AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు నిర్వహించిన బాధ్యతలు పేర్కొనండి.
జవాబు:
భాషా క్షేత్రంలో చెరగని మైలురాళ్ళను నిలిపి, తరగని కీర్తిని ఆర్జించినవారు శ్రీ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఎందరో కాకలు తీరిన భాషా యోధులకు సర్వ సైన్యాధ్యక్షుడి లాంటి గురువు ఈయన. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తల్లో భారతదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు ఈయన.

మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ట్యూటర్ గా పనిచేసిన కృష్ణమూర్తిగారు తర్వాత ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులుగా సేవలందించి, చివరన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా (వైస్ ఛాన్సలర్) పదవీ బాధ్యతలు నిర్వహించారు. సందర్శకాచార్యులు (విజిటింగ్ ప్రొఫెసర్) గా మిచిగాన్, కార్నెల్ టోక్యో, హవాలీ, టెక్సాస్ వంటి ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో భాషాశాస్త్రాన్ని వివిధ దేశాల విద్యార్థులకు బోధించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రవేశపెట్టిన వ్యవహార భాషోద్యమ స్రవంతి ఆగిపోకుండా, కుంటు పడకుండా, మరింత ఉధృతంగా ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలకెత్తుకొని విజయవంతంగా నిర్వహించారు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు గొప్ప పరిశోధకులు; ఆచార్యులు; దీక్షాదక్షులు; పరిపాలకులు – అని సమర్థించండి.
జవాబు:
దక్షిణాసియా దేశాలన్నిటిలోనూ, మనదేశంలో, మనరాష్ట్రంలో మొట్టమొదటి వృత్తి పదకోశాన్ని తయారు చేసినవారు కృష్ణమూర్తిగారు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గురించి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషిచేసిన మహనీయుడు భద్రిరాజు కృష్ణమూర్తి.

వర్ణనాత్మక, చారిత్రాత్మక, తులనాత్మక భాషాధ్యయనశీలిగా; నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష గల్గిన సుప్రసిద్ధ పరిశోధకుడిగా, శిష్యుల పట్ల అపార వాత్సల్యాదులు కల్గిన ఉత్తమ ఆచార్యుడిగా; ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడిగా, నిరంతర శోధన, ఆదర్శవంతమైన బోధన, అగాధమైన విజ్ఞానం, సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా అంతర్జాతీయ కీర్తి గడించిన మన తెలుగు తేజం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్న కృష్ణమూర్తిగారు ఆధునిక భాషా, వ్యాకరణాంశాల మీద దృష్టి సారించడం తెలుగువాళ్ళ అదృష్టం. అనేక జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా భాషా శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించారు.

గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రవేశపెట్టిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకొని, భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు.

కృష్ణమూర్తిగారి భాషా పరిశోధన ఫలాలు తెలుగువాళ్ళకు మాత్రమే పరిమితం కావు. వారి ఆంగ్ల రచనలు ఇతర భాషల వాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణనిచ్చేవి, ఒరవడి పెట్టేవి. కాలిఫోర్నియాలో ఎం.బి.ఎమినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తి జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచనతో సాహితీరంగంలో ప్రవేశించారు భద్రిరాజు కృష్ణమూర్తి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడె….’ శ్రీనాథుని ప్రౌఢశైలిని తలపిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచన చేసిన పెద్దల మన్ననలను పొందారు. ప్రౌఢత, ప్రసాదగుణం కలిగిన పద్యాలు అలవోకగా, రాయడమే గాక కృష్ణమూర్తి అవధానం కూడా చేసేవారు.

శ్రీగంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు ఈయన. ఆంధ్ర, ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ట్యూటర్ గా, ఆచార్యులుగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసారు. ప్రసిద్ధిగాంచిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో సందర్శకాచార్యులుగా ఉన్నారు. తాను స్వయంగా రచించినవీ, సంపాదకత్వం వహించినవీ ఎన్నో గ్రంథాలు వెలుగులోనికి వచ్చాయి.

భాషా పరిశోధనకు ఉద్యమించక మునుపు భద్రిరాజు కృష్ణమూర్తిగారు ప్రొడత, ఆర్ధత కల్గిన కవిగా, అవధానిగా, సంప్రదాయ వ్యాకరణ అభ్యాసకునిగా, ట్యూటర్ గా, ఆచార్యునిగా, ఉపకులపతిగా, సందర్శకాచార్యులుగా, సంపాదకుడిగా ఇలా భిన్న పార్శ్వా లలో దర్శనమిస్తారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తి భాషాసేవను గురించి రాయండి.
జవాబు:
భాషాక్షేత్రంలో చెరగని మైలురాళ్ళను, తరగని కీర్తి శిఖరాలను నిలిపారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషా శాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వవేదిక మీద నిలబడి నినదించి, తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించిన వారు కృష్ణమూర్తిగారు. అంతేకాదు తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్నందించిన వారు ఈయన. దక్షిణాసియా దేశాలన్నింటిలోనూ ప్రప్రథమంగా వృత్తి పదకోశాన్ని తయారుచేసినవారు భద్రిరాజు కృష్ణమూర్తి. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషా శాస్త్రవేత్తలలో భారతదేశానికి చెందిన ఇద్దరిలో కృష్ణమూర్తిగారొకరు.

భాషకు మాండలిక ఆవశ్యకతను గుర్తించి, వృత్తి పదకోశాల నిర్మాణాన్ని తన శిష్యుల సహకారంతో నిర్వహించారు. తొలి ప్రయత్నంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను అందించారు. వీరి పరిశోధన తెలుగులోనే కాక “ద్రవిడియన్ లాంగ్వేజ్, కంపేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్ ……” వంటి రచనల ద్వారా ఇతర భాషలవాళ్ళు చేయవలసిన కృషికి ప్రేరణగా నిలిచాయి.

వయోజన విద్యావ్యాప్తి కోసం ‘జనవాచకం’, ‘తేలిక’ తెలుగువాచకం ఈయన రచించారు. శ్రీ పి. శివానందశర్మతో కలిసి ఇంగ్లీష్ ద్వారా తెలుగు నేర్చుకొనే వారికోసం ‘ఏ బేసిక్ కోర్స్ ఇన్ మోడ్రన్ తెలుగు’ రచించారు. ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు. తన సిద్ధాంత గ్రంథం “తెలుగు వెర్బల్ బేసెస్’, ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ గ్రంథాల ద్వారా విశేష ఖ్యాతిని పొందారు. ఈ విధంగా భాష, భాషోత్పత్తి, లిపి, ప్రాచీనత, వైవిధ్యత, రూప పరిణామ క్రమం తదితర అనేకానేక అంశాలను విస్తృతంగా పరిశోధించి, ప్రామాణిక రచనలను ప్రకటించి ప్రపంచ భాషాభిమానుల, పరిశోధకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు భద్రిరాజు కృష్ణమూర్తి.

9th Class Telugu ఉపవాచకం 5th Lesson ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్‌గా పనిచేశారు.
జవాబు:
ఆ) ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19న జన్మించారు.
అ) శ్రీ గంటి జోగి సోమయాజులు గారి వద్ద సంప్రదాయ వ్యాకరణం నేర్చుకున్నారు.
ఈ) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కృష్ణమూర్తి గారు ట్యూటర్ గా పనిచేశారు.
ఇ) 2012 ఆగస్టు 11న స్వల్ప అస్వస్థతతో దేహయాత్ర చాలించారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 2.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు.
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
జవాబు:
ఆ) 300 వృత్త పద్యాల్లో ‘మాతృ సందేశం’ అనే కావ్యం రచించి పెద్దల మన్ననలు పొందారు.
అ) వ్యవసాయ చేనేత వృత్తి పదకోశాలను అందించారు. ఈ) కాలిఫోర్నియాలో ఎం.బి.ఎ.మినో గారి శిష్యరికంలో ధ్వని, పదాంశ, వాక్యశాఖల్లో పరిశోధనలు చేశారు.
ఇ) హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
తెలుగుభాషకు వివిధ అంశాలలో సేవలు చేసిన మీకు తెలిసిన మహనీయుల పేర్లను రాయండి.
జవాబు:
భాషాశాస్త్రంలో దేశవిదేశాల్లో పేరెన్నికగన్నవారు చేకూరి రామారావుగారు. పాఠ్యగ్రంథ రచనల్లో బాగా పేరుగాంచిన రచయిత – ఆచార్య కె.కె. రంగనాధాచార్యులు. తెలుగు లిపి గురించి, పదప్రయోగాల గురించి అనేక అంశాలు సమగ్రంగా రచించినవారు – డా|| బూదరాజు రాధాకృష్ణగారు. తెలుగు అక్షర నిర్మాణం గురించి, ప్రత్యయాదుల ఉత్పాదకత గురించి ప్రయత్నించినవారు – డా|| ఉమామహేశ్వరరావు. మన రాష్ట్ర మాండలికాల్లో మధ్యమండలం కాక, మిగతా మూడు మాండలికాల్లో నవలా రచన చేసినవారు డా|| పోరంకి దక్షిణామూర్తిగారు. వీరంతా కాకలు తీరిన భాషా యోధులు.

ప్రశ్న 2.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు విశిష్ట వ్యక్తి అని తెలుసుకున్నాం కదా ! క్లుప్తంగా వారి గురించి రాయండి.
జవాబు:
సంప్రదాయ కవిత్వంతో పాటు ఆధునిక ప్రామాణిక భాషా విషయంలో తెలుగుభాషకు అనన్య సామాన్యమైన సేవలందించిన విశిష్ట వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి. ఈయన గురించి – భాషాశాస్త్రాన్ని, భాషా చరిత్రనూ విశ్వ వేదిక మీద నిలబడి నినదించారు. తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించారు. ద్రవిడ భాషల తీరు తెన్నుల గురించి తులనాత్మకంగా చర్చించి, భాషా పరిశోధకులకు కరదీపికగా నిలచారు. తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్ని అందించినారు. వృత్తి పదకోశాన్ని అందించిన దక్షిణాసియా దేశాల్లో ప్రప్రథముడు. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషాశాస్త్రవేత్తలలో మనదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గూర్చి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషి చేసిన మహనీయులు. ఇలా ఎన్నో అంశాలు స్పృశించి, తెలుగువారి గుండెలలో సుస్థిర స్థానం పొందారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

ప్రశ్న 3.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు:
తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచన చేసారు కృష్ణమూర్తిగారు. నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష ఆయనను సుప్రసిద్ధ పరిశోధకునిగా నిలబెట్టాయి. శిష్యుల పట్ల అపార వాత్యల్యాదరాలు చూపే ఉత్తమ ఆచార్యుడాయన. ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడు. నిండైన ఆత్మవిశ్వాసం, ఆదర్శవంతమైన బోధన ఆయనకున్న రెండు కళ్ళు. అందరినీ ప్రేమించే సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తిగారు.

ప్రశ్న 4.
భద్రిరాజు కృష్ణమూర్తిగారి రచనల పేర్లు రాయండి.
జవాబు:
‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నా……..’ శ్రీనాథుని ప్రొడశైలిని తలపిస్తూ ‘మాతృసందేశం’ 300 వృత్త పద్యాల్లో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచించి పెద్దల మన్ననలు పొందారు. ‘పితృస్మృతి’ వారి మరో గ్రంథం. మాండలిక వృత్తి పదకోశాలు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, కం పేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్, కరెంట్ పర్స్ పెక్టివ్స్, లాంగ్వేజ్ – ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనునవి ఇతర రచనలు. వీరి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు వెర్బల్ బేసెస్’ ప్రపంచ ఖ్యాతినార్జించి పెట్టింది. ‘ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయనం’ కాల్వెల్డ్ రచనకు దీటైనది.