AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు
10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
ప్రియసఖా!
నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. ఒకచోటి జీవిత విధానంలో మరొకచోటి జీవిత విధానాన్ని నిత్యమూ పోల్చి తెలుసుకొంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్న జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడమంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడమన్నమాట. పల్లెటూళ్ళు, అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుద్దీపాలతో, పంఖాలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? నీకుమా గ్రామ జీవితం అర్థం కావాలంటే, మా ఇంటికి ఒకసారి రా! ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు.
ఇటు,
నీ మిత్రుడు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఉత్తరాన్ని ఎవరు, ఎవరికి రాసి ఉంటారు?
జవాబు:
పల్లెటూరులో నివసించే వ్యక్తి పట్నంలో నివసించే తన మిత్రునికి ఉత్తరం రాసి ఉంటాడు.
ప్రశ్న 2.
దేని గురించి రాశాడు?
జవాబు:
పట్నవాసపు జీవితాన్ని, పల్లెటూరి జీవితంతో పోల్చి రాశాడు. పల్లెటూరి జీవితంలోని బాధలు రాశాడు.
ప్రశ్న 3.
లేఖను చదివారు కదా? మీరు ఏం గ్రహించారు?
జవాబు:
లేఖా రచయిత పల్లెటూరి వాడు. పేదవాడు. పట్నవాసంలో సుఖం ఉందని అతని భావన. పల్లెటూరి జీవితం, పట్నవాసపు జీవితం పరస్పర విరుద్ధమైనవని అతని భావం.
ప్రశ్న 4.
పల్లెటూళ్ళ, పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు?
జవాబు:
పల్లెటూరి జీవితంలో సుఖం తక్కువ. ఆధునిక సౌఖ్యాలు తక్కువగా ఉంటాయి. కానీ, మనుషుల మధ్య స్నేహం ఎక్కువ. కలిసిమెలిసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో అందరూ పాలు పంచుకొంటారు. ఆడుతూ పాడుతూ పనిపాటలు చేసుకొంటారు. హాయిగా కబుర్లు చెప్పుకొంటారు. విశాలమైన ఇళ్ళు ఉంటాయి. అరుగులు ఉంటాయి. ఆ అరుగులపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటారు. స్వార్థం తక్కువ. చాలామంది వ్యవసాయంపైన జీవిస్తారు. పగలంతా శ్రమ పడతారు. రాత్రంతా హాయిగా నిద్రపోతారు. వాతావరణ కాలుష్యం ఉండదు. ప్రకృతిలో లీనమై జీవిస్తారు.
పట్టణాలలో జీవితాలు సుఖంగా ఉంటాయి. ఆధునిక సౌఖ్యాలు ఎక్కువ. కాని, ఎవరి స్వార్థం వారిది. ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. మాట్లాడుకోరు. సహాయ సహకారాలు ఉండవు. ఇరుకు గదులలో నివాసాలు. చాలామంది ఉద్యోగులే. మితిమీరిన కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలకు నిలయం. ప్రకృతితో సంబంధంలేని జీవితాలు. అంతా . తొందరే. విపరీతమైన రద్దీ, కంగారు, హడావుడి పరుగులు.
ప్రశ్న 5.
పల్లెటూళ్ళ గురించి మీకు తెల్సింది చెప్పండి.
జవాబు:
అమ్మ ఒడిలోని కమ్మదనం పల్లెటూర్లలో ఉంది. తెలుగు భాషలోని తీయదనం అక్కడే ఉంది. పక్షుల కిలకిలారావాలతో మెలుకువ వస్తుంది. చెట్ల సందులలోంచి సూర్యోదయం చూడముచ్చటగా ఉంటుంది. లేగదూడల గంతులు బాగుంటాయి. కబుర్లు చెప్పుకొంటూ పొలాలకు వెళ్ళే రైతులతో సందడిగా ఉంటుంది. పిల్లలు చదువుల కోసం స్కూళ్ళకు వెడతారు. ఒకటే అల్లరి, అరుపులు, గోలగోలగా ఉంటుంది.
సాయంత్రం అందరూ ఇళ్ళకు చేరతారు, స్నానాలు చేసి, భోజనాలు చేస్తారు. పిల్లల ఆటలు, పాటలు. పెద్దల కబుర్లు, వేళాకోళాలు, వెక్కిరింతలు, నవ్వులు. నిద్రకుపక్రమిస్తారు. కల్మషం లేని మనుషులు. కాలుష్యం లేని వాతావరణం. దొరికిన దానితో తృప్తి పడతారు. పెడతారు. తింటారు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
పల్లె గొప్పదా? పట్నం గొప్పదా? మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు? ఎందుకు?
జవాబు:
పల్లె గొప్పది :
స్నేహం ఎక్కువ. మనుషుల మధ్య చక్కటి అనుబంధాలు ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కలసిమెలసి ఉంటారు. కష్టసుఖాలలో పాలుపంచుకొంటారు. కల్మషం ఉండదు. వాతావరణం కాలుష్యం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. రణగొణ ధ్వనులు ఉండవు. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కమ్మటి గేదె పెరుగుతో అన్నం తినవచ్చు. తాజాకూరలు దొరుకుతాయి. ఎవర్ని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. పల్లె తల్లిలాంటిది. తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రతగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. పల్లెను నమ్మినవాడే తెలివైనవాడు. పల్లెటూరే భూలోకస్వర్గం.
పట్నం గొప్పది :
చదువుకు బాగుంటుంది. చాలా కాలేజీలు, స్కూళ్ళు, లైబ్రరీలు ఉంటాయి. చదువుకొనేందుకు చాలా అవకాశాలు ఉంటాయి.. సేద తీరడానికి పార్కులు ఉంటాయి. సినిమాహాళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు సర్కర్లు కూడా ఉంటాయి.
చదువుకొన్నాక మంచి ఉద్యోగానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిభ చూపిస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కూడా వస్తుంది. హాయిగా, సుఖంగా జీవించవచ్చు. చక్కటి నివాసాలు ఉంటాయి. రోడ్లు కూడా బాగుంటాయి. 24 గంటలూ జనంతో కలకలలాడుతూ ఉంటుంది. ఏ వస్తువైనా దొరుకుతుంది. ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళాలన్నా వాహనాలు దొరుకుతాయి. భయం ఉండదు. పెళ్ళివారిల్లులా సందడిగా ఉంటుంది.
(సూచన : విద్యార్థులలో ఎవరికి ఏది ఇష్టమైతే దానిని గొప్పదిగా చెప్పవచ్చు. )
ప్రశ్న 2.
గతంతో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? తెల్సుకొని చర్చలో పాల్గొనండి.
జవాబు:
వ్యవసాయం చేయాలంటే ఓర్పు కావాలి. శారీరకంగా కష్టపడాలి. రాత్రనక, పగలనక కష్టపడాలి. చాలా బాధలుపడాలి.
కాని, ఇప్పటివారికి ఓర్పు తక్కువ. కష్టపడే తత్వం తగ్గింది. నిరంతరం శ్రమపడే స్వభావం లేదు. సుఖవాంఛ పెరిగింది. సులువుగా డబ్బు సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. పట్నవాసపు మోజు పెరిగింది. చదువుకొని, ఉద్యోగం చేయాలనే కోరిక పెరిగిపోయింది. వ్యవసాయంలో నష్టాలు కూడా కారణం. సరైన ధర రాదు. అప్పులతో బాధపడాలి. కూలిరేట్లు పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. సౌఖ్యం తక్కువ. కష్టం ఎక్కువ. అందుకే వ్యవసాయం చేయడానికి నేడు ఇష్టం చూపించటం లేదు.
ప్రశ్న 3.
కింది వాక్యాలు చదవండి. వీటిని ఏ సందర్భంలో ఎవరు అన్నారు?
అ) అన్నాయ్! ఈ లెక్క చెప్పి పడుకోకూడదా !
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “ జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయితను నిద్రపొమ్మని వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు, ఆయన చెల్లెలు రచయితతో పలికిన వాక్యమిది.
భావం : రచయిత చెల్లెలు తనకు లెక్క చెప్పమని అడిగింది.
ఆ) “అయితే యీ రూపాయిని గుణించి అణాలు చేయి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయిత తన చెల్లికి లెక్క చెప్పే సందర్భంలో, రచయిత తల్లి, ఆయన చెల్లితో పలికిన వాక్యమిది.
భావం : రూపాయిని అణాలుగా చేయాలంటే పుస్తకాలు, తెలివి. అక్కర్లేదు. దుకాణం వద్దకు వెడితే వస్తుంది. ఆచరణలో ఉపయోగించే చదువు కావాలని భావం.
ఇ) “వరిచేలో నీరుపడ్డది, నీవు రావాలి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : నిజజీవితానికి, చదువులకూ గల సంబంధం రచయిత ఆలోచిస్తున్న సందర్భంలో కోటయ్య రచయితతో పలికిన వాక్యమిది.
భావం : కోటయ్య వరిచేలో నీరు పడింది. రచయిత సహాయం కోరి వచ్చాడు.
4. (బోయి భీమన్న రాసిన “ధర్మం కోసం పోరాటం” లోని) కింది పేరా చదవండి. పేరాలోని కీలకమైన ఐదు పదాలను గుర్తించండి.
పనిచేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది. అనుభవాన్ని మళ్ళీ ఆచరణలో పెడితే, పని మరింత చక్కగా సాగుతుంది. అప్పుడు అనుభవానికి మరింత పదునూ, కాంతి లభిస్తుంది. వాస్తవ జ్ఞాన సముపార్జన పద్ధతి ఇది. వాస్తవ జ్ఞానమే సరియైన జ్ఞానం. వాస్తవ జ్ఞానం ఎడతెగని పని ద్వారా, పరిశీలన ద్వారా లభిస్తుంది. వాస్తవ జ్ఞానం దేశకాల ప్రాంతానుగుణమై ఉంటుంది. దేశకాల ప్రాంతానుగుణంగా మారుతుంది. మన వస్త్రధారణ, వివాహాలు, పరిపాలన విధానాలు, ఈ విధంగా విభిన్న విషయాన్ని తీసుకొని మనం పరిశీలించినా, ఈ సత్యం కనిపిస్తుంది. మంచి చెడ్డలు, ఆచార వ్యవహారాలు, విధి విధానాలు అన్నీ దేశకాల ప్రాంతానుగుణంగా ఎలా మారిపోతున్నాయో స్పష్టమవుతుంది. మార్పుకు అతీతమైంది ఏదీ ఈ లోకంలో లేదు.
జవాబు:
కీలకపదాలు :
కీలకపదాలు అంటే ఆ పేరాకు ప్రాణం వంటి పదాలు. ఆ పదాలకు వ్యాఖ్యానము, విశ్లేషణ పేరాలో కనబడుతుంది. అంటే ఆ పదాలు లేకపోతే ఆ పేరాకు సమగ్రమైన విలువ ఉండదు. ఈ పేరాలోని కీలక పదాలు కింద ఉన్నాయి గమనించండి.
1) పని
2) అనుభవం
3) జ్ఞానం
4) పరిశీలన
5) మార్పు
పై పేరా ఆధారంగా కింది వాక్యాలలో ఏవి సరైనవో (✓) ద్వారా గుర్తించండి.
అ) అనుభవం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. ( ✓ )
ఆ) ‘జ్ఞానం’ అనేది చదివితే, వింటే లభించేది. ( ✗ )
ఇ) వాస్తవ జ్ఞానం స్థిరంగా ఉండదు. అది కాలానుగుణంగా మారుతుంటుంది. ( ✓ )
ఈ) అనుభవం, పరిశీలన వల్ల వాస్తవ జ్ఞానం సిద్ధిస్తుంది. ( ✓ )
ఉ) మన ఆచార వ్యవహారాలు, విధి విధానాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. ( ✗ )
5. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) జానపదుని లేఖలో కవి ఏ ఏ విషయాలను గురించి రాశారు?
జవాబు:
పల్లెటూరి చమత్కారాలు వివరించాడు. సరదాగా జరిగే వాదప్రతివాదనలు వివరించాడు. మానవ మనస్తత్వం, చదువులను విశ్లేషించాడు. పొలం పనులలో సాధక బాధకాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.
ఆ) వ్యవసాయదారుల కష్టాన్ని కవి ఏమని వివరించారు?
జవాబు:
వ్యవసాయ కూలీలు, రైతులు అనేక కష్టాలుపడతారు. ముందు దుక్కి దున్నుతారు. విత్తనాలు చల్లుతారు. నీటి కొరకు పోటీపడతారు. కూలి గురించి పోటీపడతారు. ఆకుమడికి కాపలా కాస్తారు. రాత్రీ, పగలూ చేలోనే ఉంటారు. జెర్రులూ, తేళ్ళూ కుడతాయి. పాములు కరుస్తాయి. వానా, బురదా లెక్కచేయకుండా చేస్తారు. ఎరువులు వేస్తారు. కలుపు తీస్తారు. అన్ని జాగ్రత్తలతో పంట పండిస్తారు. పంటను ఎలుకలు, చిలుకలు తినేయకుండా కాపాడతారు. చివరకు ఆ పండిన ధాన్యం భూస్వామికి కొలిచి అప్పగిస్తారు. తమ కడుపులు కాల్చుకొంటారు. తమ కన్నీళ్ళు అలాగే ఉంటాయి. ఎంత రాతి గుండెనైనా కరిగించే కష్టాలు వారివి అని రచయిత తన లేఖలో వ్యవసాయదారుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.
ఇ) చదువుకొన్న వాళ్ళ గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని ప్రస్తావించారు?
జవాబు:
పట్టణంలో కాలం కచ్చితంగా పాటిస్తారు. పట్నం వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు కష్టపడి సంపాదించిన దానిని తింటారు. ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. ఆ సుఖాలన్నీ పల్లెటూరి వారు కష్టపడి సమకూర్చినవే.
ఈ) జానపదుడు తన పట్టణం మిత్రుణ్ణి పల్లెటూరుకు ఎందుకు రమ్మని ఆహ్వానించాడు?
జవాబు:
పల్లెటూరి వాళ్ళు పడే కష్టాన్ని చూడడానికి రమ్మన్నాడు. ఆ కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు, మానవ సంఘానికి ఇచ్చే ఆనందాన్ని అవగాహన చేసుకొనేందుకు రమ్మన్నాడు. పల్లెటూళ్లో దొరికే నారింజపళ్ళూ, వెలపళ్ళూ, కొబ్బరి కురిడీలూ మొదలైనవి తినడానికి రమ్మన్నాడు.
ఉ) బోయి భీమన్న గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా )
‘జానపదుని జాబు’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు:
బోయి భీమన్న 19 సెప్టెంబర్, 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. తన రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. డా|| బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు,
జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మం కోసం పోరాటం మొదలైనవి 70కి పైగా రచనలు చేశారు. పాలేరు నాటకం చాలామంది జీవితాలను మార్చింది.
‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ రచనకు 1975లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’, ‘గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేసింది. 1991లో రాజ్యలక్ష్మీ అవార్డు వచ్చింది.
II. వ్యక్తీకరణ సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “ఏమీ పని లేకపోవడమే బద్దకానికి కారణం” దీనిపై మీ అభిప్రాయం తెల్పండి.
జవాబు:
పని ఉంటే తిండి పైనా, నిద్రపైనా ధ్యాస ఉండదు. పని లేకపోతే ఏదైనా తినాలనిపిస్తుంది. తిండి ఎక్కువైతే నిద్ర వస్తుంది. నిద్ర ఎక్కువైతే మత్తుగా ఉంటుంది. ఆ మత్తునే బద్దకం అంటారు. బద్దకం అలవాటైతే, పని ఉన్నా చేయలేం. అందుచేత బద్దకం అలవాటు చేసుకోకూడదు. పని లేకపోతే ఏదైనా పని కల్పించుకొని చేయాలి.
ఆ) “కాలం చాలా విలువైంది” ఎందుకు?
జవాబు:
ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చును. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చును. పరువు పోయినా, ప్రవర్తన మార్చుకొని, మంచి పనులు చేసి తిరిగి సంపాదించవచ్చును. కాని, కాలం గడిచిపోతే తిరిగి సంపాదించలేం. గడిచిపోయిన ఒక్క సెకను కూడా తిరిగిరాదు. బాల్యంలో సంపాదించవలసిన జ్ఞానం అప్పుడే సంపాదించాలి. చదువు, ఆటలు, పాటలు, ధనం, కీర్తి ఏదైనా సరే సకాలంలో సంపాదించాలి. కాలం గడిచిపోయాక బాధపడినా ప్రయోజనం లేదు. అందుకే కాలాన్ని వృథా చేయకూడదు. సక్రమంగా వినియోగించుకోవాలి.
ఇ) చదువుకున్నవాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
సూచన : రచయిత అభిప్రాయంతో కీభవించవచ్చు. వికీభవించక పోవచ్చును. అందుచేత రెండు అభిప్రాయాలు ఇవ్వబడ్డాయి. మీకు నచ్చిన ఒక అభిప్రాయాన్నే గ్రహించండి.
జవాబు:
i) రచయిత అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే విద్యార్థులు కళాశాలలో, పాఠశాలలో, ఉన్నత విద్యలోనూ అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆ విద్యార్థులకు ఆ సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పిస్తోంది. దానికి ఖర్చయ్యేది ప్రభుత్వ ధనం. అంటే పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బు కదా ! మరి, పేద ప్రజల డబ్బుతో సదుపాయాలు పొంది, చదువుకొన్నవాళ్ళు పట్నాలకు వెడుతున్నారు. అక్కడ హాయిగా సుఖపడుతున్నారు. పల్లెటూర్ల వైపు కన్నెత్తి చూడరు. తమ అభివృద్ధికి కారకులైన సామాన్యులను పట్టించుకోరు. ధన సంపాదనలో మునిగిపోతారు.
ఉదాహరణకు ఒక డాక్టరు తయారవ్వాలంటే కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బంతా ప్రజాధనమే. కాని, చదువు పూర్తయ్యాక పల్లెటూర్లో ఉండడానికి ఎవ్వరూ అంగీకరించరు. వైద్యశాలల్లో డాక్టర్లు లేక, మందులు లేక పల్లెటూరి రోగులు అనేక బాధలు పడుతున్నారు కదా ! చాలా వృత్తులు ఇలాగే ఉన్నాయి. అందుచేత రచయిత అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ సమర్థించతగినది.
ii) “చదువుకొన్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ, పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారు” అన్న రచయిత అభిప్రాయంతో ఏకీభవించను. ఎందుకంటే చదువుకొన్న వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదలు ఉంటారు. దళితులు ఉంటారు. కూలిపని చేసుకొనే వారి కుటుంబాల నుండి వచ్చిన వారుంటారు. లేఖా రచయిత కూడా పేద దళిత వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చదువుకొన్నవాడు.
అన్ని ఉద్యోగాలూ పట్నాలలోనే లేవు. ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీసు మొదలైన ఉద్యోగాలు పల్లెటూళ్ళలోనివే. పోలీసు వంటి ఉద్యోగం ప్రాణాలతో చెలగాటం కూడా. నిరంతరం ప్రమాదపుటంచున వారి జీవితాలు ఉంటాయి. అందర్నీ రక్షిస్తారు. కాని, వారికి రక్షణ లేదు.
చదువుకొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగులు అందరూ పట్నాలలోనే లేరు. పల్లెటూళ్ళలోనూ ఉన్నారు. భయంకరమైన అడవులలో, కొండలలో కూడా ఉద్యోగులు ఉన్నారు. కనుక రచయిత అభిప్రాయంతో నేను ఎట్టి పరిస్థితులలోనూ ఏకీభవించను.
ఈ) “కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది” అని అనడంలో రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది?
(లేదా)
‘కష్టం ఒకళ్ళది ఫలితం మాత్రం మరొకళ్ళది’ అని రచయిత అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుందో “ జానపదుని జాబు” అనే పాఠం ఆధారంగా రాయండి. .
జవాబు:
పల్లెటూరి వాళ్ళు ఎంతో కష్టపడతారు. కూలిపని చేస్తారు. పస్తులు ఉంటారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తారు. రాత్రనక, పగలనక అనేక కష్ట నష్టాల కోర్చి పంటను పండిస్తారు. కంటికి రెప్పలా కాపాడతారు. కాని, పండించిన దానిలో ఎక్కువ భాగం ఆ పొలం సొంతదారునకు ఇవ్వాలి. వాళ్ళు కష్టపడకుండా తీసుకొంటారు. హాయిగా అనుభవిస్తారు.
ఈ విధానం మారాలని రచయిత ఉద్దేశం. దున్నేవానిదే భూమి కావాలనేది రచయిత ఉద్దేశం. పేదరికం పోవాలంటే, పేదలకు భూమిపై హక్కు ఉండాలనేది రచయిత ఉద్దేశం.
ఉ) “పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి” దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నారు మహాకవి గుఱజాడ అప్పారావు అలాగే పల్లెటూళ్ళు అంటే, పల్లెటూళ్ళలోని మనుషులు అని అర్థం. పల్లెటూరిలో చాలామంది రైతులే ఉంటారు. వారు ఎండనక వాననక, పగలనక రాత్రనక చేలల్లో కష్టపడతారు. దుక్కి దున్నుతారు. నీరు పెడతారు. విత్తనాలు చల్లుతారు. చీడపీడల నివారణకు ఎరువులు వేస్తారు. కలుపుతీస్తారు. పంట పండిస్తారు. కుప్ప నూర్చుతారు. ఆ పండిన పంటంతా భూస్వామికి ఇస్తారు. తాము మాత్రం పస్తులుంటారు. వారికి కన్నీళ్ళే మిగులుతున్నాయి.
2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకూ తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? ఇవి కలకలలాడాలంటే మనం ఏం చేయాలి?
జవాబు:
పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉండాలంటే, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ‘దున్నేవాడిదే భూమి’ కావాలి. పండించిన పంటకు సరైన ధర రావాలి. ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. నీటి సదుపాయం ఉండాలి. రైతులకు జీవితబీమా ఉండాలి. అప్పుడు వ్యవసాయంపై జనానికి మక్కువ పెరుగుతుంది. పట్నపు వలసలు ఆగుతాయి. పల్లెలు కళకళలాడతాయి. పల్లెలు కళకళలాడితే ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది.
ఉనికి :
పల్లెటూళ్ళలో బ్రతుకు తెరువు లేక జనం పట్నాలకు వలసపోతున్నారు. జనం లేక పల్లెటూళ్ళు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జనానికి పనులు లేవు. వ్యవసాయం చేసినా నష్టాలు తప్పడం లేదు. వారు కూడా పట్నాలకో, ఇతర దేశాలకో ‘పనికోసం’ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. అందుకే ఉనికి కోల్పోతున్నాయి.
సంస్కృతి :
పల్లెటూరిలో చాలామంది వ్యవసాయదారులు ఉంటారు. ధాన్యపుగింజలకు లోటుండదు. తిండికి లోటు ఉండదు. అందుచేత ఎవరికైనా క్రొత్తవారికి కడుపునిండా తిండి పెట్టేవారు. ఆదరించేవారు, ఆప్యాయంగా పలకరించేవారు. పాడి పశువులుంటాయి. కనుక పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా ఉండేవి. ప్రతి ఇంటా ఇవి సమృద్ధిగా ఉండేవి. క్రొత్తవారికి ఉచితంగా ఇచ్చేవారు. ఇది పల్లెటూరి సంస్కృతి.
కాని వ్యవసాయంలో కన్నీరే మిగులుతోంది. పశుపోషణ తలకు మించిన భారమౌతోంది. అందుచేత పల్లెటూళ్ళు తమ సంస్కృతిని కోల్పోతున్నాయి. అసలే జనాలు లేరు. ఉన్నవారికి బాధలు. ఇక సంస్కృతి ఎలా నిలబెట్టుకొంటారు.
ఆత్మ :
పల్లెటూరికి ఆత్మ ఆత్మీయత. ఎవరినైనా ఆత్మీయంగా పలకరించడం పల్లెటూరి లక్షణం. కేవలం పలకరించడమే కాదు, వారి కష్ట సుఖాలలో పాల్గొనడం, పదిమందికీ పెట్టడం, గలగలా నవ్వడం, చకచకా పనులు చేయడం. కల్మషం, మోసం తెలియకపోవడం, ఇవన్నీ పల్లెటూరి లక్షణాలు.
కాని, పట్నవాసపు పోకడలు నేడు బాగా పెరిగిపోయాయి. అందుచేత ‘అమాయకత్వం’ స్థానంలో ‘మాయకత్వం’ వచ్చింది. మాయకత్వం ఉన్నచోట పై పేరాలో లక్షణాలేవీ ఉండవు. అందుచేతనే పల్లెటూరికి ‘ఆత్మ’ కూడా తొందరగా కనుమరుగవుతోంది.
పల్లెటూళ్ళు కళకళలాడాలంటే వాటి ఉనికి, సంస్కృతి, ఆత్మలను కాపాడాలి. కేవలం ఉపన్యాసాల వల్ల ఇవి సాధ్యం కావు. పట్టుదలతో కృషి చేయాలి. సమాజాన్ని పూర్తిగా సంస్కరించాలి.
ఆ) ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి.
(లేదా)
“పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది.” మీ అభిప్రాయం తెల్పండి.
(లేదా)
పల్లె జీవితంలోని అనుకూల అంశాలను వివరిస్తూ పది వాక్యాలలో ఒక వ్యాసం రాయండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. రణగొణ ధ్వనులు ఉండవు. అందుచేత ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కర్మాగారాలుండవు. వాహనాల పొగ ఉండదు. అందుచేత కాలుష్యం ఉండదు. కాలుష్యం లేని నివాసమే స్వర్గం కదా ! జనాభా తక్కువ కనుక సమస్యలుండవు. ఇరుకు ఉండదు. చక్కగా పచ్చటి ప్రకృతి, ఎటుచూసినా వరిచేలు, జొన్నచేలు, మొక్కలు, చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. హాయిగా అమ్మ ఒడిలోని కమ్మదనం అంతా పల్లెటూరి జీవితంలో అనుభవించవచ్చును.
ఎవర్ని పలకరించినా ఆప్యాయంగా మాట్లాడతారు. కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటారు. దొంగల భయం ఉండదు. పక్షుల కిలకిలలతో రోజు ప్రారంభమౌతుంది. వెన్నెలలో ఆటలతో, కబుర్లతో, కథలతో, నవ్వులతో, నిద్రమంచం పైకి చేరతాం.
ఇంతకంటే సౌఖ్యవంతమైన జీవితం ఎక్కడా ఉండదు. అందుకే పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని కచ్చితంగా చెప్పవచ్చును.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) మీరు చూసిన పల్లెటూరులోని మనుష్యుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:
మసకపల్లి, ప్రియమైన రాంబాబుకు, అమలాపురం డివిజన్లో మామిడికుదురు మండలంలోని గ్రామం ఆదుర్రు. ఊరంతా పచ్చటి పంటపొలాలు. ఎటుచూసినా తివాచీ పరచినట్లుగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొబ్బరిచెట్లు చాలా ఉన్నాయి. బారులు తీరి నిలబడిన సైనికుల్లా ఉంటాయి. ఇంకా రకరకాల పూలమొక్కలు, చెట్లు ఉన్నాయి. అవి అన్నీ చూస్తుంటే అస్సలు సమయం తెలియదు. ఆ ఊర్లో నది ఉంది. దాని పేరు వైనతేయ నది. ఆ నది ఒడ్డున బౌద్ధస్థూపం ఉంది. ఎత్తుగా ఉంది. అక్కడ బుద్ధునికి సంబంధించినవి ఉన్నాయట. చాలా పెద్ద పెద్ద ఇటుకలున్నాయి. పెద్ద మట్టి చెట్టు ఉంది. దాని ఊడలతో ఉయ్యాల ఊగాము. భలే సరదాగా ఉంది. ఆ చెట్లపై ఎన్నో పక్షులున్నాయి. అవి చేసే గోల భలే తమాషాగా ఉంది. అక్కడ ఎవరిని పలకరించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉపాధ్యాయులు నరసింహంగారు అనే పెద్దాయన ఆ ఊరు మొదట నిర్మింపబడిందని చెప్పారు. ‘ఆది ఊరు’ కనుక ఆదుర్రు అయింది అన్నారు. రెండు నెలల సెలవులు ఇట్టే అయిపోయాయి. ఈసారి సెలవులకి మనిద్దరం కలసి వెళదాం. నువ్వెక్కడికైనా వెళ్ళావా? లేదా? రిప్లై రాయి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారములని చెప్పు. ఇక ఉంటాను మరి. టా…టా… ఇట్లు చిరునామా: |
ఆ) ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు రాయండి.
జవాబు:
1. నినాదాలు : | 2. సూక్తులు: |
1) వలసలు మానండి, పల్లెలు నిలపండి. | 1) రైతు దేశానికి వెన్నెముక. |
2) వ్యవసాయం చేద్దాం, ఆత్మగౌరవంతో జీవిద్దాం. | 2) పల్లెటూర్లే దేశానికి పట్టుగొమ్మలు. |
3) అప్పుకు భయపడకు, ఆశను పెంచుకో. | 3) పల్లెను, తల్లిని కాపాడాలి. |
4) పల్లెటూర్లే మనదేశ ధాన్యాగారాలు. | 4) అన్నం పెట్టే తల్లివంటిదే పల్లె, |
5) పల్లెటూరిని, తల్లిని విడిచిపెట్టకు. | 5) పల్లెటూరులో జీవితం ప్రశాంతం. |
6) పల్లెలు పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయి. | |
7) రణగొణ ధ్వనులు లేని పల్లెటూర్లు ప్రశాంతమైన పడకటిళ్ళు. |
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
అందమైన పల్లెటూరు ఎలా ఉంటుందో ఊహించండి. ప్రకృతి శోభలతో అలరారే అలాంటి గ్రామసీమ చిత్రాన్ని సేకరించండి. దాన్ని వర్ణిస్తూ, వివరాలను రాసి ప్రదర్శించండి. మీ మిత్రులు కూడా ఇలాగే రాస్తారు కదా! వీటితో “అందమైన గ్రామ సీమలు” అనే పుస్తక సంకలనం చేయండి. దానికి ముఖచిత్రం కూడా గీయండి. విషయసూచిక, ముందు మాట రాసి ప్రదర్శించండి.
జవాబు:
( అందమైన గ్రామాలు (సంకలన గ్రంథం) )
ముఖచిత్రం :
ప్రతి వర్ణనలోని విషయం వచ్చేలా ఉండాలి. (అట్ట)
అట్టపైన :
గుబురుగా ఉన్న చెట్ల సందులలోంచి సూర్యోదయం. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు. పెంకుటిళ్ళు, పాకలు చిత్రించాలి. పొలం పనులకు వెళ్ళే స్త్రీ, పురుషులను చిత్రించాలి. గంతులేస్తున్న లేగదూడలను చిత్రించాలి.
III. భాషాంశాలు :
పదజాలం
1. కింది పదాలు చూడండి. వాటికి సంబంధించిన పదాలతో కలపండి.
ఉదా : రైల్వేస్టేషను, …………., ……….., చేరుకోడం.
జవాబు:
రైల్వే స్టేషను, టిక్కెట్టు, ప్రయాణం, చేరుకోడం.
అ) వర్షాకాలం, ………….., ………………… ధాన్యం.
జవాబు:
వర్షాకాలం, విత్తడం, నూర్చడం, ధాన్యం.
ఆ) మడిదున్నడం, …………., …………., పంట.
జవాబు:
మడిదున్నడం, నీరు పెట్టడం, వరినాటడం, పంట.
ఇ) పాఠశాల, …………, ………… జీవితంలో స్థిరపడడం.
జవాబు:
పాఠశాల, చదువు, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడం.
ఈ) లేఖ, ………….., ……………, చేరడం.
జవాబు:
లేఖ, విషయం , చిరునామా, చేరడం.
ఉ) పనిచేయడం, …….., ……., ఆనందంగా జీవించడం.
జవాబు:
పనిచేయడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఆనందంగా జీవించడం.
2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పొద్దస్తమానం
ఆ) చమత్కారం
ఇ) సాన్నిధ్యం
ఈ) కష్టఫలం
ఉ) కడుపులు మాడ్చుకొను
ఊ) అడుగున పడిపోవు
అ) పొద్దస్తమానం : పొద్దస్తమానం పనిచేస్తే, ‘రాత్రి బాగా నిద్ర పడుతుంది.
ఆ) చమత్కారం : చమత్కారంగా మాట్లాడే వారంటే నాకిష్టం.
ఇ) సాన్నిధ్యం : భక్తులు దేవుని సాన్నిధ్యంలో ఆనందపడతారు.
ఈ) కష్టఫలం ” : ఎవరి కష్టఫలం వారికి మధురంగా ఉంటుంది.
ఉ) కడుపులు మాడ్చుకొను : కొంతమంది కడుపులు మాడ్చుకొని పిల్లలను చదివిస్తారు.
ఊ) అడుగున పడిపోవు : జ్ఞానం విషయంలో అడుగున పడిపోవడం పనికిరాదు.
3. కింది పదాలు/ వాక్యాలను వివరించి రాయండి.
అ) పురిటిలోనే సంధి కొట్టడం :
సాధారణంగా ‘సంధి’ అనే వ్యాధి వచ్చినవారు బ్రతకరు. ఇది వృద్ధాప్యంలో వస్తుంది. ‘సంధి’ అంటే ‘మతి చలించడం’ అని చెప్పవచ్చును. ‘సంధి’ వచ్చినవారు సంబంధంలేని మాటలు మాట్లాడతారు. ఇది కూడా ఒకరకపు వాతరోగంగా ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.
పురిటిలో ఏ రకమైన వాతరోగమైనా రావచ్చును. కాని, ‘సంధి వాతరోగం’ రాదు. అటువంటిది పురిటి శిశువుకు ‘సంధి వాతం’ రావడం జరిగితే ఆ శిశువు బ్రతకదు.
అదే విధంగా ప్రారంభంలోనే పాడైపోయిన పని గురించి వివరించేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
చదువుదామని పుస్తకం తీయగానే కరెంటు పోవడంతో పురిటిలోనే సంధి కొట్టినట్లయింది ఈ రోజు చదువు.
ఆ) కలుపుతీయడం :
చేలలో వేసిన పంటతో బాటు అనవసరమైన మొక్కలు కూడా పెరుగుతాయి. ఈ అనవసరమైన మొక్కలను ‘కలుపు మొక్కలు’ అంటారు. చేనుకు వేసిన ఎరువును ఈ కలుపు మొక్కలు కూడా తీసుకొంటాయి. బాగా పెరుగుతాయి. వీటి వలన చేనుకు బలం తగ్గుతుంది. అందుచేత అనవసరమైన మొక్కలను (కలుపు మొక్కలను) పీకి, పారవేస్తారు. దీనినే కలుపు తీయడం అంటారు.
అలాగే సమాజంలో ఉంటూనే, సమాజాన్ని పాడుచేసేవారిని కూడా కలుపు మొక్కలు అంటారు.
సొంతవాక్యం :
1) చేలో కలుపు తీయడానికి నలుగురు కూలీలు కావాలి.
2) లంచగొండులైన కలుపు మొక్కలను ఏరిపారేస్తేనే సమాజం బాగుపడుతుంది.
ఇ) గ్రామోద్ధరణం :
గ్రామానికి ఉన్న సమస్యలను పరిష్కరించడాన్నే గ్రామోద్దరణం అంటారు. ఉదాహరణకు మురుగునీటి సమస్యను నివారించడం, విద్యుత్తు, ఆసుపత్రి, మంచినీరు మొదలైనవి కల్పించడం.
సొంతవాక్యం :
“గ్రామోద్ధరణమే దేశోద్ధరణం” అన్నారు గాంధీజీ.
ఈ) ఉన్నదంతా ఊడ్చుకపోవడం :
ఊడ్చుకపోవడం అంటే పూర్తిగా నాశనం కావడం. అధిక వర్షాలు, గాలివాన వంటి ఉపద్రవాలతో పంటలు నష్టపోగా, ఇంతలో వరదలు, ఉప్పెనలు వంటివి వచ్చి, పూర్తిగా పంటలు కొట్టుకుపోవడం వంటివి జరిగితే “ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని” అంటారు. పూర్తిగా నష్టం కలిగించిందని భావం.
వ్యాకరణాంశాలు
1. కింది. వాక్యాల్లోని సంధులను విడదీసి, సంధి సూత్రంతో సమన్వయం చేయండి.
అ) ఆహాహా! ఎంత వైపరీత్యము !
ఆ) జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూశావు ?
ఇ) అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
ఈ) వెన్నెల పట్టపగలును తలపిస్తున్నది.
సంధి పదాలు :
ఆహాహా, ఏమేమి, అక్కడక్కడ, వెన్నెల, పట్టపగలు, తలెత్తవచ్చు, తలపిస్తున్నది.
వివరణ :
ఆమ్రేడిత సంధి
సూత్రము : అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తఱచుగానగు.
సూచన : ఒక పదం రెండుసార్లు ఉచ్చరిస్తే, రెండవదానిని ఆమ్రేడితం అంటారు. ఇక్కడ అత్వ, ఇత్వ, ఉత్వ సంధులు చెప్పకూడదు. ఆమ్రేడిత సంధి మాత్రమే చెప్పాలి.
ఆహా + ఆహా ఆహాహా (ఆ + ఆ = ఆ)
ఏమి + ఏమి = ఏమేమి (ఇ + ఏ = ఏ)
అక్కడ + అక్కడ = అక్కడక్కడ (అ + అ = అ)
ఆమేడిత సంధి
సూత్రము :
ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు. కడ, చివర, తుద, మొదలైనవి కణాదులు.
పగలు + పగలు = పట్టపగలు
ప్రాతాది సంధి
సూత్రము :
అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచో గానంబడియెడి.
వివరణ :
ప్రాతాదుల తొలియచ్చుమీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు – ఈ సూత్రం ద్వారా ప్రాతాదులలో . ‘వెల్ల’ అనే పదం లేకపోయినా పైన వ్రాసిన సూత్రం వలన ‘ల్ల’ కు లోపం వస్తుంది. వెల్ల + నైల = వెన్నెల
అత్వ సంధి
సూత్రము :
అత్తునకు సంధి బహుళంబుగానగు.
తల + ఎత్తవచ్చు . – తలెత్తవచ్చు (అ + ఎ = ఎ)
ఉత్వ సంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు.
తలపు + ఇస్తు + ఉన్నది = తలపిస్తున్నది – (ఉ + ఇ = ఇ, ఉ + ఉ = ఉ)
2. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
అ) రాము పాఠం చదివాడు. రాము పాఠం అర్థం చేసుకున్నాడు.
జవాబు:
రాము పాఠం చదివి, అర్థం చేసుకున్నాడు.
ఆ) వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు.
జవాబు:
వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.
ఇ) అక్క టీవీ చూస్తున్నది. అక్క నృత్యం చేస్తున్నది.
జవాబు:
అక్క టీవీ చూస్తూ, నృత్యం చేస్తున్నది.
3. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
అ) రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు.
జవాబు:
రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురుశిష్యులు.
ఆ) సీత సంగీతం నేర్చుకుంటున్నది. సీత నృత్యం నేర్చుకుంటున్నది.
జవాబు:
సీత సంగీతం మరియు నృత్యం నేర్చుకుంటున్నది.
ఇ) రంగారావుకు పాడటమంటే ఆసక్తి. రంగారావుకు వినడమంటే విరక్తి.
జవాబు:
రంగారావుకు పాడటమంటే ఆసక్తి మరియు వినడమంటే విరక్తి.
ఈ) శ్రీను బడికి వచ్చాడు. జాన్ రెడ్డి బడికి వచ్చాడు. హస్మత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీను, జాన్ రెడ్డి మరియు హస్మతలు బడికి వచ్చారు.
ఉ) ఆయన కవి. ఆయన గాయకుడు. ఆయన విద్యావేత్త.
జవాబు:
ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ప్రాతాది సంధి
4. కింద గీత గీసిన పదాలను విడదీయండి. మార్పులు గమనించండి.
అ) పూరెమ్మ అందంగా ఉన్నది.
ఆ) గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు.
ఇ) రవికి పాల మీఁగడ అంటే చాలా ఇష్టం.
ఈ) కొలనులో కెందామరలు కొత్త శోభను వెదజల్లుతున్నాయి.
సంధి జరిగిన తీరును గమనించండి.
అదనపు సమాచారము
సంధులు
1) నెచ్చెలి = నెఱ + చెలి – ప్రాతాది సంధి
2) మాయమ్మ = మా + అమ్మ – యడాగమ సంధి
3) మామయ్య = మామ + అయ్య – అత్వ సంధి
4) స్వార్థాన్ని = స్వ + అర్థాన్ని – సవర్ణదీర్ఘ సంధి
5) సంవత్సరాది = సంవత్సర + ఆది – సవర్ణదీర్ఘ సంధి
6) చైత్రారంభం = చైత్ర + ఆరంభం – సవర్ణదీర్ఘ సంధి
7) గ్రామోద్ధరణము = గ్రామ + ఉద్ధరణము – గుణసంధి
8) పట్నాలు = పట్నము + లు – లలనల సంధి
9) సౌఖ్యాలు = సౌఖ్యము + లు – లులనల సంధి
10) మనోహరము = మనః + హరము – విసర్గ సంధి
11) పల్లెటూరు = పల్లె + ఊరు – టుగాగమ సంధి
గమనిక : ‘పల్లె’ అన్నచోట ఉత్వం లేదు. ఎత్వం ఉంది. అయినా టుగాగమం వచ్చింది.
ప్రకృతి – వికృతి
ఆశ్చర్యము – అక్కజము, అచ్చెరువు
స్నేహము – నేస్తము, నెయ్యము
ఆలస్యము – ఆలసము
రాశులు – రాసులు
నిద్ర – నిద్దుర
నిత్యము – నిచ్చలు
సఖా – సకుడు
పక్షము – పక్క
హృదయము – ఎద, ఎడద
గర్భము – కడుపు
సమాసాలు
రచయిత పరిచయం
నివాసం :
డా॥ బోయి భీమన్న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామవాసి. 19 సెప్టెంబర్, 1911లో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు.
భీమన్న మాట :
“ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు – పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు”, “ఈనాడు సాహిత్యమంటే కులం, మతం, వర్గం, ముఠా” అని తన కలం ద్వారా, గళం ద్వారా అనేకమార్లు వెలిబుచ్చారు.
భీమన్న బాట :
ఒకవైపు జాషువా, మరోవైపు శ్రీశ్రీ. ఇద్దరూ సాహిత్య చక్రవర్తులే, వారిద్దరి శైలి సాహితీ లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. అయినా భీమన్న తన శైలితో ప్రకంపనలు పుట్టించారు. అనేక సాహితీ ప్రక్రియలతో బడుగుల, దళితుల జీవితాలు చిత్రించారు. చైతన్యం కలిగించారు.
భీమన్న పట్టు :
అస్పృశ్యత రాజ్యమేలుతున్న రోజులవి. ఎన్నో కష్టాలు, మరెన్నో అడ్డంకులు. అన్నీ అధిగమించాడు. విద్యనభ్యసించాడు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడయ్యాడు. తన కలం ద్వారా అస్పృశ్యతను రూపుమాపాలి అని ఆలోచించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. జర్నలిస్టుగా పనిచేశాడు. 1940-45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.
రచనలు :
తన 11వ ఏట రచనలు ప్రారంభించారు. గుడిసెలు కాలిపోతున్నాయ్, పాలేరు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మంకోసం పోరాటం మొ||నవి 70కి పైగా రచనలు చేశారు. ఈయన రచించిన ‘పాలేరు’ ఎంతోమంది పేదలు, దళితుల కుటుంబాలలో వెలుగులు నింపింది. ఎంతోమంది తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించారు. పాఠశాలల్లో చేర్పించారు. ‘పాలేరు’ నాటక స్ఫూర్తితో విద్యనభ్యసించిన వారెందరో ఉన్నత స్థానాలను అధిష్ఠించారు.
అవార్డులు – రివార్డులు :
డా|| బోయి భీమన్నగారు రచించిన “గుడిసెలు కాలిపోతున్నాయ్” రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1991లో చెన్నైలోని ‘రాజ్యలక్ష్మీ ఫౌండేషన్’ వారు ‘రాజ్యలక్ష్మి’ అవార్డుతో సత్కరించారు. 1978 నుండి 1984 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఉన్నారు.
ఆస్తమయం :
విద్యావేత్త, సాహితీవేత్త, జర్నలిస్టు మొ॥ అనేకవిధాల బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారు. అటువంటి మహామనీషి అనారోగ్యంతో డిశంబర్ 16, 2005న స్వర్గస్తులయ్యారు.
కఠిన పదాలకు అర్థాలు
కరకట్టు = కరెక్ట్ (correct) – సరియైనది
నిరుద్యోగం = ఉద్యోగం లేకపోవడం దీపం బుడ్డి – చిన్నమూతి గల వెడల్పైన (దీపం) పాత్ర
అణా = 6 పైసలు (పాతకాలపు నాణెం)
దుకాణం = పచారీ కొట్టు
పక్షం = తరపు
సాన్నిధ్యం = దగ్గరగా ఉండడం
తర్కం = వాదన
మినపకుడుం = వాసెనపోలు (మినప పిండి, వరినూకతో కలిపి ఆవిరిపై ఉడికించే ఇడ్లీ వంటిది)
అయ్య = తండ్రి
అంతరం = తేడా
తట్టింది = తోచింది
గుణించి = లెక్కించి
దమ్మిడీ = 5 కాసుల నాణెము (లేక) రెండు కాసుల నాణెము (లేక) 4 పైసా
దేవుళ్ళాడటం = ప్రాధేయపడడం
కాళ్ళు పట్టుకోవడం = దీనంగా బ్రతిమాలడం
సఖా = స్నేహితుడా !
త్రిప్పలు = బాధలు
కట్టడి = ఆంక్ష
అధోగతి = హీనమైన స్థితి
చందం = విధం
చీమకుట్టిన చందం = కొద్దిపాటి బాధ కలిగినట్లు
తొలకరించడం = తొలిసారి వర్షం పడడం (ఆషాఢమాసంలోని జల్లులు)
జైలు = ధాన్యం కొలత
ఇనాందారు = భూమి కలవాడు
నానుట = బాగా తడిసిపోవడం
ఏడు = సంవత్సరం
పురిటిలోనే సంధి కొట్టడం = ప్రారంభంలోనే పని పాడవ్వడం
అర్థ హృదయుడు = దయగల మనస్సు కలవాడు
బోదె = చిన్నకాలువ
అంతర్వేది వెళ్ళగానే = మాఘశుద్ధ ఏకాదశికి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, అది పూర్తవ్వగానే
ఇవి తెలుసుకోండి
1 దమ్మిడీ = ½ పైసా
3 దమ్మిడీలు = 1 కాని (లేదా) 1 డబ్బు
2 కానులు = 1 ఏగాని (లేదా) అర్ధణా
2 అర్ధణాలు = అణా (6 పైసలు)
2 అణాలు = బేడ
2 బేడలు= 1 పావలా
2 పావలాలు = అర్ధ రూపాయి
2 అర్ధ రూపాయిలు = 1 రూపాయి
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
లేఖలు ఎప్పుడెప్పుడు రాస్తారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని ఇతరులకు తెలియజేయడానికి లేఖలు రాస్తారు. అనేక సందర్భాలలో లేఖలు రాస్తాం. పెండ్లి సమాచారాన్ని తెలియజేయడానికి శుభలేఖలు రాస్తాం. ఇళ్ళల్లో జరిగే శుభ, అశుభకార్యాల సమాచారం బంధుమిత్రులకు తెలియజేయడానికి లేఖలు రాస్తాం. మన ఇళ్ళలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడానికి లేఖలు రాస్తాం.
వస్తువులు కొనడానికి, దూర ప్రాంతాలలోని దుకాణాలకు, కంపెనీలకు లేఖలు రాస్తాం. మనకు రావలసిన బాకీల వసూళ్ళకు కూడా లేఖలు రాస్తాం. కార్యాలయాలలో సమాచారం తెలుసుకునేందుకు లేఖలు రాస్తాం. కార్యాలయం నుండి మనకు కావలసిన కాగితాలు తీసుకునేందుకు లేఖలు రాస్తాం.
ప్రశ్న 2.
“అస్థిర భావం” అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భావం అంటే మన ఆలోచనల ద్వారా ఏర్పడిన అభిప్రాయం. స్థిరభావం అంటే శాశ్వతమైన, కచ్చితమైన అభిప్రాయం. అస్థిర భావం అంటే శాశ్వతం కాని, కచ్చితం కాని అభిప్రాయం.
ప్రస్తుతం పాఠ్యాంశాన్ని బట్టి ఒక కచ్చితమైన ప్రణాళికతో కూడిన అభిప్రాయం లేనిదే అస్థిర భావం.
ప్రశ్న 3.
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయని భావిస్తున్నారా? ఎలా?
జవాబు:
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయి. ఎందుకంటే పాఠ్యాంశంలోని ప్రతి అంశంపైనా సొంతంగా ఆలోచిస్తున్నాం. సొంత మాటలతో చెబుతున్నాం. విశ్లేషిస్తున్నాం. వ్యాఖ్యా నిస్తున్నాం. చర్చిస్తున్నాం. వాదప్రతివాదనలు చేస్తున్నాం. సొంతమాటలలోనే రాస్తున్నాం. ప్రతి సబ్జెక్టులోను ఇదే విధానం కొనసాగుతోంది. అందుచేత ఇప్పుడు మా తరగతి గది ఒక ప్రపంచపు నమూనా.
ఇదే విధానం డిగ్రీ వరకు కొనసాగితే మంచిది. అపుడు నిజజీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకూ భయపడం. మేమే ఆలోచించి పరిష్కరిస్తాం. పిల్లల అభిప్రాయాలకు, మాటలకు, విశ్లేషణలకు, వ్యాఖ్యానాలకు, చర్చలకు అవకాశం కల్పించే చదువులే దైనందిన జీవితంలో ఉపయోగపడతాయి.
ఉదాహరణకు ఈ పాఠంలో గ్రామాలలోని ‘పేదరికం’ గురించి తెలుసుకున్నాం. దాని నివారణా పాయాలు తరగతి గదిలో చర్చించాం. మా అభిప్రాయాలు, చర్చ మా పెద్దలకు చెప్పాం . గ్రామాలలో పేదలను కలుసుకొని వారి పేదరికానికి కారణాలు తెలుసు కొన్నాం. పరిష్కార మార్గాలు సూచించాం. అవి ఎంత వరకు సఫలం అయ్యాయో కొన్నాళ్ళు గడిచాక తెలుసు
కొంటాం. లోపాలుంటే సవరించుకొంటాం.
ప్రశ్న 4.
మీరు చదువు పూర్తయిన తరువాత ఏం చేస్తారు? ఏం కావాలనుకుంటున్నారు?
జవాబు:
(సూచన : పిల్లలందరూ వారి వారి అభిలాషలు చెప్పాలి. వారు ఎన్నుకొనే రంగాలు చెప్పనివ్వాలి.)
ఏ వృత్తి చేపట్టినా సమాజానికి ఉపయోగపడాలి. నీతిగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. లంచగొండితనం పనికిరాదు. సమర్థంగా పనిచేయాలి. ఆదర్శవంతంగా ఉండాలి.
ప్రశ్న 5.
ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం ఎందుకు పెరుగుతోంది?
జవాబు:
ప్రక్కవారిని పట్టించుకొనే తీరిక లేదు. స్నేహం చేయరు. ఆటలు లేవు. సామూహిక కార్యక్రమాలు లేవు. ఒకరి కష్ట సుఖాలలో వేరొకరు పాల్గొనడం లేదు.
నేను, నా కుటుంబం అనే భావం పెరిగింది. అందుచేతనే స్వార్థం పెరుగుతోంది. సుఖాలు అనుభవించాలనే కోరిక కూడా కారణం. ఒంటరిగా ఉంటే ఎక్కువ సుఖాలు అనుభవించవచ్చును అనే ఆలోచన. పైవన్నీ స్వార్థం పెరగడానికి కారణాలు.
ప్రశ్న 6.
“పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది.” దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
పల్లెటూరి జీవితం చాలా బాగుంటుంది. పక్షుల కిలకిలలతో మెలుకువ వస్తుంది. ఎటుచూసినా పచ్చని చెట్లు, వరి పొలాలు కన్పిస్తాయి. పిల్ల కాలువలలో చేపల మిలమిలలూ, ఉదయకాలపు లేత ఎండలో నీటి తళతళలూ, లేగదూడల గంతులు, పొలాలకు వెళ్ళే వారి హడావుడి, పిల్లల అల్లరి, నీటి బిందెలతో స్త్రీలు, చక్కటి వాతావరణం. కలుషితం కాని వాతావరణం. కల్మషం తెలియని మనుషుల పలకరింపులతో పల్లెటూరి జీవితం చక్కగా ఉంటుంది. ఎవరిని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. చక్కటి కథలు చెబుతారు.
ప్రశ్న 7.
‘కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది’ అంటే మీకేమి అర్థమైంది ? దీన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు?
జవాబు:
పగలనక, రాత్రనక చేనులో కష్టపడేవాడు రైతు. అతను అనేక కష్టనష్టాలకోర్చి పంటను పండిస్తాడు. రెక్కలు ముక్కలయ్యేలాగా పనిచేస్తాడు. చలిలో, మంచులో తడుస్తాడు. పంటను కంటికి రెప్పలాగా కాపాడతాడు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొంటాడు. ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోడు. అంత కష్టపడి సంపాదించిన పంటనూ భూస్వామికి అప్పగించేస్తాడు. తను, తన కుటుంబం పస్తులుంటారు.
ఇల్లు కట్టే కూలీలు కూడా అంతే. ఎంతో కష్టపడి ఇల్లు కడతారు. చక్కటి మేడ కడతారు. వాళ్ళు మాత్రం పూరిగుడిసెల్లో ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు, కూలిపనులు చేసేవారి జీవితాలు అన్నీ ఇంతే, కష్టం వాళ్ళది, ఫలితం యజమానులది.
ప్రశ్న 8.
చలిమంటలు వేసుకుంటూ, రైతులు కబుర్లు చెప్పు కొంటారు కదా! వాళ్ళు ఏఏ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారు? ఊహించండి.
జవాబు:
వ్యవసాయం గురించి చెప్పుకొంటారు. పొలం గట్ల గురించి చెప్పుకొంటారు. కూలిరేట్ల గురించి చెప్పు కొంటారు. దుక్కి టెద్దుల గురించి, వాటి అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొంటారు. పాడి పశువుల గురించి చెప్పుకొంటారు. పశుగ్రాసం, దాణా గురించి చెప్పుకొంటారు. పంట పండించడంలో పాట్లు, చీడ పీడలు, చేలగట్ల గురించి చెప్పుకొంటారు. పంటరేట్లు గురించి బాధపడతారు. అప్పుల గురించి వేదన పడతారు. అప్పులు తీరే మార్గాలు అన్వేషిస్తారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు పెట్టే బాధల గురించి చెప్పుకొంటారు. రాజకీయాలు, లోకాభిరామాయణం మాట్లాడుకొంటారు. అక్కడ అన్ని విషయాలు చెప్పుకొంటారు.
ప్రశ్న 9.
పల్లెటూళ్ళకు వెళితే మనం ఏ ఏ విషయాలు తెలుసు కోవచ్చు?
జవాబు:
మానవత్వం తెలుస్తుంది. స్నేహం విలువ తెలుస్తుంది. కలసిమెలసి ఉండడమెలాగో తెలుస్తుంది. పక్షుల కిలకిలలు, జంతువుల కలకలలు తెలుస్తాయి. పచ్చటి ప్రకృతికి దగ్గరగా ఉండవచ్చు. హాయిగా ఉండవచ్చు. కలుషితం కాని స్వచ్చమైన వాతావరణంలో జీవించ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నట్లు ఉంటుంది. అమ్మ జోలపాట వింటున్నట్లుంటుంది. తాత చెప్పే కథల మాధుర్యం తెలుస్తుంది. నాన్న తోడులోని భరోసా తెలుస్తుంది.