SCERT AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 3rd Lesson Questions and Answers చిన్ని శిశువు
7th Class Telugu 3rd Lesson చిన్ని శిశువు Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
ప్రశ్న 1.
పై చిత్రాలు చూడండి. చిత్రాల గురించి మాట్లాడండి.
జవాబు:
పై చిత్రాలలో శిశువు యొక్క పెరుగుదల ఉంది. శిశువు నేర్చుకొనే ఆటల గురించి ఉంది. మొదటి బొమ్మలో 5 నెలలలోపు వయస్సు గల శిశువు ఉన్నాడు. కాళ్లు, చేతులు కదల్చడం మాత్రమే చేయగలడు. రెండవ బొమ్మలోని శిశువుకు సుమారు 6, 7 నెలల వయసుంటుంది. బోర్లా పడడం వచ్చింది. మూడవ బొమ్మలోని శిశువుకు 8, 9 నెలల వయసుంటుంది. పాకడం వచ్చింది. నాల్గవ బొమ్మలో శిశువుకు ఒక సంవత్సరంలోపు వయసు ఉంటుంది. బొమ్మలతో ఆడుకోవడం, నడక వచ్చింది. ఐదవ బొమ్మలోని శిశువుకు 3 సంవత్సరాలలోపు వయస్సు ఉంటుంది. ఆడుకోవడం, పరుగెత్తడం, సైకిల్ తొక్కడం కూడా వచ్చేసింది.
ప్రశ్న 2.
పిల్లలు ఎవరెవరు ఏమి చేస్తున్నారో ఊహించి చెప్పండి.
జవాబు:
ఒకటవ బొమ్మలోని శిశువు కాళ్లు, చేతులు కదిలిస్తున్నాడు. రెండవ బొమ్మలో బోర్లాపడ్డాడు. 3వ బొమ్మలోని శిశువు పాకుతున్నాడు. నాల్గవ బొమ్మలోని శిశువు బొమ్మలతో ఆడుకొంటున్నాడు. ఐదవ బొమ్మలోని శిశువు చిన్న సైకిల్ తొక్కుతున్నాడు.
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
చిన్ని శిశువు గేయాన్ని భావయుక్తంగా, రాగయుక్తంగా పాడండి.
జవాబు:
సూచన: ఉపాధ్యాయులు పాడే విధానం గమనించండి. అనుసరించండి. స్వరయుక్తంగా, స్వల్ప తాళంతో పాడితే – బాగుంటుంది.
ప్రశ్న 2.
పిల్లల బాల్యాన్ని మీ సొంతమాటల్లో చెప్పండి. (వ్రాయండి.)
జవాబు:
పిల్లల బాల్యం చూడముచ్చటగా ఉంటుంది. 5 నెలల వరకు కాళ్లూ, చేతులు మాత్రమే. కదల్చగలరు. క్రమేణా ‘ బోర్లాపడడం, పాకడం, నడవడం, పరుగెత్తడం మొదలైనవన్నీ నేర్చుకొంటారు. పుట్టిన కొన్నిరోజుల వరకూ చూపుకాని, మెడకాని నిలబెట్టలేరు. క్రమేణా చూపు, మెడ, నడుమూ నిలబెడతారు. అందరినీ గుర్తు పడతారు. నవ్వుతారు. ఆకలి, కోపం, భయం మొదలైనవి కూడా క్రమేణా తెలుస్తాయి. ఏడుపు తప్ప ఏమీరాని శిశువు కాలక్రమేణా మాటలు, పాటలు, పద్యాలు మొదలైనవి చెప్పే స్థాయికి చేరుతుంది.
ప్రశ్న 3.
తల్లికి బిడ్డలపై ఎలాంటి మమకారం ఉంటుందో చెప్పండి.
జవాబు:
తల్లి మమకారాన్ని దేనితోనూ పోల్చలేము. పిల్లల కోసం తన ప్రాణాలైనా ఇస్తుంది. పిల్లలకు ఆకలి వేసినా, బాధ – కలిగినా తల్లి ప్రాణం గిలగిలలాడుతుంది. తల్లికి తన పిల్లల కంటే విలువైనది ఏదీ ఈ లోకంలో లేదు. తన పిల్లల కంటే అందమైనదేదీ ఈ ప్రపంచంలో లేదంటుంది. తల్లికి పిల్లలే లోకం. వారు నవ్వితే ఆమె సంతోషిస్తుంది. పిల్లలు తింటే తల్లి తన కడుపు నిండినట్లు భావిస్తుంది. తన నోముల పంటగా పిల్లలను భావిస్తుంది.
ప్రశ్న 4.
కింది కీర్తనను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద, రామ గోవిందా జోజో జోజో
పాలవారాశిలో పవళించినావు,
బాలుగా మునులకు అభయమిచ్చినావు,
మేలుగా వసుదేవుకుదయించినావు,
బాలుడై ఉండి గోపాలుడైనావూ జోజో జోజో
నందు నింటను జేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముగ్గురంగా జోజో జోజో
ప్రశ్నలు :
1) అన్నమయ్య జోల పాటలో ఎవరిని గురించి వర్ణించాడు?
జవాబు:
అన్నమయ్య జోల పాటలో కృష్ణుని గురించి వర్ణించాడు.
2) కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు?
జవాబు:
కృష్ణుడు నందునింట పెరిగాడు.
3) కృష్ణుడు ఎవరికి పుత్రుడుగా జన్మించాడు?
జవాబు:
కృష్ణుడు వసుదేవునికి పుత్రుడుగా జన్మించాడు.
4) మునులకు అభయమిచ్చినది ఎవరు?
జవాబు:
బాలకృష్ణుడు మునులకు అభయమిచ్చాడు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
చిన్ని శిశువు జడల గురించి రాయండి.
జవాబు:
చిన్ని శిశువు యొక్క జుట్టు బాగా ఎక్కువగా ఉంది. ఆ జుట్టుతో తల ఊగుతోంది. అతని జడలు చింతకాయల వలే ఉన్నాయి.
ప్రశ్న 2.
చిన్ని కృష్ణుడు ఎలాంటి ఆభరణాలు ధరించాడు?
జవాబు:
చిన్ని కృష్ణుడు కాళ్లకు బంగారు మువ్వల గజ్జెలు ధరించాడు. వేళ్లకు వంకీల ఉంగరాలు (అందే ఉంగరాలు) ధరించాడు. అందమైన చేతులకు బంగారు మురుగులు (కడియాలు) ధరించాడు.
ప్రశ్న 3.
అన్నమయ్యను గురించి రాయండి.
జవాబు:
తాళ్లపాక అన్నమాచార్యులు :
జననం : కడప జిల్లా, రాజంపేట మండలం, తాళ్లపాక గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు: లక్కమాంబ, నారాయణసూరి అనే పుణ్యదంపతులు.
రచనలు :
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వేంకటాచల మహాత్మ్యం మొదలైనవి ఆయన రచనలు.
అంకితం : అన్నమయ్య తన రచనలను శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు.
ప్రత్యేకతలు :
దక్షిణాపథంలో భజన సంప్రదాయం , పద కవితా శైలిని ప్రారంభించిన తొలి వాగ్గేయకారుడు. 1) చందమామ రావే, జాబిల్లిరావే…… 2) జో అచ్యుతానంద జోజో ముకుందా వంటి పాటలు అన్నమయ్య రచించినవే. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. 95 సంవత్సరాలు జీవించాడు. 23.2.1503న వేంకటేశ్వర స్వామిలో లీనమయ్యాడు.
బిరుదులు :
పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు అనే బిరుదులు సమకాలీనులు సాదరంగా ఇచ్చారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
చిన్ని శిశువు పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
జవాబు:
చిన్ని కృష్ణుని వంటి చిన్న శిశువును ఎప్పుడూ చూసి ఉండము.
ఆయన శిరస్సు దట్టమైన జుట్టుతో ఊగుతోంది. ఆయన జడలు చింతకాయల వలె ఉన్నాయి. పాదాలకున్న బంగారు గజ్జెల మువ్వలు మ్రోగుతుంటాయి. తన తల్లియైన యశోదను విడువకుండా ఆమె వెనుకే తిరుగాడుతూ ఉంటాడు.
చిన్ని కృష్ణుని వేళ్లు వంకీల ఉంగరాలు (అందె ఉంగరాలు)తో మెరుస్తున్నాయి. అందమైన ఆయన చేతులు బంగారు మురుగులు (కంకణాలు)తో మెరుస్తున్నాయి. అద్దాల వంటి ఆయన చెక్కిళ్లు ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఆడుకొందుకు పిల్లలను దగ్గరకు పిలుస్తూ ‘అప్పలప్పల’ని ఎవరైనా అంటే వారిని అదలించి చిన్ని కృష్ణుడు యశోదను కౌగిలించుకొంటాడు.
పుష్టిగల చిన్ని కృష్ణుని పొట్ట మీద పాలచారలు అందంగా ఉన్నాయి. కొసరి కొసరి వెన్న తినిన నోటితో అతిశయించి దిగివచ్చాడు. ఇప్పుడు వేంకటేశ్వరస్వామిగా వేంకటాద్రిపై వెలిశాడు. అన్ని లోకాలనూ రక్షిస్తున్నాడు. అని అన్నమయ్య తన గేయంలో వివరించాడు.
ప్రశ్న 2.
అన్నమయ్య చెప్పిన శిశువుకి, మీరు చూసిన శిశువుకి గల పోలికలు రాయండి.
జవాబు:
అన్నమయ్య చెప్పిన శిశువు లక్ష్మీపతియైన శ్రీకృష్ణుడు. నేను చూసిన శిశువు నాలుగిళ్లలో పనిచేసుకొనే నిరుపేద మహిళ బిడ్డ.
జుట్టు విషయంలో ఇద్దరూ సమానమే. ఇద్దరిదీ దట్టమైన జుట్టే. ఇద్దరి జడలు చింతకాయల లాగే ఉన్నాయి. కాని, శ్రీకృష్ణుడు బంగారు గజ్జెలు ధరించాడు. ఆ మువ్వలు గలగలా మ్రోగేవి. నేను చూసిన పిల్లవాని కాళ్లు మట్టి కొట్టుకుపోయి ఉంటాయి. కనీసం కాళ్లకు ఊళ్లు కూడా లేవు. ఇద్దరూ తల్లిని విడిచి పెట్టరు. శ్రీకృష్ణుని వేళ్లకు వంకీల ఉంగరాలు ఉన్నాయి. చేతులకు బంగారు మురుగులున్నాయి. నేను చూసిన పిల్లవానికి బంగారు ఉంగరాలు, మురుగులు లేవు. దిష్టి తగలకుండా వాళ్లమ్మ కట్టిన నల్లదారం మాత్రమే చేతికి ఉంది.
కృష్ణుని బుగ్గలు నున్నగా అద్దాలలా మెరిసిపోతున్నాయి. వీడికి సరైన పోషణ లేక బుగ్గలు లోతుకుపోయి ఉంటాయి. ఆయన పొట్ట పుష్టిగా పాలచారలతో ఉంటుంది. వీడికి ‘బల్ల’ అనే వ్యాధి రావడం వల్ల పొట్ట ఎత్తుగానే ఉంటుంది. దాని నిండా మట్టి చారలే. ఆయనది వెన్న తిన్న నోరు.. వీడిది గంజి తాగిన నోరు. ఆయన వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు. వీడు దరిద్రానికి ప్రతిరూపంగా ఎదుగుతున్నాడు. ఆయన లోకాలను రక్షిస్తున్నాడు. వీడిని చూసి లోకం చిరాకు పడుతోంది. గేలి చేస్తోంది.
ప్రశ్న 3.
చిన్నపిల్లల చేష్టల గురించి మీ మాటల్లో రాయండి.
జవాబు:
చిన్నపిల్లల చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందరూ చూస్తూ, ముద్దు చేస్తుంటే ఏడుస్తారు. ఎవ్వరూ తమవైపు చూడకపోతే నవ్వుతారు. కింద నుంచో పెడితే మూత్రం పోయరు. పక్కవేసి పడుకోబెట్టగానే పోసేస్తారు. ఏది పడితే అది నోట్లో పెట్టేసుకొంటారు. లాక్కొంటే ఏడుస్తారు. కొంతమంది పిల్లలు నడవలేరు. నడుస్తామని మారాం చేస్తారు. ఎత్తుకొంటే ఏడుస్తారు. బాగా నడక వచ్చాక నడవరు. ఎత్తుకోమని ఏడుస్తారు. అన్నప్రాశన జరిగే వరకు అన్నం కంచాలు లాగేస్తారు. అన్నప్రాశన అయ్యాక అన్నం తినరు. తల్లిని ఏడిపిస్తారు. చిన్నతనంలో పిల్లలు అన్నం తినడానికి ఏడుస్తారు. పెద్దయ్యాక తల్లిదండ్రులకు పెట్టడానికి ఏడుస్తారు. చకచకా పాకడం, పరుగెత్తడం చేస్తారు. ప్రమాదాలలో పడతారేమోనని పెద్దవారికి భయం.
భాషాంశాలు
అ) కింది గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : ఈ రోజు పైడి ధర పెరిగింది.
పైడి = బంగారం
సొంతవాక్యం : స్త్రీలకు బంగారు ఆభరణాలు శోభనిస్తాయి.
1. చిన్ని కృష్ణుడికి నవనీతం అంటే ఇష్టం.
జవాబు:
నవనీతం = వెన్న
సొంతవాక్యం : వెన్నను కాచిన నెయ్యి వచ్చును.
2. చిన్న పిల్లల కురులు నిగనిగలాడుతుంటాయి.
జవాబు:
కురులు = వెంట్రుకలు
సొంతవాక్యం : తిరుమలలో చాలామంది తలవెంట్రుకలు ఇస్తారు.
3. తల్లికి శిశువు సంరక్షణ ముఖ్యం.
జవాబు:
శిశువు = చిన్నపిల్ల / చిన్నపిల్లవాడు
సొంతవాక్యం : చిన్నపిల్లలు తల్లిని వదిలి ఉండలేరు.
4. గణపతికి ఏనుగు శిరస్సు ఉంటుంది.
జవాబు:
శిరస్సు = తల
సొంతవాక్యం : తలను చక్కగా దువ్వుకొని బడికి వెళ్లాలి.
ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.
ఉదా : మేను = దేహం, తనువు, కాయం
1. ఇది పుత్తడి బొమ్మ, అది స్వర్ణ దేవాలయం.
జవాబు:
బంగారం = పుత్తడి, స్వర్ణం
2. కిటికి దర్పణం బాగుంది. రేఖ చేతిలో ముకురం ఉంది.
జవాబు:
అద్దం = దర్పణం, ముకురం
3. మా అయ్య పొలానికి వెళ్ళాడు. మా స్నేహితుని నాన్న ఉపాధ్యాయుడు.
జవాబు:
తండ్రి = అయ్య, నాన్న
4. ఆమె శిరోజాలు పొడవుగా ఉన్నాయి, ఈమె కేశాలు పొట్టిగా ఉన్నాయి.
జవాబు:
కురులు = శిరోజాలు, కేశాలు
ఇ) కిందివానిలో ప్రకృతి, వికృతులను జతపరచండి.
1. తింత్రిణి | అ) పాలు |
2. పయసు | ఆ) కన్నడు |
3. భృంగారం | ఇ) చింత |
4. కృష్ణుడు | ఈ) చేత |
5. చేష్ట | ఉ) బంగారు |
జవాబు:
1. తింత్రిణి | ఇ) చింత |
2. పయసు | అ) పాలు |
3. భృంగారం | ఉ) బంగారు |
4. కృష్ణుడు | ఆ) కన్నడు |
5. చేష్ట | ఈ) చేత |
ఈ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1. చిన్న × పెద్ద
2. కోపం × శాంతం
3. తిని × తినక
4. పైన × క్రింద
5. వేడి × చల్లన
ఉ) కింది పదపట్టికను చదవండి. పట్టిక ఆధారంగా కొన్ని పదాలు రాయండి.
ఉదా : మువ్వలు
1. శిశువు
2. శిరసు
3. పైడి
4. పాలు
5. అన్నమయ్య
వ్యాకరణాంశాలు
నిత్యం
కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలను పరిశీలించండి.
1. టంగుటూరి ప్రకాశం పంతులు తెల్లవారికి సింహస్వప్నం.
2. చుక్కలు మిలమిల మెరుస్తాయి ఎందుకని?
3. కొత్తగా వచ్చిన వ్యక్తిని మీరెవరు? అని నాన్న అడిగాడు.
4. మా రాజు మనసైన రాజు.
5. ప్రజలు అల్లూరి సీతారామరాజెక్కడని అడిగారు.
కింది పదాలను విడదీసి రాయండి.
ఉదా : ప్రకాశమతడు = ప్రకాశము + అతడు
1. ఎందుకని = ఎందుకు + అని
2. మీరెవరు = మీరు + ఎవరు
3. మనసైన = మనసు + ఐన
4. రాజెక్కడ = రాజు + ఎక్కడ
పై పదాలలో పూర్వ స్వరంగా ‘ఉ’ ఉంది. దాని పరస్వరంగా ‘అ’, ‘ఇ’, ‘ఉ’, ‘ఏ’, ‘ఒ’ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం అని తెలుసుకున్నాం. ఈ విధంగా తప్పకుండా జరిగే సంధిని నిత్యం అంటారు.
నిషేధం
కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను పరిశీలించండి.
1. కొత్తబట్టలు మాయమ్మ ఇచ్చింది.
2. మాయయ్య వ్యవసాయం చేస్తున్నాడు.
3. ఓయమ్మ! నీ కుమారుడు అల్లరి పిల్లవాడు.
4. రాముని దూతయితడు.
5. మాయిల్లు గాంధీనగర్ లో ఉంది.
కింది పదాలను విడదీయండి. సంధి జరగని విధానాన్ని గమనించండి.
ఉదా : మాయమ్మ = మా + అమ్మ
1. మాయయ్య – మా + అయ్య
2. ఓయమ్మ = ఓ + అమ్మ
3. దూతయితడు = దూత + ఇతడు
4. మాయిల్లు = మా + ఇల్లు
పూర్వ స్వరంగా ‘ఆ’ అనే అచ్చు ఉంది. పర స్వరంగా ‘అ’ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు. అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ‘య్’ వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని ‘నిషేధం’ అంటారు.
వైకల్పికం
కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను గుర్తించండి.
1. ప్రతి ఒక్కరికి మంచి మనసైన మిత్రుడు ఉండాలి.
2. మా మేనత్త చాలా మంచిది.
3. గంపలతో పూలెత్తవలెను.
4. హరి ! మీరు ఏమంటిరి
విడదీసిన పదాలను కలిపి రాయండి.
ఉదా : మనసు + ఐన = మనసైన, మనసయైన
1. మేన + అత్త = మేనత్త, మేనయత్త
2. పూలు + ఎత్తి : పూలెత్తి (ఉత్వసంధి నిత్య సంధి కనుక యడాగమ రూపం ఉండదు)
3. ఏమి + అంటిరి = ఏమంటిరి, ఏమియంటిరి
పై ఉదాహరణలో సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేషంగా జరుగుతుంది. అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించక పోవడం ఉంటుంది. ఇలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటారు.
బహుళం
కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి.
1. మా పెద్దన్న మామిడి పండు తిన్నాడు.
2. మా వదిన పుట్టినిల్లు నెల్లూరు.
3. నేను వేసవి సెలవుల్లో మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మేనయత్త ప్రేమగా చూసింది.
4. నేను నిద్రలో ఒకానొక సమయంలో ఉలిక్కిపడతాను.
కింది పదాలను విడదీయండి.
ఉదా : మనమున్నాము = మనము + ఉన్నాము
1. పెద్దన్న = పెద్ద + అన్న
2. పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు
3. మేనత్త, మేనయత్త = మేన + అత్త
4. ఒకానొక = ఒక + ఒక
పై ఉదాహరణలను గమనించండి. అన్నిటిలోనూ పూర్వపదం చివర ‘అ’ అనే అచ్చు ఉంది. పరపదం (రెండవ పదం) మొదట కూడా అ, ఇ, ఒ…. ఇలాగ ఏదో ఒక అచ్చే ఉంది. కాని, నాలుగు పదాలలోనూ నాలుగు రకాలుగా జరిగింది కదా !
1. పెద్ద + అన్న = పెద్దన్న – ఇక్కడ సంధి నిత్యంగా జరిగినట్లు చూపారు. కాని, ‘పెద్దయన్న’ అనే రూపం కూడా ఉండవచ్చు.
రామ + అయ్య = రామయ్య – ఇక్కడ సంధి నిత్యంగా జరిగింది. ‘రామయయ్య’ అనే రూపం లేదు కనుక.
2. వెల + ఆలు = వెలయాలు – ఇక్కడ మొదటి పదం చివర ‘అకారం’ ఉంది. రెండవపదం మొదట కూడా ‘ఆ’ అనే అచ్చు ఉంది. కాని సంధి జరగలేదు. యడాగమం వచ్చింది. ‘వెలయాలు’ అయ్యింది. అందుచేత ‘వెలాలు’ అనకూడదు. ఇది సంధి అస్సలు జరగని రూపం.
3. మేన + అత్త = మేనత్త, మేనయత్త – ఇక్కడ సంధి జరిగినపుడు ‘మేనత్త’ అనే రూపం ఏర్పడింది. సంధి జరగనపుడు మేనయత్త అనే రూపం ఏర్పడింది. దీనిని ‘విభాష రూపం’ అంటారు. దీనినే వికల్పం, వైకల్పికం అని కూడా అంటారు.
4. ఒక + ఒక = ఒకానొక – ఇక్కడ సంధి నిత్యంగా జరగలేదు. కనుక ‘ఒకొక’ అనే రూపం ఏర్పడలేదు. విభాషగానూ జరగలేదు. కనుక ‘ఒకయొక’ అనే రూపం ఏర్పడలేదు. సంధి జరగనపుడు వచ్చే ‘యడాగమం’ రాలేదు. కాని, మధ్యలో ‘నకారం’ వచ్చి ‘ఒకానొక’ అనే రూపం ఏర్పడింది. దీనిని అన్యకార్యం అంటే ‘ఇతర విధంగా’ సంధి ఏర్పడిందని అంటారు.
మొత్తం మీద బహుళం అంటే నాలుగు విధాలుగా ‘సంధి’ జరుగుతుందని తెలుసుకోండి. 1) నిత్యం 2) విభాష లేదా వైకల్పికం 3) సంధి లేకపోవడం 4) అన్యకార్యం అర్థమైంది కదూ !
తృతీయా విభక్తి
కింది పట్టికను గమనించండి.
1. బోయవాడు బాణం | తో | పక్షిని కొట్టాడు. |
2. దేవుని భక్తి శ్రద్ధల | పూజించాడు. | |
3. వాల్మీకి 24 వేల శ్లోకాల | రామాయణం రచించాడు. | |
4. కుశలవులు సప్తస్వరాల | పాట పాడారు. |
వాక్య రూపంలో రాయండి.
ఉదా : బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు.
1. దేవుని భక్తి శ్రద్ధలతో పూజించాడు.
2. వాల్మీకి 24వేల శ్లోకాలతో రామాయణం రచించాడు.
3. కుశలవులు సప్తస్వరాలతో పాట పాడారు.
పై వాక్యాలలో ‘తో’ అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. వాక్యంలోని పదాల మధ్య చేరే చేతన్, చేన్, తోడన్, తోన్, అనే ప్రత్యయాలను తృతీయా విభక్తి అంటారు. సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో ‘తృతీయా విభక్తి’ని ఉపయోగిస్తారు.
ఊ) కింది సమాస పదాలను విగ్రహ వాక్యాలుగా రాయండి.
ఉదా : యశోద మేను = యశోద యొక్క మేను
1. చిన్ని శిశువు = చిన్నదైన శిశువు
2. వేషభూషణములు = వేషమును, భూషణమును
3. పెద్దపొట్ట = పెద్దదైన పొట్ట
4. చింతకాయలు = చింత అను పేరు గల కాయలు
ఋ) కింది పదాలను విడదీయండి.
ఉదా : వెన్నదిన్న = వెన్న + తిన్న
1. వేంకటాద్రి = వేంకట + అద్రి
2. తూగేటి = తూగు + ఏటి
3. లోకములెల్ల = లోకములు + ఎల్ల
చమత్కార పద్యం
యోథెవ్వడు కురుబలమున?
మాధవ సఖుడేమి యెక్కి మరి తిరుగాడున్?
సాధించెనెవని రాముడు?
రాధేయుడు నందినెక్కి రావణుగెల్చెన్.
భావం :
కౌరవ సైన్యంలో యోధుడెవరు? శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు? ‘రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు? కర్ణుడు, నందినెక్కి, రావణాసురుని గెల్చాడు.
(పై మూడు పాదాలలోని ప్రశ్నలకు సమాధానం చివరి పాదంలోనే ఉంది.)
ప్రాజెక్టుపని
ప్రశ్న 1.
అన్నమయ్య కీర్తనలను మరికొన్ని సేకరించండి. వాటిని చార్టుమీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
అన్నమయ్య కీర్తనలు:
1. ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా !
తేరి మీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చుచోట
నీ రోమములు కావా నిఖిల కారణము
నీ మూలమున గాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీవంక నేపో రమణి సీతాదేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను.
బలురైత్యులను దుంచబంటు తనము మించ
కలకాలమును నెంచ కలిగితిగా
అల శ్రీ వేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా
2. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయకలుగు దాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము ||అంతరంగ||
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
ఎదుట తానురాజైతే ఏలెనా పరము ||అంతరంగ||
పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా
జీవించి ఫలమేది చింతదీరు దాకా
వేవేల ఫలమేది వేంకటేశు గన్న దాకా
భావించి తాదేవుడైతే ప్రత్యక్షమౌనా ||అంతరంగ॥
ప్రశ్న 2.
త్యాగయ్య కీర్తనలను సేకరించండి. వాటిని చార్టుమీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
1. పల్లవి : ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || ఎందరో ||
అను పల్లవి : చందురు వర్ణుని అందచందమును హృదయార విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వా || రెందరో ||
చరణం :
సామగాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు
మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనే వా . || రెందరో ||
సరగున నాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా || రెందరో ||
పతితపావనుడనే పరాత్పరు గురించి
బరమార్ధమగు నిజమార్గముతోను బాడుచును,
సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా || రెందరో ||
హరి గుణమణులగు సరములు గళమున
శోభిల్లు భక్త కోటు లిలలో తెలివితో చెలిమితో
గరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువా || రెందరో ||
హొయలు మీఱ నడులు గల్గు సరసుని సదా
గనుల జూచుచును, పులక శరీరులయి ముదంబునను యశము గల వా || రెందరో ||
పరమభాగవత మౌనివరశశి విభాకర సనకసనందన దిగీశ
సురకింపురుష కనక కశిపుసుత నారద తుంబురు పవన సూను
బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమపావనులు
ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము సదానుభవము గలవా .. || రెందరో ||
నీ మేను నామ వైభవమ్ములను నీ పరాక్రమ ధైర్యముల శాంతమా
నసము నీవులను వచన సత్యమును రఘువర నీ యెడ సద్భక్తియు
జనించకను దుర్మతములనను కల్గిజేసి నట్టి నీ యద
నెటింగి సతతంబునను గుణ భజనానంద కీర్తనము జేయువా || రెందరో ||
భాగవత రామాయణ గీతాది శ్రుతిశాస్త్ర పురాణపు మర్మములన్
శివాది షణ్మతముల గూఢముల ముప్పది ముక్కోటి సురాంత
రంగముల భావముల నెఱిగి భావరాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వా || రెందరో ||
ప్రేమ ముప్పిరిగొనువేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజను తునికి నిజదాసు || రెందరో ||
2. పల్లవి : గిరిరాజ సుతాతనయ ! సదయ !
అను పల్లవి : సురనాథ ముఖార్చిత పాదయుగ !
పరిపాలయ యామిభ రాజముఖ !
చరణము : గణనాథ ! పరాత్పర ! శంకరా
గమవారినిధి రజనీకర !
ఫణిరాజ కంకణ ! విఘ్న నివా
రణ ! శాంభవ ! శ్రీ త్యాగరాజ నుత !
మీకు తెలుసా?
చతుర్దశ భువనాలు : 14 లోకాలు (సప్త అధో లోకాలు – 7, సప్త ఊర్ధ్వ లోకాలు – 7)
సప్త అధో లోకాలు : 1) అతలం 2) వితలం 3) సుతలం 4) తలాతలం 5) రసాతలం 6) మహాతలం 7) పాతాళం
సప్త ఊర్ధ్వ లోకాలు : 1) భూలోకం 2) భువర్లోకం 3) సువర్లోకం 4) మహర్లోకం 5) జనోలోకం 6) తపోలోకం 7)గుత్యలోకం
ఉపాధ్యాయులకు సూచనలు
- అన్నమయ్య సంకీర్తనలను సేకరించండి. వాటిని వినండి.
- అన్నమయ్య జీవితం గురించి తెలుసుకోండి.
- అన్నమయ్య సంకీర్తనలను పాడే విధానాన్ని విద్యార్థులకు తెలపండి.
కవి పరిచయం
కవి పేరు : తాళ్లపాక అన్నమాచార్యులు
జననం : కడప జిల్లా రాజంపేట మండలం, తాళ్లపాక గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు : లక్కమాంబ, నారాయణసూరి అనే పుణ్యదంపతులు.
రచనలు : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వేంకటాచల మాహాత్మ్యం మొదలైనవి ఆయన రచనలు.
అంకితం : అన్నమయ్య తన రచనలను శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు.
ప్రత్యేకతలు :
దక్షిణాపథంలో భజన సంప్రదాయం, పద కవితా శైలిని ప్రారంభించిన తొలి వాగ్గేయకారుడు. 1) చందమామ రావే, జాబిల్లిరావే……. 2) జో అచ్యుతానంద జోజో ముకుందా వంటి పాటలు అన్నమయ్య రచించినవే. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. 95 సంవత్సరాలు జీవించాడు. 23.2. 1503న వేంకటేశ్వర స్వామిలో లీనమయ్యాడు.
బిరుదులు :
పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగము సార్వభౌముడు అనే బిరుదులు సమకాలీనులు సాదరంగా ఇచ్చారు.
పద్యాలు – అర్థాలు – భావాలు
1.ప|| చిన్ని శిశువూ చిన్ని శిశువూ
ఎన్నడుం జూడమమ్మ యిటువంటి శిశువూ ||
చ|| తోయంపు గురులతోడ దూగేటి శిరసు, చింత
కాయల వంటి జడల గముల తోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంట పాటాడు శిశువూ || చిన్ని ||
అర్థాలు :
ఎన్నడున్ = ఎప్పుడూ
తోయము = పరివారము (దట్టమైన)
కురులు = వెంట్రుకలు
తూగుట = ఊగుట
గములు = సమూహాలు, గుంపులు
కనకము = బంగారం
పాయక = విడువక
పాఱాడు = తిరుగాడు
భావం :
చిన్ని కృష్ణుని వంటి శిశువును ఎప్పుడూ చూడమమ్మా ! దట్టమైన వెంట్రుకలతో ఊగే శిరస్సు, చింతకాయల వంటి జడలతో ఉంటాడు, ఆయన పాదాలకున్న బంగారు గజ్జలలోని మువ్వలు మోగుతుంటాయి. తన తల్లియైన యశోదను ఒక్కక్షణం కూడా విడవకుండా ఆమె వెంట తిరుగాడే చిన్ని కృష్ణుని వంటి శిశువు నెన్నడూ చూడమమ్మా !
2. చ|| ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగరాల
నిద్దపుం జేతుల పైడి బొద్దుల తోడ
అద్దపుం జెక్కులతోడ అప్ప లప్ప లని నంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువూ || || చిన్ని ||
చ|| బలుపైన పొట్టమీది పాలచారలతోడ
నులివేడి వెన్న దిన్న నోరి తోడ
చెలగి నేడిదె వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ || చిన్ని ||
అర్థాలు :
వ్రేళ్లు = వేళ్లు
మొరవంక ఉంగరాలు = వంకీ ఉంగరాలు
నిద్దము = అందము
బొద్దులు = మురుగులు
చెక్కులు = చెక్కిళ్లు (బుగ్గలు)
అద్దము = ముఖం చూసుకొనే గాజు బిళ్ల
అప్పలప్పలు = ఒక ఆట, పిల్లలను దగ్గరకు పిలవడంలోని అనుకరణ
గద్దించి = అదలించి
మేను = శరీరం
బలుపు = పుష్టి
చార = గీత
నులివేడి = కొద్దిగా అడిగి
చెలగి = అతిశయించి
నేడు = ఈరోజు
అది = పర్వతం
పైడి = బంగారు
భావం :
ముద్దుల కృష్ణుని వేళ్ల వంకీ ఉంగరాలు అందంగా ఉన్నాయి. అందమైన ఆ చేతులు బంగారు మురుగులతో మెరుస్తున్నాయి. అతని బుగ్గలు నున్నగా అద్దాలలాగ మెరిసిపోతున్నాయి. పిల్లలు అప్పలప్పలంటే వారిని అదలించి యశోదను, కౌగిలించుకొంటాడు. పుష్టిగా ఉన్న చిన్ని కృష్ణుని పొట్టమీద పాలచారలతో, మరికొంచెం అడిగి తిన్న వెన్న నోటితో అతిశయించిన శ్రీకృష్ణుడే. ఈ రోజు క్రిందికి దిగివచ్చేడు. వేంకటాచలంపై వేంకటేశ్వరునిగా వెలిశాడు. అన్ని లోకాలనూ రక్షిస్తున్నాడు. అని అన్నమయ్య వర్ణించాడు.
సారాంశం
అన్నమయ్య భక్తితో రచించిన గేయమిది. దీనిలో బాలకృష్ణుని గురించి భక్తిగా వర్ణించాడు.
చిన్నికృష్ణుని వంటి చిన్ని శిశువును మనం ఎన్నడూ చూసి ఉండము.
దట్టమైన తలవెంట్రుకలతో ఊగే శిరస్సుతో ఉంటాడు. చింతకాయల వంటి జడలతో చిన్నికృష్ణుడు ఉన్నాడు.
బంగారు మువ్వలు గల కాలి గజ్జెలతో యశోదను విడువకుండా ఆమె వెనుకనే పారాడతాడు. ఇటువంటి చిన్ని శిశువును మనమెప్పుడూ చూడలేదు.
ముద్దుగా ఉన్న వేళ్లతో ఉంటాడు. వంకీల ఉంగరాలతో చిన్ని కృష్ణుని వేళ్లు ముద్దు ముద్దుగా ఉంటాయి. ! బంగారు మురుగులతో చేతులు మెరుస్తూ ఉంటాయి. చిన్ని కృష్ణుని బుగ్గలు అద్దాల లాగా మెరుస్తూ ఉంటాయి. పిల్లలంతా ‘అప్పలప్పలు’ అని ఆటలకు పిలిస్తే, వాళ్లను కసిరి, యశోదను కౌగిలించుకొంటాడు చిన్ని కృష్ణుడు. ! ఇటువంటి ముద్దుల కృష్ణుని మనమెప్పుడూ చూడలేదు.
నిండైన బొజ్జ మీద పాలచారలతో ఉంటాడు. వాళ్లమ్మను బెలిపించి కొసరి కొసరి తిన్న వెన్న నోటితోనే ! తిరుమల వేంకటాద్రిపై వెలిశాడు. లోకాలన్నీ కాపాడుతున్నాడు. ఇటువంటి చిన్ని శిశువును మనం ఎప్పుడూ చూడలేదు.