AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 10 సంస్కరణ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Telugu Solutions 10th Lesson సంస్కరణ
8th Class Telugu 10th Lesson సంస్కరణ Textbook Questions and Answers
చదవండి – ఆలోచించండి – చెప్పండి
 
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
 మొదటి చిత్రంలో ఉన్నవారు ఎవరు? ఆయన ఎలా ప్రసిద్ధులు?
 జవాబు:
 మొదటి చిత్రంలో ఉన్నది రాజారామ్మోహన్ రాయ్. ఆయన 1821 నాటివాడు. గొప్ప సంఘసంస్కర్త. ఆయన బ్రహ్మ సమాజమతాన్ని స్థాపించాడు. నాడు హిందూ సమాజంలో ఉన్న ‘సతి’ అనే దురాచారాన్ని నిర్మూలించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషిచేశాడు.
ప్రశ్న 2.
 రెండో చిత్రంలో ఉన్నవారు ఎవరు? వారు ఎవరికోసం కృషి చేశారు?
 జవాబు:
 రెండో చిత్రంలో ఉన్నది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయనకు “ఆంధ్రా రాజా రామమోహన రాయలు” అనే పేరు ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. హితకారిణీ సమాజాన్ని స్థాపించారు. సాంఘిక దురాచార నిర్మూలనకు కృషిచేశారు. ఆయన స్త్రీ విద్యావ్యాప్తికి, వితంతు స్త్రీలకు పునర్వివాహాలు చేయించడానికి కృషి చేశారు.
ప్రశ్న 3.
 సాంఘిక దురాచారాలు అంటే ఏమిటి?
 జవాబు:
 సంఘంలో ఉన్న చెడ్డ ఆచారాలను, సాంఘిక దురాచారాలు అంటారు. వరకట్నం, కన్యాశుల్కం, ‘సతి’ ఆచారం, వితంతు స్త్రీలను చిన్నచూపు చూడటం. స్త్రీ విద్య పనికిరాదనడం వంటివి సాంఘిక దురాచారాలు.

ప్రశ్న 4.
 నేడు మన సమాజంలో ఏయే దురాచారాలు ఉన్నాయి?
 జవాబు:
 నేడు మన సమాజంలో వరకట్నం, బాల్యవివాహాలు, లంచగొండితనం, అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, వెట్టిచాకిరి, మతదురహంకారం వంటి దురాచారాలు ఉన్నాయి.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
 మీరు గమనించిన దురాచారాలు, మూఢనమ్మకాలపై మీ అభిప్రాయాలు చెప్పండి.
 జవాబు:
 దురాచారాలు :
 సంఘంలో దురాచారాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, మూఢనమ్మకాలు, వరకట్నం, బాల్యవివాహాలు, వెట్టిచాకిరి, లంచగొండితనం, మతదురహంకారం వంటి దురాచారాలు సంఘంలో బాగా పేరుకుపోయాయి.
మూఢనమ్మకాలు :
 దయ్యాలున్నాయని నమ్మడం, శకునాలు నమ్మడం, తాంత్రిక విద్యలపై నమ్మకం, అమావాస్య, చవితి వంటి తిథులు మంచివి కావనడం మొదలైన మూఢనమ్మకాలు కూడా సంఘంలో ప్రబలి ఉన్నాయి. నా
అభిప్రాయం :
 ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు. వారిని సరిదిద్ది వారిలో గల దురాచారాల్ని మూఢనమ్మకాల్ని నిర్మూలించడంలో మనవంతు కృషి చేయాలి. సాంఘిక దురాచారాలను గురించి ప్రజలకు వివరించి చెప్పి వానిని ప్రజలు మానేటట్లు చేయడం మన కర్తవ్యం.
N.C.C., N.S.S., స్కౌటింగ్, రెడ్ క్రాస్ మొదలైన సంస్థల ద్వారా విద్యార్థులు ఈ సాంఘిక సేవలో పాలు పంచుకోవచ్చు. విద్యార్థులు తలచుకుంటే దేశంలోని ప్రజల దురాచారాలను, మూఢనమ్మకాలను సమూలంగా నిర్మూలించగలరని నా అభిప్రాయం.
ప్రశ్న 2.
 ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలు ఏవి? వాటి నిర్మూలనకు మీ వంతు కృషిగా ఏమి చేయాలను కుంటున్నారు?
 జవాబు:
 ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలలో కొన్ని :
 1. వరకట్న దురాచారము
 2. అవినీతి
 3. బాలకార్మిక వ్యవస్థ
వరకట్న దురాచారం చాలా భిన్నమైన సమస్య. దీన్ని నిర్మూలించుటకు ప్రజలే సిద్ధంగా లేరు అని చెప్పవచ్చును. కట్నం తీసుకోకపోవటం అన్నది వరుని వైపు వారు చిన్నతనంగా భావించటం, కట్నం అవసరం లేదు అని వరునివైపువారు చెబితే వరునివైపు ఏవో లోపాలు ఉన్నట్లు వధువువైపు వారు అనుకోవటం జరుగుతున్నది. దీనినే నేను నా వంతు కృషిగా వరునివైపు వారికి, వధువువైపు వారికి అలాగే సమాజంలోని వారి అందరికి వరకట్న నిర్మూలన గురించి వివరంగా తెలియచేస్తాను. అలాగే నేను కూడా వరకట్నం తీసుకోను, వరకట్నం ఇవ్వను.
అవినీతి – ఇది ఇప్పుడు పెద్ద జటిల సమస్య. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నది. నావైపు కృషిగా ముందు నేను అవినీతిని చేయను. అలాగే నా చుట్టూ వున్న సమాజ సభ్యులు అందరినీ కాకపోయినా నా స్నేహితుల వరకైనా అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు కృషి చేస్తాను.
బాలకార్మికులు కూడా మనదేశంలో చాలామంది ఉన్నారు. నా స్నేహితుల సహాయంతో నేను వారిని ఆదుకుంటాను. అటువంటి వారిని గుర్తించి వారిని వెట్టిచాకిరి నుండి విడిపించి నావంతు కృషిగా పాఠశాలల్లో చేర్పిస్తాను.

ప్రశ్న 3.
 “వరకట్న నిర్మూలన” కు రావలసిన మార్పులను “వరునివైపు – వధువువైపు” జట్లుగా విడిపోయి చర్చించండి.
 జవాబు:
| వరుడువైపు వాళ్ళు | వధువువైపు వాళ్ళు | 
| 1) కట్నం తీసుకోవడమంటే బానిసలుగా అమ్ముడు పోవడమే అని మేం గ్రహిస్తాం. మీరు కూడా కట్నం ఇవ్వమని ఖచ్చితంగా చెప్పాలి. | 1) అవును. మా తల్లిదండ్రులకు కట్నాలు ఇవ్వవద్దని చెపుతాం. సంతల్లో పశువుల్లా మగపిల్లల్ని బేరం పెట్టి అమ్మే తల్లిదండ్రులను మీరు వ్యతిరేకించండి. | 
| 2) వరునివైపు వారు కట్నం తీసుకోమని అంటే వారిలో ఏదో లోపం ఉందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. | 2) కొంతమంది అలానే ఆలోచిస్తున్నారు. తమ ఆడ పిల్లలకు కట్నం ఇవ్వలేక బాధపడే తల్లిదండ్రులు సైతం తమ మగపిల్లలకు కట్నాల కోసం పంతం పట్టడం దురదృష్టం. | 
| 3) వరకట్న నిషేధ చట్టం చేసి, ఏళ్ళు గడుస్తున్నా, ఏ మార్పు రాలేదు. వరకట్నం పుచ్చుకోవడం నేరమని మేము భావిస్తాం. | 3) వరకట్నం ఇవ్వడం నేరమని మేము భావిస్తాం. వరకట్న బాధిత మహిళల గురించి రోజూ దినపత్రికల్లో చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. వారిని హింసించేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. | 
| 4) సృష్టిలో స్త్రీలు, పురుషులు ఇరువురికీ సమ ప్రాధాన్యముందని మా అభిప్రాయం. | 4) అవును. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించి తమ ఆడపిల్లలకు కూడా తమ ఆస్తిలో వాటా కల్పించాలి. స్త్రీవిద్యను ప్రోత్సహించాలి. | 
| 5) మహిళా సంఘాలవాళ్ళు వరకట్న సమస్య విషయంలో అంత చైతన్యవంతంగా లేరనే చెప్పాలి. వారు వరకట్న నిర్మూలన కోసం ఉద్యమాలు చేయాలి. | 5) అవును. పురుషులు కూడా వరకట్న వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రచార, ప్రసార సాధనాలు తమ తోడ్పాటును అందించాలి. | 
II చదవడం, అవగాహన చేసుకోవడం
1. కింది పదాలు ఏ పేరాలోనివో గుర్తించి, ఆ పదాన్ని దేనికి సంబంధంగా వాడారో రాయండి.
 జవాబు:
| పదం | పేరా సంఖ్య | ఎందుకోసం వాడారు | 
| పెనుభూతం | 3 | తరతరాలుగా మన సమాజాన్ని బాధిస్తున్న వరకట్న దురాచారం. | 
| జటిలసమస్య | 4 | స్త్రీల అభ్యున్నతికి అవరోధంగా నిలిచిన రెండు ముఖ్య సమస్యలలో రెండవది, పరిష్కరించడానికి కష్టతరమైనది అయిన వరకట్న దురాచారం (మొదటిది విద్యావిహీనత). | 
| రూపుమాపడం | 2 | బాల్యవివాహ దురాచారం. | 
| పరిపాటి | 8 | వివాహ వేడుకల్లో మితిమీరి ధనవ్యయం చేయడం ఘనతగా పరిగణించడం. | 
2. కింది పేరాను చదవండి. ఎక్కడ?, ఏమిటి?, ఎందుకు?, ఎవరు?, ఎలా? అనే పదాలతో ప్రశ్నలు రాయండి.
 వేమన జన్మించింది, తిరిగిందీ రాయలసీమే ఐనా ఆయన పద్యాలు, ఆయన సందేశం, ప్రభావం ఆంధ్రదేశము అంతా వుంది. వీరి పద్యాలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వేమన సందేశానికి దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమాజంలోని ఎక్కువ తక్కువలు, వివక్షలు, అంటరానితనం, అంధ విశ్వాసాలు, మూఢాచారాలు, జీవహింస, అవినీతి, అధర్మం మొదలైన విషయాలపై తన సరళమైన పద్యాల ద్వారా ప్రజల మనస్సులో హత్తుకుపోయేటట్లు విమర్శనాత్మక రచనలు చేశాడు. కులవ్యవస్థపై దాడి చేశాడు. స్వానుభవమైన, ఆచరణయోగ్యమైన తత్త్వాన్ని సరళభాషలో ప్రజలకు చెప్పి ప్రజాకవిగా తెలుగువారి మదిలో శాశ్వతస్థానం పొందారు.
 ప్రశ్నలు :
 1) వేమన ఎక్కడ జన్మించాడు?
 2) వేమన ఎక్కడ తిరిగాడు?
 3) వేమన పద్యాలూ, సందేశం ప్రభావం ఎక్కడ ఉంది?
 4) ఆంధ్రదేశమంతా ఏమిటి ఉంది?
 5) వేమన పద్యాలు ఎలా అనువాదమయ్యా యి?
 6) వేమన సందేశానికి ఎక్కడెక్కడ గుర్తింపు వచ్చింది?
 7) వేమన ఏ విషయాలపై రచనలు చేశాడు?
 8) వేమన ఎలా విమర్శనాత్మక రచనలు చేశాడు?
 9) వేమన దేనిపై దాడిచేశాడు?
 10) కులవ్యవస్థపై దాడిచేసింది ఎవరు?
 11) వేమన ఎందుకు విమర్శనాత్మక రచనలు చేశాడు?
 12) వేమన పద్యాలు ఎలా ఉంటాయి?
 13) వేమన ప్రజాకవి ఎలా అయ్యాడు?
 14) వేమన ఎటువంటి తత్త్వాన్ని ప్రజలకు చెప్పాడు?
 15) వేమన ఎవరి మదిలో శాశ్వత స్థానం పొందాడు?

3. కింది పట్టికను చూడండి. సదాచారం ఏదో, దురాచారం ఏదో గుర్తించండి. కారణం రాయండి.
 జవాబు:
| అంశం | సదాచారం/దురాచారం | 
| బాల్య వివాహాలు చేయడం | దురాచారం | 
| పెద్దలను గౌరవించడం | సదాచారం | 
| వరకట్నం తీసుకోవడం / ఇవ్వడం | దురాచారం | 
| తల్లిదండ్రులకు సేవచేయడం | సదాచారం | 
| వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం | దురాచారం | 
| స్త్రీ విద్యను ప్రోత్సహించడం | సదాచారం | 
| బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టడం | దురాచారం | 
| ఆడపిల్లలకు తొందరగా పెండ్లిండ్లు చేయడం | దురాచారం | 
| చిన్న పిల్లలను వసతి గృహాల్లో ఉంచి చదివించడం | సదాచారం | 
| తోటివారిని ఎవరినైనా సమానంగా చూడడం | సదాచారం | 
4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) శాసనాలు అమలు కావాలంటే ఏమి చేయాలని నండూరివారు అన్నారు?
 జవాబు:
 శాసనాలు చేసినంత మాత్రాన ఏ సాంఘిక సంస్కరణ ప్రయత్నమూ విజయవంతం కాబోదు. ఆ సాంఘిక సంస్కరణ యొక్క అవసరాన్ని ప్రజలు గుర్తించాలి. దానికి సంబంధించిన మానసిక చైతన్యం ప్రజలలో ప్రస్ఫుటించాలి. ప్రజల నుండి ఆ సంస్కరణకు, పూర్తి సహకారం రావాలని నండూరివారు అన్నారు.
ఆ) బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టడానికి ఏమేమి తోడ్పడతాయి?
 జవాబు:
 అతి బాల్యవివాహాలు ఈనాడు చెదురు మదురుగానే అక్కడక్కడ జరుగుతున్నాయి. నేడు అది ఒక పెద్ద సమస్యగా పరిగణించదగినంతగా జరగడం లేదు. ఈ పరిణామం సాధ్యం కావడానికి ప్రభుత్వం చేసిన ‘శారదా శాసనం’ ఒక్కటే కారణం అని అనుకోలేము. బాల్యవివాహాలు అనే దురాచారాన్ని రూపుమాపడానికి ఎందరో మహానుభావులూ సంఘసంస్కర్తలు, కృషి చేశారు. వారి కృషి ఫలితంగా, ప్రజలలో బాల్యవివాహాల పట్ల కలిగిన ఏవగింపు ఈ దురాచార నిర్మూలనకు ముఖ్య కారణం.
ఇ) వరకట్న దురాచారం గురించి రచయిత అభిప్రాయం ఏమిటి?
 జవాబు:
 వరకట్న దురాచారం నిర్మూలనానికి శాసనాలు ఉన్నప్పటికీ ఇది నిర్మూలన కాలేదు సరిగదా, నానాటికీ పెనుభూతంలా పెరిగిపోతోంది.
ఈ దురాచార నిర్మూలనకు ప్రజలు సిద్ధంగా లేరని, వరకట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం అన్నవి ప్రతిష్ఠకూ, సంఘంలో గౌరవానికి సంబంధించిన విషయాలుగా చెల్లుబాటు అవుతున్నాయని రచయిత అభిప్రాయం.
కట్నం అసలు తీసుకోకపోవడం, నలుగురిలో చిన్నతనంగా వరునివైపు వారు భావిస్తున్నారు. కట్నం తీసుకోని వరునిలో, ఏదో లోపం ఉండి ఉంటుందని, వధువువైపువారు సామాన్యంగా అనుకుంటున్నారు. ఎక్కువ కట్నం ఇవ్వడం, తీసుకోవడం గొప్పగా భావిస్తున్నారు.
వరకట్నం, వివాహంలో అధిక ధనవ్యయం చేయడం వంటి దురాచారాల నిర్మూలనకు, శాసనాలు అవసరమేకానీ, అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజల్లో కలిగించడం చాలా ముఖ్యమని, వీటి పట్ల యువతీయువకులు ఎదురు తిరిగేలా చేయాలని, కేవలం శాసనాలు దీన్ని సాధింపలేవని రచయిత అభిప్రాయపడ్డాడు.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా ఎన్ని రకాలుగా ధనం వృథా అవుతుందో మీరు గమనించిన విషయాలు రాయండి.
 జవాబు:
 నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా కొంతమంది ధనవంతులు వృథాగా ధనాన్ని ఖర్చుచేస్తున్నారు. అనవసర ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అలాగే మరికొంతమంది తమ తాహత్తుకు మించి, ఇతరులను చూచి (పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు) ధనాన్ని ఖర్చు పెడతారు. దానికి తమవద్ద ధనం లేక వడ్డీలకు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. తరువాత వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.
ఆ) నేటికీ సమాజంలో ఏయే దురాచారాలు కనపడుతున్నాయి? దానికి కారణాలేమిటి?
 (లేదా)
 మన సంఘంలో ఉన్న దురాచారాలు తెలపండి.
 జవాబు: నేటికీ వరకట్నాలు, మద్యపానం, క్లబ్బులు, పబ్బులు, అర్ధనగ్న నృత్యాలు, మత్తుమందులు, వగైరా దురాచారాలు సమాజంలో కనబడుతున్నాయి.
ముఖ్యంగా యువతీ యువకులు చదువులకూ, ఉద్యోగాలకూ గ్రామాలను వదలి, పట్టణాలకు వెడుతున్నారు. అక్కడ ప్రక్కవాళ్ళను చూసి, దురాచారాలు నేర్చుకుంటున్నారు. నాగరికత పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కట్నం తీసుకోని మగాణ్ణి అసమర్థునిగా సంఘం జమకడుతోంది. వరకట్నం తీసుకోకుండా, ఏ మగాడైనా ఆదర్శంగా పెళ్ళిచేసుకుంటే, అతణ్ణి వధువు తరపువారే ఏదో లోపం ఉన్నవాడిగా జమకడుతున్నారు. ఆడపిల్లలకు బాగా చదువు లేకపోడంతో కట్నాలు
 ఇచ్చి పెళ్ళిళ్లు చేయవలసి వస్తోంది. ఆడపిల్లలకు ఆస్తిహక్కు లేకపోడంతో వరకట్నాలు అడుగుతున్నారు.
ఇ) దేశంలో వందశాతం అక్షరాస్యత ఇంకా సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటి?
 జవాబు:
- తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, బీదవారు కావడం వల్ల, వారికి చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల, పిల్లల్ని చదివించే ఆర్థికబలం లేకపోవడం వల్ల, పిల్లల్ని బడికి పంపడం లేదు.
- వయోజన పాఠశాలలు లేకపోవడం వల్ల చదువురాని పెద్దలు చదువుకోడం లేదు.
- చదువుకొనే వారికి హాస్టళ్ళలో భోజనం, ఉచిత పుస్తకాలు, దుస్తులు, పాఠశాలలకు వెళ్ళడానికి సైకిళ్ళు వగైరా ఇవ్వకపోడం వల్ల పిల్లలు చదవడం లేదు.
- గిరిజన ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ విద్య నేర్పే పాఠశాలలు లేవు.
- చదువుకొనే బాలబాలికలను కొందరు తల్లిదండ్రులు బాల్యంలోనే పనిలో పెడుతున్నారు. వారి చిన్నపాటి సంపాదనకు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు.
- బాలకార్మికులవల్ల విద్యా శాతం పెరగడం లేదు.
- మన భారత ప్రభుత్వం భారతీయులనందరినీ అక్షరాస్యులను చేయాలనీ, నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలనీ తీర్మానించింది. మన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యతను పెంచడానికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో శాశ్వత పథకాలు నత్తనడక నడుస్తున్నాయి. తాత్కాలిక పథకాలు తాటాకులమంటలా చురచురా వెలిగి ఆరిపోతున్నాయి. అందువల్లే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావటల్లేదు.
- పథకాలు మంచివయినా, ఆచరణలో చిక్కులు వస్తున్నాయి. విద్యాశాఖకు ఏటా వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బందిలో గూడుకట్టుకున్న అలసత్వం, అశ్రద్ధ, నిర్లిప్తతతో ప్రజల్లో ఆశించిన చైతన్యం రావడం లేదు.
 
2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి. –
అ) “ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం”- దీన్ని వ్యతిరేకిస్తూ సరైన కారణాలు రాయండి.
 జవాబు:
 ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం అనేది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దీనికి కారణాలు :
- అధికంగా ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం వలన అమూల్యమైన డబ్బు దుర్వినియోగం అవుతుంది. అందుకు బదులుగా అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం.
- అలా ఖర్చు చేయకుండా ఆ ధనాన్ని ఏ పేదవారికో, చదువుకునేందుకు ఆర్థికసాయం లేక మధ్యలోనే చదువుకు స్వస్తి చెపుతున్న వారికో వినియోగించవచ్చు.
- అడుగడుగునా మనకు కనిపించే అన్నార్తులను, అభాగ్యులను ఆదుకోవచ్చు.
- అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటివి నెలకొల్పవచ్చు.
- ధనవంతులు తాము ఖర్చు పెడుతున్న సొత్తుతో ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని అక్కడి వారికి జీవనోపాధిని కల్పించవచ్చు.
- గ్రామాలలో పరిశ్రమలను, కర్మాగారాలను నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
- జాషువాగారు చెప్పినట్లు రెండు నూలు దండలు, రెండు కప్పుల టీ పెళ్ళికి చాలు. ఒకరిని చూసి మరొకరు ఎక్కువగా పెళ్ళి ఖర్చులు చేసి పొలాలు అమ్ముకోడం, అప్పులు చేయడం, బంగారం వగైరా తాకట్టు పెట్టడం, అమ్మడం చేయరాదు.
- వధూవరులు, భగవంతుని సన్నిధిలో దండలు మార్చుకోవాలి. రిజిష్టరు ఆఫీసులో మూడు వందల ఖర్చుతో, పెళ్ళితంతు పూర్తి చేయాలి. ఒక్క ఫోటో చాలు.
ఆ) ‘స్త్రీలందరూ విద్యావంతులైతే, వరకట్న నిర్మూలన జరుగుతుంది’ – దీనిపై మీ అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసం రాయండి.
 జవాబు:
 స్త్రీలందరూ విద్యావంతులయితే, వరకట్నాలు తగ్గవచ్చు. కాని ఆ చదువువల్ల వరకట్నాలు పూర్తిగా పోవు. చదువుకున్న స్త్రీ, తన కన్న ఎక్కువ చదివిన, ఎక్కువ సంపాదిస్తున్న మగాడినే పెళ్ళాడుతోంది. అందుచేత అటువంటి మగాళ్ళు, మరింత కట్నం అడుగుతున్నారు.
స్త్రీలు అందరూ విద్యావంతులయి, తాము కట్నం తీసికొన్న మగవాడిని పెళ్ళాడము అని పంతంపడితే, వరకట్నాలు పూర్తిగా తగ్గిపోతాయి. వరకట్నం ఆశింపని, సజ్జనుడిని స్త్రీ పెళ్ళాడడానికి ముందుకు వస్తే వరకట్నాలు పోతాయి. స్త్రీలకు పురుషులతోపాటు సమాన ఆస్తి హక్కులు ఇస్తే, వరకట్నాలు పోతాయి. పెళ్ళిళ్ళలో దుబారా వ్యయాన్ని అరికడితే, వరకట్నాలు తగ్గుతాయి.
పెళ్ళికాని స్త్రీలు, విద్యావంతులయి, ఉద్యోగాలు చేసికొంటూ, లేదా వృత్తివిద్యలు నేర్చుకొని స్వయంగా ఉపాధిని కల్పించుకొంటే, క్రమంగా వరకట్నాలు దూరం అవుతాయి. ఆడపిల్లల తండ్రులూ ఆడపిల్లలూ, కట్నం ఇవ్వనే ఇవ్వము అని భీష్మిస్తే, కట్నాలు దూరం అవుతాయి.
కేవలం స్త్రీలందరూ విద్యావంతులయినంత మాత్రాన, కట్నాలు పోవు అని నా అభిప్రాయం.
IV. పదజాలం
1. కింది పదాలకు సమానార్థాన్నిచ్చే పదాల సమూహంలో సమానార్థాన్ని ఇవ్వని పదం ఉంది. దాన్ని గుర్తించండి.
 ఉదా :
 ఇనుడు – సూర్యుడు, రవి, ఇంద్రుడు, భానుడు
అ) పరిణయం – పెళ్ళి, పరిమళం, మనువు, వివాహం
 ఆ) శాసనం – ఆజ్ఞ, చట్టం, ఉత్తరం, ఉత్తరువు
 ఇ) స్త్రీ – కొమ్మ, బంతి, పడతి, ఉవిద
 ఈ) ధనం – విత్తం, దండనం, ద్రవ్యం, పైకం
 ఉ) అభ్యున్నతి – తిరోగతి, ప్రగతి, పురోగతి, అభివృద్ధి
2. కింద ప్రకృతి, వికృతి పదాల ఆధారంతో వాక్యాలు రాయండి.
 (విద్య – విద్దె; స్త్రీ – ఇంతి, నిజం – నిక్కం, యత్నం – జతనం)
 ఉదా :
 అ) విద్య రహస్యంగా దాచిన ధనం వంటింది.
 జవాబు:
 విద్దె లేనివాడు వింత పశువు.
ఆ) నేడు స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు.
 జవాబు:
 ఇంతులు ఇంటి సౌభాగ్యానికి పట్టుకొమ్మలు.
ఇ) నిజం నిర్భయంగా చెప్పాలి.
 జవాబు:
 దొంగ నిక్కం చెప్పినా, ఎవ్వరూ నమ్మరు.
ఈ) నిరంతర యత్నం వల్ల పనులు సాధింపవచ్చు.
 జవాబు:
 మనం జతనంతో ఏదైనా సాధించగలము.

3. కింది వానిని సొంతవాక్యాలలో రాయండి.
 అ) పెనుభూతం, ఆ) తరతరాలు, ఇ) నిరాడంబరం, ఈ) అప్పో సప్పో, ఉ) దిగజారిపోవు, ఊ) దురాచారాలు, ఋ) శాసనాలు, బ) హెచ్చుతగ్గులు.
అ) పెనుభూతం : అవినీతి నేటి కాలంలో పెనుభూతంలా మారింది.
ఆ) తరతరాలు : తరతరాలుగా ‘మా ఇంటిలో అందరూ వేంకటేశ్వర స్వామినే కొలుస్తున్నారు.
ఇ) నిరాడంబరం : గాంధీజీ నిరాడంబర జీవితాన్ని గడిపేవారు.
ఈ) అప్పో సప్పో : కొందరు తమ పిల్లలను అప్పో సప్పో చేసి కష్టపడి చదివించుకొంటున్నారు.
ఉ) దిగజారిపోవు : నేటి యువతరం చెడు వ్యసనాలకు లోనై దిగజారిపోతున్నది.
ఊ) దురాచారాలు : దురాచారాలను అందరం కలిసికట్టుగా రూపుమాపాలి.
ఋ) శాసనాలు : శాసనాలను చేసినంత మాత్రాన దురాచారాలు రూపుమాసిపోవు.
ఋ) హెచ్చుతగ్గులు : ధనిక, పేద అనే హెచ్చుతగ్గులు సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి.
V. సృజనాత్మకత
* వరకట్నానికి రోజూ ఎంతో మంది బలైపోతున్నారు. వాటిని గురించి పత్రికల్లో, టి.విల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వరకట్నం లాంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించాలనే భావం ప్రజల్లో కలిగేటట్లు “పోస్టర్” తయారు చేయండి.
 జవాబు:
 వరకట్నం వద్దు – కోడలే ముద్దు
సోదర సోదరీమణులారా ! నిత్యం మనం పత్రికల్లో వరకట్న బాధితుల వివరాలను చదువుతున్నాం. టి.విల్లో వరకట్నం సరిపడ ఇవ్వలేదనీ, ఇంకా ఇమ్మనీ, పుట్టింటి ఆస్తులు తెగనమ్మి పట్టుకురమ్మనీ బాధించే భర్తల గురించి, అత్తమామల గురించి, ఆడపడుచుల గురించి చూస్తున్నాం. మీ ఇంటికి వచ్చిన కోడలిని లక్ష్మీదేవిగా భావించి, ఆదరించాలి. మీ కోడళ్ళను, మీ కన్నబిడ్డలుగా చూడాలి.
మీరు మీ కోడళ్ళను ప్రేమగా చూస్తే, మీ ఆడుబిడ్డలను వాళ్ళ అత్తవారు అలాగే చూస్తారు. మీరు మీ కోడళ్ళను సూటిపోటీ మాటలు అనేటప్పుడు మీ కన్నబిడ్డలకు ఆ పరిస్థితే ఎదురయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మీరు మీ ఆడపిల్లలకు కట్నం ఇవ్వకండి. మీరు తీసుకోకండి. మీ ఆడపిల్లలను బాగా చదివించండి. వారు కూడా సంపాదించేలా తయారుచేయండి. మీ మగపిల్లలతో సమంగా ఆడపిల్లలకు మీ ఆస్తి పంచి ఇవ్వండి. “ఇలా మీరంతా దీక్షపట్టండి. ప్రతిజ్ఞ చెయ్యండి.” “వరకట్నం ఇవ్వం. వరకట్నం తీసుకోము.” ఇదే మా ప్రతిజ్ఞ.

(లేదా)
 * ఈ మధ్య కాలంలో పెండ్లిళ్ళు, ఇతర కార్యక్రమాల్లో సుమారు 20% ఆహార పదార్థాలు వృథా అవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీన్ని అరికట్టడానికి నియమావళి రూపొందించి పోస్టర్ రూపొందించండి.
 * శుభకార్యాలలో ఆహార పదార్థాల వృథాను అరికట్టడానికి ప్రజలను ఉద్దేశిస్తూ కరపత్రం రాయండి.
 జవాబు:
 పెళ్ళిళ్ళలో ఆహారపదార్థాల దుర్వ్యయం అరికడదాం
మిత్రులారా ! నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరిగిపోతున్నాయి. దేశ జనాభా పెరిగిపోతోంది. మన రైతులు చెమటోడ్చి పండించే పంటలు, దేశజనాభాకు సరిపోవడం లేదు.
మనలో చాలామంది పెళ్ళిళ్ళకు, చిన్న చిన్న కార్యక్రమాలకు వందల మందికి విందు చేస్తున్నాము. పిలిచిన వారందరూ రాకపోవడం, పూర్తిగా తినకపోవడం వల్ల కనీసం 30% పదార్థాలు మిగిలిపోతున్నాయి. అవి వృథా అవుతున్నాయి.
మనం కింది నియమాలు చేసికొందాం :
- పెళ్ళికి 100 మంది అతిథులు మించరాదు.
- చిన్న చిన్న శుభకార్యాలకు 10 మంది మించరాదు.
- మిగిలిన ఆహార పదార్థాలను వృద్ధాశ్రమాలకు గాని, అనాథ శరణాలయాలకు గాని తీసుకెళ్ళి వారికి పంచిపెట్టాలి. అంతేకాకుండా వండించేటప్పుడు తగిన పాళ్ళలో వండించాలి.
- మిగిలిన ఆహారపదార్థాలు పేదసాదలకు అన్నదానం చేయించాలి.
- వ్యర్థ పదార్థాలను బయట పడవేస్తే దానికి జరిమానా విధించాలి.
VI. ప్రశంస
* రంగాపురం గ్రామంలో రాధ 10వ తరగతి చదువుతున్నది. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ గ్రామంలోని ‘బాలల హక్కుల వేదిక’ సభ్యులు వెళ్ళి బాల్యవివాహం జరపడం వల్ల నష్టాలను ‘రాధ’ తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాన్ని ఆపారు. రాధ తన చదువును తిరిగి కొనసాగించింది. రాధ వివాహం ఆపిన ‘బాలల హక్కుల వేదిక’ను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
 జవాబు:
| లేఖ అనంతపురం, ‘బాలల హక్కుల వేదిక’ వారికి, మిత్రులారా, మీ వేదిక సభ్యులందరికీ మా కృతజ్ఞతలు. ఇట్లు, చిరునామా: | 
ప్రాజెక్టు పని
* సంఘంలో దురాచారాలను రూపుమాపటం కోసం కృషిచేసిన సంఘసంస్కర్తల చిత్రపటాలు, వారి సేవల వివరాలు పాఠశాల గ్రంథాలయం నుండి / పత్రికల నుండి సేకరించి ప్రదర్శించండి.
 జవాబు:
 
 1) ఆధునిక భారతదేశ సంఘసంస్కర్తలలో అగ్రగణ్యుడు రాజారామ్మోహన్ రాయ్. భారతీయ సాంఘిక పునరుజ్జీవనోద్యమ పితామహునిగా ఆయనను పేర్కొంటారు. సతీసహగమన నిషేధానికి, స్త్రీ విద్య, ఆధునిక విద్యా వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసెను. ఆయన చేసిన విజ్ఞప్తికి స్పందించి లార్డ్ బెంటింక్ ‘సతీసహగమన నిషేధ’ చట్టాన్ని జారీ చేసెను. రాజా రామమోహన్ రాయ్ ‘బ్రహ్మసమాజము’ను స్థాపించెను.

 2) కందుకూరి వీరేశలింగం (1848 – 1919) గొప్ప సంఘసంస్కర్త. ఆధునిక సాహిత్య యుగకర్త. స్త్రీ పునర్వివాహ ఉద్యమకర్త. ఆయన రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తెలుగులో తొలి నవల. స్వీయచరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర. ఇతర రచనలు, వివేకవర్ధిని, సతీహితబోధిని ఆయన ప్రారంభించిన తెలుగు పత్రికలు.

 3) రాజారామ్మోహన్ రాయ్ తరువాత అంతటి పేరొపొందిన సంఘసంస్కర్త, గొప్ప సంస్కృత పండితుడు, విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్. కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. వితంతు పునర్వివాహానికి చట్టబద్ధత కల్పిస్తూ 1856లో శాసనం వెలువడటం వెనుక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఎంతగానో ఉంది. అనేక బాలికల పాఠశాలలను స్థాపించి స్త్రీ విద్యకై కృషి చేశారు.

 4) గోవింద రనడే గొప్ప మత, సాంఘిక సంస్కరణవేత్త. బాల్యవివాహాల నిషేధానికి, పరదా పద్ధతి తొలగించడానికి కృషి చేశారు. ‘ఇండియా నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్’ను ప్రారంభించారు. ప్రార్థనా సమాజ అభివృద్ధికి కృషి చేశారు.

 5) శ్రీ నారాయణ గురు స్వాతంత్ర్యోద్యమ కాలంలోని దక్షిణాది సంఘసంస్కర్తలలో ఒకరు. ఆయన గొప్ప పండితుడు. తత్త్వవేత్త. కేరళ వజ్జవ కులంలో జన్మించిన ఆయన అంటరానితనాన్ని నిర్మూలించారు.
VII. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది పదాలను ఏం చేసి, సంధి పేరు రాయండి.
 ఉదా :
 చేసినంత = చేసిన + అంత – అత్వసంధి
 అ) ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వసంధి
 ఆ) కారణమని = కారణము _ అని – ఉత్వసంధి
 ఇ) బాధిస్తున్న = బాధిస్తు + ఉన్న – ఉత్వసంధి
 ఈ) నిజమే = నిజము + ఏ – ఉత్వసంధి
 ఉ) ఏమైన = ఏమి + ఐన – ఇత్వసంధి
 ఊ) లేరనడం = లేరు + అనడం – ఉత్వసంధి
 ఋ) హీనుడైన = హీనుడు + ఐన – ఉత్వసంధి
2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
 ఉదా :
 సంఘసంస్కర్తలు – సంఘమును సంస్కరించేవారు – ద్వితీయా తత్పురుషం
 అ) వరకట్నం = వరుని కొరకు కట్నం – చతుర్డీ తత్పురుషం
 ఆ) స్త్రీల అభ్యున్నతి = స్త్రీల యొక్క అభ్యున్నతి – షష్ఠీ తత్పురుషం
 ఇ) విద్యావిహీనత = విద్యచేత విహీనత – తృతీయా తత్పురుషం
 ఈ) విద్యావ్యాప్తి = విద్య యొక్క వ్యాప్తి – షష్ఠీ తత్పురుషం
 ఉ) ధనవ్యయం = ధనము యొక్క వ్యయం – షష్ఠీ తత్పురుషం
 ఊ) శక్తిహీనుడు = శక్తిచేత హీనుడు – తృతీయా తత్పురుషం

3. ముందు పాఠాల్లో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం క్రియలను గురించి తెలుసుకున్నారు కదా !
 కింది వాక్యాలలో గీత గీసిన క్రియలు వేటికి సంబంధించినవో గుర్తించండి.
 ఉదా :
 నీటిని వృథా చేస్తే భవిష్యత్తులో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. – చేదర్థకం
 అ) టి.వి. ఎక్కువగా చూస్తే విలువయిన సమయం వృథా అవుతుంది. – చేదర్థకం
 ఆ) అప్పన్న కొట్టు కుళ్ళి మంచివి ఏరి తీసుకురా! – క్వార్థకం
 ఇ) దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. – శత్రర్థకం
 ఈ) అఖిల పాటలు వింటూ ముగ్గులు వేస్తున్నది. – శత్రర్థకం
 ఉ) మేధావంతుల వలస తగ్గితే మన దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. – చేదర్థకం
 ఊ) మీ అక్క భోజనం చేసి లేవలేకపోతుందేమో? – క్వార్థకం
 ఋ) మహేశ్ తేనీరు తాగుతూ పత్రిక చదువుతున్నాడు. – శత్రర్థకం
తత్పురుష సమాసాలు :
 విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాల గురించి తెలుసుకున్నారు కదా ! కింది వాటిని కూడా పరిశీలించండి.
 1) పూర్వకాయము – కాయము యొక్క పూర్వము
పై దానిలో ‘పూర్వ’ అనే పదానికి ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘పూర్వము’గా మారింది. ఇలా మొదటి పదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాం.
* సమాసంలో పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడమే ప్రథమా తత్పురుష, అంటే విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు (డు, ము, వు, లు) చేరతాయి.
దీనినే ఏకదేశి సమాసం అని కూడా అంటారు. సాధారణంగా తత్పురుష సమాసాలలో ఉత్తరపదార్థానికి ప్రాధాన్యం ఉంటుంది. కాని ఏకదేశి సమాసం అంటే పూర్వపదార్థ ప్రధానంగల తత్పురుష సమాసం. కింది వాటిని పరిశీలించండి.
 1) నఞ్ + సత్యం అసత్యం = సత్యం కానిది
 2) నఞ్ + న్యాయము = అన్యాయము = న్యాయము కానిది
 3) నఞ్ + ఉచితం = అనుచితం = ఉచితము కానిది
సంస్కృతంలో ‘నఞ్’ అనేది వ్యతిరేకార్థ బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్ అనే ప్రత్యయాలు వాడుతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నః’ అనే అవ్యయాన్ని అనుసరించి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు.
5. కింది పదాలకు విగ్రహవాక్యాలు, సమాస పదాలు రాసి, సమాసం పేరు రాయండి.
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు | 
| అ) అర్ధరాత్రి | రాత్రి యొక్క అర్ధము | ప్రథమా తత్పురుష సమాసం | 
| ఆ) అనూహ్యము | ఊహ్యము కానిది | నఞ్ తత్పురుష సమాసం | 
| ఇ) అక్రమం | క్రమం కానిది | నఞ్ తత్పురుష సమాసం | 
6. తత్పురుష సమాసానికి చెందిన పదాలను ఇంతకు ముందు పాఠాల్లో వెదకండి. పట్టికలో రాయండి.
| సమాసం పేరు | విగ్రహవాక్యం | సమాస పదం | 
| 1) ప్రథమా తత్పురుష సమాసం | అర్ధము యొక్క ప్రథమము | ప్రథమార్ధము | 
| 2) ద్వితీయా తత్పురుష సమాసం | కృష్ణుని ఆశ్రయించిన వాడు | కృష్ణాశ్రితుడు | 
| 3) తృతీయా తత్పురుష సమాసం | జలముతో అభిషేకము | జలాభిషేకము | 
| 4) చతుర్డీ తత్పురుష సమాసము | లోకము కొఱకు హితము | లోకహితములు | 
| 5) పంచమీ తత్పురుష సమాసం | దొంగ వలన భయము | దొంగభయము | 
| 6) షష్ఠీ తత్పురుష సమాసం | జటల యొక్క పంక్తి | జటాపంక్తి | 
| 7) సప్తమీ తత్పురుష సమాసం | తటము నందలి భూజములు | తటభూజములు | 
| 8) నఞ్ తత్పురుష సమాసం | క్షరం కానిది | అక్షరం | 
వ్యాకరణంపై అదనపు సమాచారం
పర్యాయపదాలు
కృషి : సేద్యం, వ్యవసాయం
 ధనం : డబ్బు, సంపద, విత్తము
 మిత్రుడు : స్నేహితుడు, నేస్తము, సఖుడు
 శక్తి : సామర్థ్యం, బలము
 ఏవగింపు : అసహ్యం, రోత, జుగుప్స
 హర్షము : ఆనందం, సంతోషం
 స్త్రీ : మహిళ, వనిత, ఉవిద
 మంత్రి : ప్రధాని, సచివుడు, ప్రెగడ
 సహకారం : సహాయం, తోడ్పాటు
వ్యుత్పత్యర్థాలు
మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (స్నేహితుడు)
 సత్యం : సత్పురుషుల యందు పుట్టినిది (నిజం)
 శాసనం : దీని చేత శిక్షింపబడును (ఆజ్ఞ)
నానార్థాలు
సత్యం – సత్తు, పూజ్యము, సాధువు
 ప్రయత్నం – కృషి, సేద్యం, పరిశ్రమ
 ప్రజ – జనం, సంతతి, పుట్టుట
 చైతన్యం – ప్రాణం, తెలివి, ప్రకృతి
 శక్తి – బలిమి, పార్వతి, పరాశరుని తండ్రి
 కళ్యాణం – వివాహం, బంగారం, అక్షయం
 ఘనం – మేఘం, శరీరం, గొప్పది
 కృషి – సేద్యం, యత్నం
సంధులు
సవర్ణదీర్ఘ సంధి :
 సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
 వ్యతిరేకాభిప్రాయం = వ్యతిరేక + అభిప్రాయం – సవర్ణదీర్ఘ సంధి
యణాదేశ సంధి :
 సూత్రం : ఇ, ఉ, ఋ లకు సవర్ణముకాని అచ్చు పరమగునప్పుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
 అభ్యున్నతి = అ + ఉన్నతి – యణాదేశ సంధి
అత్వసంధి :
 సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
 చేసినంత = చేసిన + అంత – అత్వ సంధి
 ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వ సంధి
 ఐనప్పుడు = ఐన + అప్పుడు – అత్వ సంధి
 తగినంత = తగిన + అంత – అత్వ సంధి
లు ల న ల సంధి :
 సూత్రం : లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కపుడు ముగాగమానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
 మాత్రాన = మాత్రము + న – లు ల సంధి
 తరాలు = తరము + లు – లుల సంధి
 వివాహాలు = వివాహము + లు – లు ల న ల సంధి
 అవకాశాలు = అవకాశము + లు – లు ల న ల సంధి
ఇత్వసంధి :
 సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
 ఒక్కటే = ఒక్కటి + ఎ – ఇత్వ సంధి
గసడదవాదేశ సంధి :
 సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
 సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి
సమాసాలు
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు | 
| యువతీయువకులు | యువతియును, యువకుడును | ద్వంద్వ సమాసం | 
| హెచ్చుతగ్గులు | హెచ్చును, తగ్గును | ద్వంద్వ సమాసం | 
| వధూవరులు | వధువును, వరుడును | ద్వంద్వ సమాసం | 
| బంధుమిత్రులు | బంధువులు, మిత్రులు | ద్వంద్వ సమాసం | 
| బాల్యవివాహాలు | బాల్యము నందలి వివాహములు | సప్తమీ తత్పురుష సమాసం | 
| సంస్కరణ ప్రయత్నం | సంస్కరణ యొక్క ప్రయత్నం | షష్ఠీ తత్పురుష సమాసం | 
| స్త్రీల అభ్యున్నతి | స్త్రీల యొక్క అభ్యున్నతి | షష్ఠీ తత్పురుష సమాసం | 
| విద్యావ్యాప్తి | విద్య యొక్క వ్యాప్తి | షష్ఠీ తత్పురుష సమాసం | 
| వరకట్నం | వరుని కొరకు కట్నం | చతుర్డీ తత్పురుష సమాసం | 
| పెనుభూతము | పెద్దదైన భూతము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| దురాచారం | దుష్టమైన ఆచారం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| ముఖ్యమంత్రి | ముఖ్యమైన మంత్రి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| ముఖ్య సమస్యలు | ముఖ్యమైన సమస్యలు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
| జటిల సమస్య | జటిలమైన సమస్య | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం | 
ప్రకృతి – వికృతులు
మంత్రి – మంతిరి
 వివాహం – వియ్యము
 రూపము – రూపు
 స్త్రీ – ఇంతి
 విద్య – విద్దె
 దూరము – దవ్వు
 శ్రీమతి – సీమాటి
 ఆశ్చర్యం – అచ్చెరువు
 గౌరవం – గారవము
 విషయం – విసయం
 సత్యం – సత్తు
 నిజం – నిక్కం
రచయిత పరిచయం
రచయిత : “శ్రీ నండూరి రామమోహనరావు”
జన్మస్థలం : వీరు కృష్ణాజిల్లా “విస్సన్నపేట”లో జన్మించారు.
జీవిత కాలం : 1927 – 2011.
ప్రసిద్ధి : రామమోహనరావుగారు, తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులు. వీరు జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి మొదలైన పత్రికలలో సంపాదకులుగా పనిచేశారు.
రచనలు : వీరు పిల్లల కోసం కొన్ని ఇంగ్లీషు నవలలను, తెలుగులోనికి అనువదించి రాశారు. 1) “చిలక చెప్పిన రహస్యం”, 2) “మయూరకన్య” అనే పిల్లల నవలలూ, 3) “హరివిల్లు” పేరిట పిల్లల గేయాలు రాశారు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ! “చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి.
అవార్డులు : తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , వీరిని “ఉత్తమ పాత్రికేయుడు” అవార్డు నిచ్చి సత్కరించింది.
కఠిన పదాలకు అర్థాలు
శాసనాలు = చట్టాలు
 సాంఘిక సంస్కరణ = సంఘాన్ని చక్కజేయడం
 ఆవశ్యకత = అవసరము
 ప్రస్పుటించాలి = ప్రకాశించాలి; వెల్లడించాలి
 చెదురు మదురు = అక్కడక్కడ
 పరిణామం = మార్పు
 రూపుమాపు = నశింపజేయు
 మహామహులు = గొప్పవారు
 ఏవగింపు = రోత
 నిర్మూలన = పెల్లగించుట, నాశనం
 పెనుభూతం = పెద్ద దయ్యం

అభ్యున్నతి = అభివృద్ధి
 అవరోధాలు = ఆటంకాలు
 విద్యావిహీనత = విద్య లేకపోవడం
 జటిల సమస్య = పెనగొనిన సమస్య (చిక్కు సమస్య)
 ప్రయత్నపూర్వకంగా = ప్రయత్నం చేయడం ద్వారా
 విద్యాశూన్యులు = విద్య చేత శూన్యులు (చదువు రానివారు)
 ప్రతిష్ఠ = గౌరవం; కీర్తి
 ధనవ్యయం = ధనాన్ని ఖర్చు చేయడం
 పరిగణించడం = లెక్కించడం
 హర్షించదు = సంతోషించదు
 శక్తిహీనుడు = శక్తిలేనివాడు
 ఏహ్యభావాన్ని = రోతను
