Students can go through AP Inter 1st Year Botany Notes 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి
→ లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు రూపాంతరము చెందిన ప్రకాండంను పుష్పం అంటారు.
→ పుష్పంలో కేసరావళిని పురుష ప్రత్యుత్పత్తి భాగమని, అండకోశంను స్త్రీప్రత్యుత్పత్తి భాగమని అంటారు.
→ ఒక ఆవృత బీజ పరాగకోశం ద్విలంబికంగా ఉండి, ప్రతి లంబికలో 2 గదులు కల్గి ఉంటుంది.
→ మందారలో పరాగకోశం ఏకలంబికము, దానిని ఏక కక్ష్య యుత పరాగకోశం అంటారు.
→ పరాగకోశము అడ్డుకోతలో 4 పార్శ్వాలుగా ఉండి వాటిలో సూక్ష్మసిద్ధ బీజశయాలు ఉంటాయి.
→ ప్రతి సూక్ష్మ సిద్ధబీజాశయము గుండ్రంగా ఉండి 4 పొరలతో ఉన్న కుడ్యంతో కప్పబడి ఉంటుంది. అవి బాహ్యచర్మం, ఎండోథీషియమ్, మధ్య వరుసలు, టపెటమ్.
→ టపెటమ్ అభివృద్ధి చెందే పరాగ రేణువులకు పోషణనిస్తుంది.
→ సిద్ధబీజ జనక కణజాలము క్షయకరణ విభజన చెంది సూక్ష్మ సిద్ధబీజ చతుష్కాలు ఏర్పడుటను సూక్ష్మసిద్ధబీజ జననము అంటారు.
→ పరాగరేణువులు గోళాకారంలో రెండు పొరలతో ఉంటాయి. వెలుపలి పొర ఎత్తైన్, స్పోరోపొలెనిన్ ను, లోపలిపొర, ఇంటైన్ పెక్టిన్ సెల్యులోస్లతోను నిర్మితమై ఉంటాయి.
→ 60 శాతం ఆవృత బీజాలలో పరాగరేణువులు 2 కణాలదశలో (పెద్ద శాకీయ కణము, చిన్న ఉత్పాదక కణము) విడుదల అవుతాయి.
→ 40 శాతం ఆవృత బీజాలలో పరాగ రేణువులు 3 కణాల దశలో (1 శాకీయకణం, 2 పురుషబీజాలు) విడుదల అవుతాయి.
→ పరాగరేణువులో పోషకాలు ఎక్కువగా ఉండుటవల్ల, పాశ్చాత్యదేశాలలో ఇవి టాబ్లెట్లు, సిరప్ రూపంలో లభిస్తున్నాయి.
→ పరాగరేణువులు కీలాగ్రంపై పడి మొలకెత్తుతాయి.
→ లొరాంథస్ లో అండం చుట్టూ అండకవచాలు ఉండవు.
→ హీలియంథస్, దత్తురలలో అండాలు ఏకకవచయుతాలు.
→ పాలిపెటాలే జాతులు, ఏకదళబీజాలలో అండాలు ద్వికవచయుతాలు.
→ పాలీగోనంలో అండద్వారం, చలాజా, అండవృంతం, మూడు ఒక నిలువ వరుసలో ఉంటాయి. దానిని నిర్వక్ర అండం అంటారు.
→ సూర్యకాంతం, అండదేహం 180° కోణంలో వంపుతిరిగి ఉంటుంది. దీనిని వక్ర అండం అంటారు.
→ చిక్కుడులో అండదేహం మూత్రపిండాకారంలో ఉంటుంది. దానిని కాంపైలోట్రోపస్ అండం అంటారు.
→ స్థూలసిద్ధ బీజమాతృకణం నుండి స్థూలసిద్ధ బీజాలు ఏర్పడుటను స్థూలసిద్ధ బీజ జననము అంటారు.
→ 7 కణాలు, 8 కేంద్రకాలతో ఉన్న పిండకోశము ఒక స్థూల సిద్ధబీజం నుండి ఏర్పడుతుంది కావున దానిని ఏకసిద్ధబీజ వర్థక రకము అంటారు.
→ పిండకోశంలో స్త్రీబీజ పరికరం, ప్రతిపాదకణాలు, 2ధ్రువ కేంద్రకాలు ఉంటాయి.
→ పరాగకోశం నుండి పరాగరేణువులు కీలాగ్రంను చేరుటను పరాగసంపర్కం అంటారు.
→ ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలో కీలాగ్రంను చేరుటను ఆత్మపరాగసంపర్కము అని, వేరొక పుష్పంలోని కీలాగ్రంను చేరుటను పరపరాగ సంపర్కము అంటారు.
→ గాలి ద్వారా జరిగే పరాగసంపర్కంను ఎనిమోఫిలీ అంటారు.
→ నీరు ద్వారా జరిగే పరాగసంపర్కంను హైడ్రోఫిలీ అంటారు.
→ జంతువుల ద్వారా జరిగే పరాగసంపర్కంను జూఫిలీ అంటారు.
→ పక్షుల ద్వారా జరిగే పరాగసంపర్కంను ఆర్నిథోఫిలీ అంటారు.
→ గబ్బిలాల ద్వారా జరిగే పరాగసంపర్కంను కీరోష్టిరి ఫిలీ అంటారు.
→ ఉడతల ద్వారా జరిగే పరాగసంపర్కంను లెరోఫిలీ అంటారు.
→ సరీసృపాల ద్వారా జరిగే పరాగసంపర్కంను ఒఫియోఫిలీ అంటారు.
→ సూర్యకాంతంలో పుంభాగప్రథమోత్పత్తి వల్ల పరపరాగ సంపర్కం జరుగుతుంది.
→ దతూర, సొలానమ్లలో స్త్రీ భాగ ప్రథమోత్పత్తి వల్ల పరపరాగసంపర్కం జరుగుతుంది.
→ హైబిదాస్కస్ లో పరాగ కోశాలు, కీలాగ్రాలు వేరు వేరు స్థానాలలో ఉంటాయి. దానిని హెర్కొగమి అంటారు.
→ అబూటిలాన్ ఆత్మవంధ్యత్వం కనిపిస్తుంది.
→ పురుష, స్త్రీ పుష్పాలు ఒకే మొక్క పై ఉంటే ఆ స్థితిని ద్విలింగాశ్రయ స్థితి అంటారు. ఉదా: ఆముదం, మొక్కజొన్న,
→ పురుష, స్త్రీ పుష్పాలు వేరువేరు మొక్కలపై ఉంటే ఆ స్థితిని ఏకలింగాశ్రయ స్థితి అంటారు. ఉదా : బొప్పాయి
→ ఒకే జాతికి చెందిన పుప్పొడిని స్వీకరించే శక్తి కీలాగ్రంనకు ఉన్నది.
→ పరాగనాళం అండంలోనికి అండద్వారం లేక, చలాజా ద్వారా లేక అండకవచాల ద్వారా చేరుతుంది.
→ ద్విలింగపుష్పంలోని (స్త్రీజనకులు) కేసరాలను తొలగించుటను విపుంసీకరణ అంటారు.
→ విపుంసీకరణ చేసిన పుష్పాలను పాలిథిన్ సంచులు (బట్టర్ పేపర్) తో మూసివేయుటను బాగింగ్ అంటారు.
→ ఒక పురుషబీజం, స్త్రీబీజంతో కలియుటను సంయుక్త సంయోగము అంటారు. రెండవ పురుషబీజము ద్వితీయ కేంద్రకంతో కలియుటను త్రిసంయోగం అంటారు.
→ సంయుక్త బీజం అభివృద్ధి చెంది హృదయాకారంలో ఉన్న పిండమును ఇస్తుంది.
→ ఫలదీకరణ లేకుండా విత్తనాలు ఏర్పడుటను అసంయోగజననం అంటారు.
→ ఫలదీకరణ లేకుండా అండాశయం నుండి ఫలాలు ఏర్పడుటను అనిషేకఫలాల జననం అంటారు.
→ విత్తనంలో ఒకటికంటే ఎక్కువ పిండాలు ఉంటే దానిని బహుపిండత అంటారు.
→ పరపరాగసంపర్కం (అల్లోగమి) : ఒక పుష్పంలోని పరాగ రేణువులు వేరొక పుష్పాన్ని చేరడం.
→ వాయు పరాగ సంపర్కం : గాలి ద్వారా జరిగే సంపర్కం
→ ఆటోగమి : ఒకే పుష్పంలో జరిగే పరాగ రేణువుల రవాణా.
→ ప్రతిపాద కణాలు : పిండకోశంలో చలాజా వైపున ఉండే మూడు కణాలు.
→ అసంయోగజననం (Apomixis) : సాధారణ లైంగిక ప్రత్యుత్పత్తికి బదులుగా ఫలదీకరణ లేకుండా జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి లేదా విత్తనాభివృద్ధి.
→ వివృత సంయోగం : వికసించే పుష్పాలలో పరాగ సంపర్కం జరగడం.
→ కీరోఫ్టిరి ఫెలీ : గబ్బిలాల వల్ల జరిగే పరపరాగ సంపర్కం.
→ సంవృత సంయోగం : ఎప్పుడూ వికసించని పుష్పాలలో జరిగే పరాగ సంపర్కం.
→ క్లోన్ : లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కాకుండా యితర ప్రత్యుత్పత్తి విధానాల ద్వారా ఏర్పడి స్వరూపాత్మకంగా, జన్యుపరంగా ఒకే విధంగా ఉండే సంతతి.
→ చలాజా : అండంలోని అండాంతఃకణజాలం పీఠభాగం. ఇక్కడ నుంచి అండకవచాలు ఏర్పడతాయి.
→ చలజో సంయోగం : పరాగనాళం అండంలోని చలాజా ద్వారా పిండకోశంలోనికి ప్రవేశించడం.
→ మూలాంకుర కంచుకం (Coleorhiza) : పిండాక్షంలోని ప్రథమ మూలం, దాన్ని ఆవరించి ఉన్న వేరు తొడుగును కప్పుతూ ఉండే విభేదనం చూపని పొర.
→ ప్రాంకుర కంచుకం (Coleoptile) : పిండాక్షంలోని ఉపరి బీజదళంలోని, ప్రకాండపు మొగ్గ, పత్ర ఆద్యాలను కప్పుతూ బోలుగా ఉండే పొర.
→ భిన్నకాలిక పక్వత (Dichogamy) : పుప్పొడి విడుదల, కీలాగ్రం పక్వదశకు చేరడం అనేది సమకాలికంగా ఉండదు.
→ ఏకలింగాశ్రయి (Heterothallic) : పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరు థాలస్లపై అభివృద్ధి చెందడం. ద్విఫలదీకరణ : రెండు ఫలదీకరణ ప్రక్రియలు
(a) ఒక పురుష సంయోగబీజం + స్త్రీ బీజకణం
(b) రెండవ పురుష సంయోగబీజం + ద్వితీయ కేంద్రకం, ఆవృత బీజాల ప్రత్యేక లక్షణం.
→ కీటక పరాగ సంపర్కం : కీటకాల సహాయంతో జరిగే పరాగ సంపర్కం
→ స్త్రీబీజ కణ పరికరం : అండద్వారం కొనవైపున ఉండే పిండకోశంలోని మూడు కణాలు.
→ పిండం : పిండాక్షం (ప్రథమ మూలం, ప్రథమ కాండం), బీజదళాలతో ఉండే అతిచిన్న మొక్క దీన్ని కప్పుతూ బీజకవచాలు ఉంటాయి.
→ పిండోత్పత్తి శాస్త్రం : సంయోగ బీజాల అభివృద్ధి, నిర్మాణం ఫలదీకరణ విధానం, పిండాభివృద్ధి మొదలైన అంశాలు అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్రశాఖ.
→ పిండకోశం : స్త్రీబీజ కణ పరికరం, ద్వితీయ కేంద్రకం/ ధ్రువకేంద్రకాలు, ప్రతిపాద కణాలు ఉండే స్త్రీ సంయోగ బీజదం. ఆవృత బీజాలలో ఇది 7 కణాలలో (8- కేంద్రకాలలో), ఉంటుంది.
→ అంకురచ్ఛదం : అభివృద్ధి చెందుతున్న పిండాన్ని చుట్టి ఉండి పోషణనిచ్చే కణజాలం. ఆవృత బీజాలలో ఇది త్రయస్థితికంగా ఉంటుంది.
→ ఎండోథీసియమ్ : పరాగకోశపు గోడోలోని బాహ్యచర్మ కిందనున్న పొర, దీనిలో స్పర్శరేఖీయ గోడలు తంతుయుత మందాలలో (fibrous thickenings) ఉండి పరాగకోశాల స్ఫోటనానికి సహాయపడతాయి.
→ ఫలదీకరణ : పురుష సంయోగబీజం, స్త్రీ బీజకణంతో సంయోగం చెందే ప్రక్రియ.
→ ఫ్లోరికల్చర్ : పుష్పాలనిచ్చే మొక్కలను సాగు చేసే విధానం.
→ అండవృంతం : అండానికి ఉండే కాడ వంటి భాగం.
→ సంయోగబీజదం : మొక్క జీవిత చక్రంలో ఏకస్థితికంగా ఉన్న, సంయోగ బీజాన్ని ఏర్పరచే (లైంగిక) దశ.
→ ఏకవృక్ష పరపరాగ సంపర్కం (geitonogamy) : ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్ప కీలాగ్రం మీద పడటం.
→ హెర్కోగమి : పరాగకోశాలు, కీలాగ్రాలు వేర్వేరు ఎత్తులో లేదా వేర్వేరు దిశలలో ఉండటం.
→ భిన్న సంయోగ బీజాలు : స్వరూపాత్మకంగా రెండుగా విభేదనం చూపే సంయోగ బీజాలు (పురుష, స్త్రీ).
→ ఏకకాలపక్వత (homogamy) : పుష్పంలోని పరాగ కోశాలు, కీలాగ్రం ఒకే సమయాన పక్వదశకు చేరుకోవడం.
→ జల పరాగ సంపర్కం : నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం
→ అండకవచాలు : అండంలోని అండాంతఃకణ జాలాన్ని కప్పుతూ ఉండే బహుకణయుత కవచాలు.
→ సమసంయోగబీజాలు : నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా ఒకేవిధంగా / రకంగా ఉండే రెండు సంయోగ బీజాలు.
→ శైశవ దశ (Juvenile phase) : పెరుగుదల, అభివృద్ధి చూపే దశ.
→ మెలకోఫిలి (malacophily) : నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కం.
→ ద్విలింగాశ్రయ మొక్క (monoecious) : పురుష, స్త్రీ పుష్పాలు ఒకే మొక్కపై ఏర్పడటం.
→ స్థూలసిద్ధ బీజాలు : ఏకస్థితిక కణం – స్త్రీ సంయోగ బీజదం లేదా పిండకోశంగా అభివృద్ధి చెంతుంది.
→ మధ్య సంయోగం (mesogamy) : అండకవచం ద్వారాగాని, అండ వృంతం ద్వారా గాని లేదా అండం పీఠభాగం నుంచి గాని, పరాగ నాళాలు అండంలోనికి ప్రవేశించడం.
→ అండద్వారం : అండకవచాలు అండాతఃకణజాలాన్ని పూర్తిగా కప్పి వేయకుండా అండంకొనభాగంలో ఏర్పడే రంధ్రం.
→ సూక్ష్మసిద్ధబీజము : పురుష సంయోగబీజదంగా (3 కణాలతో) వృద్ధి చెందే పరాగ రేణువు.
→ అండాతఃకణజాలం : అండంలోపల, పలుచని కవచాలతో ఉండే మృదు కణజాలం.
→ పక్షిపరాగ సంపర్కం : పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం.
→ అండం : పుష్పించే మొక్కల్లోని స్థూల సిద్ధబీజాశయం.
→ ఫలకవచం : ఫలకుడ్యం. కండగల ఫలంలో వెలుపలవైపు బాహ్యఫలకవచం, మధ్యలో మధ్యఫలకవచం, లోపలివైపు అంతఃఫలకవచం అనే విభేదనం చూపుతుంది.
→ పరిచ్ఛదం : మిగిలిపోయిన దీర్ఘకాలిక అండాంతఃకణజాలం.
→ పుప్పొడి బ్యాంక్ (Pollen Bank) : జీవించే శక్తి ఉన్న పుప్పొడి రేణువులను సేకరించి రాబోయే తరాల కొరకు భద్రపరిచే విధానం. ప్రజనన ప్రయోగాల కొరకు ఏకస్థితిక మొక్కలను రూపొందించటం కొరకు ఇవి ప్రాముఖ్యత పొందినవి. పుప్పొడి/మకరందం దోపిడి దొంగలు : పరాగ సంపర్కానికి తోడ్పడకుండా పుప్పొడి/మకరందాన్ని వినియోగించుకునే కీటకాలు.
→ పరాగసంపర్కం : పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడం.
→ పరాగసంపర్క సహకారులు : పరాగసంపర్కం జరగడానికి తోడ్పడే సహకారులు.
→ పుంభాగ ప్రథమోత్పత్తి (protandry) : ఒకే పుష్పంలోని కీలాగ్రం కంటే పరాగ కోశాలు ముందుగా పక్వానికి రావడం.
→ స్త్రీభాగ ప్రథమోత్పత్తి (Protogyny) : ఒకే పుష్పంలో పరాగకోశాల కంటే కీలాగ్రం ముందు పక్వానికి రావడం.
→ బహుపిండత : ఒక విత్తనంలో, ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుట.
→ రంధ్రసంయోగం : పరాగనాళం అండంలోనికి అండ ద్వారం ద్వారా ప్రవేశించడం.
→ ప్రాథమిక ‘అంకురచ్ఛద కేంద్రకం : రెండవ పురుష సంయోగ బీజ కేంద్రకం, రెండు ధృవకేంద్రాలతో సంయోగం చెంది, ఏర్పడే త్రయస్థితిక కేంద్రకం.
→ రాఫే (Raphe) : వక్రఅండంలో అండదేహం పక్క భాగానంతటా, విత్తుచారను దాటి అతుక్కొని ఉండే అండవృంతం భాగం. స్కూటెల్లమ్ : ఏకదళ బీజ మొక్కల్లోని బీజదళాలు (గడ్డిజాతి కుటుంబం)
→ ద్వితీయకేంద్రకం : రెండు ధృవకేంద్రాల సంయోగం ద్వారా ఏర్పడిన కేంద్రకం. విత్తనబ్యాంక్ (Seed Bank) మొలకెత్తే శక్తి కలిగి ఉన్న విత్తనాలను సేకరించి ముందుతరాల కొరకు భద్రపరచడం. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలలోని ఈ భాగాలను (విత్తనాలను) స్థానేతరపద్ధతులలో సమర్ధవంతంగా భద్రపరచడం.
→ ఆత్మవంధ్యత్వం (self-sterility) : ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినపుడు మొలకెత్తలేకపోవడం.
→ సిద్ధబీజదం : మొక్క జీవితచక్రంలో ద్వయస్థితికంగా ఉండి సిద్ధబీజాలను ఏర్పరిచే అలైంగిక దశ. ఇది సిద్ధబీజ మాతృకణాలలో జరిగే క్షయకరణ విభజన ద్వారా ఏకస్థితిక బీజాలను ఏర్పరుస్తుంది.
→ సహాయకణాలు : స్త్రీ బీజకణ పరికరంలో, స్త్రీబీజ కణానికి ఇరువైపులా ఉండే రెండు కణాలు.
→ టపెటమ్ : పరాగకోశపు కుడ్యము అన్నిటికన్నా లోపల ఉండే పొర. ఇది అభివృద్ధి చెందుతున్న సూక్ష్మ సిద్ధబీజాలకు పోషణనిస్తుంది.
→ వివిపారి (Vivipary) : విత్తనం తల్లి మొక్కను అంటిపెట్టుకొని ఉండగానే అంకురించి పిల్ల మొక్కగా వృద్ధి చెందుట.
→ భిన్న వృక్షపరపరాగ సంపర్కం (Xenogamy) : ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కపై ఉన్న పుష్పం కీలాగ్రం మీద పడడం.
→ జంతు పరాగసంపర్కం (zoophily) : జంతువుల సహాయంతో జరిగే పరాగ సంపర్కం.
→ సంయుక్త బీజం : పురుష సంయోగ బీజం, స్త్రీ బీజకణం సంయోగం చెందడం ద్వారా ఏర్పడే ద్వయ స్థితిక కణం