SCERT AP 10th Class Biology Guide Pdf Download 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Biology 4th Lesson Questions and Answers విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ
10th Class Biology 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
 వ్యర్థ పదార్థాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
 జవాబు:
 జీవక్రియల ఫలితంగా కణాలలో వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి.
ప్రశ్న 2.
 అవి ఎలా ఉత్పత్తి అవుతాయి?
 జవాబు:
 జీవక్రియల ఫలితంగా శరీరంలో వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి.
ప్రశ్న 3.
 వాటిలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి?
 జవాబు:
 వ్యర్థ పదార్థాలలో ప్రధానంగా నత్రజని సంబంధ పదార్థాలైన యూరియా, యూరిక్ ఆమ్లం, అమ్మోనియా, పైత్యరస వర్ణకాలు, అదనపు లవణాలు ఉంటాయి.
ప్రశ్న 4.
 ఒకే జీవి విభిన్న పరిస్థితులలో ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాలు ఒకే రకంగా ఉంటాయా?
 జవాబు:
 లేదు. జీవి విసర్జించే వ్యర్థ పదార్థాలు వేరు వేరు పరిస్థితులలో విభిన్నంగా ఉంటాయి.

ప్రశ్న 5.
 విసర్జన అనగానేమి? మూత్రం ఏర్పడే విధానాన్ని తెల్పండి. (AS1)
 జవాబు:
 విసర్జన :
 శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక పదార్థాలు ఏర్పడతాయి. హాని కలిగించే పదార్థాలను వేరుచేసి బయటకు పంపడాన్ని విసర్జన అంటారు.
మూత్రం ఏర్పడే విధానం :
 మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.
- గుచ్ఛగాలనం
- వరణాత్మక పునఃశోషణం
- నాభికాస్రావం
- అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం.
ప్రశ్న 6.
 అమీబాలో విసర్జన ఎలా జరుగుతుంది? (AS1)
 జవాబు:
 విసర్జన వివిధ రకాలైన జీవుల్లో వేరువేరుగా ఉంటుంది. ఏకకణ జీవుల్లో ప్రత్యేకమైన విసర్జకావయవాలుండవు. కణంలోని వ్యర్థ పదార్థాలను వ్యావన పద్ధతిలో బయటికి (చుట్టూ ఉన్న నీటిలోనికి) పంపుతాయి. మంచి నీటిలో నివసించే అమీబా, పారమీషియం మొదలైనవి సంకోచరిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమత చూపుతాయి. సంకోచరిక్తికలు కణంలోని అధికంగా ఉన్న నీటిని మరియు వ్యర్థ పదార్థాలను సేకరిస్తాయి. సంకోచరిక్తికలు (Contractile vacuole) కణద్రవ్యంలో కొద్ది కొద్దిగా జరుగుతూ కణ పరిధిని చేరి పగిలిపోవుట ద్వారా సేకరించిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ప్రధానమైన విసర్జన కణద్రవాభిసరణ (Osmosis) ద్వారా జరుగుతుంది.
ప్రశ్న 7.
 మానవులలో వివిధ విసర్జకావయవాలు ఏవి? అవి విసర్జించే పదార్థాలు ఏవి? (AS1)
 జవాబు:
| విసర్జక అవయవాలు | విసర్జక పదార్థాలు | 
| 1) మూత్రపిండాలు | మూత్రము | 
| 2) చర్మము | స్వేదము, లవణాలు | 
| 3) ఊపిరితిత్తులు | నీటి ఆవిరి, CO2 | 
| 4) కాలేయము | పైత్యరస వర్ణకాలు, యూరియా | 
| 5) పెద్ద ప్రేగు | మలము | 
ప్రశ్న 8.
 దీపక్ “నెఫ్రాన్లు, మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు” అని చెప్పాడు. అతన్ని నీవెలా సమర్థిస్తావు? (AS1)
 జవాబు:
- ప్రతి మూత్రపిండం సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ (1.3 నుండి 1.8 మిలియన్) నెఫ్రాన్లచే నిర్మింపబడుతుంది. కావున నెఫ్రాను మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణంగా వ్యవహరిస్తారు.
- మూత్రపిండాల ప్రధానవిధి రక్తం నుండి వ్యర్థాల తొలగింపు. ఈ ప్రక్రియ మొత్తం నెఫ్రాలో జరుగుతుంది. కావున నెఫ్రాను మూత్రపిండం యొక్క క్రియాత్మక ప్రమాణం అంటారు.
ప్రశ్న 9.
 మొక్కలు వ్యర్థాలను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాయి? (AS1)
 జవాబు:
- మొక్కలు అధికంగా ఉన్న నీటిని బాష్పోత్సేకం మరియు బిందుస్రావం ప్రక్రియల ద్వారా బయటకు పంపుతాయి.
- వ్యర్థాలను ఆకులు, బెరడు మరియు పండ్లలో నిల్వచేసి రాల్చటం ద్వారా తగ్గించుకొంటాయి.
- కొన్ని మొక్కలు వ్యర్థాలను స్వీయ రక్షణకు ఉపయోగించుకొంటాయి.
- మరికొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాఖాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకొంటాయి.
- వీటిలో ఉండే రసాయనాల వలన మొక్కభాగాలు తినడానికి వీలుకాని రుచితో ఉంటాయి. అందువలన ఆ మొక్కలను జంతువులు తినలేవు.
- కొన్ని రసాయనాలు ఎక్కువ విషపూరితంగా ఉండడంతో వాటిని తిన్న జంతువులు చనిపోతాయి.

ప్రశ్న 10.
 కొందరు వ్యక్తులు డయాలసిస్ ఎందుకు చేయించుకుంటారు? దానిలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? (AS1)
 (లేదా)
 హీమోడయాలసిస్ అనగానేమి? ఆ విధానాన్ని వర్ణించండి.
 జవాబు:
 డయాలసిస్ :
 మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడకడతారు. కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను హీమోడయాలసిస్ (Haemodialysis) అంటారు.
 
నిర్మాణం :
- ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కందనాన్ని నిరోధించే కారకాలను కలిపి (హెపారిన్ వంటివి) డయలైజర్ యంత్రంలోనికి పంపే ఏర్పాటును చేస్తారు.
- డయాలసిస్ యంత్రంలో రక్తం కొన్ని గదులు లేదా గొట్టాల వంటి సెల్లో ఫేన్ తో తయారైన నాళికల ద్వారా ప్రవహిస్తుంది.
- ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. ఒక సన్నని పొర నాళికలోని డయలైజింగ్ ద్రావణాన్ని, రక్తాన్ని వేరుచేస్తుంది.
- నాళాలలో ప్రవహిస్తున్న రక్తం నాళాల బయట ఉన్న డయలైజింగ్ ద్రావణం రెండూ ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా కేవలం నత్రజని వ్యర్థాలే.
పనిచేయు విధానం :
 డయలైజింగ్ ద్రావణంలో నత్రజనియుత వ్యర్థాలుండవు కనుక డయలైజర్ లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియ మూత్రపిండాల పనితీరుకు సారూప్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ద్రవాభిసరణ ఆధారంగా పనిచేస్తుంది.
ప్రశ్న 11.
 ద్రవాభిసరణం అనగానేమి? మన శరీరంలో సమతుల్యత ఎలా సాధించబడుతుంది? (AS1)
 జవాబు:
 దేహంలో వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అంటారు. ద్రవాభిసరణం వలన ఈ సమతుల్యత సాధించబడుతుంది.
అధిక గాఢతగల ప్రదేశం నుండి అల్ప గాఢతగల ప్రదేశానికి, అణువులు విచక్షణా స్తరం గుండా రవాణా చెంది, రెండువైపులా గాఢతను సమానం చేయడాన్ని ద్రవాభిసరణం అంటారు. ఈ ప్రక్రియ వలన అణువులు అధిక గాఢత ప్రదేశం నుండి అల్పగాఢత ప్రదేశానికి రవాణా అవుతాయి.
ద్రవాభిసరణ వలన గాఢత సమం చేయబడుట వలన శరీర ద్రవాల మధ్య సమతుల్యత సాధించబడుతుంది.
ప్రశ్న 12.
 రక్తప్రసరణ, విసర్జక వ్యవస్థలకు ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఏమిటి? (AS1)
 జవాబు:
 రక్తప్రసరణకు, విసర్జన వ్యవస్థకు దగ్గర సంబంధం ఉంది.
- అన్ని కణాల నుండి వ్యర్థపదార్థాలు రక్తంలో చేరి రవాణా చేయబడతాయి.
- రక్తంలో చేరిన వ్యర్థ పదార్థాలు మూత్రపిండాలను చేరతాయి.
- మూత్రపిండాలలో సూక్ష్మగాలనం వలన వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి.
- వ్యర్థాలను తొలగించిన రక్తం తిరిగి వృక్క సిర ద్వారా గుండెకు చేర్చబడుతుంది.
- ఈ విధంగా విసర్జక వ్యవస్థ పని చేయటానికి కావలసిన మలిన రక్తాన్ని రక్తప్రసరణ వ్యవస్థ అందించి, తిరిగి శుద్ధి చేయబడిన రక్తాన్ని తీసుకొనిపోతుంది.
ప్రశ్న 13.
 కారణాలు తెలపండి. (AS1)
 ఎ) వాసోప్రెస్సిన్ ఎల్లప్పుడూ స్రవించదు.
 బి) మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉండి తరువాత క్షారయుతంగా ఉంటుంది.
 సి) అభివాహిధమని వ్యాసం కంటే, అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉంటుంది.
 డి) వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చిక్కగా ఉంటుంది.
 జవాబు:
 ఎ) వాసోప్రెస్సిన్ ఎల్లప్పుడూ స్రవించదు :
 జీవక్రియలకు సరిపడినంత నీరు శరీరంలో లేనప్పుడు, వాసోప్రెస్సిన్ స్రవించబడి, నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువలన గాఢత చెందిన మూత్రం ఏర్పడుతుంది. నీరు ఎక్కువగా త్రాగిన సందర్భాలలో, శీతాకాలంలో శరీరం నుండి నీటి నష్టం తక్కువగా ఉండి శరీరానికి సరిపడినంత నీరు లభించినపుడు వాసోప్రెస్సిన్ స్రవించబడదు.
బి) మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉండి తరువాత క్షారయుతంగా ఉంటుంది :
 మూత్రంలో మొదట యూరియా కరిగి యూరికామ్లంగా ఉండుట వలన ఆమ్లయుతంగా ఉంటుంది. కానీ యూరియా తరువాత అమ్మోనియాగా . మారటం వలన మూత్రం క్రమంగా క్షారయుతంగా మారుతుంది.
సి) అభివాహిధమని వ్యాసం కంటే అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉంటుంది :
 అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉండుట వలన రక్తనాళగుచ్ఛం (గ్లోమెరూలస్) లో పీడనం పెరిగి, రక్తం వడపోతకు గురి అవుతుంది. అందువలన రక్తం నుండి మలిన పదార్థాలు వేరు చేయబడతాయి.
డి) వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చిక్కగా ఉంటుంది :
 వేసవిలో పరిసరాల ఉష్ణోగ్రత అధికంగా ఉండుట వలన శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. శరీరం నీటిని కోల్పోవటం వలన మూత్రం తక్కువగా ఏర్పడుతుంది. తక్కువ మూత్రం ద్వారా వ్యర్థాలు విసర్జించబడటం వలన మూత్రం చిక్కగా ఉంటుంది. కావున వేసవి కాలంలో ఎక్కువ నీరు త్రాగటం ఆరోగ్యకరం.

ప్రశ్న 14.
 భేదాలు రాయండి. (AS1)
 ఎ) సమీపస్థ సంవళితనాళం, దూరస్థ సంవళితనాళాల విధులు
 బి) మూత్రపిండాలు మరియు కృత్రిమ మూత్రపిండాలు
 సి) విసర్జన మరియు స్రావం
 డి) ప్రాథమిక మరియు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు
 జవాబు:
 ఎ) సమీపస్థ సంవళితనాళం, దూరస్థ సంవళితనాళాల విధులు :
| సమీపస్థ సంవళితనాళం | దూరస్థ సంవళితనాళం | 
| 1) ఇది బౌమన్ గుళికకు దగ్గరగా ఉంటుంది. | 1) ఇది బొమన్ గుళికకు దూరంగా ఉంటుంది. | 
| 2) ఇది హెశిక్యం యొక్క పూర్వభాగం. | 2) ఇది హె)శిక్యం యొక్క పరభాగం. | 
| 3) ఇందులో నీరు, లవణాలు పునఃశోషణ చేయబడతాయి. వరణాత్మక పునఃశోషణ దీని ప్రధాన విధి. | 3) వ్యర్థాలు మూత్రనాళికలోనికి స్రవించబడతాయి. నాళికా స్రావం దీని ప్రధాన విధి. | 
| 4) ప్రాథమిక మూత్రం ఉంటుంది. | 4) గాఢత చెందిన మూత్రం ఉంటుంది. | 
బి) మూత్రపిండాలు మరియు కృత్రిమ మూత్రపిండాలు :
| మూత్రపిండాలు | కృత్రిమ మూత్రపిండాలు | 
| 1) మానవునిలోని ప్రధాన విసర్జక అవయవం. | 1) మూత్రపిండ విధిని నిర్వహించే పరికరము. | 
| 2) ఇది ఒక శారీరక అవయవం. | 2) ఇది ఒక యంత్రపరికరం. | 
| 3) కణజాలాలు నెఫ్రాన్లతో నిర్మితం. | 3) డయలైజర్లు నాళాలతో నిర్మితం. | 
| 4) పరిమాణాత్మకంగా చిన్నది. | 4) పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. | 
| 5) శరీరంలో ఇమిడి ఉంటుంది. | 5) శరీరం బయట ఉంచి రక్తాన్ని సరఫరా చేస్తారు. | 
| 6) స్వయం ప్రతిపత్తి కలది. | 6) మానవ ఆధీనంలో పనిచేస్తుంది. | 
| 7) సహజమైనది. | 7) కృత్రిమమైనది. | 
సి) విసర్జన మరియు స్రావం :
| విసర్జన | స్రావం | 
| 1) వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియ. | 1) పదార్థాలను ఒక చోట నుండి మరొక చోటుకు రవాణా చేసే ప్రక్రియ. | 
| 2) క్రియాత్మకం కాని ప్రక్రియ. | 2) క్రియాత్మక ప్రక్రియ. | 
| 3) మానవునిలో యూరియా, యూరికామ్లం, అమ్మోనియా విసర్జన పదార్థాలు. | 3) ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలం స్రావాలు. | 
| 4) మొక్కలలో ఆల్కలాయిడ్లు, రెసిన్ మొదలైనవి విసర్జితాలు. | 4) జిగురులు, లేటెక్స్ వంటివి స్రావితాలు. | 
డి) ప్రాథమిక మరియు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :
| ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు | ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు | 
| 1) శరీర నిర్మాణానికి, శక్తికి తోడ్పడతాయి. | 1) రక్షణకు, ఇతర క్రియలకు తోడ్పడతాయి. | 
| 2) కిరణజన్యసంయోగక్రియ వలన ఏర్పడతాయి. | 2) జీవక్రియల ఫలితంగా ఏర్పడతాయి. | 
| 3) జీవక్రియల వలన మొదటిగా ఏర్పడతాయి. కావున వీటిని ప్రాథమిక ఉత్పన్నాలు అంటారు. | 3) ప్రాథమిక ఉత్పన్నాల వినియోగం వలన ఏర్పడతాయి. కావున వీటిని ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటారు. | 
| 4) ప్రధానంగా దుంపలు, కాయలలో నిల్వ చేయబడతాయి. | 4) ప్రధానంగా ఆకు, బెరడు, వేర్లలో నిల్వ చేయబడతాయి. | 
| 5) పోషకాలుగా పరిగణిస్తాము. | 5) వ్యర్థాలుగా పరిగణిస్తాము. | 
| 6) ఉదా : కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు. | 6) ఉదా : ఆల్కలాయిడ్లు, రెసిన్లు. | 
ప్రశ్న 15.
 మానవ శరీరంలో ఒక జత చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ‘P’ అనే అవయవాలు వెన్నెముకకు ఇరువైపులా పృశరీర కుడ్యానికి అంటిపెట్టుకుని ఉంటాయి. ఉపయోగపడని ప్రోటీన్లు విచ్ఛిన్నం కావడంవల్ల ఏర్పడే వ్యర్థం ‘Q’ రక్తం ద్వారా ‘R’ అనే ధమని ద్వారా ‘P’ కి చేరుతుంది. ‘P’ లో అసంఖ్యాకంగా ఉండే ‘S’ అనే వడపోసే నాళికలు రక్తాన్ని వడపోసి మిగిలిన రక్తాన్ని సిర ‘T’ ద్వారా ప్రసరణ వ్యవస్థలోకి పంపబడుతుంది.
వ్యర్థ పదార్థాలు ‘Q’ మరియు ఇతర లవణాలు అధికంగా ఉన్న నీటితో కలిసి పసుపు వర్ణంలో ‘U’ అనే ద్రవం ఏర్పడుతుంది. ఇది ‘P’ నుండి సంచి లాంటి నిర్మాణంలో ‘V’ లోనికి ‘W’ అనే నాళాల ద్వారా వెళుతుంది. తరువాత ఈ ద్రవం ‘X’ అనే ద్వారం ద్వారా బయటకుపోతుంది. (AS1)
 ఎ) అవయవం ‘P’ ఏమిటి ? బి) వ్యర్థం ‘Q’ ఏమిటి?
 సి) ధమని ‘R’ పేరేమిటి ? డి) సిర అనే ‘T’ పేరేమిటి?
 ఇ), వడపోసే సూక్ష్మనాళిక ‘S’ను ఏమంటారు?
 ఎఫ్) ద్రవం ‘U’ పేరేమిటి?
 జి) ‘V’ నిర్మాణాల పేరేమిటి?
 హెచ్) ‘W’ నాళాల పేరేమిటి?
 ఐ) ద్వారం ‘X’ పేరేమిటి?
 జవాబు:
 ఎ) ‘P’ అంటే మూత్రపిండం.
 బి) ‘Q’ అంటే యూరియా వంటి వ్యర్థ పదార్థం.
 సి) ‘R’ అంటే వృక్క ధమని.
 డి) ‘T’ అంటే అపవాహి రక్తనాళం
 ఇ) ‘S’ అంటే నెఫ్రాన్.
 ఎఫ్) ‘U’ అనగా మూత్రం,
 జి) ‘V’ అంటే మూత్రాశయం.
 హెచ్) ‘W’ అనగా మూత్రనాళాలు.
 ఐ) ‘X’ అనగా ప్రసేకం.

ప్రశ్న 16.
 ‘B’ అనే విషపూరిత వ్యర్థాలు రక్తంలో చేరికవల్ల రక్తం మలినంగా మారి వ్యక్తి శరీరంలోని అవయవం ‘A’ చెడిపోతుంది. ఆ వ్యక్తి ప్రాణం రక్షించడానికి అతని చేతిలోని ధమని ద్వారా రక్తాన్ని మెలికలు తిరిగిన గొట్టాల ద్వారా పంపించారు. ఈ గొట్టాలు ‘E’ అనే పదార్థంతో చేయబడ్డాయి. ద్రావణం ‘F’ కలిగిన ట్యాంక్ లో ఉంచబడ్డాయి. ఈ ద్రావణంలో ‘G, H’ మరియు I అనే రక్తంతో, సమాన నిర్మాణం కలిగిన ఈ మూడు పదార్థాలు ఉన్నాయి. గొట్టాల గుండా రక్తం ప్రవహిస్తున్నపుడు రక్తంలోని వ్యర్థాలు ద్రావణం ‘F’ లోకి చేరాయి. శుభ్రమైన రక్తం తిరిగి సిర ద్వారా వ్యక్తి రక్తప్రసరణ వ్యవస్థలోకి చేరింది. (AS1)
 ఎ) అవయవం ‘A’ ఏమిటి?
 బి) వ్యర్థపదార్థం ‘B’ ఏమిటి?
 సి) పదార్థం ‘E’, ద్రావణం ‘F’ ల పేర్లేమిటి?
 డి) ద్రావణంలోని ‘G’, ‘H’ మరియు ‘I’ ఏమిటి?
 ఇ) పైన పేర్కొనబడిన విధానం ఏమిటి?
 జవాబు:
 ఎ) ‘A’ అనే అవయవం మూత్రపిండం.
 బి) ‘B’ అనే వ్యర్థ పదార్థాలు యూరియా, అమ్మోనియా.
 సి) ‘E’ అనే పదార్థం ‘సెల్లో ఫేన్’, ‘F’ అనేది డయలైజింగ్ ద్రావణం.
 డి) ద్రావణంలోని ‘G’ హెపారిన్, ‘H’ ప్రాథమిక మూత్రం మరియు ‘T’ నీరు
 ఇ) పైన పేర్కొనబడిన విధానాన్ని ‘డయాలసిస్’ అంటారు.
ప్రశ్న 17.
 ఎప్పటికప్పుడు శరీరంలోని వ్యర్థాలు బయటికి పంపకపోతే ఏమౌతుందో ఊహించండి. (AS2)
 జవాబు:
- శరీరంలో ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపకపోతే వాటి మోతాదు పెరిగిపోయి శరీర ద్రవ్యాల తులాస్థితి దెబ్బతింటుంది.
- తొలగించని వ్యర్థాలు విషపదార్థాలుగా మారి జీవక్రియలను దెబ్బతీస్తాయి.
- మరికొన్ని వ్యర్థాలు విషపదార్థాలుగా పరిణమించి మరణానికి దారితీస్తాయి.
- కావున వ్యర్థ పదార్థాల విసర్జన తప్పనిసరి. విసర్జన జరపకుండా జీవులు జీవించలేవు.
ప్రశ్న 18.
 మీ మూత్రపిండాలు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంచుకొనుటకు యూరాలజిస్ట్/నెఫ్రాలజిస్ట్ ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు? (AS2)
 జవాబు:
- మూత్రపిండాల ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఆహార నియమాలకు, మూత్రపిండాల పనితీరుకు గల సంబంధం ఏమిటి?
- మూత్రపిండాల పనితీరుకు రోజూ ఎంత నీరు అవసరము?
- ధూమపానం, ఆల్కహాల్ వ్యసనాలు మూత్రపిండంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
- శారీరక వ్యాయామానికి, మూత్రపిండాల పనితీరుకు ఏదైనా సంబంధం ఉందా?
- మూత్రపిండాలలో రాళ్లు ఎలా ఏర్పడతాయి? నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
ప్రశ్న 19.
 మీ పరిసరాలలో జిగురునిచ్చే మొక్కలేవి ? జిగురుని మొక్కల నుండి సేకరించడానికి ఎటువంటి విధానం అనుసరిస్తావు? (AS3)
 జవాబు:
- మా పరిసరాలలో ప్రధానంగా వేప, తుమ్మ, మునగ చెట్ల నుండి జిగురు తీస్తారు.
- జిగురు కోసం ముందుగా చెట్ల బెరడును కొంచెం చెక్కి వదులుతారు.
- చెక్కిన ప్రాంతం నుండి చెట్టు జిగురు స్రవిస్తుంది.
- ఈ జిగురును చెక్కి నీళ్ళలో నానవేసి జిగురు చేస్తారు.
- దీఖిని పుస్తకాల బైండింగ్ వర్క్ లో విరివిగా ఉపయోగిస్తారు.
ప్రశ్న 20.
 వివిధ రకాల మొక్కల నుండి లభించే ఆల్కలాయిడ్లకు సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలం లేదా గ్రంథాలయం నుండి సేకరించి, నివేదిక తయారుచేయండి. (AS4)
 జవాబు:
 ఆల్కలాయిడ్లు మొక్కలలో ఏర్పడే నత్రజని సంబంధిత ఉప ఉత్పన్నాలు. ఇవి మొక్కలకు అనేక విధాలుగా ఉపయోగ పడటమేగాక మానవులకు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయి.
- క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ‘సింకోనా అఫిసినాలిస్’ అనే మొక్క బెరడు’ నుండి లభిస్తుంది. దీనిని మలేరియా నివారణకు ప్రముఖ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
- ‘నికోటిన్’ అనే ఆల్కలాయిడ్ పొగాకు మొక్క నుండి లభిస్తుంది. దీనిని క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తున్నారు.
- గంజాయి మొక్క నుండి మార్ఫిన్, కొకైన్ వంటి ఆల్కలాయిడ్లు లభిస్తున్నాయి. వీటిని మత్తుమందులుగాను, నొప్పి నివారిణులుగాను ఉపయోగిస్తున్నారు.
- సర్పగంధి మొక్క వేర్ల నుండి రిసర్ఫిన్ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది. దీనిని పాముకాటు నివారిణిగా ఉపయోగిస్తారు.
- కాఫీ మొక్క నుండి లభించే ‘కెఫిన్’ అనే ఆల్కలాయిడకు నాడీవ్యవస్థను ఉత్తేజపరచే శక్తి ఉంది. కావున దీనిని వేడి పానీయంగా సేవిస్తుంటారు.
- వేప నుండి లభించే ‘నింబిన్’ ఆల్కలాయిడ్ మంచి కీటకనాశినిగా ఉపయోగపడుతుంది. కావున దీనిని పొలాలకు కీటకనాశినిగానే కాకుండా, టూత్ పేస్టు, సబ్బుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు.
- ఉమ్మెత్త మొక్క నుండి లభించే ‘స్కోపోలమైన్’ ఆల్కలాయిడ్ మత్తుమందుగా పనిచేస్తుంది.
- రిసర్ఫిన్, మార్ఫిన్ వంటి ఆల్కలాయిడ్లను మొక్కల నుండే గాక కృత్రిమంగా రూపొందిస్తున్నారు.
- ‘కురేరి’ (curare) ఆల్కలాయిడ్ ను కండర నొప్పి నివారణకు వాడుతున్నారు. అధిక మోతాదులో దీన్ని విషపదార్థంగా దక్షిణ ఆఫ్రికాలోని తెగలు బాణాలకు పూసి వాడుతుంటారు.
- నొవోకైన్ (Novocain) అనే సంశ్లేషిత ఆల్కలాయిడ్ ను కొకైన్ కు మారుగా వినియోగిస్తున్నారు. సంశ్లేషిత ఆల్కలాయిడ్లు, నిజమైన ఆల్కలాయిడ్ల కంటే తక్కువ దుష్ఫలితాలు కలిగి ఉండుట వలన ప్రాచుర్యంలోనికి వస్తున్నాయి.
ప్రశ్న 21.
 మూత్రపిండం నిలువుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి. (AS5)
 (లేదా)
 మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణాన్ని చూపు చక్కని పటం గీచి భాగాలను గుర్తించుము. వృక్క ధమని, వృక్క సిరల పని ఏమిటి?
 జవాబు:
 
- వృక్పధమని, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు కలిగిన ఆమ్లజని సహిత రక్తాన్ని మూత్రపిండాలకు సరఫరా చేస్తుంది.
- వృక్కసిర, నత్రజని వ్యర్థాలు శుభ్రపరచబడిన ఆమ్లజని రహిత రక్తాన్ని మూత్రపిండాల నుండి సేకరిస్తుంది.
ప్రశ్న 22.
 వృక్కనాళిక (Nephron) నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి. (AS5)
 జవాబు:
 నెఫ్రాన్ నిర్మాణం :
 ప్రతి నెఫ్రాలోను 2 ముఖ్య భాగాలుంటాయి. అవి:
- మాల్ఫీజియన్ దేహం (Malphigian body)
- వృక్కనాళిక (Renal tubule)

1) మాల్ఫీజియన్ దేహం (Malphigian body) :
- నెఫ్రా లో ఒకచివర వెడల్పయిన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బౌమన్ గుళిక అంటారు. దానిలో ఉన్న రక్తకేశనాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్తకేశనాళికా గుచ్ఛం (Glomerulus) అంటారు.
- బొమన్ గుళిక, రక్తకేశనాళికాగుచ్ఛంలను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు.
- రక్తకేశనాళికా గుచ్ఛం అభివాహి ధమనిక నుండి ఏర్పడుతుంది. దాని నుండి అపవాహి ధమనిక వెలువడుతుంది.
- అభివాహి ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల రరక్తకేశనాళికాగుచ్ఛంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి.
- బౌమన్ గుళిక గోడలలోని కణాలు ఉపకళాకణజాలంతో ఏర్పడతాయి. వీటిని పోడోసైట్లు అంటారు. పదార్థాల వడపోతకు వీలుకలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మరంధ్రాలు ఉంటాయి.
2) వృక్కనాళిక (Renal tubule) :
- వృక్కనాళికలలో 3 భాగాలుంటాయి. 1) సమీపస్థ సంవళితనాళం (Proximal Convoluted Tubule- PCT), 2) హెన్లీ శిక్యం (U ఆకారంలో ఉంటుంది. ) 3) దూరస్థ సంవళితనాళం (Distal Convoluted Tubule – DCT).
- దూరస్థ సంవళితనాళం, సంగ్రహణ నాళంలోనికి తెరచుకుంటుంది. సంగ్రహణ నాళాలు పిరమిడ్లు మరియు కెలిసెన్లుగా ఏర్పడి చివరికి ద్రోణి (Pelvis) లోనికి తెరచుకుంటాయి. ద్రోణి మూత్రనాళంలోకి తెరచుకుంటుంది.
- వృక్కనాళికలలోని అన్ని భాగాలు అపవాహి ధమనిక నుండి ఏర్పడిన నాళికాబాహ్య రక్తకేశనాళికల వలచేత కప్పబడి ఉంటాయి. నాళికాబాహ్య రక్తకేశనాళికలన్నీ కలిసి చివరన వృక్కసిరగా ఏర్పడతాయి.

ప్రశ్న 23.
 మానవ విసర్జక వ్యవస్థలో విసర్జన జరిగే మార్గాన్ని రేఖాచిత్రం (Block diagram) ద్వారా చూపండి. (AS5)
 జవాబు:
 
ప్రశ్న 24.
 మూత్రపిండంలో విసర్జన జరిగే విధానాన్ని వివరించే పటాన్ని గీయండి. (AS5)
 జవాబు:
 
 PCT – సమీపస్థ సంవలిత నాళం
 DCT – దూరస్థ సంవలిత నాళం
ప్రశ్న 25.
 మానవుని విసర్జన వ్యవస్థలో అద్భుతంగా భావించిన అంశాలను రాయండి. (AS6)
 జవాబు:
- మూత్రపిండంలో, విసర్జన క్రియ అంతా సన్నని నాళాలలో జరుగుతుంది అనే విషయం ఆశ్చర్యంగా ఉంది.
- మూత్రపిండం దాదాపు మిలియన్ నెఫ్రాన్లచే నిర్మించబడినది అనే విషయం అద్భుతంగా ఉంది.
- నెఫ్రాన్లో ఉపయోగపడే పదార్థాలు తిరిగి పీల్చుకోబడటం, శరీరం యొక్క తెలివితేటలను తెలుపుతుంది.
- ఒక మూత్రపిండం చెడిపోయినా, రెండవ మూత్రపిండం దాని విధిని తీసుకొంటుందని తెలుసుకొని అద్భుతంగా భావించాను.
- మూత్రపిండం యొక్క క్రియాశీలతకు ‘వాసోప్రెస్సిన్’ సహకారం అద్భుతం అనిపించింది.
ప్రశ్న 26.
 ఈ పాఠంలో ‘బ్రెయిన్ డెడ్’ వ్యక్తుల గురించి చదివావు కదా ! నీవు ఏ రకమైన చర్చను చేపడతావు? ఎందుకు? (AS6)
 జవాబు:
 బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? మన శరీరంలో మెదడు మరణించినా ఇతర శరీర అవయవాలు పనిచేస్తుంటాయా? మెదడు ప్రమేయం లేకుండా ఇతర అవయవాలు ఎలా పని చేస్తాయి? వాస్తవానికి మెదడు ప్రమేయం లేకుండా ఇతర అవయవాలు పనిచేయజాలవు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానము అందించిన సాంకేతికత ఆధారంగా గుండె, ఊపిరితిత్తులను పని చేయించవచ్చు. కానీ మెదడు ప్రతిస్పందన లేకుండా అవయవాలు పనిచేసి ప్రయోజనం ఏముంటుంది? కావున బ్రెయిన్ డెడు శాస్త్రీయంగా మరణంగా ధ్రువీకరించి ఇతర అవయవాలను తొలగిస్తారు.
బ్రెయిన్ డెడు నిర్ణయించిన తరువాత ఇతర అవయవాలను అవసరం ఉన్నవారికి దానం చేయవచ్చు. దీనిని అవయవదానం అంటారు. దాదాపు ఎనిమిది రకాల అవయవాలు దానం చేసి ఇతరుల ప్రాణాలను, జీవితాలను కాపాడవచ్చు. అవయవదానం యొక్క ప్రాధాన్యత చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసింది. దాని గురించి విస్తృతంగా తెలియ చెప్పవలసిన బాధ్యత మనందరిది.
ప్రశ్న 27.
 అవయవదానం గురించి మనకు అతి తక్కువ అవగాహన ఉంది. ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన పెంచడానికి కొన్ని నినాదాలు రాయండి. (AS7)
 జవాబు:
- అవయవదానం – మహాదానం
- మరణించే వారికి జీవం పోయవచ్చు – మరణించి కూడా జీవించవచ్చు
- అవయవదానం – బ్రతుకుదానం
- అవయవదానం చేద్దాం – సాటి మానవునిగా జీవిద్దాం
- అవయవాలను దానం చేద్దాం – కొందరికైనా వెలుగు నింపుదాం
- అవయవదానం – ప్రాణదానం

ప్రశ్న 28.
 ఈ పాఠం చదివిన తరువాత మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి మీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నావు? (AS7)
 జవాబు:
 ఈ పాఠం చదివిన తరువాత మూత్రపిండాలు సక్రమంగా పనిచేయటానికి నేను ఈ క్రింది ఆహారపు అలవాట్లు పాటిస్తున్నాను.
- రోజూ తగినంత నీరు త్రాగుతున్నాను.
- సరళ ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను.
- కూల్ డ్రింక్స్ కు బదులుగా కొబ్బరినీళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాను.
- ద్రాక్ష, పుచ్చకాయ, కమల వంటి పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నాను.
- నియమానుసారం వ్యాయామం చేస్తున్నాను.
- ప్రోటీన్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాను.
- ఉడికించిన పదార్థాలు ఎక్కువగా తినుటవలన తగినంత నీరు లభిస్తుంది.
- అన్నం తిన్న తరువాత ఎక్కువ నీరు తీసుకొంటున్నాను.
10th Class Biology 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook InText Questions and Answers
10th Class Biology Textbook Page No. 83
ప్రశ్న 1.
 అభివాహిధమనిక కంటే అపవాహిధమనిక సన్నగా ఉండటానికి కారణం ఆలోచించండి.
 జవాబు:
 అభివాహిధమనిక వ్యాసం, అపవాహిధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల రక్తకేశనాళికాగుచ్ఛంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి.
10th Class Biology Textbook Page No. 84
ప్రశ్న 2.
 నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణమని ఎందుకంటారు?
 జవాబు:
 మూత్రపిండం సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్లతో నిర్మితమౌతుంది. కావున నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. రక్తం యొక్క వడపోత నెఫ్రాని బౌమ గుళికలోనే జరుగుతుంది. కావున నెఫ్రాన్ మూత్రపిండం యొక్క క్రియాత్మక ప్రమాణం అంటారు.
ప్రశ్న 3.
 అభివాహి, అపవాహి ధమనికలలో దేని వ్యాసం ఎక్కువగా ఉంటుంది?
 జవాబు:
 అభివాహి ధమని, అపవాహి ధమని కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుంది.

ప్రశ్న 4.
 రక్తకేశనాళికా గుచ్చంలో ఏ ఏ పదార్థాలు వడపోయబడతాయి?
 జవాబు:
 రక్తకేశనాళికాలైన గుచ్ఛంలో రక్తకణాలు తప్ప మిగిలిన పదార్థాలు, నీరు, లవణాలు, పోషకాలు వడపోతకు గురి అవుతాయి.
ప్రశ్న 5.
 ఎక్కువ నీరు తాగితే ఎక్కువ మూత్రం విసర్జిస్తామా?
 జవాబు:
 శరీరంలో నీటి పునఃశోషణ నీటి పరిమాణం మరియు విసర్జించవలసిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నీరు త్రాగటం వలన మిగిలిన నీరు అంతా మూత్రంగా విసర్జింపబడుతుంది. కావున ఎక్కువ మూత్రం విసర్జిస్తాము.
ప్రశ్న 6.
 ఏఏ పదార్థాలు సమీపస్థ సంవళితనాళం నుండి బాహ్యరక్తకేశనాళికా వలలోనికి పునఃశోషణం అవుతాయి?
 జవాబు:
 శరీరానికి ఉపయోగకర పదార్థాలైన నీరు, లవణాలు, గ్లూకోజ్, ఎమైనో ఆమ్లాలు, విటమిన్ సి, సోడియం, పొటాషియంలు బాహ్యకేశనాళికా వలలోనికి విడుదల అవుతాయి.
10th Class Biology Textbook Page No. 85
ప్రశ్న 7.
 దూరస్థ సంవళితనాళంలో స్రవించబడే పదార్థాలు ఏవి?
 జవాబు:
 రక్తకేశనాళికల నుండి మూత్రనాళికలోనికి వ్యర్థ పదార్థాలు స్రవించబడతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, సోడియం, పొటాషియం, హైడ్రోజన్’ అయాన్లు స్రవించబడతాయి. ఇవి మూత్రం యొక్క గాఢతను, pH ను నియంత్రిస్తాయి.
10th Class Biology Textbook Page No. 86
ప్రశ్న 8.
 ఎక్కువ నీరు తాగినపుడు వాసోప్రెస్సిన్ ఎందుకు ఉత్పత్తికాదో ఆలోచించండి.
 జవాబు:
 శరీరంలో నీరు తగ్గినపుడు వాసోప్రెస్సిన్ ఉత్పత్తి అయి, నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువలన మూత్రం గాఢత చెందుతుంది. నీరు అధికంగా త్రాగినపుడు శరీరానికి సరిపడినంత నీరు ఉండుట వలన వాసోప్రెస్సిన్ ఉత్పత్తి కాదు.

ప్రశ్న 9.
 శీతాకాలంలో ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయవలసి వస్తుంది. ఎందుకు?
 జవాబు:
 శీతాకాలంలో పరిసరాల ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట వలన, శరీరం నుండి నీటి నష్టం తక్కువగా ఉంటుంది. కావున శరీరంలో మిగులు నీరు అధికంగా ఉండి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. కావున ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
ప్రశ్న 10.
 ఒకవేళ నీటి పునఃశోషణ జరగపోతే ఏం జరుగుతుంది?
 జవాబు:
 నీరు పునఃశోషణ జరగపోతే, అధిక నీరు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. ఇతర జీవక్రియల కోసం జీవి మరింత నీటిని తీసుకోవల్సి వస్తుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో జీవనం కష్టమౌతుంది. కావున జీవులు నీటి నష్టాన్ని తగ్గించటానికి నీటిని పునఃశోషణ చేస్తాయి.
10th Class Biology Textbook Page No. 89
ప్రశ్న 11.
 మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం ఏమైనా ఉందా?
 జవాబు:
 మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం మూత్రపిండ మార్పిడి దగ్గర సంబంధీకుల నుండి మూత్రపిండాన్ని తీసుకొని రోగి శరీరంలో అమర్చుతారు. ఈ ప్రక్రియను “మూత్రపిండ మార్పిడి” అంటారు.
ప్రశ్న 12.
 దాత నుండి సేకరించిన మూత్రపిండాన్ని రోగికి ఎక్కడ అమర్చుతారు?
 జవాబు:
 మూత్రపిండ మార్పిడిలో దాత నుండి సేకరించిన మూత్రపిండాన్ని నడుము క్రింది భాగాన అమర్చుతారు.
ప్రశ్న 13.
 పనిచేయని మూత్రపిండాన్ని ఏం చేస్తారు?
 జవాబు:
 పనిచేయని మూత్రపిండాన్ని శరీరంలో అలానే ఉంచుతారు. మూత్రపిండ మార్పిడిలో కొత్త మూత్రపిండాన్ని మూత్రాశయానికి కొంచెం పైగా అమర్చుతారు. పనిచేయని మూత్రపిండం సంక్రమణ (ఇన్ ఫెక్షన్)కు లోనైతే దానిని తొలగించవలసి ఉంటుంది.
ప్రశ్న 14.
 దాత ఒక మూత్రపిండంతోనే జీవించగలడా?
 జవాబు:
 రెండు మూత్రపిండాల పనిని ఒక మూత్రపిండం చేయగలదు. దీని కోసం మిగిలి ఉన్న మూత్రపిండం యొక్క పరిమాణం కూడా కొంచెం పెరుగుతుంది. అందువల్ల దాత ఒక మూత్రపిండంతోనే జీవించగలడు.
ప్రశ్న 15.
 మన శరీరంలో ఇంకా ఏ ఏ విసర్జకావయవాలు ఉన్నాయి?
 జవాబు:
 మన శరీరంలో మూత్రపిండాలతో పాటుగా, ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం, పెద్ద ప్రేగు వంటి విసర్జక అవయవాలు ఉన్నాయి.
10th Class Biology Textbook Page No. 90
ప్రశ్న 16.
 శీతల ప్రాంతాలలో నివసించే వారికి అతి తక్కువ చెమట వస్తుంది లేదా చెమట పట్టదు. దీని వలన వారి శరీరంలోని ఇతర విసర్జకావయవాలలో ఎలాంటి మార్పులు వస్తాయి?
 జవాబు:
 శీతల ప్రాంతాలలో ఉష్ణోగ్రత తక్కువ కావున చెమట తక్కువ పడుతుంది. కాబట్టి వీరిలో స్వేద గ్రంథుల క్రియాత్మకత తక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో శరీరం నుండి లవణాలను తొలగించటానికి మూత్రపిండాలు క్రియాత్మకంగా మెరుగుగా ఉంటాయి. చర్మం ద్వారా తొలగించాల్సిన లవణాలను మూత్రపిండాలు తొలగిస్తాయి.
10th Class Biology Textbook Page No. 91
ప్రశ్న 17.
 మొక్కలు కూడా జంతువులలాగే విసర్జిస్తాయా?
 జవాబు:
 జంతువులలో వలె మొక్కలలో కూడా విసర్జన క్రియ జరుగుతుంది. అయితే విసర్జించే ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. మొక్కలలో విసర్జనకు ప్రత్యేక అవయవాలు ఉండవు. వ్యర్థ పదార్థాల విచ్ఛిన్నం నెమ్మదిగా జరిగి, మొక్క దేహ భాగాలలో నెమ్మదిగా పోగవుతాయి.

ప్రశ్న 18.
 మొక్కలు వ్యర్థ పదార్థాలను ఏ విధంగా సర్దుబాటు చేస్తాయి లేదా బయటికి పంపిస్తాయి?
 జవాబు:
 మొక్కలు అధికంగా ఉన్న నీటిని భాష్పోత్సేకం (Transpiration) మరియు బిందుస్రావం (Guttation) ప్రక్రియల ద్వారా బయటికి పంపుతాయి. వ్యర్థ పదార్థాలను ఆకులు, బెరడు మరియు పండ్లలో నిల్వచేసి, పక్వస్థితిలో వాటిని రాల్చటం ద్వారా వ్యర్థాలను తగ్గించుకుంటాయి. కొన్ని మొక్కలు పండ్లలో వ్యర్థాలను శిలాజకణాలు (Raphides) గా నిల్వ చేస్తుంటాయి. కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను స్వీయరక్షణకు ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకొంటాయి.
10th Class Biology Textbook Page No. 92
ప్రశ్న 19.
 మొక్కలు నిర్దిష్ట కాలవ్యవధిలో ఆకులు, బెరడును రాలుస్తూ ఉంటాయి. ఎందుచేత?
 జవాబు:
 మొక్కలు తమ వ్యర్థ పదార్థాలను ఆకులు, బెరడులలో నిల్వ చేస్తుంటాయి. కొంత కాలానికి వాటిలో వ్యర్థ పదార్థాలు అధికంగా పోగవుతాయి. అప్పుడు వాటిని రాల్చివేస్తాయి.
10th Class Biology Textbook Page No. 93
ప్రశ్న 20.
 మనకు హాని కలుగజేసే ఆల్కలాయిడ్లను చెప్పండి.
 జవాబు:
- నికోటిన్ అనే ఆల్కలాయిడ్ వలన ఊపిరితిత్తుల కాన్సర్, గొంతు కాన్సర్ వస్తుంది.
- బాధా నివారిణిగా ఉపయోగించే మార్ఫినను ఎక్కువగా ఉపయోగిస్తే మూత్రపిండాలు పాడైపోతాయి.
- పుప్పొడి రేణువులలో ఉండే నత్రజని పదార్థాల ద్వారా ‘అలర్జీ’ వస్తుంది.
10th Class Biology Textbook Page No. 94
ప్రశ్న 21.
 జట్రోపా మొక్కలలో ఏ భాగాన్ని జీవ ఇంధనం తయారీలో ఉపయోగిస్తారు?
 జవాబు:
 జట్రోపా మొక్క యొక్క కాయలను, విత్తనాలను జీవ ఇంధనం తయారీలో ఉపయోగిస్తున్నారు.
ప్రశ్న 22.
 మొక్క వేర్లు కూడా స్రవిస్తాయా?
 జవాబు:
 “బ్రుగ్మన్స్” అనే వృక్ష శాస్త్రవేత్త వేర్లు నేల నుండి లవణాలను పీల్చుకోవటమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోనికి స్రవిస్తుంటాయని కనుగొన్నాడు. కొన్నిసార్లు ఈ స్రావాలు బాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి.
ప్రశ్న 23.
 ఫలసాయం తగ్గడానికి, వేర్ల స్రావాలకు ఏమైనా సంబంధం ఉందా?
 జవాబు:
 వేర్లస్రావాలు నేలలో అయాన్ల గాఢతను పెంచి నేల లవణీయతను పెంచుతాయి. అందువలన పంట దిగుబడి తగ్గుతుంది.
ప్రశ్న 24.
 మన ఇంట్లో కుండీల్లోని మొక్కల్ని మార్చేటపుడు వేర్ల నుండి ప్రత్యేకమైన వాసనలు వస్తుంటాయి. ఎందుకు?
 జవాబు:
 వేర్ల స్రావాలు నేలలోనికి విడుదలవుతుంటాయి. ఈ స్రావాలు మొక్కలను పెకిలించినపుడు వెలుపలికి వచ్చి వాసనను కలిగిస్తుంటాయి.
ప్రశ్న 25.
 కణాలన్నింటికి విసర్జన క్రియ అవసరమా?
 జవాబు:
 జీవంతో ఉన్న అన్ని కణాలు జీవక్రియను నిర్వహిస్తుంటాయి. ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి కావున కణాలన్నీ విసర్జన క్రియ జరుపుతాయి.
ప్రశ్న 26.
 వైద్యులు తగినన్ని నీళ్ళు త్రాగడం మంచిదని సూచిస్తుంటారు. ఎందుకు?
 జవాబు:
 జీవక్రియలు జరగటానికి నీరు అత్యవసరం. తగినంత నీరు లేకుంటే కణాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తొలగించ లేము. అందువలన వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మూత్ర సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. కావున వైద్యులు తగినన్ని నీళ్ళు తాగడం మంచిదని సూచిస్తుంటారు.

ప్రశ్న 27.
 కొంతమంది పిల్లలు 15 లేదా 16 సంవత్సరాలు వచ్చేవరకు కూడా రాత్రిపూట నిద్రలో పక్క తడుపుతుంటారు. ఎందుకు?
 జవాబు:
 మూత్ర విసర్జన ప్రసేకం ప్రారంభంలో ఉన్న సంవరణీ కండరంచే నియంత్రించబడుతుంది. మొదట ఈ కండరం అనియంత్రితంగా వ్యవహరించినప్పటికి, పిల్లలు పెరిగే కొలది అదుపులోనికి వస్తుంది. కానీ కొంతమంది పిల్లలలో ఈ సంవరణీ కండరం నియంత్రణ లేకపోవుట వలన 15 లేదా 16 సంవత్సరాల వరకు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటారు.
ప్రశ్న 28.
 కలుపు మొక్కలు, కొన్ని అటవీ మొక్కలకు కీటకాలు, చీడపురుగులు ఎందువలన హాని చేయలేవు?
 జవాబు:
 కలుపు మొక్కలు, అటవీ మొక్కలు వ్యర్థ పదార్థాలను ఆకులు, కాండాలలో నిల్వ చేసుకొంటాయి. ఇవి చేదుగా ఉండి కీటకాలకు, చీడపురుగులకు రుచించదు. అందువలన ఇవి కలుపు మొక్కలు, అటవీ మొక్కలకు హాని చేయలేవు.
10th Class Biology 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1

 పట్టికలో సూచించిన వివిధ జీవ ప్రక్రియలలో ఏర్పడే వివిధ ఉత్పన్నాలేమిటో చర్చించి పట్టికలో రాయండి.
 జవాబు:
| జీవక్రియలు | ఉత్పన్నాలు | 
| కిరణజన్యసంయోగక్రియ | కార్బోహైడ్రేట్స్, O2, H2O | 
| శ్వాసక్రియ | CO2, H2O, శక్తి | 
| జీర్ణక్రియ | మలము, లవణాలు | 
కృత్యం – 2
డిపార్టుమెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ
 స్పెసిమన్ : ప్లాస్మా / సీరం (రక్తం పరీక్ష రిపోర్టు)
 
మి.మోల్స్ /లీ = మిల్లీమోల్స్ / లీటరు, మి.గ్రా/డె.లీ. = మిల్లీగ్రామ్ / డెసిలీటరు
 స్పెసిమన్ : మూత్రం పరీక్ష రిపోర్టు
 
 24 గంటల మూత్రపరీక్ష అనగా ఒక వ్యక్తి నుండి 24 గంటలలో సేకరించిన మొత్తం మూత్రంలో నుండి 100-150మి.లీ. మూత్రం నమూనాగా తీసుకొని దానిని పరీక్ష చేస్తారు.
 1) రక్తంలో ఉన్న పదార్థాలు ఏవి?
 జవాబు:
 రక్తంలో గ్లూకోజ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, యూరియా వంటి పదార్థాలు ఉన్నాయి.
2) మూత్రంలో ఉన్న పదార్థాలు ఏవి?
 జవాబు:
 మూత్రంలో యూరియా, యూరికామ్లం, ప్రోటీన్స్, సోడియం, పొటాషియం వంటి లవణాలు ఉన్నాయి.
3) రక్తం మరియు మూత్రం రెండింటిలోనూ ఉన్న పదార్థాలేమిటి?
 జవాబు:
 రక్తం, మూత్రపిండం రెండింటిలోనూ ప్రోటీన్స్, క్రియాటిన్, యూరికామ్లం, గ్లూకోజ్, సోడియం, పొటాషియం వంటి లవణాలు, యూరియా, యూరికామ్లం వంటి వ్యర్థాలు ఉన్నాయి.
4) చాలా పదార్థాలు రక్తం, మూత్రం రెండింటిలోనూ ఉన్నాయి. ఎందుకు?
 జవాబు:
 మూత్రం రక్తం వడపోత వలన ఏర్పడుతుంది. రక్తంలోని పదార్థాలను తొలగించటం వలన మూత్రం ఏర్పడుతుంది. కావున మూత్రంలోని పదార్థాలు రక్తంలోను కనిపిస్తాయి.
5) రక్తం మరియు మూత్రంలో సాధారణ స్థాయిని మించి ఉన్న పదార్థాలేమిటి?
 జవాబు:
 కాల్షియం, యూరికామ్లం, యూరియా వంటి పదార్థాలు మూత్రంలోనూ, క్రియాటినిన్, యూరికామ్లం, కొలెస్ట్రాల్, ప్రోటీన్లు వంటి పదార్థాలు రక్తంలో స్థాయిని మించి ఉన్నాయి.
6) ఏవేని పదార్థాలు సాధారణ స్థాయిని మించి ఉంటే ఏం జరుగుతుంది?
 జవాబు:
 స్థాయికి మించి ఉన్న పదార్థాలు హానికరంగా తయారవుతాయి.
7) ఏయే పదార్థాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరమున్నదో పేర్కొనండి.
 జవాబు:
 యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్ లవణాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరం ఉంది.
ప్రయోగశాల కృత్యం
ఉద్దేశం :
 మూత్రపిండం బాహ్య మరియు అంతర లక్షణాలను అధ్యయనం చేయుట.
కావాల్సిన పదార్థాలు :
 మాంసం కొట్టులో సేకరించిన మేక లేదా గొర్రె మూత్రపిండం లేదా మూత్రపిండ 3D నమూనా, పదునైన బ్లేడ్, ట్రే మరియు నీళ్ళు.
పరిశీలనా విధానం :
 మేక లేదా గొర్రె మూత్రపిండాన్ని సేకరించి, రక్తమంతా పోయేలా నీటితో శుభ్రంగా కడగాలి. పూర్తిగా ఆరిన తర్వాత దానిని ఒక ట్రేలో పెట్టి జాగ్రత్తగా పరిశీలించండి. నోట్ బుక్ లో మీ పరిశీలనలు నమోదుచేయండి. ఒక పదునైన బ్లేడు లేదా స్కాల్ షెల్ సాయంతో మూత్రపిండాన్ని నిలువుగా జాగ్రత్తగా కోసి, అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించండి. ఇందుకోసం మీ ఉపాధ్యాయుని సహకారం తీసుకోండి. పరిశీలించిన దాని పటం గీయండి. మీరు గీసిన పటాన్ని పటం – 1, 2 లతో పోల్చండి.
 
1) మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉన్నాయి?
 జవాబు:
 మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి.
2) ఏ రంగులో ఉన్నాయి?
 జవాబు:
 ఇవి ముదురు ఎరుపు రంగులో ఉన్నాయి.
3) మూత్రపిండం పై భాగంలో అతుక్కొని ఏవైనా నిర్మాణాలు ఉన్నాయా?
 జవాబు:
 పైన అధివృక్క గ్రంథి అతుక్కొని ఉంది.
4) మూత్రపిండాల లోపలి నిర్మాణం పటం – 2 మాదిరిగానే ఉందా?
 జవాబు:
 మూత్రపిండాల లోపలిభాగం పటంలో చూపిన మాదిరిగానే వెలుపలివైపు ముదురు రంగులోనూ, లోపలివైపు లేత రంగులోనూ ఉంది.
5) మూత్రపిండం అడ్డుకోతలో బయటిభాగం ఏ రంగులో ఉంది?
 జవాబు:
 మూత్రపిండం బయటిభాగం ముదురు ఎరుపు రంగులో ఉంది. దీనిని “వల్కలం” అంటారు.
6) ముదురు ఎరుపురంగు భాగం ఎక్కడ ఉంది?
 జవాబు:
 ముదురు ఎరుపురంగు భాగం మూత్రపిండం బయటి వైపున ఉంది.
7) మూత్రపిండాల గుంటభాగం (హైలస్) నుండి ఎన్ని నాళాలు బహిర్గతమవుతున్నాయి?
 జవాబు:
 మూత్రపిండాల గుంటభాగం నుండి వృక్కసిర, మూత్రనాళం బయటకు వచ్చాయి.
కింది ఖాళీలను పూరించండి
1. వానపాములోని విసర్జక అవయవాలు ……….. (వృక్కాలు (నెఫ్రీడియా)
 2. మూత్రపిండం అడ్డుకోతలోని ముదురు గోధుమవర్ణపు భాగాన్ని …………. అంటారు. (వల్కలం)
 3. జీవుల్లోని నీటి ప్రమాణం, అయాన్ల గాఢతను క్రమబద్ధీకరించడాన్ని …………. అంటారు. (ద్రవాభిసరణ)
 4. నెఫ్రాన్లో ఉపయోగకరమైన పదార్థాల పునఃశోషణం ………….. జరుగుతుంది. (సమీపస్థ సంవళిత నాళం ద్వారా)
 5. జిగురు మరియు రెసిన్లు ……………………….. పదార్థాలు. (ద్వితీయ ఉత్పాదక)
 6. బొమన్ గుళిక మరియు రక్తకేశనాళికాగుచ్ఛాన్ని కలిపి …………………………. అంటారు. (నెఫ్రాన్)
 7. మలేరియా నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ …………………… (క్వి నైన్)
 8. డయాలసిలో ఇమిడి ఉన్న సూత్రం ……………. (ద్రవాభిసరణ)
 9. రబ్బరును రబ్బరు మొక్క యొక్క ……………………….. నుండి తయారుచేస్తారు. (లేటెక్స్)
 10. మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేసిన వైద్యుడు . ………. (చార్లెస్ హఫీ గెల్)
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. మానవుని మూత్రపిండంలోని నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ……….
 A) న్యూరాన్
 B) నెఫ్రాన్
 C) నెఫ్రీడియా
 D) జ్వాలాకణం
 జవాబు:
 B) నెఫ్రాన్
2. బొద్దింకలో విసర్జకావయవాలు …………………
 A) మాల్ఫీజియన్ నాళికలు
 B) రాఫైడ్స్
 C) మూత్రనాళాలు
 D) జ్వాలాకణం
 జవాబు:
 A) మాల్ఫీజియన్ నాళికలు
3. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం
 i) మూత్రపిండాలు ii) మూత్రనాళాలు iii) ప్రసేకం iv) మూత్రాశయం
 A) i, ii, iv, iii
 B) i, ii, iii, iv
 C) iv, iii, i, ii
 D) ii, iii, i, iv
 జవాబు:
 A) i, ii, iv, iii

4. మాల్ఫీజియన్ నాళికలు ఏ జీవిలో విసర్జకావయవాలు?
 A) వానపాము
 B) ఈగ
 C) బద్దెపురుగు
 D) కోడి
 జవాబు:
 B) ఈగ
5. మానవ మూత్రంలోని ప్రధాన వ్యర్థం ఏది?
 A) యూరియా
 B) సోడియం
 C) నీరు
 D) క్రియాటినిన్
 జవాబు:
 C) నీరు
6. ఏ జీవిలో ప్రత్యేక విసర్జకావయవాలు ఉండవు?
 A) పక్షులు
 B) అమీబా
 C) స్పంజికలు
 D) A మరియు B
 జవాబు:
 B) అమీబా
7. ఈ కింది వానిలో ఏ హార్మోను మూత్రవిసర్జనతో ప్రత్యక్ష సంబంధం ఉంది?
 A) ఎడ్రినలిన్
 B) వాసోప్రెస్సిన్
 C) ప్రొజెస్టిరాన్
 D) ఈస్ట్రోజన్
 జవాబు:
 B) వాసోప్రెస్సిన్
8. మూత్రం పసుపురంగులో ఉండుటకు కారణం ఏమిటి?
 A) యూరోక్రోమ్
 B) బైలిరూబిన్
 C) బైలివర్జిన్
 D) క్లోరైడ్స్
 జవాబు:
 A) యూరోక్రోమ్
9. మూత్రం ఏర్పడే దశల క్రమం
 A) వరణాత్మక పునఃశోషణం → గుచ్ఛగాలనం → నాళికాస్రావం
 B) గుచ్ఛగాలనం → వరణాత్మక పునఃశోషణం → నాళికాస్రావం
 C) వరణాత్మక పునఃశోషణం → నాళికాస్రావం → గుచ్ఛగాలనం
 D) నాళికాస్రావం → వరణాత్మక పునఃశోషణం → గుచ్ఛగాలనం
 జవాబు:
 B) గుచ్ఛగాలనం → వరణాత్మక పునఃశోషణం → నాళికాస్రావం
10. మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం
 A) హె శిక్యం
 B) సమీపస్థ సంవళితనాళం
 C) దూరస్థ సంవళితనాళం
 D) బొమన్ గుళిక
 జవాబు:
 D) బొమన్ గుళిక

11. ఆహారం తిన్న తరువాత మూత్ర విసర్జన చేయాలన్న భావన ఎందుకు కలుగుతుంది?
 A) మూత్రాశయంపై జీర్ణాశయ పీడనం
 B) ఘనపదార్థాలు ద్రవ పదార్థాలుగా మారడం
 C) ఆహారంలోని నీటి పరిమాణం
 D) స్పింక్టర్ కండరాల కదలిక
 జవాబు:
 C) ఆహారంలోని నీటి పరిమాణం
