These AP 9th Biology Important Questions and Answers 10th Lesson నేల కాలుష్యం will help students prepare well for the exams.
AP Board 9th Class Biology 10th Lesson Important Questions and Answers నేల కాలుష్యం
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
 నేలలో కలిసిపోని చెత్త గురించి క్లుప్తంగా వివరించండి. ఉదాహరణలివ్వండి.
 జవాబు:
- ఇవి నేలలో తొందరగా కలిసిపోని వ్యర్థాలు.
- ప్లాస్టిక్, గాజు, డిడిటి, అల్యూమినియం కప్పులు వీటికి ఉదాహరణలు.
ప్రశ్న 2.
 కుళ్ళిపోవడం అనగానేమి?
 జవాబు:
 కుళ్ళిపోవడం :
 పదార్ధాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న సరళ పదార్థాలుగా మారిపోవడాన్ని కుళ్ళిపోవడం అంటారు.
ప్రశ్న 3.
 నేల పై పొర ఎందువలన ప్రధానమైనది?
 జవాబు:
 నేలలో ఉన్న మూడు క్షతిజాలలో పై పొర ప్రధానమైనది. ఎందుకంటే ఇది భూమి మీద జీవులు జీవించడానికి జీవనానికి ఆధారమైనది.
ప్రశ్న 4.
 జైవిక నేల అనగానేమి?
 జవాబు:
 నేలలో 30 శాతం లేదా అంతకన్న ఎక్కువ జీవ సంబంధ పదార్ధాలను కలిగి ఉండే దానిని జైవిక నేల (Organic Soil) అంటారు.

ప్రశ్న 5.
 ఆమ్ల, క్షార స్వభావం కల నేలలని వేటిని అంటారు?
 జవాబు:
 pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం కల నేలలు అని, pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం కల నేలలనీ అంటారు.
ప్రశ్న 6.
 ఖనిజీకరణం అంటే ఏమిటి?
 జవాబు:
 నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవసంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మారుస్తాయి. ఈ సమయంలో కార్బన్ డయాక్సెడ్, అమ్మోనియం సల్ఫేట్లు, ఫాస్ఫేట్ లు ఉత్పన్నం అవుతాయి. ఇతర నిరింద్రియ మూలకాలు కూడా ఏర్పడతాయి. ఈ పద్ధతిని ‘ఖనిజీకరణం’ (Mineralization) అంటారు.
ప్రశ్న 7.
 జైవిక వ్యవస్థాపనం అంటే ఏమిటి?
 జవాబు:
 అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశించడాన్నే జైవిక వ్యవస్థాపనం (Biomagnification) అంటారు.
ప్రశ్న 8.
 జైవిక సవరణీకరణ అంటే ఏమిటి?
 జవాబు:
 జీవ సంబంధం పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ (Bio-Remediation) అంటారు.
ప్రశ్న 9.
 ఫైటోరెమిడియేషన్ అంటే ఏమిటి?
 జవాబు:
 జైవిక సవరణీకరణంలో సూక్ష్మజీవులతో పాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనిని ఫైటోరెమిడియేషన్ (Phyto – Remediation) అంటారు.
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 నేలలో కలిసిపోయే చెత్త గురించి క్లుప్తంగా వివరించి, ఉదాహరణలివ్వంది.
 జవాబు:
- సూక్ష్మజీవుల వల్ల ప్రమాదం కాని మరియు విషరహితం కాని చెత్తగా మార్చబడే పదార్థాలను నేలలో కలసిపోయే చెత్త పదార్థాలు అంటాం.
- ఆకులు, పేడ, చొప్ప, కొమ్మలు వంటి మొక్క మరియు జంతువుల నుండి వచ్చే వ్యర్థాలు మరియు వ్యవసాయంలో వచ్చే వ్యర్థాలు వీటికి ఉదాహరణలు.

ప్రశ్న 2.
 ఘనరూప వ్యర్థాలు అంటే ఏమిటి? ఘనరూప వ్యర్థాలలోని రకములు ఏవి?
 జవాబు:
- వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారేయబడిన కర్బన, ఆకర్బన పదార్థాల వ్యర్థాలన్నింటిని ఘనరూప వ్యర్థాలు అనవచ్చు.
- ఘనరూప వ్యర్థాలు అవి ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి మూడు రకాలు. అవి :
 ఎ) మునిసిపల్ వ్యర్థాలు,
 బి) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు,
 సి) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు.
ప్రశ్న 3.
 ప్రమాదకర రసాయన వ్యర్థాల వలన కలిగే దుష్ఫలితాలు ఏవి?
 జవాబు:
 ప్రమాదకర రసాయన వ్యర్థాలు మన చుట్టుపక్కల పేరుకునిపోవడం వలన ఆయా ప్రాంతాల్లోని పిల్లలు అసాధారణ రీతిలో, పుట్టుకతోనే లోపాలు కలిగి ఉండడం, క్యాన్సర్, శ్వాస, నాడీ మరియు కిడ్నీ సంబంధ వ్యాధులకు గురి కావడం జరుగుతున్నది.
ప్రశ్న 4.
 నేల కాలుష్యాన్ని ఎలా విభజించవచ్చు?
 జవాబు:
 నేలలో చేరే వ్యర్థాల ఆధారంగా నేల కాలుష్యాన్ని కింది విధంగా విభజించవచ్చును.
- వ్యవసాయం వల్ల నేల కాలుష్యం
- పారిశ్రామిక ఘన, ద్రవ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం
- పట్టణీకరణ వల్ల వెలువడే కాలుష్యం.
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 నేల ఏ విధంగా ఏర్పడుతుంది?
 జవాబు:
- నేల ఏర్పడడం ఒక సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియ. ఒక అంగుళం నేల ఏర్పడడానికి 100 నుండి 10,000 సంవత్సరాలు పడుతుంది.
- వాతావరణం, వాటి సహజ స్వరూప లక్షణాలు, దానిలో ఉండే మాతృశిల స్వభావం, సూక్ష్మజీవులు మొదలైనవన్నీ నేలను ఏర్పరచడంలో కారకాలుగా పనిచేస్తాయి.
- మాతృశిల క్రమక్షయం చెందడం, నదులు ఇతర ప్రవాహాలు మేటవేయడం, అగాధాలు, పర్వతాలు, గాలి మరియు మంచు కొండలు, వృక్ష సంబంధ వ్యర్థాల వల్ల నేల మాతృ పదార్థాలు ఏర్పడతాయి.
- కొంత కాలానికి ఇవి గడ్డకట్టడం, కరిగిపోవడం, పొడిబారడం, తడిసిపోవటం, వేడెక్కడం, చల్లబడడం, క్రమక్షయానికి గురికావడం, మొక్కలు, జంతువులు, ఇతర రసాయన చర్యల వల్ల నేలగా రూపొందుతాయి.
ప్రశ్న 2.
 నేలలో ఉండే అంశీభూతములు ఏవి?
 జవాబు:
- భూమి ఖనిజాలు, క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు గాలి, నీరుతో కలిసి నేల ఏర్పడుతుంది.
- నేల అనేక జీవరాసులకు ఆవాసం.
- బాక్టీరియా, ఫంగై వంటి జీవులతో పాటు పెద్ద, పెద్ద వృక్షాలు, జంతువులకు కూడా నేల ఆహారాన్ని అందించడంతోపాటు ఒక మంచి ఆవాసంగా ఉంటుంది.

ప్రశ్న 3.
 నేల రసాయన ధర్మాలు ఏవి? మొక్కలపై రసాయన ధర్మాల ప్రభావం ఏమిటి?
 జవాబు:
- నేలల ఆమ్ల మరియు క్షార స్వభావాలను తెలుపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారు.
- మంచి నేలల pH విలువలు 5.5 నుండి 7.5 వరకు ఉంటాయి.
- pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం గల నేలలు అని, pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం గల నేలలని అంటారు.
- నేలలో ఉండే జీవ సంబంధ పదార్థాలు కూడా pH విలువలతో సంబంధం కలిగి ఉంటాయి.
- మొక్కకు కావాల్సిన పోషకాల అందుబాటు నేల యొక్క pH విలువపై ఆధారపడి ఉంటుంది.
- నేలలో pH విలువ తగ్గే కొద్దీ మొక్కలకు కావలసిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ అందుబాటు కూడా తగ్గుతుంది.
ప్రశ్న 4.
 నేల యొక్క జీవ సంబంధ ధర్మాలు ఏవి? మొక్కల పెరుగుదలపై ఇవి ఏ విధమైన ప్రభావం కలిగిస్తాయి?
 జవాబు:
- భూమి మీద ఉన్న వైవిధ్యభరితమైన ఆవరణ వ్యవస్థలలో నేల ప్రధానమైనది.
- నేలలోని వృక్ష సంబంధమైన జీవులు, అతిసూక్ష్మమైన వైరస్ నుండి వానపాముల వరకు, ఎన్నో జీవరాసులు నేలలో జీవిస్తున్నాయి.
- బొరియల్లో నివసించే ఎలుకలు, నేల ఉడుతలు వంటి జీవజాలం కూడా ఈ నేలతో సంబంధం కలిగినవి.
- నేలలో ఉన్న సూక్ష్మజీవులలో బాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవనులు ముఖ్యమైనవి.
- ఇవి వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
- నేలలోని సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల పరిమాణాన్ని మరియు ప్రభావాన్ని కూడా నియంత్రిస్తాయి.
ప్రశ్న 5.
 పర్యావరణంపై కీటక సంహారిణి డిడిటి యొక్క ప్రభావమేమిటి?
 జవాబు:
 పర్యావరణంపై కీటక సంహారిణి దిడిటి యొక్క ప్రభావం :
- రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చాలా ఎక్కువగా ఉపయోగించబడిన కీటక సంహారకాలు డిడిటీ మరియు గమాక్సిన్లు.
- డిడిటి కేవలం కొవ్వులలో మాత్రమే కరుగుతుంది.
- నీళ్ళలో కరగకపోవడం వల్ల ఇది ఆహార గొలుసు ద్వారా పక్షులలోకి చేరి వాటిలో కాల్షియం జీవక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల పక్షుల గుడ్లపై పెంకులు పలచబడి పగిలిపోతున్నాయి.
- దీని ఫలితంగా బ్రౌన్ పెలికాన్, ఓఎస్, డేగ మరియు గద్దలు అంతరించిపోతున్నాయి.
- పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం డిడిటి నిషేధించబడినది.

ప్రశ్న 6.
 శిలీంధ్ర నాశకాలకు ఉదాహరణలివ్వండి. పర్యావరణంపై వీటి ప్రభావమేమిటి?
 జవాబు:
 శిలీంధ్ర నాశకాలకు ఉదాహరణలు :
 DDT, BHC (బెంజీన్ హెక్సాక్లోరైడ్), క్లోరినేటెడ్ హైడ్రోకార్బనులు, ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆల్జిన్, మలాథియాన్, టైలిడ్రిన్, ప్యూరో డాన్ మొదలైనవి శిలీంధ్ర నాశకాలకు ఉదాహరణలు.
పర్యావరణంపై వీటి ప్రభావాలు :
- శిలీంధ్ర నాశకాలను పంటలపై చల్లినప్పుడు మిగిలిపోయిన వీటి అవశేషాలు నేలలోని మట్టి కణాలలోకి చేరతాయి.
- ఇవి ఆ నేలలో పెరిగిన పంట మొక్కలలోకి చేరి కలుషితం చేస్తాయి.
- ఈ అవశేషాలతో పెరిగే పంటలను ఆహారంగా తినడం ద్వారా మానవ జీర్ణవ్యవస్థలోనికి చేరి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను కలుగచేస్తాయి.
- ఈ శిలీంధ్ర నాశకాలు జంతువులు మరియు మానవులలో విష” ప్రభావాన్ని కలిగించడమే కాకుండా నేల సారాన్ని తగ్గిస్తాయి.
ప్రశ్న 7.
 జైవిక వ్యవస్థాపనం గురించి వివరించండి.
 జవాబు:
 జైవిక వ్యవస్థాపనం :
 
- మొక్కలకు కావలసిన పోషకాలైన నత్రజని మరియు భాస్వరం సహజంగా లభించే నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
- నీటిలో పెరిగే వృక్షప్లవకాలు వాటి పెరుగుదల కొరకు అవసరమైన మూలకాలను ఎక్కువ పరిమాణంలో నీటి నుండి సేకరిస్తాయి.
- ఆ విధంగా సేకరించేటప్పుడు వృక్ష ప్లవకాలు కరగకుండా మిగిలిన కీటక నాశకాలలోని రసాయనిక పదార్థాలను కూడా సేకరిస్తాయి.
- ఇవి నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. చాలా సున్నిత పరికరాలు కూడా వీటిని కొలవలేవు.
- ఈ రసాయనాలు జీవులలో కొద్ది కొద్దిగా పేరుకుపోతాయి.
- జీవుల కణాలలో వీటి సాంద్రత నీటిలోని రసాయనాల సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది.
- వాతావరణంలో విచ్చిన్నం కాని DDT, BHC లాంటివి జీవుల కొవ్వు కణాలలోకి చేరతాయి.
- వృక్ష ప్లవకాలను ఎక్కువగా తినే జంతు ప్లవకాలు, చిన్న చేపలలో ఇవి కొద్దికొద్దిగా చేరి పేరుకొనిపోతాయి.
- ఆహారపు గొలుసులోని ప్రతి దశలోని జీవుల్లో దీని సాంద్రత ఎక్కువగా చేరుతూ ఉంటుంది.
- ఇలా అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవులలోకి ప్రవేశించడాన్ని జైవిక వ్యవస్థాపనం అంటారు.
ప్రశ్న 8.
 మృత్తిక క్రమక్షయం అనగానేమి? దానికి కారణాలేవి?
 జవాబు:
 మృత్తిక క్రమక్షయం :
 గాలి లేదా నీటి ద్వారా మట్టిపై పొరలు కొట్టుకుపోవడాన్ని మృత్తిక క్రమక్షయం అంటారు.
కారణాలు :
- చెట్లను నరికివేయడం, వ్యవసాయ విస్తీర్ణం పెంచడం, ఉష్ణోగ్రతలో ఎక్కువ వ్యత్యాసాలు, ఆమ్ల వర్షాలు, మానవుని చర్యలు నేల క్రమక్షయానికి కారణమవుతున్నాయి.
- మానవులు నిర్మించే వివిధ నిర్మాణాలు, గనుల తవ్వకం, కలప నరకడం, అధిక పంటలు, అధికంగా పశువులను మేపడం ద్వారా మానవుడు నేల క్రమక్షయాన్ని అధికం చేస్తున్నాడు.
- ఇది వరదలకు దారితీసి దీనివల్ల మృత్తిక క్రమక్షయం అధికమైనది.
ప్రశ్న 9.
 నగరాలలో చెత్తను సరిగా సేకరించకపోవడం వలన కలిగే సమస్యలేవి?
 జవాబు:
 నగరాలలో చెత్తను సరిగా సేకరించకపోవడం వలన కలిగే సమస్యలు :
- కాల్వల్లో నీరు ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడటం వలన మామూలుగా ప్రవహించవలసిన నీరు ఆగిపోయి మురికి నీరు రోడ్లను ముంచెత్తడం, భవనాల పునాదులకు ప్రమాదం వాటిల్లడం, దోమల వ్యాప్తి.
- ఆరోగ్యానికి ప్రమాదకారిగా మారుతుంది.
- ఒకే ప్రదేశంలో వ్యర్థాలన్నీ పారవేయడం వల్ల దుర్వాసన రావడం.
- సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో పెరిగి కర్బన పదార్థాలు ఎక్కువ మొత్తంలో మీథేన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
- ఆసుపత్రి నుండి విడుదలయ్యే ఘనరూప వ్యర్థాలు ఆరోగ్య సమస్యలను ఉత్పన్నం చేస్తాయి.
ప్రశ్న 10.
 జైవిక సవరణీకరణ అంటే ఏమిటి? దాని వలన ఉపయోగమేమిటి?
 జవాబు:
 జైవిక సవరణీకరణ :
 జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.
ఉపయోగాలు :
- అవక్షేపాలు, నేల, నీరు మొదలైన వాటిలో ఏర్పడే పర్యావరణ సమస్యలను తొలగించుకోవడానికి సాధారణంగా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు.
- జైవిక సవరణీకరణలో సూక్ష్మజీవులతోపాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనిని ఫైటోరిమిడియేషన్ అంటారు.
- లోహాల వంటి అకర్బన పదార్థాలు, తక్కువ స్థాయిలో గల రేడియోధార్మిక పదార్థాలు వంటి వాటి ద్వారా కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారు.

ప్రశ్న 11.
 నేలను సంరక్షించడానికి ఉపయోగపడే మార్గాలను, పద్ధతులను తెలపండి. వాటిని క్లుప్తంగా వివరించండి.
 జవాబు:
 నేల సంరక్షణ చర్యలు :
 1. మొక్కలు పెంచడం, 2. గట్టు కట్టడం, 3. దున్నకుండా వ్యవసాయం చేయడం, 4. కాంటూర్ వ్యవసాయం, 5. పంట మార్పిడి, 6. నేలలో ఉదజని సూచిక (pHI), 7. నేలకు నీరు పెట్టడం, 8. క్షారత్వ నిర్వహణ, 9. నేలలో ఉండే జీవులు, 10. సంప్రదాయ పంటలు.
1) మొక్కలను పెంచడం :
 a) మొక్క వేరు నేల లోపలికి విస్తరించి నేల కోరివేతకు గురికాకుండా కాపాడుతాయి.
 b) నేలను కప్పి ఉన్న మొక్కలు నేలను క్రమక్షయం కాకుండా ఉంచడమే కాకుండా గాలి వేగాన్ని కూడా అదుపు చేస్తాయి.
2) గట్టు కట్టడం :
 కొండవాలు ప్రాంతాలలో గట్లను నిర్మించడం వలన వర్షాకాలంలో వేగంగా పారే వర్షపు నీటితోపాటు మట్టి కొట్టుకొని పోకుండా గట్లు నిరోధిస్తాయి. ఎక్కడి నేల అక్కడే నిలిచిపోతుంది.
3) దున్నకుండా వ్యవసాయం చేయడం :
 a) నేలలో ఎరువులు వేయడానికి చాళ్ళను దున్నడం పనికి వస్తున్నప్పటికీ దీనివలన నేలలో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి.
 b) అందువలన నత్రజని స్థాపన తగ్గిపోతుంది.
 c) కాబట్టి దున్నకుండా వ్యవసాయం చేసే పద్ధతులు పాటించి నేల సారం కాపాడుకోవచ్చు.
4) కాంటూర్ వ్యవసాయం :
 a) నేలలో వాలుకు అడ్డంగా పొలం దున్ని వ్యవసాయం చేయడం.
 b) ఇది వర్షాకాలంలో ప్రవహించే నీటి వేగాన్ని తగ్గించి నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది.
5) పంట మార్పిడి :
 పంట మార్పిడి పద్ధతి ద్వారా నేల సారం కాపాడుకోవడంతోపాటు పంట దిగుబడి కూడా పెంచవచ్చు.
6) నేలలో ఉదజని సూచిక (pH) :
 a) నేల pH విలువను బట్టి మొక్కలు తీసుకొనే పోషకాల పరిమాణం అధారపడి ఉంటుంది.
 b) నేల pH మారకుండా చూసినట్లయితే నేల సారం సంరక్షించబడుతుంది.
7) నేలకు నీరు పెట్టడం :
 మొక్కలతోపాటు నేలకు నీరు పెట్టడం ద్వారా గాలికి నేల క్రమక్షయం కాకుండా కాపాడుకోవచ్చు.
8) క్షారత్వ నిర్వహణ :
 a) నేలలోని క్షార స్వభావం నేలపై పెరిగే మొక్కలపై ప్రభావితం చూపుతాయి. అందువల్ల మొక్కలు చనిపోతాయి.
 b) ఇది నేల క్రమక్షయానికి దారితీస్తుంది.
9) నేలలో ఉండే జీవులు :
 నేలలో ఉండే జీవులు నేల స్వభావాన్ని మెరుగుపరుస్తాయి. మొక్కలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి.
10) సంప్రదాయ పంటలు :
 నేలలను కాపాడుకోవడంలో స్థానిక పంటలు ముఖ్యపాత్ర వహిస్తాయి.

ప్రశ్న 12.
 వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావాలు ఏవి?
 జవాబు:
 వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావాలు :
- నేల సారం తగ్గిపోతుంది.
- నేలలో నత్రజని స్థిరీకరణ తగ్గిపోతుంది.
- నేల క్రమక్షయం పెరుగుతుంది.
- నేలలోని పోషకాలు అధికంగా నష్టమవుతాయి.
- నదులు, చెరువుల్లో పూడిక పెరిగిపోతుంది.
- పంట దిగుబడి తగ్గిపోతుంది.
ప్రశ్న 13.
 పరిశ్రమల ద్వారా కలిగే నేల కాలుష్య ప్రభావాలు ఏవి?
 జవాబు:
 పరిశ్రమల ద్వారా కలిగే నేల కాలుష్య ప్రభావాలు :
- భూగర్భ జలాలు విష రసాయనాలతో కలుషితమవుతాయి.
- ఆవరణ వ్యవస్థలలో అసమతుల్యత ఏర్పడుతుంది.
- విషపూరిత వాయువులు వెలువడతాయి.
- ఆరోగ్యానికి హాని కలిగించే రేడియోధార్మిక కిరణాలు విడుదల అవుతాయి.
- నేలలో క్షార స్వభావం పెరిగిపోతుంది.
- వృక్షజాలం తగ్గిపోతుంది.
ప్రశ్న 14.
 నగరాలలో నేల కాలుష్య ప్రభావ ఫలితాలు ఏవి?
 జవాబు:
 నగరాలలో నేల కాలుష్య ప్రభావ ఫలితాలు :
- మురుగు నీటి కాలువలు మూసుకుపోతాయి.
- పరిసరాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి.
- ప్రజా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
- తాగునీటి వనరులు కలుషితం అవుతాయి.
- చెడు వాసన గల వాయువులు వెలువడుతాయి.
- వ్యర్థ పదార్థాల నిర్వహణ కష్టమవుతుంది.
ప్రశ్న 15.
 నేల కాలుష్యం కలిగించే కారకాలను, వాటిని తొలగించే పద్ధతులను వివరించండి.
 జవాబు:
 నేలలో చేరే వ్యర్థాల ఆధారంగా నేల కాలుష్యాన్ని ఈ కింది విధంగా విభజించవచ్చు. అవి :
- వ్యవసాయం వల్ల నేల కాలుష్యం
- పారిశ్రామిక ఘన, ద్రవ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం
- పట్టణీకరణ వల్ల వెలువడే కాలుష్యం
కాలుష్య కారకాలను తొలగించే పద్ధతులు :
- నగరాల్లో ఏర్పడే చెత్తలో అధికంగా కాగితాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు వంటి వాటిని పునఃచక్రీయ పద్ధతి ద్వారా కాని, నేలలోకి విచ్ఛిన్నం చేయించడం ద్వారా కాని నిర్మూలించవచ్చు / తొలగించవచ్చు.
- వ్యవసాయంలో ఏర్పడే అధిక వ్యర్థాలను పునఃచక్రీయ పద్ధతిలో వాడుకోవచ్చు.
- ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వ్యర్థాల సేకరణ, అనుకూలమైన ప్రదేశాలకు రవాణా చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించని పద్ధతుల ద్వారా తొలగించడం అనే దశలు పాటించాలి.
- పరిశ్రమల వ్యర్థాలను భౌతిక, రసాయనిక, జైవిక పద్ధతుల ద్వారా తక్కువ హాని కలిగించే విధంగా మార్చాలి.
- ఆమ్ల, క్షార వ్యర్థాలను మొదట తటస్థీకరించాలి. నీటిలో కరగని, నేలలోకి చేరిపోయే వ్యర్థాలను నియంత్రిత స్థితిలో పారవేయాలి.
- ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వాటికి నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చివేయడ మనేది అందరికి తెలిసిన పద్ధతి.
- ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడాన్ని పైరాలసిస్ అంటారు. ఇది కాల్చడానికి ఉపయోగించే ఇన్ సినరేషనకు ప్రత్యామ్నాయ పద్ధతి.
- పట్టణాల, గృహాల నుండి వెలువడే చెత్తను వాయుసహిత, అవాయు పరిస్థితులలో జీవ సంబంధిత నశించిపోయే వ్యర్థాలను కుళ్ళింప చేయడం ద్వారా జీవ ఎరువులు తయారు చేస్తారు.
- జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Important Questions and Answers
ప్రశ్న 1.
 ఫ్లోరోసిస్ నివారణ చర్యలు ఏవైనా రెండు రాయండి.
 జవాబు:
- భూగర్భజలాల వినియోగం ఆపివేసి భూ ఉపరితలం పై ప్రవహించే నదులు, కాలువల నీటిని ఉపయోగించాలి. తక్కువ ఫ్లోరిన్ శాతం కలిగిన భూగర్భ జలాలను, వర్షపు నీటిని వాడవచ్చు.
- త్రాగేనీటి నుండి అధిక మొత్తంలో ఉన్న ఫ్లోరైడ్స్ ను డీఫ్లోరిడేషన్ ప్రక్రియ ద్వారా తొలగించాలి.
ప్రశ్న 2.
 ఈ క్రింది పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 
 ఎ) తక్కువ కాలుష్య కారకం ఏది?
 జవాబు:
 చెత్త 1%
బి) పై కాలుష్య కారకాలలో నేలలో కలిసిపోయేవి ఏవి?
 జవాబు:
 సేంద్రియ వ్యర్థాలు, చెత్త, కాగితం
సి) నిర్మాణపరమైన నేల కాలుష్య కారకాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
 జవాబు:
 నిర్మాణాల కూల్చివేతలు, లోహలు
డి) నేల కాలుష్య నివారణ చర్యలు రెండింటిని సూచించండి.
 జవాబు:
- 4R సూత్రాన్ని నిత్యజీవితంలో ఉపయోగించడం.
- ఘన రూప వ్యర్థాల సమగ్ర యాజమాన్యం
ప్రశ్న 3.
 ఫ్లోరైడ్ ఆరోగ్యానికి హానికరమని నీకు తెలుసుకదా! మరి మీ గ్రామంలో ఫ్లోరైడ్ సంబంధిత వ్యాధులు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటావు.?
 జవాబు:
- సాధ్యమైనంత వరకు బావి నీరు కాకుండా నదులలో, వాగులలో ఉండే నీటిని త్రాగాలి.
- డీఫ్లోరిడేషన్ చేయబడిన నీటిని మాత్రమే త్రాగాలి.
- ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంత భూములలో పండిన కాయగూరలను తినకూడదు. వాటిని దూరంగా ఉంచాలి.

ప్రశ్న 4.
 ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఆటంకం కలిగిస్తాయని నీకు తెలుసుకదా ! మరి వాటికి బదులుగా నీవేం ఉపయోగిస్తావు?
 జవాబు:
 ప్లాస్టిక్ సంచులకు బదులు, జనపనారతో లేదా గుడ్డతో చేసిన సంచులను వాడతాను.
9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 1 Mark Bits Questions and Answers
లక్ష్యాత్మక నియోజనము
1. నేల వీటితో ఏర్పడుతుంది.
 A) ఖనిజాలు
 B) సేంద్రియ పదార్థం
 C) నీరు మరియు గాలి
 D) అన్నీ
 జవాబు:
 D) అన్నీ
2. భూమి మీద గల ఒక అంగుళం పై పొర ఏర్పడడానికి పట్టే కాలం
 A) 100 నుండి 1000 సంవత్సరాలు
 B) 100 నుండి 10,000 సంవత్సరాలు
 C) 100 నుండి 5000 సంవత్సరాలు
 D) 100 నుండి 15,000 సంవత్సరాలు
 జవాబు:
 B) 100 నుండి 10,000 సంవత్సరాలు
3. భూమి మీద జీవులు జీవించడానికి, జీవనానికి ఆధారమైన నేల పొర
 A) మధ్య పొర
 B) కింది పొర
 C) పై పొర
 D) అన్ని పొరలూ
 జవాబు:
 C) పై పొర
4. మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు
 A) నత్రజని
 B) ఫాస్పరస్
 C) పొటాషియం
 D) అన్నీ
 జవాబు:
 D) అన్నీ
5. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేల స్వభావం
 A) ఆమ్ల స్వభావం
 B) క్షార స్వభావం
 C) లవణ స్వభావం
 D) సేంద్రియ నేల
 జవాబు:
 A) ఆమ్ల స్వభావం
6. క్షార స్వభావం గల నేల pH విలువ
 A) 7 కన్నా ఎక్కువ
 B) 7 కన్నా తక్కువ
 C) 8 కన్నా ఎక్కువ
 D) 8 కన్నా తక్కువ
 జవాబు:
 A) 7 కన్నా ఎక్కువ
7. నేలలో ఎక్కువ సంఖ్యలో ఉన్న సూక్ష్మజీవుల సమూహాలు
 A) బాక్టీరియా, శిలీంధ్రాలు
 B) బాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు
 C) బాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు మరియు ప్రోటోజోవన్లు
 D) బాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు
 జవాబు:
 D) బాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు
8. సేంద్రియ స్థితిలో ఉన్న జీవ సంబంధ మూలకాలను నిరింద్రియ పదార్థాలుగా సూక్ష్మజీవులు మార్చే ప్రక్రియ
 A) జీవ భౌతిక, రసాయనిక వలయాలు
 B) ఖనిజీకరణం
 C) పైరాలసిస్
 D) ఇన్సినరేషన్
 జవాబు:
 B) ఖనిజీకరణం
9. నేలలో విస్తరించి ఉండే సూక్ష్మజీవులలో అధిక భాగం వీటితోనే ఏర్పడి ఉంటుంది.
 A) శైవలాలు
 B) శిలీంధ్రాలు
 C) బాక్టీరియా
 D) ప్రోటోజోవా
 జవాబు:
 B) శిలీంధ్రాలు
10. సూక్ష్మజీవుల వల్ల ప్రమాదం కాని మరియు విషరహితం కాని చెత్తగా మార్చబడే పదార్థాలు
 A) ఘనరూప వ్యర్థ పదార్థాలు
 B) నేలలో కలసిపోని చెత్త
 C) నేలలో కలసిపోయే చెత్త
 D) ద్రవరూప వ్యర్థ పదార్థాలు
 జవాబు:
 C) నేలలో కలసిపోయే చెత్త

11. పొటాషియం ఎక్కువగా ఉండే నేలల్లో పండే ఈ ఆహార పదార్థాలలో విటమిన్ ‘C మరియు కెరోటిన్ పరిమాణం తగ్గుతున్నది.
 A) కూరగాయలు
 B) పండ్లు
 C) ధాన్యాలు
 D) కూరగాయలు, పండ్లు
 జవాబు:
 D) కూరగాయలు, పండ్లు
12. రెండో ప్రపంచ యుద్ధం తరువాత చాలా ఎక్కువగా ఉపయోగించబడిన కీటక సంహారిణి
 A) DDT
 B) BHC
 C) మలాథియాన్
 D) నువక్రాన్
 జవాబు:
 A) DDT
13. అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవులలోకి ప్రవేశించడం
 A) ఇన్సినరేషన్
 B) పైరాలసిస్
 C) జైవిక వ్యవస్థాపనం
 D) జైవిక సవరణీకరణ
 జవాబు:
 C) జైవిక వ్యవస్థాపనం
14. ఘనరూప వ్యర్థాలు ఎక్కువ కావటానికి కారణం
 A) జనాభా పెరుగుదల
 B) నగరీకరణ
 C) A మరియు B
 D) ఆధునికీకరణ
 జవాబు:
 C) A మరియు B
15. ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
 A) ఇళ్ళ నుండి వచ్చే వ్యర్థాలు
 B) పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు
 C) పారిశుద్ధ్యం వల్ల వచ్చే వ్యర్థాలు
 D) ఇళ్ళ నిర్మాణం వ్యర్థాలు
 జవాబు:
 B) పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు
16. నేలను గట్టిగా పట్టి ఉంచడం ద్వారా నేల క్రమక్షయానికి, గురి కాకుండా కాపాడేవి
 A) అడవులు
 B) గడ్డి మైదానాలు
 C) అడవులు, గడ్డి మైదానాలు
 D) ఏదీకాదు
 జవాబు:
 C) అడవులు, గడ్డి మైదానాలు
17. మన దేశములో ప్రతిరోజూ పట్టణాలలో ఏర్పడే ఘనరూప వ్యర్థాల పరిమాణం
 A) 50,000 నుండి 80,000 మెట్రిక్ టన్నులు
 B) 5,000 నుండి 8,000 మెట్రిక్ టన్నులు
 C) 500 నుండి 800 మెట్రిక్ టన్నులు
 D) 600 నుండి 800 మెట్రిక్ టన్నులు
 జవాబు:
 A) 50,000 నుండి 80,000 మెట్రిక్ టన్నులు
18. సేంద్రియ వ్యర్థాలను సూక్ష్మజీవులు కుళ్ళింపచేయుట
 A) ఈథేన్
 B) ప్రొపేన్
 C) మిథేన్
 D) ఎసిటిలీన్
 జవాబు:
 C) మిథేన్
19. మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగించే విషపూరిత లోహం
 A) బంగారం
 B) వెండి
 C) సీసం
 D) రాగి
 జవాబు:
 C) సీసం
20. నేల కాలుష్యమును ఈ విధముగా నివారించవచ్చు.
 A) రసాయన ఎరువులు, పురుగు మందులు తక్కువగా వాడడం
 B) నేల క్రమక్షయం చెందకుండా చూడడం కోసం పరిమిత సంఖ్యలో నిర్మాణాలు
 C) తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, మరల వాడుకునేందుకు వీలుగా మార్చడం, తిరిగి చేయడం
 D) అన్నీ
 జవాబు:
 D) అన్నీ
21. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే తలసరి చెత్త పరిమాణం
 A) 264 గ్రా.
 B) 364 గ్రా.
 C) 634 గ్రా.
 D) 346 గ్రా.
 జవాబు:
 B) 364 గ్రా.
22. ఘనరూప వ్యర్థాల నిర్వహణలో ఇది అత్యంత ఎక్కువ వినియోగంలో ఉన్న పద్ధతి.
 A) వ్యర్థాలను పూడ్చివేయడం
 B) వ్యర్థాలను మండించడం
 C) ఇన్సినరేషన్
 D) పైరాలసిస్
 జవాబు:
 A) వ్యర్థాలను పూడ్చివేయడం
23. ఘనరూప వ్యర్థాల నిర్వహణలో ఖరీదైనది మరియు గాలి కాలుష్యానికి కారణమయ్యే పద్ధతి
 A) వ్యర్థాలను పూడ్చివేయడం
 B) పైరాలసిస్
 C) ఇన్ సినరేషన్
 D) బయోరిమిడియేషన్
 జవాబు:
 C) ఇన్ సినరేషన్
24. జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడం.
 A) పైరాలసిస్
 B) ఇన్ సినరేషన్
 C) జైవిక వ్యవస్థాపనం
 D) జైవిక సవరణీకరణ
 జవాబు:
 D) జైవిక సవరణీకరణ
25. బాష్పీభవనం ద్వారా మొక్కల నుండి నేరుగా వాతావరణములోకి వెలువడే లోహాలు
 A) సీసం, పాదరసం వలన విడుదల అయ్యే వాయువు
 B) పాదరసం, సెలినియమ్
 C) సెలినియమ్, సీసం
 D) ఆంటిమొని, పాదరసం
 జవాబు:
 B) పాదరసం, సెలినియమ్
26. ఎక్కువ మొత్తంలో నేల కాలుష్యం జరిగే సందర్భాలు
 A) భూకంపాలు, వరదలు
 B) నేల పరియలు కావడం, తుపానులు
 C) భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం
 D) భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం, తుపానులు
 జవాబు:
 D) భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం, తుపానులు
27. ఈ పద్ధతి నేలలో నీరు ఇంకదానికి ఎంతగానో సహకరిస్తుంది.
 A) దున్నకుండా వ్యవసాయం చేయడం
 B) కాంటూర్ వ్యవసాయం
 C) పంట మార్పిడి
 D) మొక్కలు పెంచడం
 జవాబు:
 B) కాంటూర్ వ్యవసాయం
28. నేలలో దీని విలువను బట్టి మొక్కలు తీసుకునే పోషకాల పరిమాణం ఆధారపడి ఉంటుంది.
 A) నేల స్వభావం
 B) నేలలో ఉదజని సూచిక
 C) నేలలో ఉండే జీవులు
 D) క్షారత్వ నిర్వహణ
 జవాబు:
 B) నేలలో ఉదజని సూచిక

29. 8 అంగుళాల పై పొర మందంగల ఒక ఎకరా భూమి నందు ఉండే వానపాముల సంఖ్య
 A) 5,000
 B) 50,000
 C) 15,000
 D) 17,000
 జవాబు:
 B) 50,000
30. ఆరోగ్యవంతమైన నేల అంటే
 A) నేల సారవంతంగా ఉండటం
 B) నేలలో పంటలు బాగా పండటం
 C) ఆ నేలలో ఆహారోత్పత్తులు తిన్న ప్రాణులు ఆరోగ్యంగా ఉండటం
 D) నేల కాలుష్యం కాకుండటం
 జవాబు:
 C) ఆ నేలలో ఆహారోత్పత్తులు తిన్న ప్రాణులు ఆరోగ్యంగా ఉండటం
31. సేంద్రియ పదార్థాలలో హ్యూమస్ శాతం
 A) 60%
 B) 70%
 C) 80%
 D) 90%
 జవాబు:
 C) 80%
32. భూమి మీద ఒక అంగుళం పొర ఏర్పడటానికి పట్టే కాలం
 A) 100 సం||
 B) 1000 సం||
 C) 100 – 1000 సం||
 D) 100-10,000 సం||
 జవాబు:
 D) 100-10,000 సం||
33. నేలలో 30% కన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు ఉంటే
 A) జైవిక నేలలు
 B) ఖనిజపరమైన నేలలు
 C) ఆమ్ల నేలలు
 D) క్షార నేలలు
 జవాబు:
 A) జైవిక నేలలు
34. మంచి నేలలకు ఉండవలసిన pH విలువ
 A) 4.5-5. 5
 B ) 5.5-6.5
 C) 5.5-7.5
 D) 6.5-7.5
 జవాబు:
 C) 5.5-7.5
35. నేల pH విలువ తగ్గటానికి కారణం
 A) సూక్ష్మజీవుల చర్య తగ్గిపోవటం
 B) నేల క్రమక్షయం చెందటం
 C) A & B
 D) పైవేవీ కావు
 జవాబు:
 C) A & B
36. ఖనిజీకరణం అనగా
 A) సేంద్రీయ మూలకాలు ఏర్పడటం
 B) నిరీంద్రీయ మూలకాలేర్పడటం
 C) రెండూ ఏర్పడటం
 D) పైవేవీ కావు
 జవాబు:
 C) రెండూ ఏర్పడటం
37. భూమి, గాలి, నేల, నీరు ఇవి వారసత్వ సంపద కాదు. అలాగని అప్పు కాదు. వీటిని ఎలా పొందామో అదే రూపంలో తరువాత తరానికి అందించవలసిన బాధ్యత ఉన్నది అని అన్నది ఎవరు?
 A) గాంధీ
 B) నెహ్రూ
 C) సుందర్ లాల్ బహుగుణ
 D) మేధా పాట్కర్
 జవాబు:
 A) గాంధీ
38. వీటిలో నేలలో తొందరగా కలిసిపోయేవి.
 A) DDT
 B) అల్యూమినియం కప్పులు
 C) ఆకులు
 D) గాజు
 జవాబు:
 C) ఆకులు
39. నేలలో విచ్ఛిన్నం అయ్యే లోహం
 A) ఇనుము
 B) ఆర్సినిక్
 C) లెడ్
 D) కాడ్మియం
 జవాబు:
 A) ఇనుము
40. మిశ్రమ ఎరువుల్లో ఉండేవి
 A) అమ్మోనియం నైట్రేట్
 B) పొటాషియం పెంటాక్సెడ్
 C) పొటాషియం ఆక్సెడ్
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
41. చాలా సంవత్సరాలుగా NPK ఎరువులు వాడటం ద్వారా
 A) వంటలు, కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది.
 B) గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలలో ప్రోటీన్ల పరిమాణం తగ్గును.
 C) పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో పండే పండ్లలో విటమిన్ ‘సి’ మరియు కెరోటిన్ పరిమాణం తగ్గుతాయి.
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
42. DDT అనగా
 A) డై క్లోరో డై ఫినైల్ టై క్లోరో ఈథేన్
 B) డై క్లోరో డై ఫినైల్ ట్రై క్లోరో మీథేన్
 C) డై క్లోరో డై ఫినైల్ టైఫ్లోరో ఈథేన్
 D) డై క్లోరో డై ఫినైల్ ట్రై ఫ్లోరో మీథేన్
 జవాబు:
 A) డై క్లోరో డై ఫినైల్ టై క్లోరో ఈథేన్
43. పక్షి గుడ్లలోని ‘పెంకు పలచబడి పగలిపోవటానికి కారణం
 A) B.H.C
 B) డైలిడ్రిన్
 C) ఆల్జిన్
 D) D.D.T
 జవాబు:
 D) D.D.T
44. ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి కాలుష్యాలు సాంద్రీకృతమవడం
 A) జైవిక వ్యవస్థాపనం
 B) జైవిక వృద్ధీకరణం
 C) జైవిక సవరణీకరణ
 D) వృక్ష సవరణీకరణ
 జవాబు:
 B) జైవిక వృద్ధీకరణం
45. సూక్ష్మజీవులతోపాటు మొక్కలను ఉపయోగించి కాలుష్య కారకాలను తొలగించడం
 A) జైవిక సవరణీకరణ
 B) జైవిక వృద్ధీకరణం
 C) జైవిక వ్యవస్థాపనం
 D) వృక్ష సవరణీకరణ
 జవాబు:
 D) వృక్ష సవరణీకరణ
46. ఇళ్ళ నుండి వచ్చే వ్యర్థాలు
 A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
 B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
 C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు
 D) పైవేవీ కావు
 జవాబు:
 A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
47. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు
 A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
 B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
 C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు
 D) పైవేవీ కావు
 జవాబు:
 B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
48. ఆపరేషన్ థియేటర్ వ్యర్థాలు సూదులు, సిరంజిలు
 A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
 B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
 C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు
 D) పైవేవీ కావు
 జవాబు:
 C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు
49. నేల జీవరసాయన ధర్మాలను మార్చి మంచినీటి వనరులను కలుషితం చేసేవి
 A) హానికరమైన నూనెలు
 B) భారలోహాలు
 C) కర్బన ద్రావణాలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

50. అటవీ భూములను ఈ విధంగా పిలుస్తారు.
 A) కార్బన్ సింక్స్
 B) ఆక్సిజన్ సింక్స్
 C) హైడ్రోజన్ సింక్స్
 D) వాటర్ సింక్స్
 జవాబు:
 A) కార్బన్ సింక్స్
51. పిల్లల్లో తెలివితేటలు తగ్గిపోటానికి కారణమయ్యే విషపూరిత భారలోహం
 A) పాదరసం
 B) సీసం
 C) లెడ్
 D) కాడ్మియం
 జవాబు:
 B) సీసం
52. ఘనరూప వ్యర్థాలను తగ్గించే పద్ధతి
 A) తిరిగి ఉపయోగించటం
 B) మరల వాడుకునేందుకు వీలుగా మార్చటం
 C) తిరిగి చేయటం
 D) పైవన్నీ
 జవాబు:
 B) మరల వాడుకునేందుకు వీలుగా మార్చటం
53. ఒక టన్ను కాగితం తయారీకి కావలసిన చెట్ల సంఖ్య
 A) 17
 B) 27
 C) 37
 D) 47
 జవాబు:
 A) 17
54. 2021 నాటికి చెత్తనంతా పారవేయడానికి మన రాష్ట్రానికి కావలసిన స్థలం
 A) 344 చ.కి.మీ
 B) 444 చ.కి.మీ
 C) 544 చ.కి.
 D) 644 చ.కి.మీ
 జవాబు:
 C) 544 చ.కి.
55. ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడం
 A) కంబశ్చన్
 B) బర్నింగ్
 C) పైరాలసిస్
 D) ఎలక్ట్రాలిసిస్
 జవాబు:
 C) పైరాలసిస్
56. పేడ నుండి వెలువడే వాయువు
 A) మీథేన్
 B) ఈథేన్
 C) ప్రోపేన్
 D) బ్యూటేన్
 జవాబు:
 A) మీథేన్
57. నేల కాలుష్యం జరిగే సహజ పద్దతి
 A) భూకంపాలు
 B) వరదలు
 C) తుపానులు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

58. కాంటూర్ వ్యవసాయం ఇక్కడ చేస్తారు.
 A) అడవులు
 B) మైదానాలు
 C) కొండలు
 D) ఎడారులు
 జవాబు:
 C) కొండలు
59. క్రింది వానిలో సహజ వనరు
 A) గాలి
 B) నీరు
 C) నేల
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
60. నేల క్రమక్షయాన్ని వేగవంతం చేసేవి
 A) అడవుల నరికివేత
 B) ఉష్ణోగ్రత వ్యత్యాసాలు
 C) మానవ చర్యలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
61. వానపాము విసర్జితాలలో NPKలు సాధారణ నేలకన్నా ఎంత ఎక్కువగా ఉంటాయి?
 A) 5, 7, 11
 B) 3, 5, 7
 C) 7, 9, 11
 D) 5, 7, 9
 జవాబు:
 A) 5, 7, 11
62. పశువుల పెంపకంలో ఉపయోగించే పురుగు
 A) మిడత
 B) పేడపురుగు
 C) గ్రోమోర్
 D) వానపాము
 జవాబు:
 B) పేడపురుగు
63. ఒకేసారి పేడపురుగు తన బరువుకన్నా ఎన్ని రెట్ల పేడను నేలలో పూడ్చగలదు?
 A) 100
 B) 150
 C) 200
 D) 250
 జవాబు:
 D) 250
64. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గటం, స్త్రీలలో రొమ్ము కేన్సర్ కి కారణం
 A) ప్లాస్టిక్
 B) రసాయనాలు
 C) పురుగుమందులు
 D) హార్మోన్లు
 జవాబు:
 A) ప్లాస్టిక్
65. ప్లాస్టిక్ పునఃచక్రీయ సంస్థలు కల దేశం
 A) జపాన్
 B) మలేషియా
 C) A మరియు B
 D) చైనా
 జవాబు:
 C) A మరియు B
66. భూమి మీద జీవులు జీవించడానికి, జీవనానికి ఆధారమైన నేలపొర
 A) మధ్యపొర
 B) క్రిందిపొర
 C) పైపొర
 D) అన్ని పొరలు
 జవాబు:
 C) పైపొర
67. P.V.C. ప్లాస్టిక్ ను మండించడం వల్ల వెలువడేవి
 A) హైడ్రోకార్బన్లు
 B) హేలోజన్లు
 C) డయాక్సిన్, ఫ్యూరాన్లు
 D) క్లోరో ఫ్లోరో కార్బన్లు
 జవాబు:
 C) డయాక్సిన్, ఫ్యూరాన్లు

68. కింది వాటిలో నేల కాలుష్య కారకం కానిది
 A) కూరగాయల తొక్కలు
 B) ఆమ్లవర్షాలు
 C) కీటకనాశనులు
 D) పాలిథీన్ సంచులు
 జవాబు:
 A) కూరగాయల తొక్కలు
పునరాలోచన

