SCERT AP 10th Class Biology Guide Pdf Download 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Biology 3rd Lesson Questions and Answers ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ
10th Class Biology 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
 ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలన్నింటిని ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చేయటం సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? (AS1)
 జవాబు:
 ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలను ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చేయటం సాధ్యమే. ముఖ్యంగా పరిణితి చెందిన బహుకణ జీవులలో ఇది కనిపిస్తుంది. అందువలనే బహుకణ జీవులలో రవాణా వ్యవస్థలో వైవిధ్యం కనిపిస్తుంది. తీసుకొన్న ఆహారం, (ఘనపదార్థం), నీరు (ద్రవ పదార్థం), పీల్చిన గాలి (వాయుపదార్థం) రక్తం ద్వారానే అన్ని శరీరభాగాలకు రవాణా అవుతున్నాయి.
ప్రశ్న 2.
 ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది జీవులకు ఏవిధంగా ఉపయోగపడుతుందో రాయండి. (AS1)
 జవాబు:
 ప్రసరణ వ్యవస్థ :
 జీవులలో పదార్థాల రవాణాకు నిర్వహించే వ్యవస్థను ప్రసరణ వ్యవస్థ అంటారు. దీని ద్వారా శరీర కణజాలానికి అవసరమైన అన్ని పదార్థాలు రవాణా చేయబడతాయి.
ఆవశ్యకత :
- ఏకకణ జీవులలో పదార్థాల రవాణా, విసరణ (వ్యాపనం), ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతులలో ప్రసరణ జరుగుతుంది.
- కాని బహుకణ జీవులలో ఎక్కువ పదార్థాలు రవాణా చేయటానికి ఈ పద్ధతిలో సంవత్సరాల కొలది సమయం అవసరమవుతుంది.
- ఈ అవసరమైన ఆలస్యాన్ని నివారించటానికి జీవులు ప్రత్యేకమైన వేగవంతమైన ప్రసరణ వ్యవస్థను ఏర్పర్చుకొన్నాయి.
ఉపయోగాలు : ప్రసరణ వ్యవస్థ వలన
- కణజాలాలకు ఆక్సిజన్ రవాణా చేయబడుతుంది.
- కణాలలో ఏర్పడిన CO2 తొలగించబడుతుంది.
- కణాలకు అవసరమైన పోషకాలు అందించబడతాయి.
- కణాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి.
- నిర్దిష్ట భాగాలకు హార్మోన్స్ అందించబడతాయి.
- రక్షణ వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తుంది.
ప్రశ్న 3.
 ప్లాస్మా మరియు రక్తం మధ్య గల సంబంధం ఏమిటి? (AS1)
 జవాబు:
 రక్తంలోని కణాంతర ద్రవాన్ని ప్లాస్మా అంటారు. ఇది ద్రవస్థితిలోని పదార్థం. రక్తం యొక్క మాతృక, రక్తకణాలు ప్లాస్మాలో తేలుతూ ప్రవహిస్తుంటాయి. రక్తకణాలు మరియు ప్లాస్మా కలయిక వలన రక్తం ఏర్పడుతుంది.
 రక్తం = రక్తకణాలు + ప్లాస్మా
ప్లాస్మాలో 6.8% కర్బన పదార్థాలు 0.085-0.9% అకర్బన పదార్థాలు, వాయువులు, ప్రోటీనులు రక్షణ చర్యకు, రక్తస్కందనానికి తోడ్పడే పదార్థాలు ఉంటాయి. ప్రసరణ ప్రక్రియలో ప్లాస్మా కీలకపాత్ర వహిస్తూ, రక్త విధులను నిర్వహిస్తుంది.

ప్రశ్న 4.
 గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని చేరవేసే భాగాలు ఏవి? (AS1)
 జవాబు:
 మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకుని పోయే రక్తనాళాలు : దైహిక మహాధమని, పుపుసమహాధమని, హృదయ ధమనులు.
దైహిక మహాధమని :
 ఇది ఎడమ జఠరిక నుండి బయలుదేరి ఊపిరితిత్తులకు తప్ప మిగతా అన్ని శరీర భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది.
పుపుస మహాధమని :
 ఇది కుడి జఠరిక నుండి బయలుదేరుతుంది. ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయము నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది.
హృదయ ధమనులు :
 ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయ కండరాలకు తీసుకుని వెళతాయి.
ప్రశ్న 5.
 మన శరీరంలో గల మూడు ప్రధానమైన రక్తనాళాలను పేర్కొనండి. (AS1)
 జవాబు:
 శరీరంలో మూడు ప్రధాన రక్తనాళాలు
 1. ధమనులు :
 ఇవి గుండె నుండి శరీరభాగాలకు రక్తాన్ని తీసుకెళతాయి. ఇవి దృఢంగా ఉండి కవాటాలు లేకుండా, తక్కువ కుహరంలో శరీరం లోపలివైపున ఉంటాయి.
2. సిరలు :
 ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చుతాయి. ఇవి మృదువుగా ఉండి, కవాటాలతో చర్మం క్రింద విస్తరించి ఉంటాయి.
3. రక్తకేశనాళికలు :
 ఇవి సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు, కణజాలంతో సంబంధం కలిగి ఉంటాయి.
ప్రశ్న 6.
 మన శరీరంలో అతిపెద్ద ధమని ఏది? ఇది పెద్దదిగా ఉండటానికి గల కారణమేమిటి? (AS1)
 జవాబు:
 బృహత్ ధమని శరీరంలోని పెద్ద ధమని. ఇది ఎడమ జఠరిక నుండి ప్రారంభమై గుండె బయటకు వచ్చి శరీరభాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.
ఊపిరితిత్తులకు తప్ప’ శరీర అన్ని భాగాలకు రక్తాన్ని అందించాలి కావున ఈ బృహత్ ధమని ద్వారా అధిక రక్తం ప్రసరిస్తుంది. కావున బృహత్ ధమని పెద్దదిగా ఉంటుంది.
ప్రశ్న 7.
 ఆక్సీకరణం చెందడం కోసం రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి? (AS1)
 జవాబు:
 శరీరంలో రక్తం ఊపిరితిత్తులలో ఆక్సీకరణం చెందుతుంది. కావున రక్తం పుపుస ధమని ద్వారా గుండె నుండి, ఆ తలకు వెలువడుతుంది. ఈ ధమని గుండె పై భాగాన రెండుగా చీలి రెండు ఊపిరితిత్తులకు రక్తాన్ని అందిస్తుంది.
ప్రశ్న 8.
 లింఫ్ నాళాలు, సిరలలో ఉండి ధమనులలో లేని నిర్మాణాలు ఏమిటి? (AS1)
 జవాబు:
 కవాటాలు, లింఫ్ నాళాలు సిరలలో ఉంటాయి. కాని ధమనులలో ఉండవు. ఇవి రక్తాన్ని వెనుకకు రాకుండా నివారిస్తూ, ముందుకు నడిపిస్తాయి.
ప్రశ్న 9.
 రక్తఫలకికల యొక్క ఉపయోగాలు రాయండి. (AS1)
 జవాబు:
 రక్తంలో ఉండే రక్తఫలకికలు రక్తస్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి. గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలకికల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్ గా మారుస్తుంది. తాంబ్రిన్ ప్రభావం వలన ఫైబ్రిన్ తంతువులు ఏర్పడి, రక్తం గడ్డకడుతుంది.

ప్రశ్న 10.
 కింది వాని మధ్య భేదాలు రాయండి. (AS1)
 ఎ) సిస్టోల్ – డయాస్టోల్
 బి) ధమనులు – సిరలు
 సి) దారువు – పోషక కణజాలం
 జవాబు:
 ఎ) సిస్టోల్ – డయాస్టోల్
| సిస్టోల్ | డయాస్టోల్ | 
| 1. గుండె సంకోచ దశను సిస్టోల్ అంటారు. | 1. గుండె సడలే దశను డయాస్టోల్ అంటారు. | 
| 2. ఈ ప్రక్రియలో రక్తం ధమనులలోనికి ప్రవేశింపబడుతుంది. | 2. ఈ ప్రక్రియలో రక్తం సిరల నుండి గుండెకు చేరుతుంది. | 
| 3. గుండె ఖాళీ చేయబడుతుంది. | 3. గుండె రక్తంతో నింపబడుతుంది. | 
| 4. సిస్టోలిక్ పీడనం విలువ 120 mmHg. | 4. డయాస్టోలిక్ పీడనం విలువ 80 mmHig. | 
| 5. సిస్టోలిక్ సమయం 0.38 నుండి 0.49 సెకనులు. | 5. డయాస్టోలిక్ సమయం 0.31 నుండి 0.42 సెకనులు. | 
బి) ధమనులు – సిరలు
| ధమనులు | సిరలు | 
| 1. గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాలను ధమనులు అంటారు. | 1. శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చే రక్త నాళాలను సిరలు అంటారు. | 
| 2. మందమైన గోడలు ఉంటాయి. | 2. గోడలు పలుచగా ఉంటాయి. | 
| 3. ‘నాళ కుహరం చిన్నదిగా ఉంటుంది. | 3. నాళ కుహరం పెద్దదిగా ఉంటుంది. | 
| 4. కవాటాలు ఉండవు. | 4. కవాటాలు ఉంటాయి. | 
| 5. రక్తనాళాలపై పీడనం ఎక్కువ. | 5. రక్తనాళాలపై పీడనం తక్కువ. | 
| 6. ఆమ్లజనిసహిత రక్తం ఉంటుంది. | 6. ఆమ్లజనిరహిత రక్తం ఉంటుంది. | 
| 7. పుపుస ధమనిలో ఆమ్లజనిరహిత రక్తం ఉంటుంది. | 7. పుపుస సిరలో ఆమ్లజనిసహిత రక్తం ఉంటుంది. | 
| 8. రక్తకేశనాళికలతో అంతమౌతాయి. | 8. రక్తకేశనాళికల నుండి ప్రారంభమౌతాయి. | 
సి) దారువు – పోషక కణజాలం
| దారువు | పోషక కణజాలం | 
| 1. దారువు నీరు మరియు పోషక పదార్థములను వేర్ల మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. | 1. ఇది ఆకుల నుండి ఆహార పదార్థములను మొక్క నుండి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. | 
| 2. దారుకణాలు, దారునాళాలు, దారునారలు మరియు దారు మృదుకణజాలాలు దీనియందు ఉంటాయి. | 2. పోషక కణజాలంనందు చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి. | 
| 3. దారువు మృదుకణజులం మాత్రమే సజీవ కణజాలం. | 3. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు మరియు పోషక మృదుకణజాలాలు సజీవ కణజాలాలు. | 
| 4. చారుకణాలు, దారునాళాలు, దారునారలు నిర్జీవ కణజాలాలు. | 4. పోషక కణజాల నారలు మాత్రమే నిర్జీవ కణజాలం. | 
| 5. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. | 5. మొక్కకు యాంత్రిక బలమును ఇవ్వదు. | 
| 6. దారువు నీటి సరఫరాను ఏకమార్గములో నిర్వహిస్తుంది. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరుస్తుంది. | 6. ఆహార పదార్థాల సరఫరా ద్విమార్గముల ద్వారా నిర్వహిస్తుంది. ఆకుల నుండి నిల్వ అంగాలు లేదా- పెరుగుదల నిల్వ అంగాల నుండి పెరుగుదల ప్రదేశాలకు సరఫరా చేస్తుంది. | 
ప్రశ్న 11.
 మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి. (AS1)
 (లేదా)
 మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలలోకి నీరు ప్రవేశించే విధానాన్ని పటం సహాయంతో వివరించండి.
 జవాబు:
 1. మృత్తిక నీరు, లవణాలతో కూడిన సజల ద్రావణం.
2. మూలకేశాలలోని కణరసం గాఢత మృత్తిక నీరు ద్రావణ గాఢతకంటే ఎక్కువ ఉంటుంది. అందువలన ద్రవాభిసరణ ద్వారా మూలకేశాలలోని రిక్తికలలోకి నీరు ప్రవహిస్తుంది.
 
 3. మూలకేశాలలోని పదార్థాల గాఢత నీరు లోపలికి ప్రవేశించడం వలన పెరుగుతుంది. దీని ఫలితంగా నీరు పక్కనున్న కణాలకు ప్రవహించి వాటి గాఢతను కూడా పెంచుతుంది. చివరిగా నీరు దారు నాళాలలోకి చేరుతుంది.
4. ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు మరియు వేరు కణాలు ఈ ప్రక్రియలో పాల్గొనటం వలన దారు నాళాలలో పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనం నీటిపైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ మొత్తం పీడనాన్ని వేరు పీడనం (root pressure) అంటారు.
ప్రశ్న 12.
 వేరు పీడనం అంటే ఏమిటి? ఇది మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS1)
 జవాబు:
 వేరు పీడనం :
 వేరు నీటిని, పీల్చుకొన్నప్పుడు వెలువర్చే పీడనాన్ని వేరు పీడనం అంటారు.
ప్రయోజనం :
 వేరు పీడనం వలన వేరులోనికి ప్రవేశించిన నీరు కాండంలోనికి నెట్టబడుతుంది. కాండంలోనికి చేరిన నీరు ఇతర ప్రక్రియల ద్వారా పైకి లాగబడుతుంది.
ప్రశ్న 13.
 పోషక కణజాలం కొన్ని జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు? (AS1)
 జవాబు:
- పోషక కణజాలం ద్వారా మొక్కలలో ఆహార పదార్థాలు రవాణా అవుతాయి. అందువలన కొన్ని జీవులు ఈ పోషక కణజాలాన్ని ఆహారంగా వాడుకొంటాయి.
- ప్రధానంగా ఎఫిడ్స్ లేతకాండం చుట్టూ గుమిగూడి తొండాన్ని పోషక కణజాలంలోనికి చొప్పించి మొక్కల రసాన్ని – ఆహారంగా గ్రహిస్తాయి.
- చిట్టెలుకలు కొన్నిసార్లు ఆహారం కొరకు చెట్టు బెరడును తొలిచి ఆహారాన్ని సంపాదిస్తాయి. బెరడులో ఉండే పోషక కణాజాలాన్ని ఆహారంగా తీసుకొంటాయి.
- కుందేళ్ళు తమ పదునైన దంతాలతో చెట్ల పోషక కణజాలాన్ని కొరికి మొక్కలకు, అటవీ సంపదకు హాని చేస్తుంటాయి.
ప్రశ్న 14.
 కింది పేరాలు చదవండి. ఖాళీలలో సమాచారాన్ని నింపండి.
 → గుండె నాలుగు గదులతో కూడిన కండరయుతమైన నిర్మాణం. గదులను విభజిస్తూ విభాజక పొర ఉంటుంది. గుండెలో గల విభాజక పొరలకు పేర్లు పెట్టండి.
 ఎ) రెండు కర్ణికల మధ్య గల విభాజకాన్ని కర్ణికాంతర విభాజకం అంటారు.
 బి) రెండు జఠరికల మధ్య గల విభాజకాన్ని ……………….. అంటారు.
 సి) ఒక కర్ణిక దాని దిగువన ఉన్న జఠరికల మధ్య ఉన్న విభాజకాన్ని ……………….. అంటారు.
 జవాబు:
 బి) జఠరికాంతర విభాజకం
 సి) కర్ణికా-జఠరికాంతర విభాజకం
→ గుండెలోని రెండు గదులను కలుపుతూ ఉండే మార్గాన్ని రంధ్రం (aperture) అంటారు. కర్ణికలు, జఠరికల మధ్య ఉండే రంధ్రాలకు పేర్లు పెట్టండి.
 ఎ) కుడికర్ణిక, కుడి జఠరికలను కలుపుతూ ఉండే రంధ్రాన్ని …………….. అంటారు.
 బి) ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలను కలుపుతూ ఉండే రంధ్రాన్ని ……………………. అంటారు.
 జవాబు:
 ఎ) కుడి కర్ణికా జఠరికా విభాజక రంధ్రం
 బి) ఎడమ కర్ణికా జఠరికా విభాజక రంధ్రం
→ తమ గుండా ఒక దిశలో మాత్రమే పదార్థాలు ప్రయాణించడానికి అనుమతించే రంధ్రాన్ని కవాటం అంటారు.
 ఎ) గుండె గదుల మధ్య ఉండే కవాటాలకు పేర్లు రాయండి.
 బి) ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య ఉండే కవాటం …………..
 సి) కుడి కర్ణిక, కుడి జఠరికల మధ్య ఉండే కవాటం
 జవాబు:
 ఎ) అగ్రత్రయ కవాటం, అగ్రద్వయ కవాటం
 బి) మిట్రల్ కవాటం (అగ్రద్వయ కవాటం)
 సి) అగ్రత్రయ కవాటం

ప్రశ్న 15.
 కాళ్ళలో ఉండే సిరల్లో కవాటాలు రక్తప్రవాహాన్ని అడ్డుకున్నాయనుకోండి. అప్పుడు జరిగే పరిణామాలేమిటో ఆ ఊహించండి. (AS2)
 జవాబు:
- కాళ్ళలోని సిరలు కవాటాలు కలిగి ఉంటాయి. ఇవి రక్తాన్ని వెనుకకు ప్రయాణించకుండా నిరోధిస్తాయి.
- ఈ కవాటాలు రక్తప్రవాహాన్ని అడ్డుకుంటే, వీటిని అధిగమించి రక్తం ముందుకు ప్రసరించదు.
- అందువలన సిరలలో రక్తం నిల్వ పెరిగి సిరలు ఉబ్బిపోతాయి.
- రక్తం సిరల ద్వారా గుండెకు చేరదు కాబట్టి రక్తప్రసరణ అసంపూర్తి అవుతుంది.
- సరఫరా చేయటానికి రక్తం గుండెకు చేరదు కావున రక్తప్రసరణ స్తంభిస్తుంది.
- రక్తప్రసరణ జరగక జీవి మరణిస్తుంది.
ప్రశ్న 16.
 మొక్కల మూలకేశ కణాలలోని కణద్రవ్యం గాఢత ఎక్కువయినపుడు ఏమి జరుగుతుంది? (AS2)
 జవాబు:
- మొక్కల వేర్లమీద ఉండే సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాన్ని మూలకేశాలు అంటారు. ఇవి ఒక కణమందం కలిగి నేల నుండి నీటిని, లవణాలను గ్రహిస్తాయి.
- మూలకేశాలలోనికి నీరు ప్రవేశించటం కణద్రవ్య గాఢత పైన ఆధారపడి ఉంటుంది. కణద్రవ్య గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు, మట్టిలోని నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా కణాలలోనికి ప్రవేశిస్తుంది.
- ద్రవాభిసరణ వలన అల్పగాఢత నుండి, అధిక గాఢతగల కణద్రవ్యంలోకి నీరు చేరుతుంది.
- ప్రక్క కణంలో సాపేక్షంగా గాఢత ఎక్కువ ఉండుటవలన ఈ నీరు ప్రక్క కణాలలోనికి ద్రవాభిసరణ చెంది నీటి ప్రసరణ జరుగుతుంది.
ప్రశ్న 17.
 జాన్ కాగితం కప్పు, సెలైన్ గొట్టాలను ఉపయోగించి స్టెతస్కోపును తయారుచేశాడు. అతడు అనుసరించిన విధానాన్ని రాయండి. (AS3)
 జవాబు:
 జాన్ స్టెతస్కోప్ నిర్మించటానికి ఈ క్రింది విధానం అనుసరించాడు.
 
- ఒక కాగితం కప్పు తీసుకొని దాని మధ్యన రంధ్రం చేసి, ఒక చిన్న గొట్టం అమర్చాడు.
- రెండు సెలైన్ గొట్టాలను తీసుకొని వాటిని రబ్బరు ట్యూబ్ తో కలిపాడు.
- రబ్బరు ట్యూబ్ ను కాగితం కప్పుకు అమర్చిన గొట్టానికి కలిపాడు.
- అందువలన Y ఆకారంలో సెలైన్ గొట్టాలు అమర్చబడ్డాయి.
- దానికి క్రిందుగా కాగితం కప్పు వ్రేలాడుతూ ఉంది.
- సెలైన్ పైపులను చెవిలో ఉంచుకొని గుండెపై కాగితం కప్పు ఆన్చి హృదయ స్పందనను వినవచ్చు.
- ఇది హృదయస్పందనను పరిశీలించే స్టెతస్కోలా పని చేస్తుంది.
ప్రశ్న 18.
 పోషక కణజాలం ద్వారా మొక్కలలో ఆహారం రవాణా జరుగుతుందని తెలపడానికి శాస్త్రవేత్తలు ఏ ప్రయోగాన్ని చేశారో వివరించండి. (AS3)
 జవాబు:
 
- ఎఫిడ్ లేత కాండం చుట్టూ గుమికూడి మొక్కరసాన్ని పీలుస్తాయి. రసం పీల్చడానికి ఎఫిడ్ పొడవుగా, సూదిమాదిరిగా ఉండే తొండాన్ని (Proboscis) మొక్క కణజాలంలోకి చొప్పిస్తుంది.
- రసాన్ని పీల్చేటప్పుడు ఎఫిడ్లని చంపి కాండం అడ్డుకోతను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రోబోసిస్ పోషక కణజాలంలోని దారు నాళాల వరకు మాత్రమే చొచ్చుకుపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
- ప్రోబోసి లో ఉన్న రసాన్ని విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు కింది ప్రయోగాన్ని చేశారు. మొక్క రసాన్ని పీల్చేటప్పుడే ఎఫిడ్ను చంపి ప్రోబోసిస్ భాగం పోషక కణజాలంలో ఉండే విధంగా ఎఫిడ్ శరీర భాగాన్ని వేరుచేశారు.
- పోషక కణజాలంలోని స్వల్ప పీడనం వల్ల కోసిన ప్రోబోసిస్ మొక్క నుండి కీటకం ఆహారాన్ని సేకరించుట భాగం గుండా రసం చుక్కల రూపంలో కారుతుండడాన్ని గుర్తించారు.
- ఈ ద్రవరూప చుక్కలని సేకరించి విశ్లేషించగా అందులో చక్కెరలు మరియు ఆమైనో ఆమ్లాలు ఉన్నాయని తెలిసింది.
ప్రశ్న 19.
 ఎఫి పై శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల సారాంశం ఏమిటి?
 జవాబు:
 ఎఫి పై శాస్త్రవేత్తల ప్రయోగాల వలన ఈ క్రింది అంశాలు నిర్ధారించారు.
- మొక్కలలో పోషక కణజాలం రవాణా ప్రక్రియలో పాల్గొంటుంది.
- ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయి.
- పోషక కణజాలం కాండం పరిధీయ భాగంలో ఉంటుంది.
- సాధారణంగా పోషక కణాలలో ప్రసరణ అధోముఖంగా ఉంటుంది.
- పోషక కణజాలంలో పోషక ద్రవం కొంత వత్తిడితో ప్రసరిస్తుంది.
- చాలా కీటకాలు, పోషణ కొరకు పోషక కణజాలంపై ఆధారపడతాయి.
- కీటకాలు ప్రొబోసిస్ ద్వారా పోషక కణజాలం నుండి ఆహారం గ్రహిస్తాయి.
- పోషక కణజాలం కోసం కొన్ని క్షీరదాలు మొక్కలకు హానిచేస్తాయి.
ప్రశ్న 20.
 మీ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వారి రక్తపీడన సమాచారాన్ని సేకరించండి. వారిలో ఎక్కువ రక్తపీడనం (high B.P), తక్కువ రక్తపీడనం (low B.P.) గలవారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి నివేదిక రాయండి. (AS4)
 జవాబు:
 మా ఇంటి చుట్టుప్రక్కల ఉన్నవారి వద్ద నుండి రక్తపీడన సమాచారం సేకరించాను. వీరిలో కొందరు అధిక రక్తపీడనం కలిగి ఉంటే మరికొందరు తక్కువ రక్తపీడనం కలిగి ఉన్నారు.
అధికరక్తపీడనం :
 రక్త పీడనం విలువ 120/80 కంటే అధికంగా ఉంటే దానిని అధిక రక్తపీడనం అంటారు. అధిక రక్తపీడనం గల వ్యక్తులు
- గుండె దడ కలిగి ఉంటారు.
- ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతారు.
- చెమటలు పట్టి నియంత్రణ కోల్పోతారు.
- చిన్నపనులకు అలసిపోతారు.
- వీరు మూత్రపిండ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అల్పరక్తపీడనం :
 రక్తపీడనం విలువ 120/80 కంటే తక్కువగా ఉంటే దానిని అల్పరక్తపీడనం అంటారు. వీరు
- నీరసంగా, తల తిరుగుడు వంటి లక్షణాలు కలిగి ఉన్నారు.
- నాడీ స్పందన తక్కువగా ఉంటుంది.
- నీరసంతో పడిపోతుంటారు.
- చెమటలు పట్టటం, గుండెదడ ఉంటుంది.
ప్రశ్న 21.
 ఏకవలయ, ద్వంద్వవలయ రక్తప్రసరణను తెలియజేసే పటం గీసి, రెండింటి మధ్య తేడాలు రాయండి. (AS5)
 జవాబు:
 
| ఏకవలయ ప్రసరణ | ద్వివలయ ప్రసరణ | 
| 1. గుండె ద్వారా రక్తము ఒకేసారి ప్రసరణ జరిగితే దానిని ఏకవలయ ప్రసరణ అంటారు. | 1. రక్తం హృదయం ద్వారా రెండుసార్లు ప్రసరిస్తే దాన్ని ద్వివలయ ప్రసరణ అంటారు. | 
| 2. దీని యందు పుపుస ప్రసరణ వుండదు. | 2. ఒకసారి హృదయం నుండి ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం, శరీర భాగాల మధ్య రక్తము ప్రసరించును. | 
| 3. నాలుగు గదుల గుండెగల జీవులలో ఇది జరుగును. | 3. రెండు గదుల గుండె గల జీవులలో ఈ రక్త ప్రసరణ జరుగును. | 
| . 4. ద్వివలయ ప్రసరణ కప్ప నుండి అభివృద్ధి చెందిన జీవుల లో జరుగును. | 4. ఏకవలయ ప్రసరణము చేపల వంటి జీవులలో జరుగును. | 
ప్రశ్న 22.
 ఆకుల గుండా జరిగే బాష్పోత్సేకాన్ని, వేళ్ళ గుండా జరిగే నీటి శోషణను తెలియజేసే నమూనా పటం గీయండి. (AS5)
 జవాబు:
 
ప్రశ్న 23.
 మానవునిలో విస్తరించి ఉన్న రక్తప్రసరణ వ్యవస్థ నిర్మాణాన్ని నీవు దేనితో పోలుస్తావు? (AS6)
 జవాబు:
- మానవుని రక్తప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా 1. హృదయం 2. రక్తనాళాలు 3. రక్తం అనే భాగాలు ఉంటాయి.
- వీటి పని విధానం మా ఇంటిలోని నీటి సరఫరా వ్యవస్థను పోలి ఉంటుంది.
- ఇంటిలో మోటారు, నీటిని పంపు చేస్తుంది. ఇది రక్తప్రసరణ వ్యవస్థలోని గుండెతో పోల్చవచ్చు.
- నీరు ఎక్కడా బయటకు రాకుండా పైపులలో ప్రవహిస్తుంది. ఈ నీటి పైపులను శరీరంలోని రక్తనాళాలతో పోల్చవచ్చు.
- నీటి పైపు లోపల నీరు పీడనం కలిగిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని రక్తనాళాలలో ప్రవహిస్తున్న రక్తంతో పోల్చవచ్చు.
ప్రశ్న 24.
 ఎత్తైన చెట్లలో జరిగే ప్రసరణ వ్యవస్థను గమనించినపుడు నీకు ఏమి అనిపిస్తుంది? (AS6)
 జవాబు:
- ఎత్తైన చెట్లలో జరిగే ప్రసరణ వ్యవస్థను గమనించినపుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.
- ఇంత ఎత్తుకు, గురుత్వ ఆకర్షణ శక్తిని అధిగమించి నీరు పైకి ఎలా లాగబడుతుందని అన్న ఆలోచన కలుగుతుంది.
- రెండు అంతస్తుల బిల్డింగ్ పైకి నీటిని పంపటానికి, 1. హావర్స్ మోటార్ వాడుతున్నాం. అంతకు రెండు రెట్లు ఎత్తు ఉన్న చెట్ల పైకి నీరు పంపడానికి ఎంత హార్స్ పవర్స్ అవసరమోగదా అనిపిస్తుంది.
- చిన్నచిన్న నాళాలలో, ఇంత ఎత్తుకు నీటిని పంపడం ప్రకృతి యొక్క గొప్పతనంగా భావించి అభినందిస్తాను.
- ప్రకృతిలోని ఈ యంత్రాంగం అమరిక, ఒక విశేషంలా తోస్తుంది.
- ప్రకృతిలో ఇటువంటి ప్రక్రియలను పరిశీలించినపుడు, ప్రకృతి అద్భుత మేధావిలాగా అనిపిస్తుంది.

ప్రశ్న 25.
 హృదయస్పందనపై హాస్యాన్ని కలిగించే ఏదైనా ఒక కార్టూన్ ను తయారుచేయండి. (AS7)
 జవాబు:
 
ప్రశ్న 26.
 ఈ పాఠం చదివిన తరువాత ప్రయాణ సమయాల్లో కాళ్ల వాపు గురించి మీ పెద్దలకు నీవు ఏమి సలహాలిస్తావు? (AS7)
 జవాబు:
- ఎక్కువసేపు కాళ్లు క్రిందకు వ్రేలాడదీసి కూర్చోటం వలన కణజాల ద్రవం పైకి రవాణా కాదు. అందువలన కాళ్ళ వాపు వస్తుంది. దీనిని ఎడిమా అంటారు.
- ఎడిమా ప్రధానంగా పెద్దవారిలో స్పష్టంగా కనిపిస్తుంది.
- ఎడిమా నివారించటానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి.
 ఎ) కాళ్ళను. కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
 బి) కాళ్ళను వ్రేలాడ వేయకుండా, చాపుకొనే ఏర్పాటు చూచుకోవాలి.
 సి) మధ్య మధ్యలో నిలబడటంగాని, అటు ఇటూ కొంచెం సేపు నడవటం గాని చేయాలి.
 డి) కాళ్ళను మధ్యలో కదిలిస్తూ ఉండాలి.
 ఇ) ఒకే భంగిమలో కూర్చోకుండా భంగిమలు మార్చుతూ ఉండాలి.
10th Class Biology 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook InText Questions and Answers
10th Class Biology Textbook Page No. 60
ప్రశ్న 1.
 ధమనులు, సిరల అడ్డుకోతకు రక్తప్రవాహ వేగానికి సంబంధం ఏమైనా ఉందా?
 జవాబు:
- ధమనులలో హృదయస్పందన వలన రక్తం చాలా వేగంగా ఎక్కువ ఒత్తిడితో ప్రసరిస్తుంది. అందువలన దానిగోడలు ఆ’ మందంగా ఉన్నాయి.
- సిరలలో రక్త ప్రవాహ వేగం తక్కువ. కావున గోడలు పలుచగా ఉన్నాయి.
ప్రశ్న 2.
 ఏ రక్తనాళాలలో కవాటాలు ఉంటాయి ? కవాటాల ఉపయోగం ఏమిటి ?
 జవాబు:
 సిరలు కవాటాలను కలిగి ఉన్నాయి. సిరలలో రక్తం గుండెవైపు ఏక మార్గంలో గురుత్వ ఆకర్షణను అధిగమించి ప్రయాణించవలసి ఉంటుంది. కావున రక్తం వెనుకకు రాకుండా ఈ కవాటాలు నిరోధిస్తుంటాయి.
ప్రశ్న 3.
 చేతికి బిగుతుగా కట్టు కట్టినపుడు గుండెకు దూరంగా ఉన్న వైపున రక్తనాళాలు ఎందుకు ఉబ్బుతాయి?
 జవాబు:
 సిరలు గుండెకు రక్తాన్ని తీసుకొని వస్తాయి. చేతికి బిగుతుగా కట్టునప్పుడు వాటిలోని ప్రవాహం నిరోధించబడి, ఉబ్బి స్పష్టంగా కనిపిస్తాయి.
ప్రశ్న 4.
 శరీరంలో లోపలివైపున ఉన్న రక్తనాళాలను (ధమనులను) బంధించినపుడు అవి హృదయం వైపు ఉబ్బటానికి కారణం ఏమిటి?
 జవాబు:
 శరీరం లోపలివైపున ఉన్న రక్తనాళాలను ధమనులు అంటారు. ఇవి హృదయం నుండి రక్తాన్ని తీసుకొని వెళతాయి. కావున వీటిని బంధించినపుడు రక్తనాళాలలో రక్తం పెరిగి, హృదయం వైపు ఉబ్బి స్పష్టంగా కనిపిస్తాయి.
ప్రశ్న 5.
 గుండెలో కర్ణికలు, జఠరికల మధ్య కవాటాలు ఉంటాయి. ఈ కవాటాల వలన, సిరలలో ఉండే కవాటాల వలన కలిగే ప్రయోజనం ఒకటేనని నీవు భావిస్తున్నావా?
 జవాబు:
 కవాటాలు రక్తాన్ని ఏక మార్గంలో ప్రసరింప చేయటానికి తోడ్పడతాయి. దీనికి వ్యతిరేకమార్గంలో ప్రసరణ నిరోధిస్తాయి. గుండెలోని కవాటాలు, సిరలలోని కవాటాల వలన కలిగే ప్రయోజనం ఒక్కటే.

ప్రశ్న 6.
 ధమనులు శరీరం లోపలి భాగంలో ఉంటే, సిరలు శరీరంలో పరధీయ భాగాలలో ఎందుకుంటాయో ఊహించండి.
 జవాబు:
- ధమనుల యొక్క రక్తనాళాలపై పీడనం ఎక్కువ మరియు అవి గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని వెళతాయి. అందువలన శరీరం లోపలి భాగంలో ఉంటాయి.
- సిరలు యొక్క రక్తనాళాలపై పీడనం తక్కువ మరియు అవి శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని చేరుస్తాయి. అందువలన సిరలు శరీరంలో పరధీయ భాగాలలో ఉంటాయి.
10th Class Biology Textbook Page No. 61
ప్రశ్న 7.
 ధమనులు, సిరలు గురించి ఈ క్రింది పట్టిక పూరించండి.
 (లేదా)
 విలియం హార్వే అందించిన సమాచారం ప్రకారం ఈ క్రింది పట్టికను పూరింపుము.
 జవాబు:
 
10th Class Biology Textbook Page No. 63
ప్రశ్న 8.
 పటం (ఎ) మరియు పటం (బి)లను గమనించండి.
పటాలలో ఎక్కడనుండైనా మొదలు పెట్టి బాణపుగుర్తుల మార్గంలో మీ పెన్సిల్ ను కదపండి. మీ మార్గంలో వచ్చిన భాగాలను చక్రీయంగా గుర్తించండి. రెండు ఫ్లోచార్టులను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పటాలలో వివిధ శరీర భాగాలను గుర్తించే ప్రయత్నం చేయండి.
 
 1. పటం(ఎ) లో మీ పెన్సిల్ శరీర భాగాల ద్వారా ఎన్నిసార్లు ప్రయాణించింది?
 జవాబు:
 పటం-(ఎ) లో పెన్సిల్ శరీర భాగాల ద్వారా ఒకసారి ప్రయాణించింది.
2. పటం(బి) లో మీ పెన్సిల్ గుండె ద్వారా ఎన్ని సార్లు ప్రయాణించింది?
 జవాబు:
 పటం-(బి) లో పెన్సిల్ గుండె ద్వారా రెండు సార్లు ప్రయాణించింది.
3. పటం(బి) లో మీ పెన్సిల్ ఊపిరితిత్తుల ద్వారా ఎన్నిసార్లు ప్రయాణించింది?
 జవాబు:
 పటం(బి) లో పెన్సిల్ ఊపిరితిత్తుల ద్వారా ఒకసారి ప్రయాణించింది.
10th Class Biology Textbook Page No. 64
ప్రశ్న 9.
 కాళ్ళలో ఎందుకు ఇలా వాపు వస్తుంది?
 జవాబు:
 ఎక్కువ సేపు ప్రయాణం చేస్తూ కూర్చున్నప్పుడు కాళ్ళలో చేరిన కణజాల ద్రవం పైకి సరఫరా చేయబడక కాళ్ళలో నిల్వ ఉంటుంది. అందువలన కాళ్ళు ఉబ్బిన వాపు కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని ఎడిమా అంటారు. కొద్దిపాటి కదలికల వలన ఈ పరిస్థితి సర్దుబాటు అవుతుంది.
10th Class Biology Textbook Page No. 68
ప్రశ్న 10.
 మొక్కలలో కూడా జంతువుల మాదిరిగా రక్తప్రసరణ వ్యవస్థ ఏదైనా ఉందా?
 జవాబు:
 మొక్కలలో కూడా రవాణా కొరకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. ఇది పొడవైన నాళాలు కలిగి పదార్థ రవాణాను నిర్వహిస్తాయి. ఈ నాళికా కణజాలాన్ని ‘నాళికాపుంజం’ అంటారు. దీనిలో రెండు రకాల కణజాలం ఉంటుంది. పెద్ద నాళాలు కలిగి కణజాలం నీటి రవాణాలో పాల్గొంటుంది. దీనిని దారువు అంటారు. దారువు క్రింది కణజాలం తక్కువ పరిమాణంతో కూడిన నాళాలు కలిగి ఉంటుంది. దీనిని పోషకకణజాలం అంటారు. ఇది ఆహార పదార్థాల రవాణాలో పాల్గొంటుంది.
ప్రశ్న 11.
 వేర్లు నేలలోని ఖనిజ లవణాలను శోషిస్తుందని మనకు తెలుసు కాని ఇది ఎలా సాధ్యమవుతుంది?
 ఎ) దీని వెనుకనున్న యాంత్రికం ఏమిటి?
 జవాబు:
 ఖనిజలవణాల శోషణలో మొక్కలు కొన్నిసార్లు కణద్రవ్య శక్తిని వినియోగిస్తాయి. దీనిని ‘సక్రియా శోషణ’ అంటారు.
బి) వేర్లు నీటితో నేరుగా సంబంధాన్ని ఏర్పరుచుకుంటాయా?
 జవాబు:
 వేర్లు సన్నని మూలకేశాలను కలిగి ఉండి నీటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
సి) నీరు ఎలా శోషించబడుతుంది?
 జవాబు:
 మూలకేశాలు నీటిని పీల్చుకోవటం ద్వారా కణాలలోని దారువు కణజాలంలోకి నీరు శోషించబడుతుంది. ఈ ప్రక్రియలో విసరణ, ద్రవాభిసరణ వ్యవస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
10th Class Biology Textbook Page No. 71
ప్రశ్న 12.
 బాష్పోత్సేకానికి, వర్షపాతానికి ఏమైనా సంబంధం ఉందా?
 జవాబు:
 బాష్పోత్సేకం వలన గాలిలో తేమ అధికంగా చేరుతుంది. తేమ ఉన్న గాలి వర్షాన్ని కలిగిస్తుంది. కావున మొక్కలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో (అడవులలో) వర్షపాతం కూడా అధికం.
10th Class Biology Textbook Page No. 73
ప్రశ్న 13.
 మీ పరిసరాలలో ఏవైనా చెట్లు, మొక్కల బెరళ్ళను జంతువులు తొలచివేశాయా? పరిశీలించండి. వాటి జాబితా రాయండి. మీ జాబితాలో చెట్లు ఏ జాతికి చెందినవి, నష్టం ఎంత, నష్టం ఈ మధ్యనే జరిగిందా, పాతదా, కాండం మీద గీరినట్లుగా జంతువుల పళ్ళగాట్ల గుర్తులు కనిపిస్తున్నాయా?
 జవాబు:
 మా పరిసరాలలోని జామ, మామిడి చెట్లపై ఎలుక కొరికిన గీతలు, గాట్లు గమనించాను. కొన్నిసార్లు ఎలుకలు చెట్ల వేర్లను కొరకటం వలన చెట్లు మరణిస్తాయని మా పెద్దలు చెప్పారు.
ప్రశ్న 14.
 ధమనుల గోడలు దృఢంగా, స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటాయి. ఎందుకు?
 జవాబు:
 ధమనులు గుండె నుండి రక్తాన్ని తీసుకొనిపోతాయి. హృదయస్పందన వలన ధమనులలో రక్తపీడనం అధికంగా ఉంటుంది. ఈ పీడనాన్ని భరించటానికి ధమనుల గోడలు దృఢంగా ఉండి స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. పీడనం పెరిగినపుడు ధమనులు వ్యాకోచించి పీడనాన్ని తట్టుకొంటాయి.

ప్రశ్న 15.
 ధమనులను శాఖలుగా విస్తరించిన చెట్టుతో పోల్చుతారు. ఎందుకు?
 జవాబు:
 చెట్టు మొదటిలో ఒకే కాండం కలిగి ముందుకు వెళ్ళేకొలది అనేక శాఖలుగా చీలిపోయి విస్తరిస్తుంది. మన రక్తప్రసరణ వ్యవస్థలో ధమని కూడా గుండె ‘నుండి బయలు దేరి ముందుకు సాగే కొలది అనేక శాఖలుగా చీలి విస్తరిస్తుంది. అందువలన ధమనులను శాఖలుగా విస్తరించిన చెట్లతో పోల్చుతారు.
ప్రశ్న 16.
 ధమనులతో పోల్చితే, సిరలలో రక్త ప్రవాహ మార్గం (lumen) పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఎందుకు?
 జవాబు:
 ధమనులలో, హృదయస్పందన వలన ఒత్తిడి ఉండుటవలన రక్తం బలంగా నెట్టబడుతుంది. కాని సిరలలో ప్రవేశించే రక్తంలో ఇటువంటి ఒత్తిడి ఉండదు. రక్తం స్వేచ్ఛగా ప్రసరించాలంటే సిరలలో కుహర పరిమాణం పెద్దదిగా ఉండాలి. అంతేగాక సిరల లోపల కవాటాలు స్థలాన్ని ఆక్రమిస్తాయి. కావున సిరలలో కుహర పరిమాణం పెద్దదిగా ఉంటుంది.
10th Class Biology 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook Activities (కృత్యములు)
కృత్యం -1
→ డాక్టరుగారి లాగే మీరు కూడా హృదయస్పందనను లెక్కించవచ్చు. బొమ్మలో చూపిన విధంగా మీ చూపుడు వేలు, మధ్య వేళ్ళను మణికట్టు లోపలి వైపుకు బొటనవేలును మణికట్టు కిందివైపుకు కొంచెం నొక్కిపెట్టినట్లుగా పటంలో చూపిన విధంగా ఉంచండి.
 1) మీరు ఏం గమనించారు?
 జవాబు:
 లోపల నుండి లయబద్ధంగా మీ వేళ్ళను ఏదో తోస్తున్నట్లుగా అనిపిస్తోంది కదూ! ఈ లయనే ‘నాడీ స్పందన’ (Pulse) అంటాం.
 
2) ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు వస్తున్నాయో లెక్కించండి.
 జవాబు:
 నిముషానికి 72 సార్లు స్పందనలు గుర్తించాను.
ఇప్పుడు లేచి నిలబడి ఒక నిముషం పాటు ‘జాగింగ్’ చేయండి. మరలా ఒక నిమిషం పాటు నాడీ స్పందనను లెక్కించండి. మీ తరగతిలోని కొందరు విద్యార్థుల నాడీ స్పందనలను లెక్కించండి. ఇలా మూడు నమూనాలను లెక్కించి కింది పట్టికలో నమోదు చేయండి.
 
 
3) మీరు ఏం గమనించారు? విశ్రాంతిలోను, జాగింగ్ తర్వాత నాడీ స్పందన ఒకే విధంగా ఉందా?
 జవాబు:
 లేదు, జాగింగ్ తరువాత నాడీస్పందన రేటు పెరిగింది.
కృత్యం – 2
→ నాడీస్పందన రేటు వ్యక్తికి వ్యక్తికి మరియు సందర్భాన్ని బట్టి మారటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి నాడీస్పందన స్థిరంగా ఉండదని, మనం భయపడినపుడు, ఉద్రేకపడినపుడు నాడీస్పందనరేటు పెరుగుతుందని అర్థమవుతోంది కదూ! మరికొన్ని సందర్భాలలో కూడా ఇలాంటి పరిస్థితిని గమనించవచ్చు. ఉదాహరణకు మనం మెట్లు ఎక్కేటపుడు, పరిగెత్తేటపుడు నాడీ స్పందనను పరిశీలించండి.
హృదయస్పందన, నాడీ స్పందనల మధ్య గల సంబంధాన్ని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాడీస్పందనను మరొక విధంగా కూడా గుర్తించవచ్చు. కింది కృత్యాన్ని చేయండి.
ఇందుకోసం మీ సొంత స్టెతస్కోపును తయారుచేసుకోండి. ఒక చొక్కా గుండీని తీసుకోండి. అగ్గిపుల్లను నిటారుగా నిలబడేటట్లుగా గుండీ రంధ్రంలోకి చొప్పించండి. గుండీని మణికట్టు లోపలివైపున పటంలో చూపిన విధంగా ఉంచండి. అగ్గిపుల్లలో కదలికలను జాగ్రత్తగా గమనించండి. దీని సహాయంతో నాడీ స్పందనను లెక్కించండి.
 
 1) మీరు ఏమి గమనించారు?
 జవాబు:
 అగ్గిపుల్లలో కదలికలు గమనించాను.
2) మన నాడీ స్పందన ఎప్పుడు అధికమవుతుంది?
 జవాబు:
 జాగింగ్, వాకింగ్ తరువాత నాడీ స్పందన పెరిగింది.
3) నాడీ స్పందన దేనిని తెలియజేస్తుంది?
 జవాబు:
 నాడీ స్పందన హృదయస్పందనను తెలియజేస్తుంది.
కృత్యం – 3
→ లెన్నెక్ చేసిన ప్రయోగాన్ని మనమూ చేద్దాం. 10 అంగుళాల పొడవు, ఒక అంగుళం వ్యాసం ఉండేట్లుగా ఒక కాగితపు గొట్టాన్ని తయారుచేయండి. మీ స్నేహితుని మెడ నుండి ఆరంగుళాల కిందుగా, రొమ్ము మధ్య భాగానికి ఒక అంగుళం ఎడమవైపున కాగితపు గొట్టం ఒక చివరను ఆనించండి. రెండవ చివర చెవి ఉంచి జాగ్రత్తగా వినండి. ఒక నిమిషంలో ఎన్నిసార్లు హృదయం స్పందిస్తోందో లెక్కించండి. కనీసం పది మంది విద్యార్థుల హృదయస్పందనలను, నాడీస్పందనలను లెక్కించి కింది పట్టికలో నమోదు చేయండి.
 
 
పై అంశాల ఆధారంగా హృదయస్పందన, నాడీస్పందనల మధ్య గల సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ (Histogram) గీయండి. నమూనా గ్రాఫ్ ను పరిశీలించండి. అందులో నీలిరంగు పట్టీలు (a) హృదయ స్పందనను, ఎరుపురంగు పట్టీలు (b) నాడీస్పందనను తెలియజేస్తాయి.
 → హృదయస్పందనకు, నాడీ స్పందనకు మధ్య గల సంబంధం ఏమిటి?
 జవాబు:
 హృదయస్పందన రేటు నాడీ స్పందన రేటుకు సమానంగా ఉంది.
→ హృదయస్పందన రేటు, నాడీ స్పందన రేటు ఎప్పుడూ సమానంగా ఉంటాయా?
 జవాబు:
 ఔను, నాడీస్పందన రేటు, ఎల్లప్పుడూ హృదయస్పందన రేటుకు నిముషానికి సమానం.
పై పరిశీలనలను బట్టి రెండింటి మధ్య సంబంధం ఉన్నదని తెలుస్తోంది కదూ!
కృత్యం – 4
→ ధమనులు, సిరల పనితీరును పరిశీలించడానికి కింది కృత్యాలు చేయండి.
కాలుమీద కాలువేసుకొని బల్ల మీద కూర్చొండి. ఈ స్థితిలో ఒక మోకాలు మీద మరొక మోకాలు ఆని ఉంటుంది. ఒక పాదం నేలకు ఆని ఉంటే మరొక పాదం గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది. ఇలా కొంచెంసేపు కూర్చుంటే హృదయస్పందనలకు లయబద్ధంగా కాలిలో కదలికలు రావడాన్ని మీరు గమనించవచ్చు.
ఇదే భంగిమలో చాలాసేపు కూర్చుంటే వేలాడుతున్న కాలు బరువెక్కినట్లు, సూదులు గుచ్చుతున్నట్లు, తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
 జవాబు:
 కాలు మడిచి కూర్చున్నప్పుడు, మడిచిన క్రింది భాగాలకు రక్త సరఫరా తగ్గుతుంది. అందువలన కణజాలానికి సరిపడినంత ఆక్సిజన్ అందదు. కణజాలంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత వలన తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుంది. నిటారుగా నిలబడినపుడు తిరిగి రక్తప్రసరణ పునరుద్ధరింపబడి, తిమ్మిరి తగ్గుతుంది.
చేతిలో సిరలు రక్తంతో నిండి ఉబ్బేలా చేతిని గిరగిరా తిప్పండి. తరువాత చేతిని కిందికి జారవిడవండి. పైకి కనిపిస్తున్న సిరను మెల్లగా వేలితో నొక్కండి. వ్యతిరేకదిశలో రక్తం ప్రవహించడాన్ని గమనించవచ్చు. కవాటాలకు వ్యతిరేక దిశలో రక్తం ప్రవహిస్తూ సిర ఉబ్బినట్లుగా మీరు గమనించారా? ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలను మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
 జవాబు:
 సిరలలో రక్తప్రసరణ గుండెవైపుకు ఉంటుంది. రక్తం వెనుకకు ప్రయాణించకుండా సిరలలోని కవాటాలు నిరోధిస్తాయి. చేతిని గిరగిరా తిప్పినపుడు అపకేంద్రబలం వలన రక్తం వెనుకకు నెట్టబడి సిర ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. తరువాత తిరిగి రక్త ప్రసరణ పునరుద్ధరించబడి సాధారణ స్థితి నెలకొంటుంది.
కృత్యం – 5: మూలకేశాల శోషణ
→ ఈ కృత్యాన్ని నిర్వహించడానికి సజ్జలు లేక ఆవాల విత్తనాలను మొలకెత్తించాలి. తడి అద్దుడు కాగితంపై పెంచిన ఆవాల మొలకలను తీసుకుని పరీక్షించండి. వేర్ల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి నిర్మాణాలను భూతద్దంతో పరిశీలించండి. వీటినే మూలకేశాలు అంటారు. వాటి ద్వారా నీరు మొక్కలలోకి ప్రవేశిస్తుంది. కొంత వేరు భాగాన్ని తీసుకుని దానిపై కొద్దిగా పొడి నీటి చుక్కను వేయండి. కవర్ స్లితో కప్పి చిదిమినట్లు అయ్యేలా నెమ్మదిగా నొక్కి సూక్ష్మదర్శినిలో పరీక్షించండి.
 → మీరు ఏం గమనించారు?
 జవాబు:
 సన్నగా పొడవైన నిర్మాణాలు కనిపించాయి. ఇవి ఒక కణ మందంతో పొడవుగా ఉన్నాయి. ఈ నాళాలు నీటి రవాణాలో పాల్గొంటాయి.

కృత్యం – 6 : వేరు పీడనం
→ నీటి మట్టంలో పెరుగుదల గమనించారా?
 జవాబు:
 ఔను. నీరు M1 నుండి M2 కు పెరిగింది.
→ ఈ చర్యలో దారువు పాత్ర ఏమిటి?
 జవాబు:
 దారువు ద్వారా నీరు రవాణా జరుగుతుంది. నీటి అణువుల మధ్య ఆకర్షణ బలాల వలన దారునాళాల గోడలలో నీరు పైకి లాగబడి, నీటి స్తంభం ఏర్పడుతుంది.
ప్రయోగశాల కృత్యం
ఉద్దేశం : క్షీరదాల గుండె అంతర్నిర్మాణాన్ని పరిశీలించడం.
క్షీరదాలన్నింటిలో గుండె నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రయోగశాలలో గొర్రె లేక మేక గుండెను పరిశీలన కోసం తీసుకుందాం.
కావలసిన పరికరాలు :
 గొర్రె లేక మేక తాజా గుండె, సోడా స్ట్రాలు, పదునైన బ్లేడు లేదా స్కాల్ పెల్, డిసెక్షన్ ట్రే, ఒక మగ్గు నీరు, డిసెక్షన్ కత్తెర, ఫోర్సెప్స్.
పరిశీలనా పద్దతి :
 మేక లేక గొర్రె తాజా గుండెను తీసుకొని గుండె గదులలో రక్తం లేకుండా శుభ్రం చేసి పరిశీలన కోసం సిద్ధం చేయాలి.
సోడా స్ట్రాలను కత్తిరింపబడిన రక్తనాళాలలోకి ప్రవేశపెట్టాలి. ఇలా సిద్ధం చేసిన గుండెను పరిశీలిస్తూ, పరిశీలనలను మీ నోటు పుస్తకంలో రాయండి.
→ గుండెను కప్పుతూ ఎన్ని పొరలున్నాయి? (పొరలను కత్తెరతో కత్తిరించి తీసివేయండి.)
 జవాబు:
 రెండు పొరలు ఉన్నాయి.
→ గుండె ఏ ఆకారంలో ఉంది?
 జవాబు:
 గుండె శంఖం ఆకారంలో ఉంది. పైభాగం వెడల్పుగా క్రింది భాగం మొనతేలి ఉంది.
→ గుండెకు అతుక్కుని ఎన్ని రక్తనాళాల చివరులున్నాయి?
 జవాబు:
 నాలుగు రక్తనాళాలు ఉన్నాయి.
→ గుండె యొక్క ఏ చివర వెడల్పుగా ఉంది? ఏ చివర సన్నగా ఉంది?
 జవాబు:
 పైభాగం వెడల్పుగా, క్రింది భాగం సన్నగా ఉంది.
→ గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉన్నాయా?
 జవాబు:
 లేవు. జఠరికలో గోడలు మందంగా ఉన్నాయి.
→ గుండెలో ఎన్ని గదులున్నాయి?
 జవాబు:
 గుండెలో నాలుగు గదులు ఉన్నాయి.
→ అన్ని గదులు ఒకే పరిమాణంలో ఉన్నాయా?
 జవాబు:
 లేవు.
→ గుండె గదుల మధ్య ఇంకేమైనా ప్రత్యేకతలను గమనించారా?
 జవాబు:
 కర్ణికలు వెడల్పుగా, జఠరికలు పొడవుగా ఉన్నాయి.
→ గుండె గదులన్నీ ఒకదానితో ఒకటి కలుపబడి ఉన్నాయా?
 జవాబు:
 లేదు.
→ గుండె గదులు ఒకదానితో ఒకటి ఎలా కలుపబడ్డాయి?
 జవాబు:
 గుండె గదులు విభాజక రంధ్రాల ద్వారా కలుపబడ్డాయి.
→ గుండె గదులు ఒకదానితో ఒకటి ఎలా వేరుచేయబడ్డాయి?
 జవాబు:
 గుండె గదుల విభాజకాల ద్వారా వేరు చేయబడ్డాయి.
→ గుండె కింది గదులలో తెల్లని నిర్మాణాలను గమనించారా? ఏ భాగాలకు అవి అతుకబడి ఉంటాయి?
 జవాబు:
 ఈ తెల్లటి నిర్మాణాలను స్నాయురజ్జువులు అంటారు. ఇవి జఠరిక కుడ్యం లోపలి వైపున అతుకబడి ఉన్నాయి.
→ గుండెకు ఎన్ని రక్తనాళాలు అతుకబడి ఉన్నాయి?
 జవాబు:
 గుండెకు నాలుగు రక్తనాళాలు అతుకబడి ఉన్నాయి.
→ అన్ని రక్తనాళాలు దృఢంగా ఉన్నాయా? ఎన్ని రక్తనాళాలు దృఢంగా ఉన్నాయి?
 జవాబు:
 లేవు. రెండు నాళాలు దృఢంగా ఉన్నాయి.
→ రక్తనాళాల దృఢత్వానికి, రక్తప్రసరణకు సంబంధం ఉందని నీవు భావిస్తున్నావా?
 జవాబు:
 ఔను. దృఢంగా ఉన్న రక్తనాళాలను ధమనులు అంటారు. ఇవి గుండె నుండి రక్తాన్ని తీసుకెళతాయి. గుండె కలిగించే ఒత్తిడిని భరించటానికి ఇవి దృఢమైన గోడలు కలిగి ఉంటాయి.
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఈ అవయవానికి సంబంధించినది.
 A) గుండె
 B) ధమని
 C) లింఫ్ గ్రంథి
 D) కేశనాళిక
 జవాబు:
 A) గుండె
2. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? ‘
 A) కుడి కర్ణిక
 B) కుడి జఠరిక
 C) ఎడమ కర్ణిక
 D) ఎడమ జఠరిక
 జవాబు:
 A & B
3. కింది వానిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది?
 A) ధమని
 B) సిర
 B) సిర
 C) కవాటం
 D) కేశనాళిక
 జవాబు:
 C) కవాటం
4. ఈ క్రింది వానిలో సరియైనది
 A) దారువు పోషక కణజాలం ఒకదానిపై ఒకటి నాళాకారంలో అమరి ఉంటాయని రవి చెప్పాడు.
 B) దారువు పోషక కణజాలం వేరుగా ఉండే నాళాలు కాదని జాన్ అన్నాడు.
 C) దారువు పోషక కణజాలం కలిసి నాళాకారంగా ఏర్పడుతాయి అని సల్మా చెప్పింది.
 D) ఆకారాన్ని ఆధారంగా చేసుకుని వాటిని నాళాకార నిర్మాణాలని హరి చెప్పాడు.
 జవాబు:
 D) ఆకారాన్ని ఆధారంగా చేసుకుని వాటిని నాళాకార నిర్మాణాలని హరి చెప్పాడు.

5. ఎఫిడ్ తన తొండాన్ని మొక్కలో …………. లోనికి చొప్పించి రసాన్ని పీలుస్తుంది.
 A) దారువు
 B) పోషక కణజాలం
 C) దవ్వ
 D) నాళికాపుంజం
 జవాబు:
 B) పోషక కణజాలం
