These AP 6th Class Telugu Important Questions 9th Lesson ధర్మ నిర్ణయం will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 9th Lesson Important Questions and Answers ధర్మ నిర్ణయం
6th Class Telugu 9th Lesson ధర్మ నిర్ణయం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు
1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
రథానికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరుగిడుతున్నాయి. మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం. ఆ రథచక్రాల కిందపడి ఒక యువకుడు అసువులు బాశాడు. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియచేసారు. ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని తల్లి, కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది. ఈలోపు సూర్యుడు అస్తమించాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) గుర్రాలు ఏ వేగంతో పరుగెడుతున్నాయి?
జవాబు:
గుర్రాలు వాయువేగంతో పరుగిడుతున్నాయి.
ఆ) యువకుడు ఎందుకు మరణించాడు?
జవాబు:
యువకుడు రథచక్రాల కింద పడడం వల్ల మరణించాడు.
ఇ) మెరుపు వేగంతో వెళ్ళింది ఏది?
జవాబు:
మెరుపు వేగంతో వెళ్ళింది రథం.
ఈ) తల్లి గుండె ఎందుకు పగిలింది?
జవాబు:
కొడుకు ఆకస్మిక మరణానికి తల్లి గుండె పగిలింది.
2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. నగరవీధిలో పసివారుంటారు, నిస్సహాయులెందరో. ఉంటారు. మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధులలోకి పోకూడదు.
ప్రాణాపాయం కలుగుతుంది. యువరాజు ఎక్కిన రధం వేగానికి ఒక ప్రాణం బలి అయింది. మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు. న్యాయశాసనాలకు రాజకుమారుడని కాని, సామాన్యుడని కాని భేదముండదు. ఇక్కడ బంధుప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు. తీర్పు వింటున్నంత సేపూ మహారాజు ముఖం ప్రశాంతంగానే ఉంది. మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది. సభ చాలించాడు. సింహాసనం దిగాడు. సింహాసనంపై ఉన్నంతసేపూ గంభీరంగా ఉన్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) నగరవీధుల్లో ఎవరెవరు ఉంటారని న్యాయమూర్తులు అన్నారు?
జవాబు:
నగర వీధుల్లో పసివారు, నిస్సహాయులెందరో ఉంటారని న్యాయమూర్తులు అన్నారు.
ఆ) రాకుమారునికి న్యాయమూర్తులు ఏ శిక్ష విధించారు?
జవాబు:
రాకుమారునికి న్యాయమూర్తులు మరణశిక్ష విధించారు.
ఇ) శాసనాలకు ఏ భేదం ఉండదు?
జవాబు:
న్యాయశాసనాలకు రాజకుమారుడని గాని, సామాన్యుడని గాని భేదం ఉండదు.
ఈ) తీర్పు విన్న మాధవవర్మ ఎలా ఉన్నాడు?
జవాబు:
తీర్పు వింటున్నంత సేపూ మాధవవర్మ ముఖం ప్రశాంతంగా, గంభీరంగా ఉంది.
3. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆ సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు. “ధర్మో రక్షతి రక్షితః” – ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవవర్మ పట్ల ప్రసన్నురాలైంది. ప్రభువు ధర్మ నిరతికి సంతోషపడింది. ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది.
జలజలా కురుస్తోంది.
గలగలా కురుస్తోంది. ఆశ్చర్యం !
ఘడియపాటు ఎడతెరపి లేకుండా విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది. బిలబిలమంటూ ప్రజలు వీధులలోనికి పరుగెత్తారు. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటినుంచి కనకదుర్గగా పిల్చుకుంటున్నారు ప్రజలు.
ప్రశ్నలు – జవాబులు:
అ) “ధర్మోరక్షతి రక్షితః” అనే సూక్తికి అర్థం ఏమిటి?
జవాబు:
ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది – అని ఈ సూక్తికి అర్థం.
ఆ) దుర్గాదేవి ఎందుకు ప్రసన్నురాలైంది?
జవాబు:
దుర్గాదేవి మాధవవర్మ ధర్మనిరతికి సంతోషపడి ప్రసన్నురాలైంది.
ఇ) కాసులవాన ఎలా కురిసింది?
జవాబు:
కాసులవాన జలజలా, గలగలా ఘడియపాటు కురిసింది.
ఈ) దుర్గాదేవిని కనకదుర్గగా ఎందుకు పిలుస్తున్నారు?
జవాబు:
విజయవాడలో ఘడియపాటు బంగారు కాసుల వాన కురిపించడం వలన దుర్గా దేవిని కనకదుర్గగా పిలుస్తున్నారు.
అపరిచిత గద్యాలు
1. కింది పేరా చదవండి. అడిగిన విధంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మానవుడు స్వేచ్ఛాజీవి. కొన్నాళ్ళు అన్నపానీయాలు లేకపోయినా తట్టుకోగలడేమో కానీ, స్వేచ్చ లేకపోతే భరించలేడు. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం అనే బలాలతో మానవజాతి నిరంతర ప్రగతిని సాధించింది. ఈనాడు మనం స్వేచ్ఛగా సుఖసంతోషాలతో హాయిగా జీవిస్తున్నామంటే, దానివెనుక మన పూర్వీకుల కృషి ఎంతైనా ఉంది. దాన్ని తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది. చరిత్రలో మన భారతీయుల కృషిని అధ్యయనం చేసినట్లయితే వెనుకటి తరాలవారి ముందుచూపు తెలుస్తుంది. వ్యక్తి ‘అశాశ్వతుడు, వ్యవస్థ శాశ్వతం.
ప్రశ్నలు – జవాబులు:
అ) మానవుడు ఏమి లేకపోతే తట్టుకోలేడు?
జవాబు:
మానవుడు స్వేచ్ఛ లేకపోతే తట్టుకోలేడు.
ఆ) పై పేరాకు శీర్షికను సూచించండి.
జవాబు:
పై పేరాకు ‘స్వేచ్ఛ’ అని శీర్షిక పెట్టవచ్చు.
ఇ) చరిత్రను అధ్యయనం చేస్తే ఏమి తెలుస్తుంది?
జవాబు:
చరిత్రను అధ్యయనం చేస్తే వెనుకటి తరాలవారి ముందుచూపు తెలుస్తుంది.
ఈ) పై గద్యాన్ని చదివి, ఏదైనా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
‘వ్యక్తి – వ్యవస్థ’ వీటిలో శాశ్వతమైనదేది?
2. కింది పేరా చదవండి. అడిగిన విధంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
రాయలసీమ రత్నం, తెలుగుజాతి గర్వించదగిన ఆణిముత్యం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
తెల్లదొరల పాలననుంచి మన దేశాన్ని విముక్తంచేసి స్వాతంత్ర్యం సాధించాలన్న గొప్ప తలంపుతో ఎందరో మహానుభావులు తమ సర్వస్వాన్ని ఒడ్డారు. అలాంటి త్యాగధనుల్లో అగ్రేసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దేశ స్వాతంత్ర్యం కొరకు ఆత్మార్పణ గావించిన వీరాధివీరుడు. తెల్లదొరలను గజగజలాడించిన పరాక్రమశాలి. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కరుణామయుడు. వీర, శాంత గుణాల కలగలుపే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
ప్రశ్నలు – జవాబులు:
అ) తెలుగుజాతి గర్వించదగిన ఆణిముత్యం ఎవరు?
జవాబు:
తెలుగుజాతి గర్వించదగిన ఆణిముత్యం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
ఆ) పై పేరాకు శీర్షికను సూచించండి.
జవాబు:
పై పేరాకు ‘వీరాధివీరుడు’ అని శీర్షిక పెట్టవచ్చు.
ఇ) ఏయే గుణాల కలగలుపే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి?
జవాబు:
వీర, శాంత గుణాల కలగలుపే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
ఈ) ఇవ్వబడిన గద్యాన్ని చదివి, ఏదైనా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ ప్రాంతం వాడు?
3. కింది పేరా చదవండి. అడిగిన విధంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తెల్లదొరల నిరంకుశపాలన మనుషులనే కాదు పశువులను కూడా క్రూరంగా హింసించింది. పశువులను అడవులలో పెరిగే గడ్డి మేపుకోవడానికి పన్ను చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. దీనిని పుల్లరి అంటారు. సహాయ నిరాకరణోద్యమ కాలంలో భూమి పన్నులు, పశువుల పుల్లరి చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన శాసనాన్ని ఎదిరించి పోరాడిన వీరుడు, సాహసి, దీక్షాపరుడు, కృషీవలుడు కన్నెగంటి హనుమంతు.
ప్రశ్నలు – జవాబులు:
అ) బ్రిటిష్ ప్రభుత్వం ఏమని చట్టం చేసింది?
జవాబు:
పశువులను అడవులలో పెరిగే గడ్డి మేపుకోవడానికి పన్ను చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది.
ఆ) ఈ పేరాకు శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పేరాకు ‘పుల్లరి’ అని శీర్షిక పెట్టవచ్చు.
ఇ) పశువుల పుల్లరి చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన శాసనాన్ని ఎదిరించి పోరాడిన వీరుడు ఎవరు?
జవాబు:
కన్నెగంటి హనుమంతు.
ఈ) ఇవ్వబడిన గద్యాన్ని చదివి, ఏదైనా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
తెల్లదొరల నిరంకుశపాలన ఎట్టిది?
4. క్రింది కరపత్రం చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
మనవాళ్ళే ప్రత్యేక అవసరాలున్నవాళ్ళు మనవాళ్ళే. వాళ్ళకి చేయూతనివ్వండి. వాళ్ళు వేగంగా అభివృద్ధి చెందేలా | ప్రోత్సహించండి. ధైర్యం చెప్పండి. సహాయం చేయండి. మన సమాజ అభివృద్ధిలో వారూ భాగస్వాములౌతారు. వాళ్ళూ మనవాళ్ళే. వాళ్ళూ మన సోదరులే. ఇట్లు, |
ప్రశ్నలు – జవాబులు:
అ) పై కరపత్రం ఎవరు విడుదల చేశారు?
జవాబు:
ప్రత్యేక అవసరాలున్నవారి ప్రోత్సాహక కమిటీవారు పై కరపత్రాన్ని విడుదల చేశారు.
ఆ) ప్రత్యేక అవసరాలున్నవారు దేనిలో భాగస్వాములు కావాలి?
జవాబు:
సమాజ అభివృద్ధిలో ప్రత్యేక అవసరాలున్నవారు భాగస్వాములు కావాలి.
ఇ) వాళ్ళూ మనవాళ్ళే అన్నారు కదా ! వాళ్ళెవరు?
జవాబు:
ప్రత్యేక అవసరాలున్న వాళ్ళు.
ఈ) పై కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై కరపత్రంలో ఎవరి గురించి చెప్పారు?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
‘అతివేగం ప్రమాదకరం’ అనే వాక్యాన్ని మీ పాఠం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
విజయవాడను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కొడుకు యువరాజు పదివేల బంగారు నాణేలతో అరేబియా దేశానికి చెందిన మేలుజాతి గుర్రాలను కొన్నాడు. ఆ గుర్రాలను కట్టిన రథంపై విహారానికి బయలుదేరాడు. అతనికి పట్టాభిషేకం జరగబోతోంది. ఒళ్ళు తెలియని ఉత్సాహంతో గుర్రాలను పరిగెత్తించాడు. కోటవీధిలో సాయంకాలం సమయంలో జనం – తిరుగుతున్నారు. అయినా పట్టించుకోలేదు. గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. రథం మెరుపువేగంతో దూసుకుపోతోంది. రథ చక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. ఆ యువకుని మరణానికి మితిమీరిన వేగంతో రథాన్ని నడపడమే కారణం. ఒళ్ళు తెలియని వేగం వలన అనవసరంగా ఒక యువకుడు బలైపోయాడు. దీన్ని విచారించిన మాధవవర్మ తన కుమారునికి కూడా మరణదండన విధించాడు. అందుచేత మితిమీరిన వేగం ఇతరులకు, తమకు కూడా ప్రమాదమని గుర్తించాలి.
ప్రశ్న 2.
వృద్ధురాలు మాధవవర్మతో మాట్లాడిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
మాధవవర్మ కుమారుని రథం క్రిందపడి వృద్ధురాలి కొడుకు మరణించాడు. ఆ మరణానికి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. మరునాడు ఉదయం రాజు కొలువులోకి ప్రవేశించింది. ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. రక్తంతో అట్టలు కట్టిన కొడుకు మృతదేహాన్ని రాజు ముందు ఉంచింది. తనకు ఒక్కడే కొడుకని రాజుకు చెప్పింది. తన కుటుంబానికి అతనే ఆధారమని వివరించింది. తన కుమారుని మరణానికి రాజకుమారుడే కారణమని చెప్పింది. ఏ దిక్కూలేని తనకు న్యాయం చేయమని ప్రార్థించింది. దీనిని బట్టి ఆ ముసలి తల్లి బాధ మాకు అర్థమయ్యింది.
ప్రశ్న 3.
ధర్మ నిర్ణయం ఎవరు చేశారు ? ఆ ధర్మ నిర్ణయం ఏమిటి?
జవాబు:
న్యాయమూర్తులు సుదీర్ఘంగా యువకుని మరణం గురించి విచారించారు. నగరవీధులలో పసిపిల్లలు, నిస్సహాయులు, సామాన్యులు చాలామంది తిరుగుతూ ఉంటారు. అటువంటి చోట మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాజ కుమారుడు వెళ్ళడం తప్పని తేల్చారు. వెళ్ళినా మితిమీరిన వేగంతో వెళ్ళటం చాలా తప్పని తేల్చారు. యువకుని మరణానికి ఖచ్చితంగా రాజకుమారుడే కారణమని తేల్చారు. న్యాయ శాసనాలకు రాజకుమారుడని, సామాన్యులని భేదముండదన్నారు. బంధుప్రీతికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పారు. న్యాయసూత్రాల ప్రకారం రాజకుమారునికి మరణదండన విధించాలని ధర్మ నిర్ణయం చేశారు.
ప్రశ్న 4.
‘ధర్మో రక్షతి రక్షితః’ ఈ పాఠం ఆధారంగా వ్యాఖ్యానించండి.
జవాబు:
ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని అర్థం. రథాన్ని అతివేగంగా రాజకుమారుడు నడిపాడు. ఒక యువకుని మరణానికి కారణమయ్యాడు. న్యాయాధికారులు అతనికి మరణశిక్ష విధించాలన్నారు. రాజయిన మాధవవర్మకు రెండు సమస్యలు వచ్చాయి. తన పుత్రునకు తానే మరణశిక్ష విధించాలి. కానీ తండ్రిగా కుమారుని మరణానికి తను కారణం కావడం ధర్మం కాదు. రెండవది ఒక రాజుగా తప్పు చేసిన వాడికి శిక్ష విధించాలి. ధర్మాన్ని కాపాడాలి. ఈ పరిస్థితిలో కుటుంబ ధర్మం కంటే రాజధర్మం గొప్పది. అందుకే రాజధర్మానికి కట్టుబడి యువరాజుకి మరణదండన విధించాడు. అందుకే అతని ధర్మనిరతిని జగన్మాతయైన దుర్గాదేవి కూడా మెచ్చుకుంది. బంగారు వర్షం కురిపించింది. మరణించిన వారిని (రాజకుమారుని, యువకుని) బ్రతికించింది.
ప్రశ్న 5.
మీకు తెలిసిన ఒక ధర్మాత్ముని గురించి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
లేఖ తిరుపతి, ప్రియమైన విజయ్ కు, నీ మిత్రుడు మనోజ్ వ్రాయు లేఖ. నీకు తెలిసిన ధర్మాత్ముడి గురించి లేఖ రాయి. ఉంటాను మరి. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 6.
ముసలమ్మకు, మాధవవర్మకు మధ్య జరిగిన సంభాషణ రాయండి.
జవాబు:
ముసలమ్మ : రాజుగారూ ! దండాలండీ.
మాధవవర్మ : ఏమైంది ? ఎందుకేడుస్తున్నావు?
ముసలమ్మ : నా కొడుకు చచ్చిపోయాడు బాబూ !
మాధవవర్మ : అయ్యయ్యో ! నీకేం పరవాలేదు. నేనున్నాను. ఎలా చచ్చిపోయాడు?
ముసలమ్మ : రథం కింద పడిపోయాడండీ !
మాధవవర్మ : ఆ రథం ఎవరిది? చూశావా?
ముసలమ్మ : చూశానండీ ! యువరాజు గారి రథమండి.
మాధవవర్మ : ఆఁ …… ? విచారణ చేయిస్తాను. దోషిని శిక్షిస్తాను. నీకు న్యాయం చేస్తాను.
ముసలమ్మ : ధర్మప్రభువులండీ ! తమరు ! !
మాధవవర్మ : ఇక నీవు వెళ్లవచ్చు. (ముసలమ్మ వెళ్లిపోతుంది)
III. భాషాంశాలు.
1. పర్యాయపదాలు :
కుమారుడు = కొడుకు, తనయుడు
గుఱ్ఱము = తురగము, అశ్వము .
మేఘం = పయోధరము, జీమూతము
శోకము = ఏడ్పు, రోదనము
హృదయం = ఎద, ఎడద
సువర్ణము = బంగారము, కనకము
రథం = తేరు, స్యందనము
వదనం = ముఖము, ఆననము
సభ = కొలువు, సదస్సు
2. ప్రకృతి – వికృతులు :
కోట్టము – కోట
వీథి – వీది
కుమారుడు – కొమరుడు
మేఘము – మొగులు
ప్రజ – పజ
న్యాయం – నాయం
శాసనము – చట్టము
పుత్రుడు – బొట్టెడు
మంత్రి – మంతిరి
కార్యము – కర్ణము
ధర్మము – దమ్మము
భటుడు – బంటు
రథము – అరదము
మూర్తి – మూరితి
వృద్ధు – పెద్ద
ఆజ్ఞ – ఆన
బంధువులు – బందుగులు
హృదయం – ఎద
అంతఃపురము – అంతిపురము
సంతోషము – సంతసము
3. సంధులు:
నాణేలను + ఇచ్చి = నాణేలనిచ్చి – (ఉత్వ సంధి)
ప్రజలు + అందరూ = ప్రజలందరూ – (ఉత్వ సంధి)
ముందు + ఉంచింది = ముదుంచింది – (ఉత్వ సంధి)
ఇతడు + ఒక్కడే = ఇతడొక్కడే – (ఉత్వ సంధి)
వారు + ఉంటారు = వారుంటారు – (ఉత్వ సంధి)
కుమారుడు + అని = కుమారుడని – (ఉత్వ సంధి)
భేదము + , ఉండదు = భేదముండదు – (ఉత్వ సంధి)
పరవశుడు + అయ్యాడు = పరవశుడయ్యాడు – (ఉత్వ సంధి)
భక్తుడు + ఐన = భక్తుడైన – (ఉత్వ సంధి)
ఆనతి + ఇచ్చాడు = ఆనతిచ్చాడు – (ఇత్వ సంధి)
ఉన్న + అంత = ఉన్నంత – (అత్వ సంధి)
పట్ట + అభిషేకం = పట్టాభిషేకం – (సవర్ణదీర్ఘ సంధి)
న్యాయ + అధికారి = న్యాయాధికారి – (సవర్ణదీర్ఘ సంధి)
సింహ + ఆసనం = సింహాసనం – (సవర్ణదీర్ఘ సంధి)
కార్య + ఆచరణ = కార్యాచరణ – (సవర్ణదీర్ఘ సంధి)
సు + ఉక్తి = సూక్తి – (సవర్ణదీర్ఘ సంధి)
4. కింద గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
1. చెట్టు పడిపోతే పెద్ద ధ్వని వచ్చింది.
జవాబు:
ధ్వని = శబ్దం
అనవసరంగా శబ్దం చేయకు.
2. దేవుడు రథంపై ఊరేగుతున్నాడు.
జవాబు:
రథం = తేరు
అర్జునుని తేరును చూస్తే శత్రువులకు భయం.
3. మొన్న ప్రమాదంలో ఒకనికి నెత్తురు వచ్చింది.
జవాబు:
నెత్తురు = రక్తం
రక్తం ఎర్రగా ఉంటుంది.
5. కింది వ్యతిరేక పదాలు జతపర్చండి.
1) ఉత్సాహం | అ) పైన |
2) కింద | ఆ) వెనుక |
3) ముందు | ఇ) నిరుత్సాహం |
జవాబు:
1) ఉత్సాహం | ఇ) నిరుత్సాహం |
2) కింద | అ) పైన |
3) ముందు | ఆ) వెనుక |
6. కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి.
1) భటుడు | అ) మొగులు |
2) మేఘము | ఆ) బంటు |
3) ప్రజ | ఇ) పజ |
జవాబు:
1) భటుడు | ఆ) బంటు |
2) మేఘము | అ) మొగులు |
3) ప్రజ | ఇ) పజ |
7. కింది ఖాళీలను పూరించండి.
1. ప్రజలందరూ = ప్రజలు + అందరూ – ఉత్వ సంధి
2. ఏమన్నారు = ఏమి + అన్నారు – ఇత్వ సంధి
3. అక్కడెక్కడో = అక్కడ + ఎక్కడో – అత్వ సంధి
4. మంచి చెడులు = మంచియును, చెడుయు – ద్వంద్వ సమాసం
5. త్రిమూర్తులు = ముగ్గురైన మూర్తులు – ద్విగు సమాసం
6. నవరసాలు = తొమ్మిదైన (నవ సంఖ్య గల) రసాలు = ద్విగు సమాసం
7. రామలక్ష్మణులు మహావీరులు. ఇది సంయుక్త వాక్యం
8. అన్నం తిని బడికి వెళ్లాను. ఇది సంక్లిష్ట వాక్యం
9. లతకు చదవడం రాయడం వచ్చును. ఇది సంయుక్త వాక్యం.
8. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.
1. ఎండలో తిరిగితే వదనం కందిపోయింది. (అర్థం గుర్తించండి)
అ) ముఖం
ఆ) వందనం
ఇ) శరీరం
జవాబు:
అ) ముఖం
2. శాసనం అతిక్రమించకూడదు. (అర్థం గుర్తించండి)
అ) మాట
ఆ) కారణం
ఇ) చట్టం
జవాబు:
ఇ) చట్టం
3. గురువుల సూక్తిని పాటించాలి. (అర్థం గుర్తించండి)
అ) మాట
ఆ) మంచిమాట
ఇ) పాఠం
జవాబు:
ఆ) మంచిమాట
4. శోకము అనర్థదాయకం. (అర్థం గుర్తించండి)
అ) ఏడ్పు
ఆ) బాధ
ఇ) కంగారు
జవాబు:
అ) ఏడ్పు
5. రథంపై దేవుడు వస్తాడు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) గుర్రం, అశ్వం
ఆ) పల్లకి, పల్యంకిక
ఇ) తేరు, స్యందనం
జవాబు:
ఇ) తేరు, స్యందనం
6. మేఘం వస్తే వాన వస్తుంది. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) పయోధరము, జీమూతము
ఆ) శీతలం, చల్లగాలి
ఇ) చినుకు, జడి
జవాబు:
అ) పయోధరము, జీమూతము
7. దశరథుని కుమారుడు రాముడు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) కొడుకు, కూతురు
ఆ) పుత్రి, బిడ్డ
ఇ) కొడుకు, తనయుడు
జవాబు:
ఇ) కొడుకు, తనయుడు
8. హృదయంలో మంచి మాత్రమే ఉండాలి. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) గుండె, కండరం
ఆ) ఎడద, ఎద
ఇ) మనస్సు, ఆలోచన
జవాబు:
ఆ) ఎడద, ఎద
9. కోట చుట్టూ సైన్యం ఉంది. (ప్రకృతిని గుర్తించండి)
అ) కోటరము
ఆ) కోట్టము
ఇ) కొట్టము
జవాబు:
ఆ) కోట్టము
10. భటుడు కాపలా ఉంటాడు. వికృతిని గుర్తించండి)
అ) బంటు
ఆ) భట్టు
ఇ) పటము
జవాబు:
అ) బంటు
11. కృష్ణమూర్తిని చూచి మొక్కాము. (వికృతిని గుర్తించండి)
అ) మూర్తము
ఆ) అమూర్తము
ఇ) మూరితి
జవాబు:
ఇ) మూరితి
12. కుమారుడు తల్లిదండ్రులను చూడాలి. (వికృతిని గుర్తించండి)
అ) కుమ్మరుడు
ఆ) కొమరుడు
ఇ) కొమారులే
జవాబు:
ఆ) కొమరుడు
13. ప్రజలందరూ తీర్పు వినడానికి వచ్చారు. (సంధి పేరు గుర్తించండి)
అ) ఉత్వ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) ఇత్వ సంధి
జవాబు:
అ) ఉత్వ సంధి
14. రాజు ఆనతిచ్చాడు – సంధి పేరు గుర్తించండి.
అ) ఉత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) అత్వ సంధి
జవాబు:
ఆ) ఇత్వ సంధి
15. ఉన్నంతలో దానం చేయాలి. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) ఉండి + అంత
ఆ) ఉంటు + అంత
ఇ) ఉన్న + అంత
జవాబు:
ఇ) ఉన్న + అంత
16. పంచపాండవులు ధర్మం వైపు నిలిచారు. (సమాసం పేరు గుర్తించండి)
అ) ద్విగువు
ఆ) ద్వంద్వం
ఇ) బహువ్రీహి
జవాబు:
అ) ద్విగువు
17. బ్రహ్మకు చతుర్ముఖములు ఉంటాయి. (విగ్రహవాక్యం గుర్తించండి)
అ) నలువ ముఖాలు
ఆ) నాలుగైన ముఖాలు
ఇ) నాలుగు వేదాలు
జవాబు:
ఆ) నాలుగైన ముఖాలు
18. మూడైన (త్రిఐన) మూర్తులు – సమాసపదం గుర్తించండి.
అ) త్రిదశలు
ఆ) త్రిలోకాలు
ఇ) త్రిమూర్తులు
జవాబు:
ఇ) త్రిమూర్తులు
19. పాటలూ పద్యాలూ నేర్చుకొన్నది. (ఏ రకమైన వాక్యం)
అ) సంయుక్తం
ఆ) సంక్లిష్టం
ఇ) అనుమత్యర్థకం
జవాబు:
అ) సంయుక్తం
20. ఆడుతూపాడుతూ బ్రతకాలి. (ఏ రకమైన వాక్యం )
అ) సంయుక్తం
ఆ) సామాన్యం
ఇ) సంక్లిష్టం
జవాబు:
ఇ) సంక్లిష్టం
21. కిందివానిలో సంయుక్తం గుర్తించండి.
అ) వచ్చి, చూశారు
ఆ) వెళ్లకండి
ఇ) అన్నదమ్ములు
జవాబు:
ఇ) అన్నదమ్ములు
22. మాధవవర్మ ధర్మంగా, న్యాయంగా జీవించాడు. (వాక్య రకం)
అ) సంక్లిష్టం
ఆ) సంయుక్తం
ఇ) అనుమత్యర్థకం
జవాబు:
ఆ) సంయుక్తం
23. రామారావు, నాగేశ్వరరావు సినిమా నటులు. (వాక్య రకం)
అ) సంయుక్తం
ఆ) సంక్లిష్టం
ఇ) విధ్యర్థకం
జవాబు:
అ) సంయుక్తం
24. నలుగురూ వచ్చి వెళ్లాలి. (వాక్య రకం గుర్తించండి)
అ) విధ్యర్థకం
ఆ) సంయుక్తం
ఇ) సంక్లిష్టం
జవాబు:
ఇ) సంక్లిష్టం
25. కిందివానిలో పంచమీ విభక్తి ప్రత్యయం గుర్తించండి.
అ) కొఱకు
ఆ) వలన(న్)
ఇ) యొక్క
జవాబు:
ఆ) వలన(న్)
26. కిందివానిలో సప్తమీ విభక్తి ప్రత్యయం గుర్తించండి.
అ) అందు(న్)
ఆ) గూర్చి
ఇ) తోడు
జవాబు:
అ) అందు(న్)
27. కిందివానిలో సర్వనామం గుర్తించండి.
అ) బాగు
ఆ) రాముడు
ఇ) ఆమె
జవాబు:
ఇ) ఆమె
28. కిందివానిలో అవ్యయం గుర్తించండి.
అ) సీత
ఆ) అబ్బ
ఇ) బాగుంది
జవాబు:
ఆ) అబ్బ
29. ఆమె చాలా పొడవుగా ఉందని సీత అన్నది. (విశేషణం గుర్తించండి)
అ) ఆమె
ఆ) సీత
ఇ) పొడవు
జవాబు:
ఇ) పొడవు
30. నామవాచకానికి బదులుగా వాడేది గుర్తించండి.
అ) సర్వనామం
ఆ) నామవాచకం
ఇ) అవ్యయం
జవాబు:
అ) సర్వనామం
చదవండి – ఆనందించండి
నేరము – శిక్ష
ఓరోజు మా నాన్న, తనని బస్తీలో జరిగే ఒక సమావేశానికి కారులో తీసుకెళ్ళమనడంతో, ఎగిరి గంతేశాను. ఎలానూ బస్తీకెళ్తున్నాను కాబట్టి, మా అమ్మ తనకవసరమైన సరుకులపట్టీ ఇచ్చింది. పైగా రోజంతా బస్తీలోనే ఉండాలి కనుక, కారు సర్వీసింగ్ తో పాటుగా చేయాల్సిన ఇతర పనులు కూడా మా నాన్న అప్పగించారు. ఆ ఉదయం మా నాన్నను దిగబెట్టాక, “సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇక్కడికే రా, కలసి ఇంటికి వెళ్లాం…” అన్నారు నాన్న.
హడావిడిగా పనులన్నీ ముగించుకుని, నేరుగా దగ్గరలోని సినిమాహాల్ కి వెళ్ళాను. సినిమాలో జాన్ వేన్ చేసిన ద్విపాత్రాభినయంలో లీనమవ్వడంతో సమయం గుర్తులేదు. నాకు గుర్తొచ్చేప్పటికి సాయంత్రం 5.30 గంటలయింది. నేను గారేజ్ కి పరిగెత్తుకెళ్ళి, కారు తీసుకుని, నాకోసమే ఎదురుచూస్తున్న మా నాన్నను చేరేటప్పటికి సాయంత్రం 6.30 గంటలయ్యింది. ‘ఎందుకు ఆలస్యమయింది?” అని ఆత్రుతతో నాన్న అడిగారు. జాన్ వేన్ సినిమా చూశానని ఆయనకు చెప్పటానికి సిగ్గుపడ్డ నేను, ఆయన అప్పటికే గారేజ్ వారితో మాట్లాడి ఉన్న విషయం తెలియక, ‘కారు సిద్ధం కాలేదు, నేను వేచి ఉండాల్సి వచ్చింది’ అన్నాను.
అబద్ధం చెప్తూ పట్టుబడ్డ నాతో ఆయన, ‘నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు. నిన్ను పెంచటంలో నేనేదో తప్పు చేశాను. నేను ఎక్కడ తప్పుచేశానో తెలుసుకునేందుకు 18 మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను. దాని గురించి ఆలోచించు’ అన్నారు. సూటూ, బూటూ వేసుకుని దర్జాగా ఉన్న ఆయన, చీకట్లో, దీపాలు లేని, ఆ గతుకుల రోడ్డు మీద నడవడం ప్రారంభించారు.
ఆయనను వదిలి వెళ్ళలేని నేను, బుద్ధి తక్కువగా నేను ఆడిన అబద్ధం వల్ల ఆయన అనుభవిస్తున్న ఆవేదనను చూస్తూ, ఐదున్నర గంటలపాటు ఆయన వెనకే, కారు నడుపుకుంటూ వెళ్ళాను. అప్పటికప్పుడే, అక్కడికక్కడే ఇక మళ్ళీ అబద్ధమాడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.
మనం మన పిల్లలను తిట్టీ కొట్టి శిక్షించే పద్ధతిలో ఆయన నన్ను శిక్షించి ఉంటే, నేనీ పాఠాన్ని నేర్చుకుని వుండేవాడనా? అని అప్పుడప్పుడు ఈ సంఘటనను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంటాను. నేర్చుకుని ఉండేవాడను కానని నా నమ్మకం. ఆ శిక్షను అనుభవించి, మళ్ళీ ఎప్పటిలాగే అదే పని చేసి ఉండేవాడిని. కానీ, ఈ ఒక్క అహింసాచర్య ఎంత శక్తిమంతమైనదంటే, అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. అహింసకున్న శక్తి అటువంటిది.