These AP 7th Class Social Important Questions 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు will help students prepare well for the exams.
AP Board 7th Class Social 12th Lesson Important Questions and Answers మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు
ప్రశ్న 1.
పొరుగు మార్కెట్ల గురించి నీకేమి తెలియును? వీని వలన ఉపయోగమేమి?
జవాబు:
పొరుగు మార్కెట్లు :
- మన ఇంటి పక్కన లేదా వీధి చివరలో చాలా దుకాణాలు ఉంటాయి. వీటిని పొరుగు దుకాణాలు అంటారు.
- ఈ దుకాణాలలో కొన్ని శాశ్వత భవనాలలో ఉంటే, మరికొన్ని తాత్కాలిక షెడ్లు లేదా కదిలే బండ్లపై ఉంటాయి.
- ఈ దుకాణాల నుండి, మనం మన ఇంటికి కావాల్సిన కిరాణా సామగ్రిని అనగా బియ్యం, పప్పులు, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, మొదలైనవి కొనుగోలు చేస్తాము.
- అలాగే కొన్ని దుకాణాల నుంచి పుస్తకాలు మరియు కాగితాలు, మరికొన్ని దుకాణాల నుంచి ఔషధాలు కొనుగోలు చేస్తాము.
ఉపయోగాలు :
- పొరుగు దుకాణాల వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
- అనగా మనం రోజులోని ఏ సమయంలోనైనా ఈ దుకాణాలకు వెళ్లి వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
- ఒక దుకాణంలో మనకు కావాల్సిన వస్తువులు దొరకనట్లయితే పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు.
- మనం ఈ దుకాణాలలో తరచుగా కొనుగోళ్లు చేస్తుంటాము కాబట్టి, మన దగ్గర డబ్బు లేనప్పుడు అప్పుగా కూడా వస్తువులను కొనుగోలు చేయవచ్చు మరియు ఆ డబ్బును తర్వాత చెల్లించవచ్చు.
ప్రశ్న 2.
వారాంతపు సంతల గురించి వివరించండి.
జవాబు:
- వారాంతపు మార్కెట్లు సంప్రదాయ మార్కెట్లు. సాధారణంగా, ఈ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి.
- ప్రతి వారం ఒక నిర్దిష్ట రోజున ఈ మార్కెట్లు ఉదయాన్నే ఏర్పాటు చేయబడి సాయంత్రం మూసివేయబడతాయి.
- వారాంతపు మార్కెట్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
- నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నందున. ఈ వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను విక్రయించగలుగుతాయి.
- వారాంతపు మార్కెట్ చుట్టూ నివసించే ప్రజలు ఈ మార్కెట్ల నుండి తమకు అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.
- ఫలితంగా, ఈ మార్కెట్లు చాలామందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి.
ప్రశ్న 3.
వారాంతపు సంత వలన ఒక ముఖ్య ప్రయోజనం వ్రాయండి.
జవాబు:
వారాంతపు సంతలు చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి.
ప్రశ్న 4.
రైతు బజారుల గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
రైతు బజారు:
- మన రాష్ట్రంలో రైతు బజార్లు జనవరి 1999 లో ప్రారంభించబడినవి.
- రైతుల ప్రయోజనాల కోసం మరియు రైతులకి వినియోగదారులకి మధ్య ఉండే మధ్యవర్తులను అరికట్టుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
- చిన్న సన్నకారు మరియు సన్నకారు రైతులు నేరుగా వినియోగదారులకి అమ్మి వారి ఉత్పత్తులకు మంచి ధరను పొందగలుగుతారు.
- ఈ మార్కెట్లు రైతులు మరియు వినియోగదారులు ఇద్దరికీ ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటమే గాక మంచి నాణ్యమైన ఉత్పత్తులు అందించగలుగుతున్నాయి.
ప్రశ్న 5.
షాపింగ్ మాల్స్ అంటే ఏమిటి? ఇక్కడ ఏవిధమైన వస్తువులు లభిస్తాయి?
జవాబు:
షాపింగ్ మాల్స్ :
- పట్టణ ప్రాంతాలలోని వివిధ అంతస్తులలోని దుకాణాలు, పెద్ద బహుళ అంతస్థుల ఎయిర్ కండిషన్డ్ భవనాలు.
- ఈ మాల్స్ లో బ్రాండెడ్ మరియు నాన్ బ్రాండెడ్ వస్తువులను పొందవచ్చు.
ప్రశ్న 6.
ఫ్లోటింగ్ మార్కెట్ (తేలియాడే మార్కెట్) గురించి వివరించండి.
జవాబు:
- శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ లో ఫ్లోటింగ్ మార్కెట్ (తేలియాడే మార్కెట్).
- శ్రీనగర్ లోని అత్యంత సుందరమైన దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 నుండి ఉదయం 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది.
- ఈ పడవలను స్థానిక భాషలో ‘షికారా’ అంటారు. కూరగాయలతోపాటు చెక్కబొమ్మలు, కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాలలో లభిస్తాయి.
- వివిధ దేశాల పర్యాటకులు షాపింగ్ చేయడాన్ని ఆనందిస్తారు.
ప్రశ్న 7.
ఇ-వాణిజ్యం అనగానేమి? దీని ఉపయోగమేమిటి?
జవాబు:
మనం మన వద్ద వున్న చరవాణి ద్వారా లేదా అంతర్జాలంతో అనుసంధానమైన కంప్యూటర్ ద్వారా ఆదేశాలు ఇచ్చి మనకు నచ్చిన అనేక రకాలైన వస్తువులను ఇంటి నుండి బయటకు వెళ్ళకుండానే కొనుగోలు చేయవచ్చు. ఈ రకమైన మార్కెట్‌ను ఈ – కామర్స్ లేదా ఆన్లైన్ మార్కెట్ అంటారు.
ప్రశ్న 8.
మార్కెట్ గొలుసు గురించి క్లుప్తంగా తెల్పండి.
జవాబు:
- వస్తువులు కర్మాగారాలలో, పొలాలలో, అలాగే గృహాలలో ఉత్పత్తి అవుతాయి. అయితే మనం నేరుగా కర్మాగారం లేదా పొలం నుండి కొనుగోలు చేయాలి.
- ఉత్పత్తిదారులు కిలో బియ్యం, పప్పులు అమ్మడానికి ఆసక్తి చూపరు.
- ఉత్పత్తి చేయబడిన వస్తువులు ముందుగా పంపిణీ కేంద్రం లేదా స్టాక్ పాయింట్ కి చేరతాయి. అక్కడి నుండి హోల్సేన్ షాపులకి, తర్వాత చిల్లర వ్యాపారులకి అక్కడి నుండి వినియోగదారునికి చేరుతాయి.
ప్రశ్న 9.
వినియోగదారుడు అంటే ఎవరు? వినియోగదారుల రక్షణ చట్టం అంటే ఏమిటి?
జవాబు:
వినియోగదారుడు :
వస్తువులను కొనుగోలు చేసే లేదా సేవలను వినియోగించుకునే వ్యక్తి.
వినియోగదారుల రక్షణ చట్టం :
వినియోగదారుల హక్కులను పరిరక్షించడం మార్కెట్లో చాలా ముఖ్యమైన అంశం. వినియోగదారుని హక్కులను రక్షించడానికి రూపొందించిన చట్టాలను విని యోగదారుల రక్షణ చట్టాలు అంటారు.
ప్రశ్న 10.
కుటీర పరిశ్రమ గురించి మీకు తెలిసినది వ్రాయండి.
జవాబు:
కుటీర పరిశ్రమ అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థ. ఈ వ్యవస్థలో వస్తువులను లేదా వాటి విడి భాగాలను, ఇంటి వద్ద లేదా చిన్న చిన్న కార్యానాలలో హస్తకళాకారులు లేదా వ్యక్తులు, చిన్న బృందాలుగా లేదా కుటుంబ యూనిట్ల ద్వారా తయారు చేస్తారు.
ప్రశ్న 11.
మీ ప్రాంతంలో వారాంతపు సంతలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని గురించి వ్రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో వారాంతపు సంతలు ఏమీ లేవు. కాని మా అమ్మమ్మ వారి ఊర్లో ఉన్నాయి. ప్రతి శనివారం అక్కడ సంత జరుగుతుంది. చుట్టు ప్రక్కల వాళ్ళు అందరు అక్కడ దుకాణాలు పెడతారు. అక్కడ తక్కువ ధరలో వస్తువులు దొరుకుతాయి.
ప్రశ్న 12.
ఎ) మీరు ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళారా?
బి) మార్కెట్లో ఏయే వస్తు సేవలు లభిస్తాయో పేర్కొనండి.
సి) స్థానిక మార్కెట్లో అన్ని రకాల వస్తువులు లభిస్తాయా?
జవాబు:
ఎ) ఇంటి అవసరాల నిమిత్తము ‘మార్కెట్ కి’ వెళ్ళాను.
బి) మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు, చికెన్, మాంసం, చేపలు మరియు నిత్యావసర వస్తువులు, సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి.
సి) స్థానిక మార్కెట్లో చాలా వరకు లభిస్తాయి. కొన్ని ప్రత్యేక వస్తువులు మాత్రం స్థానిక మార్కెట్లో లభించవు.
ప్రశ్న 13.
“డిస్కౌంట్స్ మరియు ఆఫర్లు అమ్మకాలని పెంచుతాయి.” ఈ విషయాన్ని అంగీకరిస్తారా? చర్చించండి.
జవాబు:
డిస్కౌంట్స్ మరియు ఆఫర్లు అమ్మకాలని పెంచుతాయి అనుటలో సందేహం లేదు. డిస్కౌంట్స్ మరియు ఆఫర్లు ప్రకటించటం వలన వినియోగదారులు సదరు షాపులలోనే కొనుగోలు చేస్తారు. అలాగే ఎప్పుడో భవిష్యత్తులో కొనుగోలు చేద్దామనుకునేవారు కూడా ఈ ఆఫర్ల వల్ల ఇప్పుడే కొనుగోలు చేస్తారు. కొంతమంది తక్కువ ధరకు వస్తున్నాయని అవసరం అన్పించకపోయినా కొనుగోలు చేస్తారు.
ప్రశ్న 14.
మీ ప్రాంతంలో ఫ్లోటింగ్ మార్కెట్ (తేలియాడే మార్కెట్) ఎప్పుడైనా గమనించారా?
జవాబు:
లేదు. మా ప్రాంతంలో ఫ్లోటింగ్ మార్కెట్ ను గమనించలేదు. కాని శ్రీనగర్ జమ్ము కాశ్మీర్ మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఇటువంటి మార్కెట్లు ఉన్నట్లు గమనించాను.
ప్రశ్న 15.
మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారిని అడిగి వస్తువులను అమ్మటానికి లేదా కొనటానికి మిమ్మల్ని అనుమతించే ఆన్లైన్ మాధ్యమాల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
ఆన్లైన్ మాధ్యమాలు :
- అమెజాన్
- ఫ్లిప్ కార్ట్
- షాప్ క్లూస్
- స్నాప్ డీల్
- బుక్ మై షో
- 1 mg
- మింత్ర (Myntra)
- నైకా (Nykaa)
- అలీబాబా
- ఈ-బే (e-bay)
ప్రశ్న 16.
ఎ) పై ప్రవాహ పటాన్ని గమనించండి. వినియోగదారుడు ఏ మార్గంలో తక్కువ ధరకు వస్తువులను పొందుతాడో మరియు దానికి గల కారణం ఏమిటో మీ ఉపాధ్యాయుని సహాయంతో తెలుసుకోండి.
బి) ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య మధ్యవర్తి ఉంటే ఉత్పత్తుల ధర పెరుగుతుంది – చర్చించండి.
జవాబు:
ఎ) ప్రత్యక్ష మార్గంలో అయితే వినియోగదారునికి తక్కువ ధరకు వస్తుంది. కారణం మధ్యలో ఏ వర్తకులు, ఏజెంట్లు లేరు. ఉత్పత్తిదారుడు ప్రత్యక్షంగా వినియోగదారునికే వస్తువులు అమ్ముతాడు.
ఉదా : రైతు బజారు.
బి) ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య మధ్యవర్తి ఉంటే ఉత్పత్తుల ధర పెరుగుతుంది. కారణం మధ్యవర్తులు కొంత తమ లాభం చూసుకోవటం, కొన్ని సందర్భాలలో కృత్రిమ గిరాకీ పెంచడం వంటి వాటి వల్ల.
మీకు తెలుసా?
7th Class Social Textbook Page No. 149
క్రెడిట్ కార్డ్ :
ముందుగా అనుమతించిన ఋణ పరిమితి మేరకు మీరు చేసిన కొనుగోళ్ళకు చెల్లింపులు జరిపేందుకు ఆర్థిక సంస్థల ద్వారా జారీ చేయబడే కార్డ్
7th Class Social Textbook Page No. 155
శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ లో తేలియాడే మార్కెట్ : శ్రీనగర్ లోని అత్యంత సుందరమైన దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది. ఈ పడవలను స్థానిక భాషలో ‘షికారా’ అంటారు. కూరగాయలతోపాటు చెక్కబొమ్మలు, కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాల్లో లభిస్తాయి. వివిధ దేశాల పర్యాటకులు ఈ దాల్ సరస్సులో షాపింగ్ చేయడాన్ని ఆనందిస్తారు
7th Class Social Textbook Page No. 159
కుటీర పరిశ్రమ అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థ. ఈ వ్యవస్థలో వస్తువులను లేదా వాటి విడి భాగాలను, ఇంటి వద్ద లేదా చిన్న చిన్న కార్ఖానాలలో హస్త కళా కారులు లేదా వ్యక్తులు, చిన్న బృందాలు లేదా కుటుంబ యూనిట్ల ద్వారా తయారుచేస్తారు.
7th Class Social Textbook Page No. 163
- వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్.సి.డి.ఆర్.సి 1988లో స్థాపించబడినది. దీని ప్రధాన కార్యా లయం కొత్త ఢిల్లీలో ఉంది.
- వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ : నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-114000 లేదా 14404.
- ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 ను భారతదేశంలో “జాతీయ వినియోగదారుల దినోత్సవం”గా జరుపుకుంటారు.