AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు
10th Class Telugu 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
లఘుపతనతుండు మంథరునితో నిట్లనియె. “చెలితాఁడా! యీ మూషిక రాజును నీవు మిక్కిలి | సమ్మానింపుము. ఇతఁడు పుణ్యకరులలోపల ధురీణుఁడు, గుణరత్నాకరుఁడు, హిరణ్యకుఁ డనువాఁడు. ఈతని గుణములు శేషుఁడు సహితము వర్ణింపజాలఁడు. నే నేపాటివాడఁను” అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతట మంథరుఁడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి యిట్లనియె. “హిరణ్యతా! నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి ? చెప్పుము” అని యడిగెను. హిరణ్యకుఁడిట్లనియె.
ఈ ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
 ఇలాంటి శైలిలో ఉన్న పాఠాలను చదివారా? లేదా? (ఈ రూపంలో ఉన్న మీకు తెలిసిన పుస్తకాల పేర్లు చెప్పండి.)
 జవాబు:
 ఇలాంటి భాషతో ఉన్న పాఠాలను చదివాము. 7వ తరగతిలో ‘దురాశ పాఠమును చదివాము. అది పరవస్తు చిన్నయసూరి గారు రచించిన నీతిచంద్రిక లోనిది. 9వ తరగతిలో ‘స్వభాష’ పాఠం చదివాము. ఇది పానుగంటి గారి రచన.
పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు రచించిన సాక్షి వ్యాసాలు ఇటువంటి రచనే. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన సంధి, విగ్రహం ఇటువంటివే. అడవి బాపిరాజు గారు, కోలాంచల కవి, ఏనుగుల వీరాస్వామి, మధిర సుబ్బన్న దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన వారి రచనలు ఇట్టివే.
ప్రశ్న 2.
 మంథరుడు ఎవరి వృత్తాంతాన్ని విన్నాడు?
 జవాబు:
 మంథరుడు హిరణ్యకుని వృత్తాంతాన్ని విన్నాడు. దానిని లఘుపతనకుడు చెప్పాడు.

ప్రశ్న 3.
 హిరణ్యకుని నివాసమెక్కడ?
 జవాబు:
 హిరణ్యకుని నివాసము నిర్జన వనము.
ప్రశ్న 4.
 హిరణ్యకుడు తన నివాసం గురించి ఏం చెప్పి ఉంటాడు?
 జవాబు:
 “హిరణ్యకా! నీవు నిర్జన వనము నందు వాసము చేయుటకు నిమిత్తమేమి? చెప్పుము” అని మంథరుడు అడిగిన దానిని బట్టి ఆ నిర్జన వనము హిరణ్యకుని నివాసము కాదని తెలుస్తోంది. అక్కడకు చేరకముందు హిరణ్యకునిది మంచి నివాసమే అయి ఉండును. అక్కడ ఏదో బాధ కలగడం వలన దాని మకాం నిర్జన వనానికి మారి ఉండును. బహుశా ఆ కారణాలన్నీ మంథరునితో చెప్పి ఉంటాడు.
 (ఇంకా అనేక ప్రశ్నలడిగి పిల్లలందరిచేత మాట్లాడించాలి.)
1. అవగాహన-ప్రతిస్పందన
ప్రశ్న 1.
 చూడాకర్ణుని మాటలను బట్టి మీకర్ణమైన విషయమేమి? దానిపై మీ అభిప్రాయమేమిటో చెప్పండి.
 జవాబు:
 చూడాకర్ణుని మాటలను బట్టి ధనము కలవాడే బలవంతుడని తెలిసింది. ధనముగల వాడే పండితుడు. ధనము లేకపోతే బలహీనుడౌతాడు. ధనము ఉంటే బలం పెరుగుతుందని, ధనవంతునికి సాధ్యము కానిది లేదని తెలిసింది. అన్ని ‘ శుభములకు ధనమే మూలమని చూడాకరుని అభిప్రాయమని అతని మాటలను బట్టి తెలిసింది.
కేవలం ధనం ఉంటే గొప్పవాడు కాదని నా అభిప్రాయం. ఎంత ధనం ఉన్నా వివేకం లేకపోతే ప్రయోజనం లేదు. ఆ వివేకం రావాలంటే విద్య కావాలి. ‘విద్యా ధనం సర్వ ధన ప్రధానమ్’ అని ఆర్యోక్తి. అందుచేత విద్యను మించిన ధనం లేదు. మూర్యుడు తన ఇంటిలోనే గౌరవింపబడతాడు. ధనవంతుడు తన గ్రామంలోనే గౌరవింపబడతాడు. రాజు తన రాజ్యంలోనే గౌరవింపబడతాడు కానీ, విద్యావంతుడు భూమండలమంతా గౌరవింపబడతాడు. మంచి పనుల కోసం ధనాన్ని విడిచిపెట్టాలి. కాని, ధనం కోసం కీర్తిని, మంచి పనులను, విద్యను, వివేకాన్ని విడిచిపెట్టకూడదు.

ప్రశ్న 2.
 “ఆహా! ధనలోభము సర్వయాపదలకు మూలము కదా!” ఈ విషయాన్ని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ మీ అభిప్రాయాలు చెప్పండి.
 జవాబు:
 ధనం పట్ల పిసినిగొట్టుతనం అన్ని కష్టాలకు, ప్రమాదాలకు మూలమని దీని భావం.
సమర్థన:
 ధనమును ఖర్చు పెట్టనిదే సౌఖ్యం దొరకదు. ధన సంపాదనే ధ్యేయంగా ఉంటే గౌరవం పోతుంది. కీర్తి పోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. ధనం కోసం మంచి, చెడు మరచిపోతాము. స్నేహితులు, బంధువులు అందరినీ పోగొట్టుకుంటాము. విలువైన జీవితకాలంలో సంపాదించవలసిన జ్ఞానం సంపాదించలేము. అన్నిటినీ కోల్పోతాము. ధనం మాత్రమే మిగులుతుంది. అందుచేత ధనలోభం మంచిది కాదు.
వ్యతిరేకత :
 ధనమును మితిమీరి ఖర్చు చేయడం దారిద్ర్యానికి దగ్గర దారి. ధనం లేకపోతే ఎవరూ పలకరించరు. సమాజంలో గౌరవస్థానం ఉండదు. హోదా ఉండదు. ధనం లేకపోతే ఏ పుణ్యకార్యాలు చేయలేము. దానధర్మాలకు ధనం కావాలి. పేదవాని కోపం పెదవికి చేటు. ధనవంతుని కోపం ధరణికే చేటు. ధనలోభం గలవారే ముందు తరాల వారికి కూడా సంపదను కూడబెట్టగలరు. ధనలోభం గలవారే లక్ష్మీపుత్రులు. సిరిసంపదలతో తులతూగుతారు. నచ్చిన ఆహారం తినగలరు. చక్కగా, విలాసవంతంగా బ్రతకగలరు. అనారోగ్యం వచ్చినా ఖరీదైన వైద్యం చేయించుకోగలరు. అందుకే “పశువుకు తిన్నది బలం. మనిషికి ఉన్నది బిలం” అన్నారు. కలిమి కలవాడే కలవాడు. లేనివాడు లేనివాడే కదా!
ప్రశ్న 3.
 ఈ పాఠానికి పెట్టిన శీర్షికను విశ్లేషిస్తూ చెప్పండి.
 జవాబు:
 ఈ పాఠానికి ఉన్న శీర్షిక ‘ధన్యుడు’. ధన్యుడు ఎవరనేది పాఠ్య రచయిత స్పష్టంగా చెప్పాడు. ‘ఉదరముకయి పరుల గోఁజక ప్రాప్తిలాభమునకు సంతోషించువాఁడొక్కడు లోకమందు ధన్యుడు’ అని మూడవ పేరాలో హిరణ్యకుని చేత రచయిత (చిన్నయసూరి) చెప్పించాడు.
సన్న్యాసికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు. కాని, చూడాకర్ణుడనే సన్న్యాసికి ధనమే గొప్పదనే భావం ఉంది. ధనహీనుని చేయడానికి హిరణ్యకుని బాధించాడు. అతని వేషం సన్న్యాసి వేషం, మనసు మాత్రం క్రూరమైనది.
హిరణ్యకుడు ధనం పోగుచేసినాడు. అది పోగానే జ్ఞానం కలిగింది. తన పొట్ట నింపుకోవడానికి ఇతరులను బాధించకూడదనే జ్ఞానం పొందాడు. ధన్యుడయ్యాడు.
ధన్యుడు కావాలంటే వేషం కాదు, ఆత్మ పరిశీలన కావాలి. ఆత్మ పరిశీలనతో తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి . అని చెప్పకుండానే పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా నిరూపించిన ఈ పాఠానికి ‘ధన్యుడు’ అనే శీర్షిక చక్కగా సరిపోయింది.

ప్రశ్న 4.
 ఈ కింది వాక్యాలు ఎవరు, ఎవరితో అన్నారో గుర్తించి రాయండి.
అ) “అనృత మాడుట కంటె మౌనము మేలు.”
 జవాబు:
 పరిచయం :
 ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.
సందర్భం :
 చూడాకర్ణుని చేతిలో తన సర్వస్వము కోల్పోయిన హిరణ్యకుడు ఒక అడవిలో ఉండెను. తన గతమును మంథరునితో చెప్పుచున్న సందర్భంలో పలికిన వాక్యమిది. భావం : అసత్యము పలకడం కంటే మౌనంగా ఉండడం మంచిది.
ఆ) “దీని కేమైనను నిమిత్తము లేక మానదు.”
 జవాబు:
 పరిచయం :
 ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.
సందర్భం :
 చంపకవతి అనే పట్టణంలోని చూడాకర్ణుని వద్దకు వీణాకర్ణుడు వచ్చాడు. మాటలలో చూడాకర్ణుడు తను చిలుకకొయ్య పై పెట్టిన ఆహారాన్ని హిరణ్యకుడు కాజేస్తున్న విషయం చెప్పాడు. ఒక ఎలుక చిలుక
 కొయ్యపైకి ఎగరడానికి బలమైన కారణమేదో ఉండాలని వీణాకర్ణుడు పలికిన సందర్భంలోని వాక్యమిది.
భావం :
 ఒక ఎలుక చిలుకకొయ్య అంత ఎత్తు ఎగరడానికి తప్పనిసరిగా ఏదో కారణం ఉంటుంది.
ఇ) “సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు.”
 జవాబు:
 పరిచయం :
 ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.
సందర్భం :
 తన గతమును మంథరునితో హిరణ్యకుడు చెప్పాడు. తన సర్వస్వం కోల్పోయి అరణ్యానికి చేరానన్నాడు. ఆ నిర్జనారణ్యంలో లఘుపతనకునితో తనకు స్నేహం ఏర్పడడం తన అదృష్టమని చెప్తూ పలికిన వాక్యమిది.
భావం :
 మంచివారితో స్నేహం కంటే మంచిదేదీ ఈ లోకంలో లేదు.
ప్రశ్న 5.
 కింది పద్యాన్ని చదివి, భారాన్ని పూరించండి.
 “ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైన దాఁ
 జక్కనొనర్చుఁగారవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
 జక్కగనీక తబలసేన ననేక శిలీముఖంబులన్
 మొక్కవడంగ జేసి తుదముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!
భావం:
 ………………………. ఎంతటి పని ఐనా ……………………… ఆవుల మందను .. ……………… తన బాణాలతో ఆ బలమైన …………….. అర్జునుడే కదా!
 జవాబు:
 ఒక బలవంతుడు చాలు ఎంతటి పని అయినా చేయడానికి. కౌరవులనేకమంది పట్టిన ఆవుల మందను విడిపించాడు. వాడియైన , 5 బాణాలతో ఆ బలమైన సైన్యాన్ని బాధించి, విజయం సాధించినవాడు అర్జునుడే కదా !
II. వృశికరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) “సంసార విషవృక్షమునకు రెండు ఫలము లమృతతుల్యములు” పాఠాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని గురించి వివరించండి.
 జవాబు:
 సంసార విషవృక్షానికి రెండు ఫలాలు అమృతంతో సమానమైనవి. అవి :
- కావ్యమునందలి అమృతము వంటి మంచి విషయమును తెలుసుకొనడం.
- మంచివారితో స్నేహం.
ప్రస్తుత పాఠం పరిశీలించినట్లైతే హిరణ్యకుడు సంసారంపై వ్యామోహంతో చాలా సంపాదించి దాచాడు. అంటే సంసారమనే విషవృక్షానికి తనను తానే బఁ “ని చేసుకొన్నాడు. ఆ ధనమదంతో చూడాకర్ణుని ఆహారాన్ని చిలుక కొయ్యపైకి ఎగిరి కాజేసేవాడు. ఎంతో గర్వంతో బ్రతికాడు. ఆ సన్న్యాసిని ముప్పుతిప్పలు పెట్టాడు.
సంపాదించినదంతా పోయింది. చూడాకర్ణుడు ఎలుక కలుగును త్రవ్వి, దాని సంపదంతా హరించాడు. అప్పటితో హిరణ్యకుని ధన గర్వం తగ్గింది. వీణాకర్ణుని మాటలతో అజ్ఞానం పోయింది. ధనం కలవాడే బలవంతుడు. ధనం లేనివాడు మరణించినట్లే అని వీణాకర్ణుడు చెప్పాడు. దానితో పర ధనం మీద వ్యా మోహం విడిచిపెట్టి అడవికి చేరాడు. ఆ సన్న్యాసి చెప్పిన మంచిమాటలు కావ్యామృతం వంటివి.
రెండవ ఫలం సజ్జన స్నేహం. అది లఘుపతనకునితో స్నేహం. లఘుపతనకుని వంటి ఉత్తమునితో స్నేహం ఏర్పడింది. దానితో హిరణ్యకునికి పరిపూర్ణంగా జ్ఞానం కలిగింది. ఈ విధంగా హిరణ్యకుడు ధన్యుడయ్యాడు.
ఆ) “వివేకహీనుడైన ప్రభువును సేవించుటకంటె వనవాస ముత్తమం” – దీని ఔచిత్యాన్ని గురించి చర్చించండి.
 జవాబు:
 వివేకవంతుడైన ప్రభువు తన వారి గురించి ఆలోచిస్తాడు. తనను సేవించే వారి సౌఖ్యానికి ప్రాధాన్యం ఇస్తాడు. సేవకులకు సౌఖ్యాలు కల్పిస్తే నిరంతరం ప్రభువు సేవలో అప్రమత్తులై ఉంటారు.
వివేకహీనుడైన ప్రభువు తనగురించి ఆలోచిస్తాడు. తన సౌఖ్యమే చూసుకొంటాడు. తన సేవకులను పట్టించుకోడు. సేవకులకు జీతభత్యాలను సక్రమంగా ఇవ్వడు. దానితో అర్ధాకలి బ్రతుకులు తప్పవు. అర్ధాకలి భరించలేక డబ్బుకోసం తప్పులు చేయాలి. అంటే ప్రభు ద్రోహానికి పాల్పడాలి. అది మహాపాపం. మన శక్తియుక్తులన్నీ రాజు క్షేమానికి ఉపయోగపడాలి. కాని, వివేకహీనుడైన ప్రభువు విషయంలో అది సాధ్యం కాదు. అందుచేత అటువంటి ప్రభువు సేవను విడిచిపెట్టి వనవాసం చేయడం నయం. అడవిలో దుంపలు, పళ్ళు తింటూ దైవధ్యానం చేసుకొంటూ మునుల వలే జీవించడం మంచిది. వివేకహీనుడైన ప్రభువు రక్షించడు. అడవిలోనూ రక్షణ ఉండదు. కాని, వివేకహీనుడైన ప్రభువును సేవించలేక పాపాలు చేయాలి. అడవిలో అయితే పుణ్యం సంపాదించుకోవచ్చు. అందుచేత వివేకం లేని ప్రభువును సేవించడం కంటే వనవాసమే మంచిది.

ఇ) చిన్నయసూరిని గూర్చిన విశేషాలు రాయండి.
 జవాబు:
- పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
- ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
- చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు. ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) ‘అర్థనాశం, మనస్తాపం, గృహమందలి దుశ్చరితం, వంచనం, పరాభవం’ – ఈ పదాల గురించి మీరు ఏరకంగా అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
 జవాబు:
 అర్థనాశం :
 అర్థనాశం అంటే డబ్బు నశించిపోవడం, కష్టపడి సంపాదించినదంతా, తనకు, తనవారికి కాకుండా పోవడం. ‘ధన్యుడు’ కథలో హిరణ్యకుడు ఎంతో కష్టపడి, ఎన్నో రోజులు కూడబెట్టాడు. కూడబెట్టిన ధనమంతా తన కలుగులో దాచుకొన్నాడు. చూడాకర్ణుడు గునపంతో ఆ కలుగు తవ్వి ఆ సంపదంతా కొల్లగొట్టాడు. హిరణ్యకునికి అర్థనాశం కలిగింది.
మనస్తాపం :
 మనసుకు బాధ కలగడం. చేయని తప్పుకు నిందమోపినా మనస్తాపం కలుగుతుంది. సంపదంతా పోయినా మనస్తాపం కలుగుతుంది. హిరణ్యకుని సంపదంతా పోవడం వలన మనస్తాపం కలిగింది.
గృహమందలి దుశ్చరితం :
 మన ఇంట్లో అందరూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొంటే ఆనందం. ఎవరైనా కొందరు చెడ్డ పేరు తెచ్చుకొంటే అది ఇంట్లో వారందరినీ బాధిస్తుంది. సమాజంలో ఆ ఇంటికి గౌరవం తగ్గుతుంది. అందరూ చులకనగా చూస్తారు. హిరణ్యకుని సంపద పోయాక అక్కడ ఉండలేక అడవికి వెళ్లిపోయింది.
వంచనం:
 వంచనం అంటే మోసం. మనం మోసం చేయడం తప్పు. మోసపోవడం అవమానం. హిరణ్యకుడు రోజూ చూడాకర్ణుని వంచించి ఆహారం దొంగిలించాడు. తన సంపద పోయాక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు.
పరాభవం :
 పరాభవం అంటే అవమానం. పరాభవం జరిగితే ఎవరికీ చెప్పుకోకూడదు. చెప్పుకొంటే గౌరవం పోతుంది. ఈ పాఠంలో హిరణ్యకుని సంపదంతా చూడాకర్ణుడు కొల్లగొట్టాడు. అప్పుడు హిరణ్యకునికి విరక్తి కలిగింది. పరాభవం జరిగినచోట ఉండకూడదని అడవిలోకి మకాం మార్చాడు.
ఆ) మంథరుని మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
 జవాబు:
 మంథరుడు “ధనము, యౌవనము, నిత్యములు కావనీ, జీవితం బుడగవంటిదనీ సత్యము” చెప్పాడు. ధనము ఏదో రకంగా పోవచ్చు. వయస్సు తరిగి పోయి, మరణం వస్తుంది. ప్రాణం, నీటిమీద బుడగలా ఎప్పుడయినా పోవచ్చు. ఇవన్నీ కఠోర సత్యములు.
అందువల్ల బుద్ధిమంతుడు ధనము, యౌవనము, ప్రాణము ఉన్నప్పుడే, ధర్మములు చేయాలి. లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి మంథరుని మాటలను, నేను గట్టిగా సమర్థిస్తాను.
3. కింది అంశాలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) చూడాకర్ణునికి, వీణాకర్ణునికి మధ్య జరిగిన మాటలను సంభాషణా రూపంలో రాయండి.
 జవాబు:
 చూడాకర్ణుడు : రండి, మిత్రమా ! వీణాకర్ణా! కూర్చోండి.
వీణాకర్ణుడు – : (కూర్చొని) ఏమిటి విశేషాలు?
చూడాకర్ణుడు : (గిలుక కల్బుతో నేలమీద కొడుతూ) ఏమున్నాయి. మీరు రావడమే విశేషం.
వీణాకర్ణుడు : అదేమిటి ? అలా నేలపై కొడుతున్నారెందుకు?
చూడాకర్ణుడు : ఎలుకను బెదిరించడానికి,
వీణాకర్ణుడు : మరి, పైకి చూస్తున్నారెందుకు?
చూడాకర్ణుడు : ప్రతిరోజూ చిలుకకొయ్యమీద దాచుకొన్న అన్నం ఒక ఎలుక తినేస్తోంది. దాని బాధ పడలేకపోతున్నాను.
వీణాకర్ణుడు : చిలుకకొయ్య ఎక్కడ? ఎలుక ఎక్కడ? అంత చిన్న ఎలుక అంత ఎత్తు ఎగురుతోందా? అయితే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.
చూడాకర్ణుడు : చాలాకాలం నుండీ ఎలుక ఒక కన్నంలో ఉంది. దానికి కారణం తెలియట్లేదు. తవ్వి చూస్తాను.
వీణాకర్ణుడు : ఏమైనా దొరికిందా?
చూడాకర్ణుడు : చూడండి! ఎంత ఆహారం దాచిందో. దీని బలమంతా ఈ సంపదే. ఈ సంపదంతా లాగేస్తాను.
వీణాకర్ణుడు : పూర్తిగా లాగేయండి. ఏదీ వదలకండి.
చూడాకర్ణుడు : చూడండి. పూర్తిగా ఖాళీ చేసేశాను. ఇంక దీని పని అయిపోయింది.
వీణాకర్ణుడు : ఆ ఎలుక చూడండి. ఎంత మెల్లిగా కదులుతోందో ! బక్కచిక్కిపోయింది కదా ! ఎందుకంటారండీ! అంతలా కృశించిపోయింది.
చూడాకర్ణుడు : ధనం కలవాడే బలవంతుడు. ధనం ఉన్నవాడే పండితుడు.
వీణాకర్ణుడు : ధనం లేకపోతే ఏమవుతుంది?
చూడాకర్ణుడు : ధనం లేకపోతే నిరంతరం బాధగా ఉంటుంది. ఆ బాధలో బుద్ది పనిచేయదు. బుర్ర పనిచేయకుంటే అన్ని పనులూ పాడవుతాయి. సమస్తం శూన్యమవుతుంది.
వీణాకర్ణుడు : దరిద్రం అంత బాధాకరమా?
చూడాకర్ణుడు : దారిద్ర్యం చాలా బాధాకరం. అంతకంటే మరణం మంచిది.
వీణాకర్ణుడు : ఇవి విని, ఎలుక వెళ్ళిపోతోందండోయ్.
చూడాకర్ణుడు : ఇంక ఆ ఎలుక రాదు. దాని పీడ నాకు విరగడయ్యింది. అందుకే ‘ఊరక రారు మహాత్ములు’ అన్నారు.

ఆ) ఈ కథను ఓ చిన్న నాటికగా రాయండి.
 జవాబు:
 పాత్రలు – చూడాకర్ణుడు, వీణాకర్ణుడు, లఘుపతనకుడు, మంథరుడు, హిరణ్యకుడు.
మంథరుడు : లఘుపతనకా ! మిత్రమా! ఎవరీ కొత్త మిత్రుడు?
లఘుపతనకుడు : స్నేహితుడా ! ఇతను చాలా పుణ్యాత్ముడు. చాలా గొప్పవాడు.
మంథరుడు : ఈ కొత్త మిత్రుని పేరు?
లఘుపతనకుడు : హిరణ్యకుడు. పేరుకు తగ్గట్టే బంగారంలాంటివాడు,
మంథరుడు .: నా స్నేహితుడికి స్నేహితుడవంటే నాకూ స్నేహితుడివే.
హిరణ్యకుడు : అలాగే ! మిత్రమా ! మన ముగ్గురమింక ప్రాణ స్నేహితులం.
మంథరుడు : నీ గురించి చెప్పలేదు. ఈ నిర్ణనవనంలో ఎందుకున్నావు?
హిరణ్యకుడు : అదొక పెద్ద కథ. నా జీవితం ఇప్పటికి కుదుటపడింది.
మంథరుడు : ఏఁ ఏమయ్యింది? మిత్రుని వద్ద దాపరికమా?
హిరణ్యకుడు : లేదు. లేదు. నిన్ను , నా గతంలోకి తీసుకువెళతాను. పద. (చూడాకర్ణుడు, వీణాకర్ణుడు ఉంటారు.)
చూడాకర్ణుడు : మిత్రమా! వీణాకర్ణా! రండి. రండి.
వీణాకర్ణుడు : ఈ చంపకవతీ నగరం వస్తే మిమ్మల్ని చూడందే వెళ్లలేను.
చూడాకర్ణుడు : ఏమిటి విశేషాలు?
వీణాకర్ణుడు : ఏవో మంచి విషయాలు చెబుతారనే వచ్చాను.
చూడాకర్ణుడు : (గిలుక కర్రతో నేలపై కొడుతూ, చిలుకకొయ్య వైపు చూస్తుంటాడు.)
వీణాకర్ణుడు : ఇదేమైనా ఆధ్యాత్మిక సాధనా?
చూడాకర్ణుడు : అదేమీ లేదు. నా తలరాత.
వీణాకర్ణుడు : అదేమిటి?
చూడాకర్ణుడు : ఏం చెప్పనండీ ! ఆ చిలుకకొయ్యపై ఉన్న భిక్షాన్న శేషాన్ని ఒక ఎలుక తినేస్తోంది.
వీణాకర్ణుడు : ఒక ఎలుక అంత ఎత్తు ఎగురుతోందంటే, తప్పకుండా దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.
చూడాకర్ణుడు : అది ఒక కన్నంలో ఉండి, నా ఆహారం దోచుకొంటోంది.
వీణాకర్ణుడు : ఆ కలుగులోనే దాని సంపద ఉంటుంది. తవ్వండి.
చూడాకర్ణుడు : (తవ్వినట్లు నటిస్తూ) అమ్మో ! అమ్మో ! ఎంత సంపద? తవ్వేకొలదీ వస్తోంది. ఇంక దీని పని అయిపోయింది. (ఇంతలో హిరణ్యకుడు కృశించి, మెల్లగా తిరుగుతుంటాడు.)
వీణాకర్ణుడు : పాపం! హిరణ్యకుని చూశారా? ఎంత నీరసపడ్డాడో!
చూడాకర్ణుడు : ధనము కలవాడే బలవంతుడు. ధనం కలవాడే పండితుడు. ధనమే సర్వ శ్రేయాలకు మూలం.
వీణాకర్ణుడు : మరి, ధనం లేకపోతే?
చూడాకర్ణుడు : (నవ్వుతూ) ధనం లేకపోతే నిరంతరం బాధ కలుగుతుంది. ఆ బాధతో వివేకం నశిస్తుంది. వివేకం లేకపోతే ఏ పనీ సాధించలేము. అందరూ దూరమౌతారు.
హిరణ్యకుడు : (ఆలోచిస్తూ తనలో) నిజమే ! ఈ బాధ ఎవరికీ చెప్పుకోలేను. ఈ అవమానం భరించలేను. అయినా ఇక్కడే ఉంటాను. మళ్ళీ సంపాదిస్తాను.
వీణాకర్ణుడు : అదుగోనండోయ్. ఆ ఎలుక మిమ్మల్ని వదల్లేదండోయ్.
చూడాకర్ణుడు : దీని అంతు చూస్తా. (ఎలుకపై కర్ర విసిరాడు)
హిరణ్యకుడు : (తనలో) అమ్మో! చచ్చాను. హమ్మయ్య తప్పించుకొన్నాను. ఇంక ఈ ధనవ్యామోహం వదిలేస్తా. నిర్జనవనానికి పోతాను. ఆ భగవంతుడే కాపాడుతాడు. (మంథరుడు, హిరణ్యకుడు అడవిలో ఉంటారు.)
మంథరుడు : కళ్లకు కట్టినట్లుగా మీ గతం చెప్పారు.
హిరణ్యకుడు : ఇప్పుడు మీ స్నేహంలో నాకది ఒక పీడకల.
లఘుపతనకుడు : మీ ఇద్దరూ నన్ను వదిలేశారు.
మంథరుడు, హిరణ్యకుడు : ప్రాణాలైనా వదుల్తాం కానీ, స్నేహాన్నీ, మంచి స్నేహితులనీ వదలలేం.
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్ర కథల పుస్తకంలోని కథలను చదవండి. మీకు నచ్చిన కథను మీ సొంతమాటల్లో రాసి ప్రదర్శించండి.
 జవాబు:
 మితిమీరిన ఆశ (పంచతంత్ర కథ)
 ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. సింహం, పులి వంటి జంతువులు వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తిని, అది జీవించేది.
ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి, దాన్ని భుజాన వేసుకొని వస్తున్నాడు. ఇంతట్లో అతడికి ఒక పెద్ద అడవి పంది కనిపించింది. అతడు గురి చూసి పందిపై బాణం వేశాడు. బాణం గురి తప్పింది. పందికి గట్టి గాయం అయ్యింది. పంది కోపంతో వేటగాడిమీదికి దూకి, వాడిని చంపింది. పంది కూడా ప్రాణం విడిచింది. ఒక పాము పంది కాళ్ళ కిందపడి నలిగి చచ్చింది.
ఇంతలో ఆ దారినే వస్తూ నక్క చచ్చి పడియున్న మనిషినీ, పందినీ, పామునూ, లేడినీ చూసింది. ఒక్కసారిగా దానికి ఎంతో మాంసం దొరికింది. దానికి అసలే దురాశ గదా! వేటగాడి బాణంకు ఒక నరం బిగించి ఉంది. మిగిలిన మాంసం తరువాత తినవచ్చు. ముందు ఆ నరం తిందాము అనుకుంది నక్క.
నరాన్ని నక్క కొరికింది. బిగించిన ఆ నరం తెగి, ఊపుగా సాగి, నక్క గుండెను బలంగా తగిలింది. నక్క వెంటనే మరణించింది.
కథలోని నీతి : దురాశ దుఃఖానికి చేటు.
III. భాషాంశాలు
పదజాలం
1. కింది వాక్యాలకు అర్థాన్ని మీ సొంత పదాల్లో రాయండి.
అ) బుద్ధిహీనత వల్ల సమస్తకార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
 జవాబు:
 నిదాఘము అంటే వేసవికాలం. నదీ పూరములు అంటే నదులలోని నీటి ప్రవాహాలు, నిదాఘ నదీపూరములు అంటే మండువేసవిలో నదులలోని నీటి ప్రవాహాలు.
పని నెరవేరాలంటే వివేకం కావాలి. అంటే ఏది మంచో, ఏది చెడో తెలియాలి. వివేకం లేకపోతే అన్ని పనులూ వేసవిలో నదీ జలప్రవాహాలవలె ఆవిరైపోతాయి. అంటే పనులన్నీ పాడవుతాయి
ఆ) ధనమును బాసిన క్షణముననే లాతివాఁడగును.
 జవాబు:
 ధనము ఉంటే స్నేహితులు ఎక్కువవుతారు. అవసరమున్నా, లేకపోయినా అందరూ పలకరిస్తారు. ఇక బంధువులైతే ఏదో వంకతో వస్తారు. బంధువులు కానివారు కూడా ఆ ధనవంతుడు మావాడే అని చెప్పుకొంటారు. మా ఊరువాడు, మా జిల్లా వాడు, మా రాష్ట్రం వాడు, మా దేశం వాడే అని చెప్పుకొంటారు.
కాని ధనం పోతే ఎవ్వరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు (లాతివాడు) అవుతాడు.

ఇ) పరధనాపహరణము కంటె దిరియుట మంచిది.
 జవాబు:
 పరధనము పాము వంటిది. ఇతరుల వస్తువులను వేటినీ దొంగిలించకూడదు. మనకి ఉన్న దానితోటే తృప్తి పడాలి. ‘ లేకపోతే యాచించుట (తిరీయుట) మంచిది. అంటే పరధనాన్ని దొంగిలించడం మంచిది కాదు. అంతకంటె యాచన ద్వారా జీవించడం నయం.
ఈ) ఉదరమునకయి పరుల గోజక ప్రాప్త లాభమునకు సంతోషించు వాఁడొక్కడు లోకమందు ధన్యుడు.
 జవాబు:
 మన ఉదరము నింపుకోవడానికి అంటే మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడే ధన్యుడు. అంటే సంతోషమనేది సంతృప్తిని బట్టి ఉంటుంది. కాని, సంపదని బట్టి ఉండదు.
2. కింది పదాలకు ప్రకృతి – వికృతులను పాఠం నుండి వెతికి ఆ వాక్యాలను రాయండి.
 అ) బోనం : భోజనము
 జవాబు:
 అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో బెట్టి చిలుకకొయ్యమీద నుంచి నిద్రపోవును.
ఆ) శబ్దం : సద్గు
 జవాబు:
 నేను సద్దు చేయక దానిమీది కెగిరి ప్రతిదినమావంటకము భక్షించి పోవుచుండును.
ఇ) కర్షం : కార్యము
 జవాబు:
 బుద్దిహీనత వలన సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
ఈ) గీము : గృహము
 జవాబు:
 పుత్ర, మిత్ర, విరహితుని గృహమును, మూర్చుని చిత్తమును శూన్యములు.
ఉ) గారవం : గౌరవము
 జవాబు:
 సేవా వృత్తి మానమును వలె, యాచనా వృత్తి సమస్త గౌరవమును హరించును.
ఊ) చట్టం : శాస్త్రము
 జవాబు:
 వాడే సర్వశాస్త్రములు చదివిన వాడు.
ఋ) దమ్మము : ధర్మము
 జవాబు:
 వాడే సర్వ ధర్మము లాచరించినవాడు.
ఋ) సంతసం : సంతోషము
 జవాబు:
 ఉదరముకయి పరుల గోజక ప్రాప్తి లాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు.
3. వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) పుత్రుడు
 జవాబు:
 పున్నామ నరకము నుంచి రక్షించువాడు
ఆ) దేహి
 జవాబు:
 దేహాన్ని ధరించినవాడు
ఇ) ఈశ్వరుడు
 జవాబు:
 ఐశ్వర్యము ఉన్నవాడు
ఈ) మూషికము
 జవాబు:
 అన్నాదులను దొంగిలించునది
4. నానార్థాలు రాయండి.
అ) వివరము
 జవాబు:
 వివరణము, దూషణము
ఆ) వనము
 జవాబు:
 అడవి, నీరు, గుంపు
ఇ) ఫలము
 జవాబు:
 పండు, ప్రయోజనము, సంతానం
ఈ) అమృతము
 జవాబు:
 సోమరసము, వసనాభి, పరబ్రహ్మము

5. పర్యాయపదాలు రాయండి.
అ) జంతువు
 జవాబు:
 పశువు, జింక, అన్వేషణము
ఆ) మూర్ధము
 జవాబు:
 మస్తకము, శీర్షము, ఉత్తమాంగము
ఇ) బలము
 జవాబు:
 అంబ, బిరుదు, సత్తువ
ఈ) వివరము
 జవాబు:
 రంధ్రం, బిలం, కలుగు
వ్యాకరణాంశాలు
1. కింది వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీయండి. అవి ఏ సంధులో సూత్రయుక్తంగా తెల్పండి.
అ) అందుఁ జూడాకర్ణుఁడను పరివ్రాజకుఁడు గలడు.
 సంధి పదాలు :
- అందుఁజూడాకర్ణుఁడు
- చూడాకర్ణుఁడను
- పరివ్రాజకుఁడు గలడు.
వివరణ :
 సరళాదేశ సంధి
1) అందున్ + చూడాకర్ణుఁడు
 సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
అందున్ + చూడాకర్ణుఁడు
 సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.
అందుంజూడాకర్ణుఁడు (పూర్ణబిందు రూపం)
 అందుఁజూడాకర్ణుఁడు (అర్ధబిందు రూపం)
 అందున్టూడాకర్ణుఁడు (సంశ్లేష రూపం)
 అందుజూడాకర్ణుఁడు (విభాష వలన మార్పు రాని రూపం)
2) చూడాకర్ణుఁడను
 వివరణ : ఉత్వసంధి
 సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
 చూడాకర్ణుఁడు + అను – (ఉ + అ = అ)
3) పరివ్రాజకుఁడు గలడు
 వివరణ : గసడదవాదేశ సంధి
 సూత్రము : ప్రథమ (డు, ము, వు, లు) మీది పరుషములకు (క, చ, ట, త, ప లకు) గ, స, డ, ద, వలు బహుళంబుగానగు.
పరివ్రాజకుఁడు + కలడు = పరివ్రాజకుఁడు గలడు.
ఆ) తడవులఁ బట్టి ఈ యెలుక విడువక వాసము చేయుచున్నది.
 సంధి పదాలు :
- తడవులఁబట్టి
- ఈ యెలుక
- చేయుచున్నది
1) తడవులన్ + పట్టి
 వివరణ : సరళాదేశ
 సంధి సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
 తడవులన్ + బట్టి
సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
 తడవులంబట్టి (పూర్ణబిందు రూపం)
 తడవులఁబట్టి (అరబిందు రూపం)
 తడవులనబట్టి (సంశ్లేష రూపం)
 తడవుల్బట్టి (విభాష వలన మార్పు రాని రూపం)
2) ఈ యెలుక
 వివరణ : యడాగమం
 ఈ + ఎలుక = ఈ యెలుక.
 సూత్రము : సంధి లేనిచోట స్వరంబుకంటే పరమయిన స్వరమునకు యడాగమంబగు.
3) చేయుచున్నది
 వివరణ : ఉత్వసంధి
 చేయుచు + ఉన్నది = చేయుచున్నది.
 సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
పై వాక్యాలలో సరళాదేశ, గసడదవాదేశ, ఉత్వ సంధులు, యడాగమము ఉండటాన్ని గమనించారు కదా ! ఈ పాఠంలో సరళాదేశ, గసడదవాదేశ సంధి పదాలు ఇంకా ఏమేమున్నాయో గుర్తించి, సంధి సూత్రాలను రాయండి.
1. సరళాదేశ సంధి
 సూత్రములు :
- ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
- ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
పాత్రలోఁబెట్టి = పాత్రలోన్ + పెట్టి
 అడుగగాఁజూడాకర్ణుడు = అడుగగాన్ + చూడాకర్ణుడు
 తడవులఁబట్టి = తడవులన్ + పట్టి
 సంపాదించుకొనఁ జాలక = సంపాదించుకొనన్ + చాలక
 ఉండగాఁజూచి = ఉండగాన్ + చూచి
 పరులతోఁ జెప్పికోలును = పరులతోన్ + చెప్పికోలును
 ప్రకాశింపఁజేయ = ప్రకాశింపన్ + చేయు
 చేయఁదగదు = చేయన్ + తగదు
 అపహరణము కంటెఁ దిరియుట = అపహరణము కంటెన్ + తిరియుట
 వలనఁ దప్పిపోయినది = వలనన్ + తప్పిపోయినది
 నన్నుఁ గఱ్ఱతో = నన్నున్ + కఱ్ఱతో
 ఇంకఁదావు = ఇంకన్ + తావు
 నన్నుఁ గాపాడకుండునా = నన్నున్ కాపాడకుండునా
 వనములోఁ గాయగసరులు = వనములోన్ + కాయగసరులు
2) గసడదవాదేశ సంధి
 సూత్రము :
 ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
 పట్టణము గలదు = పట్టణము + కలదు
 ధనము గలవాడె +ధనము + కలవాడె
 మూలము గదా = మూలము + కదా
 కాణాచి గాదు = కాణాచి + కాదు
 మోఁదులు వడి = మోదులు + పడి
3) గసడదవాదేశ సంధి
 సూత్రము :
 ద్వంద్వంబునందు పదంబుపయి పరుషములకు గసడదవలగు.
 పెట్టువోతలు = పెట్టు + పోత
 కాయగసరులు = కాయ + కసరు

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను పేర్కొనండి.
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు | 
| అ) ఉదా : చంపకవతి పట్టణము | చంపకవతి అనే పేరుగల పట్టణము | సంభావనా పూర్వపద కర్మధారయము | 
| ఆ) మహాభాగ్యము | గొప్పదైన భాగ్యము | విశేషణ పూర్వపద కర్మధారయము | 
| ఇ) సేవావృత్తి | సేవయే వృత్తి | అవధారణ కర్మధారయ సమాసం | 
| ఈ) పదాబ్జములు | అబ్జముల వంటి పదములు | ఉపమాన ఉత్తరపద కర్మధారయము | 
| ఉ) కలువకన్నులు | కలువల వంటి కన్నులు | ఉపమాన పూర్వపద కర్మధారయము | 
| ఊ) మామిడిగున్న | గున్నయైన మామిడి | విశేషణ ఉత్తరపద కర్మధారయము | 
| ఎ) మృదుమధురము | మృదువును, మధురమును | విశేషణ ఉభయపద కర్మధారయము | 
3. పుంప్వాదేశ సంధి
 కింది పదాలు విడదీయండి. మార్పును గమనించండి.
 ఉదా :
 అచ్చపు పూలతోట = అచ్చము + పూలతోట
 అ) నీలపు గండ్లు = నీలము + కండ్లు
 ఆ) ముత్తెపుసరులు = ముత్తెము + సరులు
 ఇ) సరసపుమాట = సరసము + మాట
పైనున్న అన్ని సంధులలోనూ మొదటి పదం విశేషణం, రెండవ పదం విశేష్యం (నామవాచకం). అంటే పైవన్నీ కర్మధారయ సమాసాలే కదా! సంధి జరిగినపుడు మొదటి పదంలో చివరగల ‘ము’ లోపించింది. దానికి బదులుగా ‘పు’ వచ్చింది. ఒక్కొక్కసారి పూర్ణబిందు పూర్వక పు (ంపు) కూడా రావచ్చును. ‘పు’, ‘ంపు’ ఆదేశమవ్వడాన్ని పుంప్వాదేశం అంటారు. అందుకే దీన్ని పుంప్వాదేశ సంధి అన్నారు.
దీనికి సూత్రము:
 కర్మధారయంబున ‘ము’ వర్ణకమునకు పు, పులగు.
 అ) సింగప్తుకొదమ = సింగము + కొదమ
 ఆ) ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప
 ఇ) కొంచపునరుడు = కొంచము + నరుడు
4. వచనంలో శైలీ భేదం :
 కింది వాక్యాలు చదవండి. భేదాలు గమనించండి.
అ) ఆ పరివ్రాజకుడు సెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని.
 ఆ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
 ఇ) ఆ సన్యాసి జెప్పింది యిని శానా దుక్కమొచ్చింది.
మొదటి వాక్యం , ప్రాచీన శైలిని తెలుపుతుంది. దీనినే ‘గ్రాంథికం’ అని కూడా అంటారు. ‘ధన్యుడు’ పాఠమంతా ఈ శైలిలోనే నడుస్తుంది.
రెండవ వాక్యం శిష్టవ్యవహార శైలిని అనుసరించి ఉంది. ఇది విద్యావంతులు ఉపయోగించేది.
మూడవ వాక్యం నిరక్షరాస్యులు ఉపయోగించే పద్ధతి. ఇది స్థానిక మాండలిక పదాలతో ఉంటుంది.
కాలాన్ననుసరించి, ప్రాంతాన్ననుసరించి, సందర్భాన్ని బట్టి భాషను ఉపయోగించే విధానంలో మార్పు ఉంటుంది. ఇది భాషలో వైవిధ్యమేగాని, గొప్ప, తక్కువ అనే సంకుచిత దృష్టికూడదు.
కనుక పై మూడూ అనుసరించ తగినవే. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు దేని సొగసు దానిదే.
సాధారణంగా శిష్టవ్యవహారిక శైలినే చాలామంది ఈ రోజుల్లో రచయితలు ఉపయోగిస్తున్నారు. ఈ మార్పులలో ‘ంబు’, ‘ము’లు పోయి ‘0’ వస్తుంది.
ఉదా : కాలంబు, కాలము – ప్రాచీన గ్రాంథికం
 కాలం – వ్యవహారికం
 చూచి, వ్రాసి మొ||నవి – ప్రాచీన గ్రాంథికం
 చూసి, రాసి మొ||నవి – వ్యవహారికం
 యడాగమం, సరళాదేశాలు, గసడదవాదేశాలు – ప్రాచీన గ్రాంథికం
 విసంధిచేయడం – వ్యవహారికం
కింది వాక్యాలను ఆధునిక వ్యవహార శైలిలోకి, స్థానిక మాండలిక శైలిలో మార్చండి.
 గమనిక :
 ఈ మార్పులు చేసేటప్పుడు ‘ము’ వర్ణాలు, బిందుపూర్వక ‘బు’ కారాలు (ంబు), యడాగమాలు, క్రియారూపాలు (చేయును, జరుగును, చూడుము ……… వంటివి మారడాన్ని) గమనించండి.
అ) వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటె వనవాసముత్తమము.
 జవాబు:
 వ్యవహారికం :
 వివేక హీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.
ఆ) ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీఁదికెగిరి పాత్రమునందున్న యన్నము భక్షించి పోవుచున్నది.
 జవాబు:
 వ్యవహారికం :
 ఎలుక ప్రతిదినం చిలక్కొయ్య మీదకెగిరి పాత్రలోని అన్నం భక్షించి పోతోంది.
ఇ) బుద్ధిహీనత వలస సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
 జవాబు:
 వ్యవహారికం : బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపూరాలు లాగా వినాశమౌతాయి.
అదనపు సమాచారము
సంధులు
1) యాతనావహము = యాతనా + ఆవహము – సవర్ణదీర్ఘ సంధి
 2) దైవానుకూల్యము = దెవ + ఆనుకూల్యము – సవర్ణదీర్ఘ సంధి
 3) ధనాపహరణము = ధన + అపహరణము – సవర్ణదీర్ఘ సంధి
 4) స్వాశ్రయము = స్వ + ఆశ్రయము – సవర్ణదీర్ఘ సంధి
 5) సర్వాపదలు = సర్వ + ఆపదలు – సవర్ణదీర్ఘ సంధి
 6) కర్మానురూపము = కర్మ + అనురూపము. – సవర్ణదీర్ఘ సంధి
 7) శిలాంతరాళము = శిలా + అంతరాళము – సవర్ణదీర్ఘ సంధి
 8) జీవనార్ధము = జీవన + అర్థము – సవర్ణదీర్ఘ సంధి
 9) వచనామృతము = అమృతము – సవర్ణదీర్ఘ సంధి
 10) శోకాగ్ని = శోక + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
 11) చిరకాలోపార్జితము = చిరకాల + ఉపార్జితము – గుణసంధి
 12) సత్వోత్సాహములు = సత్త్వ + ఉత్సాహములు – గుణసంధి
 13) అతిసంచయేచ్చ = అతిసంచయ + ఇచ్ఛ – గుణసంధి
 14) చెడగరపుబోడ = చెడగరము + బోడ – పుంప్వాదేశ సంధి
 15) యావజ్జీవము = యావత్ + జీవము – శ్చుత్వసంధి
 16) ఏమది = ఏమి + అది – ఇత్వ సంధి
 17) ఏమయినను = ఏమి + అయినను – ఇత్వ సంధి
 18) ప్రయాసపాటు = ప్రయాసము + పాటు – పడ్వాది సంధి
 19) ఆయాసంపాటు = ఆయసము + పాటు – పడ్వాది సంధి
సమాసాలు
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు | 
| 1) సత్వోత్సాహములు | సత్త్వమును, ఉత్సాహమును | ద్వంద్వ సమాసం | 
| 2) జవసత్త్వములు | జవమును, సత్త్వమును | ద్వంద్వ సమాసం | 
| 3) బంధుమిత్రులు | బంధువులును, మిత్రులును | ద్వంద్వ సమాసం | 
| 4) పెట్టుబోతలు | పెట్టు, పోత | ద్వంద్వ సమాసం | 
| 5) ధనహీనుడు | ధనముచేత హీనుడు | తృతీయా తత్పురుష సమాసం | 
| 6) వివేకహీనుడు | వివేకముచే హీనుడు | తృతీయా తత్పురుష సమాసం | 
| 7) దైవానుకూల్యము | దైవము యొక్క అనుకూల్యము | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 8) కుసుమ స్తబకము | కుసుమముల యొక్క స్తబకము | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 9) ధనాపహరణము | ధనము యొక్క అపహరణము | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 10) యమలోకము | యముని యొక్క లోకము | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 11) శిలాంతరాళము | శిల యొక్క అంతరాళము | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 12) అమృత తుల్యము | అమృతముతో తుల్యము | తృతీయా తత్పురుష సమాసం | 
| 13) ధనలోభము | ధనమందు లోభము | సప్తమీ తత్పురుష సమాసం | 
| 14) సజ్జన సంగతి | సజ్జనుల యొక్క సంగతి | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 15) మహాభాగ్యము | గొప్ప అయిన భాగ్యము | విశేషణ పూర్వపద కర్మధారయం | 
| 16) సర్వశ్రేయములు | సర్వములయిన శ్రేయములు | విశేషణ పూర్వపద కర్మధారయం | 
| 17) అనృతము | ఋతము కానిది | నఇ్ తత్పురుష సమాసం | 
| 18) రెండు ఫలములు | రెండైన ఫలములు | ద్విగు సమాసం | 
| 19) మిత్రలాభము | మిత్రుల వలన లాభము | పంచమీ తత్పురుష | 
| 20) సంచయేచ్ఛ | సంచయమునందు ఇచ్చ | సప్తమీ తత్పురుష సమాసం | 
పర్యాయపదాలు
1) అమృతము : 1) సుధ 2) పీయూషము
 2) భోజనము : 1) తిండి 2) ఆహారము 3) అశనము
 3) ఎలుక : 1) మూషికం 2) ఆఖనికం 3) ఖనకం 4) ఎలక
 4) బలము : 1) శక్తి 2) పరాక్రమము 3) పౌరుషము
 5) సన్న్యాసి : 1) పరివ్రాజకుడు 2) భిక్షువు 3) బోడ 4) యతి
 6) ధనము : 1) అర్థం 2) ద్రవ్యం 3) విత్తం 4) ధనం
 7) గృహము : 1) ఇల్లు 2) భవనము 3) మందిరము
 8) అన్నము : 1) వంటకం 2) కూడు 3) బువ్వ
 9) బుద్ధి : 1) ప్రజ్ఞ 2) మతి 3) ప్రజ్ఞానం 4) మేధ 5) ధిషణ
 10) స్నేహితుడు : 1) మిత్రుడు 2) చెలికాడు 3) మిత్రము
నానార్థాలు
1) వాసము : 1) వెదురు 2) బట్ట 3) ఇల్లు 4) కాపురం
 2) నిమిత్తము : 1) కారణం 2) శకునము 3) గుటి
 3) నామము : 1) పేరు 2) బొట్టు 3) ప్రాతిపదిక
 4) ప్రభువు : 1) స్వామి 2) సమర్థుడు 3) అధిపుడు
 5) ధర్మము : 1) న్యాయం 2) విల్లు 3) స్వభావం
 6) ప్రాణము : 1) జీవుడు 2) గాలి 3) చైతన్యం
 7) పుణ్యము : 1) సుకృతం 2) ఆకాశం 3) నీరు 4) పూవు
 8) ఫలము : 1) పండు 2) ప్రయోజనం 3) సంతానం
 9) వనము : 1) అడవి 2) నీరు 3) గుంపు
 10) లోకము : 1) జనం 2) స్వర్గం వంటి లోకము 3) చూపు
 11) మిత్రుడు : 1) స్నేహితుడు 2) సూర్యుడు
 12) శాస్త్రము : 1) తర్కము మొదలయిన శాస్త్రములు 2) చట్టం 3) ఆజ్ఞ
 13) ఆశ : 1) దిక్కు 2) కోరిక
 14) ఉదరము : 1) కడుపు 2) నడుము 3) యుద్ధం
 15) గృహము : 1) ఇల్లు 2) భార్య 3) గృహస్థాశ్రమం
 16) జీవనము : 1) బ్రతుకుట 2) గాలి 3) నీరు
 17) గౌరవము : 1) బరువు 2) గొప్పదనము 3) మన్నన, మర్యాద
 18) బలము : 1) సత్తువ 2) సైన్యం 3) బలాత్కారం
వ్యుత్పత్తరాలు
1) సన్న్యా సి : సర్వమూ న్యాసం (వదలివేసిన) చేసినవాడు.
 2) పరివ్రాజకుడు : అన్నింటినీ పరిత్యజించిపోయేవాడు (సన్న్యాసి)
 3) మూషికము : అన్నాదులను దొంగిలించునది (ఎలుక)
 4) నిదాఘము : దీనియందు జనము మిక్కిలి దహింపబడతారు (గ్రీష్మ ఋతువు
 5) పుత్తుడు : పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)
 6) దేహి : దేహమును (శరీరాన్ని) ధరించినవాడు (మనిషి)
 7) ఈశ్వరుడు : స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు (శివుడు)
 8) మిత్రుడు : సర్వభూతముల యందు స్నేహయుక్తుడు (సూర్యుడు)
 9) లఘుపతనకుడు : తేలికగా ఎగిరేది (కాకి)
రచయిత పరిచయం
రచయిత :
 ఈ పాఠ్యాంశ రచయిత పేరు పరవస్తు చిన్నయసూరి. క్రీ.శ. 1809లో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరంబుదూరులో జన్మించాడు. తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వేంకట రామానుజాచార్యులు. చిన్నయసూరి మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పని చేశారు.
రచనలు :
 పద్యానికి నన్నయ, గద్యానికి చిన్నయ అని లోకోక్తి. ‘సూరి’ అనేది వీరి బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థం. అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం,
 పరవస్తు చిన్నయసూరి శబ్దలక్షణసంగ్రహము బాలవ్యాకరణం, నీతిచంద్రిక మొదలైన గ్రంథాలు 1809 – 1882) రచించారు.
రచనా శైలి :
 ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. గ్రాంథిక రచన. ఈయన వ్రాసిన బాలవ్యాకరణం ప్రామాణిక గ్రంథం. నీతిచంద్రిక – బాలవ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్లభాషలలో సూరి మంచి పండితుడు.
కఠిన పదాలకు అర్థాలు
సన్న్యాసి = కామ్యకర్మలను విడిచినవాడు
 వాసము = నివాసము
 తట్టు = కొట్టు
 పరివ్రాజకుడు = సర్వమును విడిచి పెట్టినవాడు(సన్న్యాసి)
 చిలుకకొయ్య = బట్టలు తగిలించుకొనుటకు గోడకు కొట్టబడిన చిలుక ఆకారపు కొయ్య (Hanger)
 లాఁగ = రంధ్రము
 మీదు = పైన
 తడవు = చిరకాలము
 ఉపద్రవము = విప్లవము
 నిమిత్తము = కారణము
 వివరము = రంధ్రము
 గుద్దలి = గునపము
 చిరకాలము = చాలా కాలం
 ఆర్జితము = సంపాదింపబడినది
 సత్యము = బలము
 కృశించి = బక్కచిక్కి
 శ్రేయము = శుభము
 నిదానము = అసలు కారణము
 తొంటి = మొదటి
 జవము = వేగము

స్వజాతి = తన జాతి
 అర్థ పరిహీనుడు = ధనము లేనివాడు, దరిద్రుడు
 నిరంతరము = ఎల్లప్పుడు
 ఖేదము = దుఃఖము
 నిదాఘము = వేసవి
 పూరము = జల ప్రవాహము
 మేధ = తెలివి
 మిత్రులు = స్నేహితులు
 విరహితము = లేనిది
 ఆపాతము = పడుట
 యాతన = బాధ
 ఆవహము = కూడినది
 వేదన = బాధ
 ఆకరము = చోటు
 నామము = పేరు
 వచోధోరణి = మాట్లాడే పద్ధతి
 లాంతివాడు = రాయివాడు, అన్యుడు
 ఖిన్నుడు = భేదము పొందినవాడు, బాధితుడు
 యుక్తము = తగినది
 వంచనము = మోసము
 పరాభవము = అవమానము
 అనుకూల్యము = అనుకూలమైనది
 మానవంతుడు = పౌరుషం కలవాడు
 స్తబకము = గుత్తి
 మూరము = తల, శిరస్సు
 యాచన = ముష్టి
 గర్హితము = నిందింపబడినది
 మ్రుక్కడి = అల్పము, అల్పుడు
 తొఱుఁగుట = విడచుట
 అనృతము = అసత్యము, అబద్ధము
 అపహరణము = దొంగతనము
 తిరియుట = బిచ్చమెత్తుట, యాచించుట
 నింద్యము = నిందింపతగినది
 నానావిధములు = అనేక విధాలు
 విచారించి = ఆలోచించి
 అర్ధసంగ్రహము = ధన సంపాదన
 లోభము = పిసినిగొట్టుతనము
 మోహము = అజ్ఞానము, వలపు
 ఉత్పాదించును = పుట్టించును
 జ్వలనము = అగ్ని
 అనంతరము = తరువాత
 వర్జనము = విడిచిపెట్టుట
 దిగనాడుట = విడిచి పెట్టుట
 ఉదరము = పొట్ట
 పరులు = ఇతరులు
 తత్ + తత్ + కర్మ + అనురూపము = ఆయా పనులకు తగినట్లుగా
 గోఁజక = పీడింపక
 దేహి = దేహము కలవాడు, మానవుడు
 ప్రయాస = కష్టము, శ్రమ
 నిరర్థకము = వృథా
 తావు = స్థానము
 కాణాచి = నిలయము
 చెడగరపుబోడ (చెడగరము =క్రూరము) (బోడ = సన్యా సి) = క్రూరుడైన సన్యాసి
 మోదులు = దెబ్బలు
 విజన ప్రదేశము = జనులు లేని చోటు
 అంతరాళము = లోపలి భాగము
 శిల = రాయి
 కసరు = పిందె (లేతకాయ)
 పడియ = నీటిగుంట
 సజ్జన సంగతి = సజ్జనులతో కలియుట
 తుల్యము = సమానం
 అమృత రసపానము = అమృత రసమును త్రాగుట
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
 ఎక్కడి ఎలుక ? ఎక్కడి చిలుకకొయ్య? అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది?
 జవాబు:
 సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాల లోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాక లోకము (స్వర్గం) ఎక్కడ ?’ అని కూడా అంటారు.
ప్రశ్న 2.
 “ధనము సర్వశ్రేయములకు నిదానము”. మీ అభిప్రాయం చెప్పండి.
 జవాబు:
 ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్య కార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

ప్రశ్న 3.
 ‘దారిద్ర్యము సర్వశూన్యము’ అనే మాటను బట్టి మీకేమర్థమయింది?
 జవాబు:
 దారిద్ర్యము అంటే బీదతనము. సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.
ప్రశ్న 4.
 ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు. ఎట్లు?
 జవాబు:
 ఆశ అన్ని అనర్ధాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.
ప్రశ్న 5.
 ధనహీనుడై నలుగురిలో నుండరాదు. ఎందుకు?
 జవాబు:
 ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండ కూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.
ప్రశ్న 6.
 ‘మనసు గట్టి పరచుకోవటం’ అంటే ఏమిటి?
 జవాబు:
 మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పెంచుకోవడం అంటే మనస్సును దృఢము చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

ప్రశ్న 7.
 ‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమరమైంది?
 జవాబు:
 మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.
