AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 1st Lesson ఎంట్రప్రిన్యూర్షిప్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 1st Lesson ఎంట్రప్రిన్యూర్షిప్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ లక్షణాలను వివరించండి.
జవాబు:
సాధారణ వ్యక్తుల కంటే ఎంట్రప్రిన్యూర్కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వ్యాపారములో విజేతగా నిలవాలంటే ప్రతి ఎంట్రప్రిన్యూర్కు క్రింది లక్షణాలు ఉండవలెను.
1) నవకల్పన: నూతన వ్యాపారములో నవకల్పన అనే లక్షణము వ్యవస్థాపకుడికి చాలా అవసరము. వ్యవస్థాపకుడు ఒకవైపున ఉత్పత్తిని పెంచుకోవడము, మరో వైపున ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొనుటకు, నవకల్పనలను ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తాడు. నవకల్పన వలన ఉత్పత్తి ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చును. లేక ప్రస్తుతమున్న పద్ధతులను అభివృద్ధి చేయవచ్చును. దీనిలో కొత్త మార్కెట్లను కనుగొనడం, ముడిసరుకు మరియు నూతన సాంకేతిక ఉత్పత్తి పద్ధతులను కనుగొనవచ్చును.

2) రిస్కును భరించుట: వ్యవస్థాపకుని మరో లక్షణం రిస్కును భరించుట. ఉత్పత్తికి కావలసిన వనరులను ముందుగానే సమకూర్చుకోవాలి. ఇలాంటి సందర్భాలలో మంచి లాభాలకు లేదా ఎక్కువ నష్టాలకు అవకాశమున్నది. కాబట్టి రిస్కును భరించడం వ్యవస్థాపకుని అంతిమ బాధ్యత. రిచర్డ్ కాంటిలిన్ అభిప్రాయము ప్రకారము వ్యవస్థాపకుడు ఒక ఏజెంటుగా ఉత్పత్తి కారకాలను నిశ్చిత ధరకు కొనుగోలు చేసి, వాటిని ఒక వస్తువు రూపములో చేసి అనిశ్చిత ధరకు అమ్మడము.

3) ఉత్పత్తికి సంబంధించిన వ్యవస్థీకరణ: వ్యవస్థాపకుడు వస్తువులు ఉత్పత్తి చేయుటకు లేదా సేవలు అందించుటకు కావలసిన ఉత్పత్తి కారకాలను సమకూర్చుకొనును. అతను ఉత్పత్తి ప్రక్రియకు కావలసిన భూమి, శ్రామికులు, మూలధనము, ముడిసరుకులను సమకూర్చుకొనును. అన్ని రకాలైన ఉత్పత్తి ప్రక్రియలను అధ్యయనము చేసి తనకు ఎక్కువ అనుకూలమైన పద్ధతిని ఎంపిక చేసుకొనెను.

4) నిర్ణయాలు తీసుకోవడము: వ్యవస్థాపకుడు వ్యాపార సంస్థను స్థాపించడం, దానిని నిర్వహించడము మరియు వివిధ వనరులను సమన్వయపరుచుటకు నిర్ణయాలు తీసుకొనవలెను. వ్యాపారములో ప్రతి పనికి నిర్ణయీకరణ అవసరమవుతుంది. వ్యాపార కార్యకలాపాల గురించి వ్యవస్థాపకుడు ప్రతిరోజు నిర్ణయాలు తీసుకొనవలెను.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

5) నాయకత్వము: వ్యవస్థ విధులను నియంత్రణ చేయుటకు, నిర్ణయించుటకు, ఆదేశించుటకు, నిర్వహించుటకు వ్యవస్థాపకునికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండవలెను. ఇతను దిగువస్థాయి సిబ్బందికి ఆదర్శముగా ఉండవలెను. ఎందుకనగా ఇతని వ్యక్తిత్వము ఆధీనులపై ప్రభావము చూపును. వ్యవస్థాపకుని లక్షణాలు అతని ఉద్యోగులు అభినందించే విధముగా ఉండవలెను. నాయకుడు మార్గదర్శకుడే కాకుండా సంస్థ లక్ష్యాలను త్వరగా సమర్థవంతంగా సాధించే విధముగా ప్రేరణ కలిగించవలెను.

6) ప్రణాళికీకరణ: వ్యవస్థాపకుడు వ్యాపారములో ప్రతి విషయానికి ఒక ప్రణాళిక తయారుచేస్తాడు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను బేరీజు వేసుకొని ఎక్కువ ప్రయోజనము పొందుతాడు. ప్రణాళికీకరణ అనేది ఒక ప్రక్రియ. దీనిలో పనిచేసే ముందు ఆలోచించడం ఇమిడి ఉన్నది. ఏమి చేయాలి ? ఎపుడు చేయాలి ? ఎలా చేయాలి ? ఆ పనిని ఎవరు చేయాలి ? వ్యవస్థాపకుడు ఉత్పత్తికి సంబంధించినవి. మార్కెట్ సంబంధించిన ప్రణాళికలే కాకుండా పారిశ్రామిక విధానం ప్రకారం వ్యవస్థలో విధులను నిర్ణయించడానికి ప్రణాళికలు తయారుచేయును.

7) కష్టపడేతత్వము: విజయవంతమైన వ్యవస్థాపకునికి, అపజయాలు పొందిన వారికి మధ్య తేడా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడడం మాత్రమే. సంస్థ ఖాయిలా పడే దశకు చేరిననూ తన స్వేదముతో, శ్రమతో ధైర్యముగా నిలువగలుగుతాడు. విజయవంతమైన వ్యవస్థాపకుడు ప్రారంభం నుండి చివరి వరకు నిరంతరము జీవితాంతము శ్రమిస్తూనే ఉంటాడు.

8) ఉన్నత లక్ష్యాలను సాధించాలనే కోరిక వ్యవస్థాపకులు వ్యాపారములో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే గాఢమైన కోరికను కలిగి ఉంటాడు. ఈ తపనతోనే అతడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఆతురతతో తనకు వాటిల్లిన దురదృష్ట ఘటనలకు భయపడక విజయం వైపు సాగి విజయవంతమైన వ్యాపారం చేయగలడు.

9) ఉన్నతమైన ఆశావాద దృక్పథము: విజయవంతమైన వ్యవస్థాపకులు తను ఎదుర్కొనే సమస్యలకు చలించరు. భవిష్యత్తులో వ్యాపారములో మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే ఆశావాద దృక్పథముతో సంస్థను
విజయవంతంగా నడపగలుగుతారు.

10) స్వేచ్ఛ: విజయవంతమైన వ్యవస్థాపకుడు ఇతరులచేత మార్గనిర్దేశించబడడు. తన వ్యాపార వ్యవహారములో స్వతంత్రముగా ఉండుటకు ఇష్టపడతాడు.

11) దూరదృష్టి / ముందుచూపు: వ్యవస్థాపకులు భవిష్యత్తులో వ్యాపార పరిస్థితులు ఎలా ఉంటాయో చక్కటి ముందుచూపు కలిగి ఉంటారు. మార్కెట్లో వచ్చే మార్పులను, వినియోగదారుల అభిరుచులు, సాంకేతిక పరిజ్ఞానములో వచ్చే మార్పులకు అనుగుణముగా తగు చర్యలు తీసుకొనును.

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్ విధులను వివరించండి.
జవాబు:
వ్యవస్థాపకుని ఆలోచన మొదలైనప్పటి నుంచి సంస్థను, స్థాపించే వరకు అన్ని రకాల విధులను నిర్వహిస్తాడు. అందులో ముఖ్యమైనవి:
1) నూతన ఉత్పాదక వ్యవస్థాపన: J.B. Say ప్రకారం ఉత్పత్తి కారకాలను సంఘటిత పరిచి వాటిని నూతన ఉత్పత్తి వ్యవస్థగా రూపొందించడము వ్యవస్థాపకుని విధులలో ఒకటి.

2) నిర్ణయీకరణ: వ్యవస్థాపకుడు క్రింది విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాడు. అవి:

  1. సంస్థ లక్ష్యాలను నిర్ణయించడము
  2. ఆర్థిక వనరుల లభ్యత
  3. ఉత్పత్తి మిశ్రమము
  4. ధరల విధానము
  5. అభివృద్ధి వ్యూహాలు
  6. అనువైన సాంకేతిక లేక నూతన సాధనాలు

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

3) నవకల్పన: నవకల్పన అనేది వ్యవస్థాపకుని ముఖ్య విధి. నవకల్పన అనగా కొత్త పనులు చేయడం లేదా పాత పనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థికపరముగా వాడడము. కాబట్టి శాస్త్ర పారిశ్రామికాభివృద్ధికి మరియు ఆర్థికాభివృద్ధికి నవకల్పన ఎంతో ఆవశ్యకము.

4) నిర్వహణ: వ్యవస్థాపకుడు నిర్వహణ విధులను నిర్వహించును. అవి సేకరణ మరియు నిర్వహణ విధులు, ఉత్పత్తి ప్రణాళికలను తయారు చేయడం, ముడిసరుకు సమకూర్చడము, భౌతిక సదుపాయాలు, ఉత్పత్తి సదుపాయాలు, వ్యవస్థీకరణ మరియు అమ్మకాల నిర్వహణ.

5) రిస్కు భరించుట: అనుకోని సంఘటనల వలన భవిష్యత్తులో సంభవించే నష్టాలకు వ్యవస్థాపకుడే బాధ్యత వహించవలెను. ఋణదాతలకు వడ్డీ, శ్రామికులకు వేతనాలు మరియు భూమికి భాటకం చెల్లించుటకు హామీ ఇవ్వవలెను.

6) పర్యవేక్షణ, నియంత్రణ మరియు దిశా నిర్దేశము: జె.యస్. మిల్ మాటలలో పర్యవేక్షణ, నియంత్రణ మరియు దిశా నిర్దేశనలు వ్యవస్థాపకుని విధులు. పర్యవేక్షణలో పనిని పర్యవేక్షించడం, తక్కువ వ్యయముతో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం వంటివి ఇమిడి ఉన్నాయి. వ్యవస్థాపకుడు యంత్రాలను, విత్త వినియోగానికి వస్తువుల పంపిణీని మరియు ఉద్యోగులను నియంత్రిస్తాడు. లక్ష్యాలకు అనుగుణముగా వ్యవస్థను నిరంతరము నడిపిస్తూ ఉంటాడు.

7) ప్రణాళికీకరణ: ప్రణాళిక అనేది. ఒక సంస్థను స్థాపించుటలో మొదటి మెట్టు. వ్యవస్థాపకుడు ప్రారంభించబోయే ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికను ఒక క్రమ పద్ధతిలో తయారుచేస్తాడు. అధికార సంస్థలు ఆ ప్రణాళికలతో సంతృప్తి చెందిన యెడల న్యాయపరమైన మంజూరు చేయును.

కిల్బి ప్రకారము వ్యవస్థాపకుడు క్రింది నాలుగు ముఖ్యమైన విధులను నిర్వహించును. అవి:
1) వినియమ విధులు:

  • మార్కెటింగ్ అవకాశాలు గుర్తించడం.
  • అరుదైన, కొరతగా ఉన్న వనరులను సాధించుట.
  • ఉత్పాదకాల కొనుగోలు.
  • ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయుట, పోటీని ఎదుర్కొనుట.

2) పరిపాలనా విధులు:

  • ప్రజా బ్యూరోక్రసితో కలిసి వ్యవహరించుట.
  • సిబ్బంది నిర్వహణ.
  • పంపిణీదారులను నిర్వహించడం.
  • వినియోగదారులను ఆకర్షించుట.

3) నిర్వహణ మరియు నియంత్రణ విధులు:

  • విత్త నిర్వహణ.
  • ఉత్పత్తి నిర్వహణ.
  • ఫ్యాక్టరీ నియంత్రణ.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

4) సాంకేతిక పరిజ్ఞాన విధులు:

  • యంత్రాలను, పనిముట్లను సమకూర్చడం.
  • పారిశ్రామిక ఇంజనీరింగ్.
  • ఉత్పత్తి ప్రక్రియలో, వస్తు నాణ్యతలో మెరుగుదల.
  • కొత్త వస్తూత్పత్తి పద్ధతులను, వస్తువులను ప్రవేశపెట్టడం.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్ రకాలను వివరించండి.
జవాబు:
క్లారెన్స్ డన్ హాఫ్, అమెరికా వ్యవసాయరంగాన్ని పరిశీలించి వ్యవస్థాపకులను వర్గీకరించారు. ఆర్థికాభివృద్ధి ప్రారంభదశలో వ్యవస్థాపకులలో తక్కువ చొరవ, ఉత్సాహము ఉండినది. ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి చెందనారంభించినదో వ్యవస్థాపకులలోనూ తగిన ఉత్సాహము, ఉత్తేజము కలిగినది. దీని ఆధారముగా వీరిని నాలుగు రకాలుగా విభజించారు.

1) నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు నవకల్పన వ్యవస్థాపకులు కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడము, కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంబించడము, కొత్త మార్కెట్లను రూపొందించడం మరియు సంస్థను కొత్తగా నిర్వహించడము. వీరు ఇదివరకే కొంత అభివృద్ధిని సాధించి ఉంటారు. మరియు మార్పు కోసం, అభివృద్ధి కోసం ముందుచూపుతో
ఉంటారు.

2) అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు: వీరు కొత్త పద్ధతులను, సాంకేతికతను విజయవంతమైన వ్యవస్థాపకుల నుండి అనుకరిస్తారు. వీరు కొత్త నవకల్పనలు చేయరు. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిపోతారు. వీరు అభివృద్ధి చెందిన దేశాల నుండి వస్తువులను, సాంకేతికతను దిగుమతి చేసుకొని అనుకరిస్తారు.

3) నిదానపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు జాగ్రత్తపరులు. వీరు మార్పులను తొందరగా అనుకరించరు. వీరు కొత్త పద్ధతులను అనుసరించవలెనంటే అవి ఖచ్చితముగా నష్టాలు రాని విధముగా ఉంటేనే పాటిస్తారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

4) స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు వస్తు తయారీ పద్ధతిలో మార్పులు తీసుకొని వచ్చుటకు అవకాశాలు ఉన్నప్పటికీ, వ్యయాలు తగ్గించుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికి మార్పులు చేయరు. వీరికి నష్టాలు వస్తున్నప్పటికీ ప్రస్తుత తయారీ పద్ధతిలో మార్పులు చేయరు.

ప్రశ్న 4.
ఎంట్రప్రెన్యూర్కి, ఎంట్రప్రిన్యూర్షిప్కి మధ్యగల సంబంధాలను వివరించండి.
జవాబు:
ఎంట్రప్రిన్యూర్ అనువాడు కర్త, ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది ఒక ప్రక్రియ. ఎంటర్ప్రైజ్ అనేది ఒక వ్యక్తి యొక్క ” సృష్టి మరియు ఒక ప్రక్రియ ద్వారా ఏర్పడినది.
ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్ అనే పదాల ఉచ్ఛారణలో ఒకే విధముగా ఉన్నప్పటికి వాటి భావములో మాత్రము తేడా ఉన్నది. ఇవి ఒక నాణానికి ఉన్న బొమ్మ, బొరుసులాంటివి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్కి మధ్యగల సంబంధము:

  1. ఎంట్రప్రిన్యూర్ ఒక వ్యక్తి. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక ప్రక్రియ.
  2. ఎంట్రప్రిన్యూర్ ఒక నిర్వాహకుడు. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక నిర్వాహక సంస్థ.
  3. ఎంట్రప్రిన్యూర్ నవకల్పన కర్త. ఎంట్రప్రిన్యూర్షిప్ నవకల్పన ప్రక్రియ.
  4. ఎంట్రప్రిన్యూర్ నష్టభయాన్ని స్వీకరించేవాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ నష్టభయంతో కూడిన చర్య.
  5. ఎంట్రప్రిన్యూర్ ప్రేరణ చేయువాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ ప్రేరేపింపబడేది. `
  6. ఎంట్రప్రిన్యూర్ సృష్టికర్త. ఎంట్రప్రిన్యూర్షిప్ సృష్టించబడేది.
  7. ఎంట్రప్రిన్యూర్ మనోదృష్టి కలవాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ మనోదృష్టి.
  8. ఎంట్రప్రిన్యూర్ నాయకుడు. ఎంట్రప్రిన్యూర్షిష్ నాయకత్వము.
  9. ఎంట్రప్రిన్యూర్ అనుకరించువాడు. ఎంట్రప్రిన్యూర్షిప్ అనుకరణ.

ప్రశ్న 5.
ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రెన్యూర్షిప్ పాత్రను వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రిన్యూర్షిప్ పాత్ర ఒక ఆర్థిక వ్యవస్థకు, మరొక ఆర్థిక వ్యవస్థకు వస్తు వనరుల మీద, పారిశ్రామిక వాతావరణము మరియు రాజకీయ వ్యవస్థపై మారుతూ ఉంటుంది. వీరు ఆర్థిక వ్యవస్థలో తక్కువ అనుకూల అవకాశాలు ఉంటే ఎక్కువ అనుకూల అవకాశాలను కల్పిస్తారు.

భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము. ఆర్థికాభివృద్ధి సాధించుటకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగవలెను. తద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చును. ఈ క్రమములో సమాన ప్రాంతీయ అభివృద్ధిని సాధించుటకు చిన్నతరహా పరిశ్రమలు ముఖ్యమైన పాత్ర వహించును. చిన్నతరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించును. అంతేకాకుండా జాతీయ ఆదాయాన్ని సమానముగా పంచుటకు మరియు మానవ వనరులను, మూలధన వనరులను సమర్థవంతంగా తరలించి ఉపయోగించుకొనును. లేకపోతే అవి వృధాగా ఉండును. ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రిన్యూర్షిప్ ముఖ్య భూమిక పోషించును. ఒక క్రమ పద్ధతిలో దిగువ తెలిపిన విధముగా పంపిణీ జరిగినట్లయితే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

  1. ఎంట్రప్రిన్యూర్షిప్ ప్రజల వద్ద నిరుపయోగముగా ఉన్న పొదుపు మొత్తాలను సేకరించి దానిని మూలధనముగా మార్చును.
  2. ఎంట్రప్రిన్యూర్షిప్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తుంది. తద్వారా దేశములో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఇదే ఆర్థిక, సాంఘిక సమస్యలకు మూలము.
  3. ఎంట్రప్రిన్యూర్షిప్ సమతల ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది.
  4. ఆర్థికశక్తుల కేంద్రీకరణను తగ్గించడానికి దోహదపడుతుంది.
  5. దేశ అవసరాల దృష్ట్యా సంపదను, ఆదాయాన్ని మరియు రాజకీయ అధికారాన్ని సమానముగా పంపిణీ చేయడానికి తోడ్పడుతుంది.
  6. నిరుపయోగముగా ఉన్న పొదుపును, మానవ నైపుణ్యాలను, మూలధన అవసరాలకు తరలించును. 7) దేశ ఆర్థికాభివృద్ధిలో వెనుక, ముందు అనుసంధాలను కలుగజేస్తుంది.
  7. ఆర్థికాభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన ఎగుమతి వర్తకాన్ని ప్రోత్సహిస్తుంది. కావున ఎంట్రప్రిన్యూర్షిప్ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్లో ఎంట్రప్రిన్యూర్షిప్కు గల అవకాశాలను వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్లో అతి విలువైన సహజ వనరులు పుష్కలంగా ఉండటమే గాక వ్యవసాయ మరియు అటవీ సంపదతో వ్యవస్థాపకులకు పెట్టుబడులు పెట్టుటకు అనువైన అవకాశాలు ఉన్నవి. క్రియాశీల పారిశ్రామికాభివృద్ధికి అనుకూలము. సాంకేతికపరముగా నిపుణులు అయిన మానవ వనరులతో పాటు శీఘ్రముగా స్పందించే ప్రభుత్వ విధానాలు, అనువైన సౌకర్యాలు, పంట మార్పిడి విధానము, పరిశ్రమలు మరియు గనులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. సాంప్రదాయ పరిశ్రమలు అయిన బట్టలు, చర్మ పరిశ్రమలు, ఖనిజ మరియు ఆహార వస్తువుల పరిశ్రమలు అభివృద్ధి పథములో ఉన్నాయి. ఇవేకాకుండా సమాచార, సాంకేతిక మరియు పర్యాటక రంగములో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

1) సమాచార సాంకేతిక రంగము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమాచార సాంకేతిక రంగాన్ని అత్యవసర సేవా నిర్వహణ చట్టముగా ప్రకటించినది. మరియు విద్యుత్ కోతల నుండి మినహాయించినది. రాష్ట్రాన్ని విజ్ఞాన సమాజముగా మార్చాలని, సాంకేతిక విజ్ఞానము పౌరులందరికి ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండాలని, రాష్ట్రములో పెట్టుబడిదారులు ముందంజలో ఉండాలని చూస్తోంది. మన రాష్ట్రములో నిష్ణాతులైన మానవశక్తి మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా సదుపాయాలున్నవి. ప్రపంచస్థాయి ఐ.టి. కంపెనీలను ఆకర్షించుటకు అవకాశాలున్నవి. మహిళా వ్యవస్థాపకులు, SC, ST వర్గాలకు చెందిన వ్యక్తులు ఐ.టి సంస్థలు స్థాపించినట్లయితే వారి స్థిర మూలధనములో 25 శాతం రాయితీ ఇవ్వబడుతుంది. అంతేగాక ఇతర ఆకర్షణీయమైన వెసులుబాట్లు కూడా ప్రభుత్వము కల్పించింది.

2) ఆటోమొబైల్: నిపుణులైన, శిక్షణ కలిగిన, మానవశక్తి కలిగి ఉన్నందున ఆటోమొబైల్ పరికరాల పరిశ్రమలను స్థాపించుటకు ఆంధ్రప్రదేశ్ అనువైన స్థలము. 100కు పైగా ఆటోమొబైల్ పరికరాల తయారీ పరిశ్రమలు ముఖ్యంగా అల్యూమినియం కాస్టింగ్, అధిక ఒత్తిడి గల డైకాస్టింగ్, ఫోర్జింగ్, యంత్రపరికరాలు, లోహ పరికరాలు, గేర్లు, ఫిస్టన్లు మొదలైన వాటికి ఎక్కువ డిమాండు ఉన్నది. వ్యవస్థాపకులకు ఇది చక్కని అవకాశము.

3) మందుల పరిశ్రమలు: మన రాష్ట్రములో శిక్షణ పొందిన, నైపుణ్యము కలిగిన మానవశక్తి, మౌళిక సదుపాయాలు, పరిశోధన అభివృద్ధి సదుపాయాలు ఉండటము వలన ఔషధ పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలున్నవి. దేశములోని మందుల తయారీలో ఆంధ్రప్రదేశ్లో మూడవవంతు తయారవుతున్నాయి. దీనిని ఔషధ రాజధానిగా పేర్కొన్నారు. అంతేగాక విశాఖపట్టణము చుట్టుప్రక్కల ప్రాంతాలలో ప్రైవేటు భాగస్వామ్యములో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినది. అందువలన వ్యవస్థాపకులకు ఎన్నో అవకాశాలున్నవి.

4) గనులు మరియు ఖనిజ సంపద: భారతదేశములో ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద ఖనిజసంపద గల రాష్ట్రం. బొగ్గు, సున్నపురాయి, స్లాబ్స్, నూనె, సహజవాయువు, మాంగనీస్, ఆస్బెస్టాస్, ముడి ఇనుము, బంగారము, వజ్రాలు, గ్రాఫైటు, సహజ వాయువు మొదలైనవి లభ్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము గనులు మరియు ఖనిజ సంపద రంగాన్ని అభివృద్ధి చెందే పరిశ్రమగా గుర్తించినది. కాబట్టి ఈ రంగములో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

5) వ్యవసాయ మరియు అటవీసంపద: ఆంధ్రప్రదేశ్లో ఎక్కువమంది ముఖ్యవృత్తి వ్యవసాయము. ఆహార పంటలలో వరి ముఖ్యమైనది. అన్ని ఆహారపు ధాన్యాలలో వరి ధాన్యము 77 శాతము, ఇతర ముఖ్య పంటలు జొన్నలు, సజ్జలు, రాగి, అపరాలు, పొగాకు, పత్తి, చెరకు. రాష్ట్రము పండ్ల తోటలకు ముఖ్యముగా మామిడి, నిమ్మ, ద్రాక్ష, అనాస, అరటి, ఉల్లి అనువైనది. మన రాష్ట్రములోనే కొన్ని ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవి టేకు, తైలము, వెదురు, జీడిపప్పు మొదలైనవి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నూనెగింజల పరిశ్రమలు, ఆహార పదార్థాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, ఎక్కువ ప్రొటీన్ గల ఆహార పదార్థాల పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలున్నాయి.

6) పర్యాటక రంగము: ఆంధ్రప్రదేశ్ సుందరమైన రాష్ట్రము. ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. సముద్ర తీరాలు, కొండలు, వన్యమృగ అరణ్యాలు, ఓడరేవులు, చారిత్రాత్మక కట్టడాలు, పార్కులు ఉన్నాయి. అంతేగాక శిల్పకళా సంపద గలిగిన దేవాలయాలు, తిరుపతి, అన్నవరం, సింహాచలంలోని దేవాలయాలు, అరకు లోయలు మొదలైనవి వ్యవస్థాపకులకు వ్యాపార సంస్థలు స్థాపించుటకు మంచి అవకాశాలు గల ప్రదేశాలు.

7) మత్స్యసంపద: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బంగాళాఖాతము ఒడ్డున విస్తరించి ఉన్నది. విస్తారమైన సముద్రతీరము ఉండటం వలన సముద్రపు ఆహారము దొరుకును. రొయ్యల సాగుకు సముద్రతీరం అనుకూలముగా ఉండటం వలన సముద్రపు ఆహారము ఎగుమతులలో ఎక్కువ భాగము ఉన్నది. వ్యవస్థాపకులు సంస్థలు స్థాపించుటకు ఉన్న అవకాశాలు పరిశీలించి స్థాపించుట ద్వారా ఎగుమతి చేయుటకు అవకాశాలు ఉన్నాయి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ అనగా అర్థమేమి ?
జవాబు:
ఎంట్రప్రిన్యూర్ అనే పదము ఫ్రెంచి మూలమైన ఎంట్రప్రిడేర్ (Entreprede) అనే పదము నుంచి ఆవిర్భవించినది. ‘దీని అర్థము ఒక కొత్త పనిని చేపట్టడము. నష్టభయాన్ని స్వీకరించి, ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్. ఒక వ్యక్తిగాని, కొంతమంది వ్యక్తులు కలిసి వివిధ రకాల వనరులను సేకరించి ఒక కొత్త సంస్థను ప్రారంభించి తద్వారా వచ్చే రిస్క్ న్ను భరించడము.

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్కు ఒక నిర్వచనము వ్రాయండి.
జవాబు:
పీటర్ ఎఫ్. డ్రక్కర్ ప్రకారము ‘ఎంట్రప్రిన్యూర్’ అనేవాడు ఎల్లప్పుడూ మార్పు కోసం వెదుకుతూ, వచ్చిన మార్పులకు స్పందించి అట్టి మార్పులనే అవకాశాలు చేజిక్కించుకునేవాడు మరియు నూతన రూపకల్పన అనేది ఎంట్రప్రిన్యూర్షిప్ సాధనలో ఉపయోగపడే ఒక సాధనము.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్షిప్ ను నిర్వచించుము.
జవాబు:
అమెరికాలో జరిగిన ఒక సదస్సులో ఎంట్రప్రిన్యూర్షిప్ ను ఈ క్రింది విధముగా నిర్వచించినారు. “ఎంట్రప్రిన్యూర్షిప్ వ్యాపార అవకాశాలను గుర్తించుట, ఆ అవకాశాలకు అనుగుణముగా రిస్క్న నిర్వహణ చేయడం మరియు నిర్వహణ నైపుణ్యాల ద్వారా మానవ, విత్త, వస్తు వనరులను అవసరమైన వరకు తరలించి వాటికి విలువను సృష్టించడము”.

ప్రశ్న 4.
ఎంట్రప్రిన్యూర్ ఒక లక్షణము వివరించండి.
జవాబు:
నవకల్పన: నూతన వ్యాపారములో నవకల్పన అనే లక్షణము వ్యాపారస్తుడికి చాలా అవసరము. వ్యవస్థాపకుడు ఒక వైపున ఉత్పత్తిని పెంచుకోవడం, మరోవైపున ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొనుటకు నవకల్పనను ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తాడు. నవకల్పన వలన ఉత్పత్తి ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చును. లేక ప్రస్తుతము ఉన్న పద్ధతులను అభివృద్ధి చేయవచ్చును. దీనిలో కొత్త మార్కెట్లను కనుగొనడం, ముడిసరుకు మరియు నూతన సాంకేతిక పద్దతులను కనుగొనవచ్చును.

 

ప్రశ్న 5.
ఎంట్రప్రిన్యూర్ ఒక విధిని వివరించండి.
జవాబు:
నిర్ణయీకరణ: వ్యవస్థాపకుడు క్రింది విషయాలకు సంబంధించి వివిధ రకాల నిర్ణయాలను తీసుకుంటాడు.
అవి:

  1. సంస్థ లక్ష్యాలను నిర్ణయించడం
  2. ఆర్థిక వనరుల లభ్యత
  3. ఉత్పత్తి మిశ్రమము
  4. ధరల విధానము
  5. అభివృద్ధి వ్యూహాలు
  6. అనువైన సాంకేతిక లేక నూతన విధానాలు

AP Inter 2nd Year Commerce Study Material Chapter 1 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 6.
ఎంట్రప్రిన్యూర్ రకాలను వ్రాయండి.
జవాబు:
ఎంట్రప్రిన్యూర్లలో రకాలు:

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు.
  2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు