These AP 6th Class Social Important Questions 12th Lesson సమానత్వం వైపు will help students prepare well for the exams.
AP Board 6th Class Social 12th Lesson Important Questions and Answers సమానత్వం వైపు
ప్రశ్న 1.
 వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది?
 జవాబు:
 వైవిధ్యం ఎలా ఏర్పడుతుందంటే :
- భారతదేశం అనేక భిన్నత్వాలు కలిగిన దేశం. మనం అనేక భాషలు మాట్లాడతాం. వివిధ రకాల ఆహారం తీసుకుంటాం. రక రకాల పండుగలు జరుపుకుంటాం. భిన్న మతాలను ఆచరిస్తాం.
- అనేక వందల సంవత్సరాల క్రితం – ప్రజలు స్థిరనివాసం కొరకు, వ్యాపారం చేయుటకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేశారు.
- తరుచుగా వారు వారి కొత్త ప్రాంతాలలో స్థిరపడటం ప్రారంభించారు. దీని ఫలితంగా పాత, కొత్త సంస్కృతుల కలయిక వలన ఈ ప్రాంతాలు భిన్నత్వం కలిగిన ప్రాంతాలుగా మారాయి.
- అదే విధంగా ప్రజలు వారు నివసించే భౌగోళిక ప్రాంతానికి అనుగుణంగా వారి జీవన విధానాలను మార్చు కున్నప్పుడు కూడా భిన్నత్వం ఏర్పడుతుంది.
- ఉదాహరణకు సముద్ర తీరంలోని జీవనశైలి ఎడారి ప్రాంత జీవనశైలికి భిన్నంగా ఉంటుంది.
- అదే విధంగా వారి పని రకం కూడా ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది.
ప్రశ్న 2.
 వివక్షత ఎలా ఏర్పడుతుంది?
 జవాబు:
 వివక్షత ఎలా ఏర్పడుతుందంటే :
- భారతదేశ వైవిధ్యాలతో కూడిన దేశం కానీ అన్ని వైవిధ్యాలకు తగిన ప్రాధాన్యత లభించటం లేదు.
- మనం మనలాగే కనిపించే, మాట్లాడే దుస్తులు ధరించే, ఆలోచించే వ్యక్తులతో సురక్షితంగా, భద్రంగా ఉన్నట్లు భావిస్తాం.
  
- మనం మనకు పరిచయం లేని కొత్త వ్యక్తులను చూసినపుడు వారిని అర్థం చేసుకోకుండానే వారి మీద కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలను ఏర్పరుచుకుంటాం.
- ఇలా ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను, పక్షపాత ధోరణిని అవలంబించడం వలన వివక్షత ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
 కుల వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? కుల వివక్షత అంటే ఏమిటి?
 జవాబు:
 కుల వ్యవస్థ ఎలా ఏర్పడిందంటే :
- ప్రజలు జీవనోపాధి కొరకు బోధన, వడ్రంగి, కుమ్మరి, నేతపని, చేపలు పట్టుట, వ్యవసాయం వంటి వివిధ రకాల వృత్తులను చేపట్టారు.
- కొన్ని రకాల వృత్తులకు మాత్రమే ఎక్కువ గౌరవం లభించేది.
- శుభ్రపరచడం, చెత్తను పోగు చేయుట వంటి పనులు తక్కువ విలువ కలిగినవిగాను, ఆ వృత్తులు చేసే వ్యక్తులను దూరంగా ఉంచడం వంటివి చేసేవారు.
- ఈ నమ్మకమే కులవ్యవస్థకు పునాది.
కుల వివక్షత అంటే:
- కుల వ్యవస్థలో కొన్ని వర్గాలు లేదా సమూహాలు’ పై స్థాయిలో లేక కింది స్థాయిలో ఉంచబడ్డాయి.
- పై స్థాయిలో ఉంచబడినవారు ఉన్నత కులాలుగాను తమను తాము అగ్ర కులాలుగాను ఉన్నతులుగాను భావించేవారు.
- కింది స్థాయిలో ఉంచబడిన వారిని అనర్హులుగా, అణగారినవారిగాను పరిగణించారు.
- అణగారినవారిగా పరిగణింపబడే వీరికి కేటాయింపబడిన వృత్తి తప్ప వేరే వృత్తి చేపట్టడానికి అనుమతి లేకుండా కులనియమాలు విధించబడ్డాయి.
- అగ్రకులాల వారు అనుభవించే హక్కులు నిమ్న కులాల వారిని అనుభవించనీయకపోవడమే కుల వివక్షత.
ప్రశ్న 4.
 స్త్రీ హక్కుల కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు ఏవి?
 జవాబు:
 
- జనాభాలో సగభాగం స్త్రీలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశాలు కల్పించబడలేదు.
- పుట్టుక రీత్యా స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులే కాబట్టి వారిద్దరికీ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక హక్కులు ఉంటాయి.
- పలువురు సంఘసంస్కర్తలు స్త్రీ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పోరాడారు. అలా పోరాడిన వారిలో సావిత్రీబాయి ఫూలే ఒకరు.
- ఆమె మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావాది, కవయిత్రి. ఆమె భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయినిగా కీర్తించబడ్డారు.
- బ్రిటీష్ వారి పరిపాలనలో ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలే తో కలిసి భారతదేశంలో స్త్రీ హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.
- ఆమెను “భారతీయ స్త్రీ వాద మాతా మహి” అని కీర్తిస్తారు.
- ఫూలే తన భర్తతో కలిసి పూనెలోని భిడేవాడలో భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు.
- కుల, లింగ వివక్షత వలన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు.
ప్రశ్న 5.
 ప్రాంతీయ వివక్షత అనగా నేమి?
 జవాబు:
 
 ప్రాంతీయ వివక్షత అనగా :
 ఇది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మ స్థలం ఆధారంగా ఈ చూపే వివక్షత. ఉదాహరణకు గ్రామాల పట్ల పట్టణాలు, చిన్న పట్టణాల పట్ల పెద్ద నగరాలు, గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు చూపే వివక్ష. ఇది పక్షపాతం లేదా మూసధోరణి కారణంగా మొదలవుతుంది.
ప్రశ్న 6.
 దివ్యాంగుల పట్ల వివక్షత అని దేనిని భావిస్తారు?
 జవాబు:
 PWD చట్టం – 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు. వారిలో కొందరు పుట్టుకతో లేదా ప్రమాదాలలో శరీర భాగాలను కోల్పోవచ్చు. కొంతమంది వారిని అగౌరవం లేదా అవమానం పాలు చేస్తారు. ఇలాంటి వాటిని దివ్యాంగుల పట్ల వివక్షతగా భావిస్తాం.
 
ప్రశ్న 7.
 భారతదేశంలో అసమానతలకు గల మూలకారణాలేమిటి?
 జవాబు:
 
 ఈ అసమానతలు, వివక్షతలకు మూల కారణాలు :
- అవిద్య
- అధికారం
- నమ్మకాలు
- వృత్తులు
- సంపద
- సంప్రదాయాలు మన సమాజంలో ఈ అసమానతలను, వివక్షను సృష్టించాయి.
ప్రశ్న 8.
 అసమానత (వివక్షత)ల ఫలితాలను పేర్కొనండి.
 జవాబు:
 అసమానతల ఫలితాలు :
- అసమానతలు దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తాయి.
- అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తాయి.
- అసమానతలు ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి.
- ఇది నేరాల పెరుగుదలకు, వ్యాధుల విస్తరణకు, పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది.
- సుస్థిర అభివృద్ధిని సాధించలేం.
- ప్రపంచ వ్యాప్తంగా కొందరు వ్యక్తుల సామర్థ్యాలు వెలుగులోకి రాకుండానే ఉండిపోతాయి.
ప్రశ్న 9.
 సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందు పరిచిన అంశాలు ఏవి?
 జవాబు:
 సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు :
- 14వ నిబంధన : చట్టం ముందు అందరూ సమానం.
- 15(1)వ నిబంధన : మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు.
- 16వ నిబంధన : ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమానావకాశాలు.
- 17వ నిబంధన : అంటరానితనాన్ని పాటించడం నిషేధం. దీన్ని పాటించినవారు చట్ట ప్రకారం శిక్షించబడతారు.
 అణచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేటందుకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.
- 21(ఎ) నిబంధన : 6-14 వయసులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రభుత్వం చట్టం ద్వారా మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు విధాలుగా సమానత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది.
ప్రశ్న 10.
 అసమానతలు, వివక్షతలూ లక్ష్యసాధనను అడ్డుకుంటాయా? ఒక ప్రముఖ వ్యక్తిని ఆధారంగా తీసుకుని (ఏ.పి.జే అబ్దుల్ కలాం) వివరించండి.
 జవాబు:
 
 డా|| ఏ.పి.జె. అబ్దుల్ కలాం : డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం భారతదేశపు 11వ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త మరియు గొప్ప రచయిత. ఒక పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ, జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన రాసిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్” అన్న పుస్తకంలో ఇలా అంటాడు. “మనమందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాం. ఈ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచమంతటినీ ఆ మంచితనపు వెలుగులతో నింపడానికి మనం ప్రయత్నించాలి” ఆయన ఇంకా ఇలా అంటారు “మనకందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి ఏ.పి.జె. అబుల్ కలాం చేసుకోవడానికి అందరమూ సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం”.
ప్రశ్న 11.
 క్రింది వారి గురించి నీకేమి తెలుసో వివరించండి.
 1) డా॥ ఆనందీబాయి జోషి 2) డా|| నెల్సన్ మండేలా
 జవాబు:
 1) డా|| ఆనందీబాయి జోషి :
 భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. తన మగబిడ్డ పుట్టిన పదిరోజులకే వైద్యం అందక మరణించాడు. ఈ విషాదం తనను వైద్యవిద్య చదివేలా ప్రేరేపించింది. 1886లో వైద్యురాలిగా పట్టా అందుకున్నారు. భారతదేశానికి తిరిగివస్తూండగా ఆమె క్షయ వ్యాధికి గురయ్యారు. 1887లో పూనెలో మరణించారు.
 
2) డా|| నెల్సన్ మండేలా :
 దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడైన నెల్సన్ మండేలా 27 సంవత్సరాల జైలు జీవితం తర్వాత 1990లో విడుదలయ్యారు. జాతివివక్ష విధానానికి విజయవంతంగా ముగింపు పలికారు. జాతిపరంగా విభజితమై ఉన్న దేశంలో శాంతిని నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1990లో భారతరత్న అవార్డును స్వీకరించారు. ఆయనను “దక్షిణాఫ్రికా గాంధీ” అని పిలుస్తారు.
 
