These AP 6th Class Telugu Important Questions 5th Lesson మన మహనీయులు will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 5th Lesson Important Questions and Answers మన మహనీయులు
6th Class Telugu 5th Lesson మన మహనీయులు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు
1. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి (ప్రస్తుతం ప్రకాశంజిల్లా) ప్రాంతీయులు. వ్యాపారరీత్యా మద్రాసు (చెన్నై) లో స్థిరపడ్డారు. శ్రీరాములుగారు గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16. 3. 1901 న జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేసారు. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకొన్నారు. బొంబాయిలో అసిస్టెంటు ప్లంబర్ గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. విశ్రాంతివేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు. పేదవారి కష్టాల్లో పాలుపంచుకొనేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యారు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించాయి.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) పొట్టి శ్రీరాములు గారి పూర్వీకులు ఎక్కడ ఉండేవారు?
 జవాబు:
 పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా), కనిగిరి ప్రాంతంలో ఉండేవారు.
ఆ) శ్రీరాములు గారి తల్లిదండ్రులు ఎవరు?
 జవాబు:
 శ్రీరాములు గారి తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి గురవయ్య.
ఇ) శ్రీరాములు గారు ఎక్కడ, ఏ ఉద్యోగం చేశారు?
 జవాబు:
 శ్రీరాములు గారు బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్ గా ఉద్యోగం చేశారు.
ఈ) శ్రీరాములు గారు స్వాతంత్ర్యోద్యమం వైపు ఎందుకు నడిచారు?
 జవాబు:
 గాంధీజీ బోధనలకు ఆకర్షితులై శ్రీరాములుగారు స్వాతంత్ర్యోద్యమం వైపు నడిచారు.

2. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. మూడుగంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా, తెలుపురంగు శాంతికి, సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి, నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) 1921వ సంవత్సరం అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి?
 జవాబు:
 1921లో అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలు విజయవాడలో జరిగాయి.
ఆ) జాతీయ జెండాలో కాషాయం రంగు దేనికి గుర్తు?
 జవాబు:
 జాతీయ జెండాలో కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి గుర్తు.
ఇ) జాతీయ జెండాలో తెలుపురంగు దేనికి గుర్తు?
 జవాబు:
 జాతీయ జెండాలో తెలుపు రంగు శాంతికి, సత్యానికి గుర్తు.
ఈ) పతాకం మధ్య రాట్నం స్థానంలో తరువాత దేనిని చేర్చారు?
 జవాబు:
 పతాకం మధ్య రాట్నం స్థానంలో తరువాత అశోక చక్రం చేర్చారు.
3. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య, రాంబాయమ్మలకు జన్మించారు. బాల్యంలోనే తన తల్లి రామాయణ, మహాభారతాలు చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్టణంలో ట్రెజరి అధికారిగా పనిచేశారు. పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టిచాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాసారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాసారు. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు చేశారు.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) వెంకట సుబ్బారావు ఎక్కడ జన్మించారు?
 జవాబు:
 వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో జన్మించారు.
ఆ) సుబ్బారావు గారి తల్లిదండ్రులు ఎవరు?
 జవాబు:
 సుబ్బారావు గారి తల్లి రాంబాయమ్మ, తండ్రి వెంకటరామయ్య.
ఇ) సుబ్బారావు గారు వ్రాసిన పద్య కావ్యాలు ఏవి?
 జవాబు:
 సుబ్బారావు గారు దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు.
ఈ) సుబ్బారావు గారు రాసిన నాటకాలు ఏవి?
 జవాబు:
 సుబ్బారావు గారు గృహస్త జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు.

4. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
సుందరాచారి చిత్తూరు జిల్లా, తిరుపతిలో 1914 ఆగష్టు 10న జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో, మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేసారు. ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా, పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేశారు. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వం, కావేటి నగరరాజ నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత వంటి ఎన్నో రచనలు చేసారు. సినిమా పాటలు రాసారు.
 ప్రశ్నలు – జవాబులు:
 అ) సుందరాచారి ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
 జవాబు:
 సుందరాచారి చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగష్టు 10వ తేదీన జన్మించారు.
ఆ) సుందరాచారి ఎక్కడ చదువుకున్నారు?
 జవాబు:
 సుందరాచారి తిరుపతి దేవస్థానం పాఠశాలలో, మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలోను చదువుకున్నారు.
ఇ) సుందరాచారి చేసిన ఉద్యోగాలేవి?
 జవాబు:
 సుందరాచారి ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకునిగా, పాఠశాలల పర్యవేక్షకునిగా ఉద్యోగాలు చేశారు.
ఈ) సుందరాచారి రచనలు నాల్గింటిని తెల్పండి.
 జవాబు:
 సుందరాచారి సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు మొదలైన రచనలు చేశారు.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
 పొట్టి శ్రీరాములుగారి గురించి వ్రాయండి.
 జవాబు:
 పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి (ప్రస్తుతం ప్రకాశం జిల్లా) ప్రాంతీయులు. వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములుగారి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, గురవయ్య దంపతులు. ఆయన మద్రాసులో 16-03-1901న జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాలలో చదువుకొన్నారు. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంటు ప్లంబరుగా ఉద్యోగంలో చేరారు. అక్కడే నివాసం ఉన్నారు. ఇతరుల కోసం ఏదోఒకటి చేయాలని తపించేవారు.

ప్రశ్న 2.
 పొట్టి శ్రీరాములుగారు ఉద్యోగం ఎందుకు వదిలేసారు? తరువాత ఏమి చేసారో వివరించండి.
 జవాబు:
 పొట్టి శ్రీరాములుగారు గాంధీజీ బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆ బోధనలే ఆయనను భారత స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించాయి. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతీ ఆశ్రమంలో చేరారు. సత్యాగ్రహంలో చేరారు. జైలుశిక్ష అనుభవించారు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలూ, సమావేశాలూ, తీర్మానాలూ జరగడాన్ని గమనించారు. ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రశ్న 3.
 జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య అని ఎలా చెప్పగలవు?
 జవాబు:
 1906లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అక్కడ బ్రిటిష్ జెండా ఎగురవేసారు. అది పింగళి వెంకయ్యగారికి నచ్చలేదు. 1921 లో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని మహాత్మాగాంధీ అడిగారు. మూడు గంటలలో జాతీయ జెండాను వెంకయ్యగారు రూపొందించారు. అదే మన త్రివర్ణ పతాకం. పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోకుని ధర్మచక్రం చేర్చారు. ఈ విధంగా మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడు కావడం మన అందరికీ గర్వకారణం.
ప్రశ్న 4.
 జాతీయ ప్రతిజ్ఞను ఎవరు తయారు చేసారు? ఆయన గురించి వ్రాయండి.
 జవాబు:
 ప్రతీ పాఠశాలలోను భారతదేశము నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ విద్యార్థులందరిచేత చెప్పిస్తారు. దీనిని పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు రచించారు. 1962లో భారత్-చైనా యుద్ధం ముగిసిన తరువాత దీనిని రచించారు. 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞను చేర్చారు. పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు నల్గొండ జిల్లాలో అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. రాంబాయమ్మ, వెంకటరామయ్యలు వీరి తల్లిదండ్రులు. 1962లో విశాఖ పట్టణంలో ట్రెజరీ అధికారిగా పనిచేసారు. అనేక పద్యకావ్యాలు, కథలు, నాటకాలు రచించారు.

ప్రశ్న 5.
 శంకరంబాడి సుందరాచారిగారి గురించి వ్రాయండి.
 జవాబు:
 శంకరంబాడి సుందరాచారిగారు తిరుపతిలో జన్మించారు. 1914 ఆగష్టు 10న ఆయన జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లిలో విద్యాభ్యాసం చేసారు. ఉపాధ్యాయుడుగా పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేసారు. ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా పనిచేసారు. సుందర రామాయణం, సుందర భాగవతం మొదలైనవి రచించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థుల కోసం తొలిసారిగా పాడారు. ఆయన సినిమా పాటలు కూడా రచించారు.
