Students can go through AP Inter 1st Year Botany Notes 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం
→ అంతర్నిర్మాణ పరంగా, మొక్క దేహము వివిద రకాల కణజాలాలతో నిర్మితమై ఉన్నది.
→ కణజాలాలు రెండు రకాలు. అవి
- విభాజ్య కణజాలాలు
- శాశ్వత కణజాలాలు
→ ఎల్లప్పుడు విభజనచెందే అపరిపక్వ కణజాల సముదాయమును విభాజ్య కణజాలాలు అంటారు.
→ ఇవి కాండ అగ్రంలో (అగ్ర) లేక మధ్యస్థ లేక పార్శ్వంగా ఉంటాయి.
→ విభజనశక్తిని కోల్పోయి, పక్వత చెంది నిర్దిష్ట ఆకారంను ఏర్పరుచుకున్న కణజాలాలను శాశ్వత కణజాలాలు అంటారు.
→ శాశ్వత కణజాలాలు 3 రకాలు అవి
- సరళ కణజాలాలు
- సంక్లిష్ట కణజాలాలు
- ప్రత్యేక కణజాలాలు
→ ఒకే రకమైన కణాలతో ఏర్పడి, ఒకే విధిని నిర్వర్తించే కణాల సముదాయమును సరళ కణజాలాలు అంటారు. ఇవి మృదుకణజాలము స్థూలకోణ కణజాలము మరియు దృఢ కణజాలము అవి 3 రకాలు
→ వేర్వేరు కణాలలో ఏర్పడి, అన్ని కలసి ఒకే విధిని నిర్వర్తించే కణాల సముదాయమును సంక్లిష్ట కణజాలాలు అంటారు. వీటిలో దారువు, పోషక కణజాలములు కలవు.
→ నిర్మాణము, స్థానమును బట్టి కణజాల వ్యవస్థలు 3 రకాలు కలవు. అవి బాహ్యచర్మ కణజాల వ్యవస్థ, సంధాయక కణజాలవ్యవస్థ మరియు నాళికా కణజాల వ్యవస్థ.
→ బాహ్యచర్మ కణజాల వ్యవస్థలో బాహ్య చర్మము, పత్రరంధ్రాలు, కేశాలు అవభాసిని ఉంటాయి.
→ సంధాయక కణజాల వ్యవస్థలో బాహ్యచర్మము, నాళికాపుంజాలు కాక మిగిలినవి (అధశ్చర్మము, సాధారణ వల్కలం, అంతరశ్చర్మం, దవ్వ, దవ్వరేఖలు) ఉంటాయి.
→ నాళికా కణజాలవ్యవస్థలో దారువు, పోషకకణజాలములు కలవు.
→ నాళికాపుంజాలు సహ పార్శ్వ వివృతము (ద్విదళబీజ కాండము), సహ పార్శ్వ సంవృతము (ఏకదళబీజ కాండము) వ్యాసార్థపు (వేర్లు) ద్విసహపార్శ్వము (కుకుర్చిటా కాండము)గా ఉంటాయి.
→ ద్విదళబీజవేరు అడ్డుకోతలో బాహ్యచర్మము, వల్కలము మరియు ప్రసరణస్థంభం ఉంటాయి. ప్రసరణస్థంభంలో దారువు, పోషక కణజాలాలు వేరు వేరు వ్యాసార్ధాల పై ఉంటాయి. దారువు చతుఃప్రథమ దారుకము.
→ ఏకదళబీజవేరు అడ్డుకోతలో దారువు, పోషక కణజాలాలు వ్యాసార్థంగా ఉంటాయి మరియు బహుప్రథమదారుకము.
→ ద్విదళబీజ కాండములో 15-20 నాళికాపుంజాలు ఒక వలయంలో అమరి ఉంటాయి. (నిజ ప్రసరణస్థంభం)
→ ఏకదళ బీజకాండంలో అనేక నాళికా పుంజాలు చెల్లాచెదురుగా అమరి ఉంటాయి. (అటాక్టోస్టీల్)
→ ద్విదళబీజ పత్రంలో పత్రాంతరంలో స్థంభ, స్పాంజి మృదు కణజాలాలు ఉంటాయి. ఏకదళబీజ పత్రంలో స్పాంజి కణజాలం మాత్రమే ఉంటుంది.
→ ద్విదళబీజకాండాలు, వేర్లలో నాళికా విభాజ్య కణావళి వలన వ్యాసం పెరుగుతుంది. దీనిని ద్వితీయ వృద్ధి అంటారు.
→ పుంజాంతర విభాజ్య కణావళి, పుంజాంతస్థ విభాజ్యకణావళి కలసి విభాజ్య కణావళి వలయం ఏర్పడుతుంది.
→ వసంతదారువు, శరద్దారువులను కలిపి వార్షిక వలయము అంటారు. వీటిని లెక్కించి, మొక్క యొక్క వయస్సు అంచనా వేయవచ్చు. దీనిని డెండ్రోక్రోనాలజి అంటారు.
→ ముదిరిన కాండాలలో మధ్యలో ఉన్న ముదురు దారువును అంతర్దారువు/ డ్యూరమెన్ అంటారు.
→ పరిధీయ, లేతరంగులో ఉన్న దారువును రస దారువు అంటారు.
→ వల్కల కణాలు విభాజ్యకణాలుగా మారి బెండు విభాజ్య కణావళి లేక ఫెల్లోజన్ ను ఏర్పరుస్తాయి.
→ ఫెల్లోజన్, ఫెల్లం (వెలుపలిబెండు), ఫెల్లోడర్ (లోపలి ద్వితీయ వల్కలము) లను కలిపి పరిచర్మం అంటారు.
→ ముదిరిన కాండాలలో ఏర్పడే కటకాకార రంధ్రాలను వాయు రంధ్రాలు అంటారు. ఇవి వాయువుల వినిమయానికి తోడ్పడతాయి.
→ వార్షిక వలయం : ద్విదళబీజాల ద్వితీయ అంగాలలో ఒక సంవత్సరంలో ఏర్పడి ఏకకేంద్రక వలయాలుగా కనిపించే వసంత దారువు, శరద్దారువులను వార్షిక వలయం అంటారు. వార్షిక వలయాల సంఖ్యను లెక్కబెట్టి వృక్షాల వయస్సును సుమారుగా అంచనా వేయవచ్చు.
→ శరద్దారువు లేదా మలిదారువు : సన్నని అవకాశికలను కలిగిన దారు నాళాలు ఉన్న దారువును శరద్దారువు అంటారు. ఇది శరదృతువులో ఏర్పడుతుంది.
→ ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు : దారువుకి ఇరువైపులా పోషక కణజాలం అమరి ఉండి విభాజ్యకణజాలం ద్వారా వేరు చేయబడి ఉన్న నాళికా పుంజం.
→ బుల్లిఫామ్ కణాలు : ఇవి సమద్విపార్శ్వ పత్రంలోని అభ్యక్ష తలంలో పెద్దవిగా, ఖాళీగా, వర్ణరహితంగా ఉండే కణాలు. పత్రాలు చుట్టుకోవడానికి, విప్పుకోవడానికి ఈ కణాలు తోడ్పడతాయి.
→ కాస్పేరియన్ పేలికలు : ఇవి నీటికి అపారగమ్యంగా ఉండి, అంతశ్చర్మ కణాల స్పర్శరేఖీయ, వ్యాసార్ధ కుడ్యాల మీద నిక్షిప్తమయిన మైనం లాంటి సూబరిన్తో తయారు చేయబడ్డ పట్టీలు.
→ సంక్లిష్ట కణజాలాలు : అనేక రకాల కణాలను కలిగిన శాశ్వత కణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు.
→ సంయుక్త నాళికా పుంజాలు : దారువు, పోషకకణజాలాలు ఒకే వ్యాసార్థం మీద ఉండే ఒక రకమైన నాళికా పుంజాలు.
→ అంతర ప్రథమదారుకం : ప్రథమ దారువు లోపలి వైపు (దవ్వ వైపు), అంతదారువు అంగం వెలుపలి వైపు ఉంటాయి. ఇటువంటి దారువు కాండాలలో కనిపిస్తుంది.
→ బాహ్య ప్రథమదారుకం : ప్రథమ దారువు వెలుపలివైపుకి, అంత్యదారువు లోపలి వైపుకి ఉంటాయి. ఇటువంటి ప్రాథమిక దారువు అమరిక వేర్లలో ఉంటుంది.
→ నారలు : ఇవి మందమైన కుడ్యాలను కలిగి పొడవుగా ఉండే దృఢకణజాల కణాలు. వీటి కొనలు సన్నగా, మొనదేలి ఉంటాయి. ఈ కణాలు సమూహాలుగా ఉంటాయి.
→ అంతర్దారువు : ముదురు గోధుమ వర్ణంలో ఉండే ద్వితీయదారువు మధ్య భాగాన్ని అంతర్దారువు అంటారు. దీనిలో నిర్జీవ మూలకాలు ఉంటాయి. వీటి కుడ్యాలు అధిక లిగ్నిన్ పూరితమై ఉంటాయి. ఇది టానిన్లు, రెసిన్లు, నూనెలు, జిగుర్లు, సువాసన పదార్థాల లాంటి కర్బన పదార్థాలు, సుగంధ తైలాలతో నిండి ఉంటుంది. అంతర్దారువు నీటిని ప్రసరింపచేయదు. కాని కాండానికి యాంత్రిక ఆధారాన్నిస్తుంది.
→ వాయురంధ్రాలు : దారుయుత వృక్షాల బెండులో ఉండే కటకాకార రంధ్రాలను వాయురంధ్రాలు అంటారు. వీటిలో కణాలు దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. వాయురంధ్రాల ద్వారా దారుయుత అంగాల అంతర కణజాలాలు, వెలుపలి వాతావరణం మధ్య వాయువుల వినిమయం జరుగుతుంది.
→ విభాజ్య కణజాలాలు : ఇవి మొక్కలలో చురుకుగా కణవిభజన జరిగే ప్రత్యేకమైన ప్రదేశాలు.
→ పరిచర్మం : ఫెల్లోజన్, ఫెల్లమ్, ఫెల్లోడర్ ను కలిపి పరిచర్మం అంటారు.
→ ఫెల్లమ్ : ఫెల్లోజన్ కణాలనుంచి ఏర్పడే బెండు కణజాలం.
→ ఫెల్లోడర్మ్: బెండు విభాజ్యకణావళికి లోపలివైపు ఏర్పడే ద్వితీయ వల్కలం కణాలు.
→ ఫెల్లోజన్ : దీన్ని బెండు విభాజ్యకణావళి అని కూడా అంటారు. ఇది సాధారణంగా వల్కలంలో కనిపిస్తుంది. ఇది ఫెల్లమ్, ఫెల్లోడర్లను ఉత్పత్తి చేస్తుంది.
→ రసదారువు : ద్వితీయ దారువు వెలుపలి భాగం లేత వర్ణంలో ఉంటుంది. దీన్ని రసదారువు అంటారు. ఇది వేరు నుంచి పత్రానికి నీరు, ఖనిజాలను సరఫరా చేస్తుంది.
→ దృఢకణాలు : ఇవి గోళాకారం, అండాకారం లేదా స్థూపాకారంగా ఉండే దృఢ కణజాల కణాలు. ఇవి నిర్జీవ కణాలు, వీటిలో అవకాశిక చాలా సన్నగా ఉంటుంది.
→ సరళ కణజాలాలు : నిర్మాణంలోనూ, విధిలోను ఒకే రకంగా ఉండే కణాలను కలిగిన శాశ్వత కణజాలాలను సరళ కణజాలాలు అంటారు.
→ వసంత దారువు లేదా తొలిదారువు : విశాలమైన అవకాశికలను కలిగిన దారునాళాలతో ఉండే దారువును వసంత దారువు అంటారు. ఇది వసంత రుతువులో ఏర్పడుతుంది.
→ పిండి ఒర : అంతశ్చర్మ కణాలలో అధికంగా పిండి రేణువులు ఉంటాయి. అందువల్ల అంతశ్చర్మాన్ని పిండి ఒర అంటారు.
→ పత్రరంధ్ర పరికరం : పత్రరంధ్రం, రక్షక కణాలు, వాటిని ఆవరించి ఉండే అనుబంధ కణాలను కలిపి పత్రరంధ్ర పరికరం అంటారు.