Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 5th Lesson వినియోగదారుల రక్షణ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Commerce Study Material 5th Lesson వినియోగదారుల రక్షణ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం వినియోగదారుని హక్కులను వివరించండి.
జవాబు:
వ్యాపారులు తమ యొక్క సామాజిక బాధ్యతలను గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నప్పటికి అనేక చోట్ల వినియోగదారుడు దోపిడికి గురి అవుతున్నాడు. ఆ కారణముచేత భారత ప్రభుత్వము వినియోగదారుల చట్ట పరిధిలో దిగువ తెలపబడిన వినియోగదారుల హక్కులను పొందుపరచడమైనది.
1) భద్రత హక్కు: తన ప్రాణమునకు గాని, ఆస్తులకు గాని ప్రమాదకరమైన వస్తువులు లేదా సేవల వినియోగము నుండి భద్రత వినియోగదారుని హక్కుగా పరిగణించడమైనది. దీని వలన భద్రమైన జీవనము సాగించుటకు వీలు కల్పించబడినది.
2) సమాచార హక్కు : వస్తువులు మరియు సేవలకు సంబంధించిన నాణ్యత, పరిమాణము, స్వచ్ఛతల గురించి పూర్తి సమాచారము పొందు హక్కు కల్పించబడినది. కాబట్టి ఉత్పత్తిదారుడు వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారమును వినియోగదారునకు అందించవలెను.
3) ఎంపిక హక్కు : తన ఇష్టానికి సరితూగే విధముగా వస్తువుల కొనుగోలు, సేవలను పొందే హక్కు వినియోగదారునకు ఇవ్వబడినది. పంపిణీదారులు వారి ఇష్ట ప్రకారము వినియోగదారులకు వస్తువులు అమ్మరాదు. వినియోగదారులను బలవంతము చేయరాదు. తన ఇష్టానుసారం వస్తువులను ఎంపిక చేసుకునే హక్కు, స్వేచ్ఛ వినియోగదారునకు ఉన్నది.
4) వినియోగదారునకు అవగాహన కల్పించు హక్కు : ఒక వస్తువును గురించి సరైన అవగాహన, నైపుణ్యం కలిగించుకునే హక్కు వినియోగదారునకు కల్పించబడినది. అక్షరాస్యులైన వినియోగదారులు వారి హక్కులు మరియు ఎలాంటి చర్యలు తీసుకునే జ్ఞానము కలిగి ఉంటారు.
5) సమస్యల పరిష్కార హక్కు తనకు జరిగిన దోపిడీ మరియు మోసానికి పరిష్కారము పొందుటకు, వ్యాపారస్తుల దోపిడీ నుంచి నష్టపరిహారము పొందే హక్కు కల్పించబడినది. ఈ హక్కు ద్వారా దోపిడీ, మోసము నుంచి న్యాయము కలుగజేయబడుతుంది.
6) వినిపించే, విన్నవించుకునే హక్కు : వినియోగదారుడు తనకు జరిగిన అన్యాయము గురించి విన్పించుటకు, వ్రాతపూర్వకముగా విన్నవించుకొనుటకు వినియోగదారునకు హక్కు ఉన్నది. తాను కొనుగోలు చేసిన వస్తువులు లోపభూయిష్టముగా ఉన్నా, తనకు అందించిన సేవలలో వ్యత్యాసము ఉన్ననూ వినియోగదారుని మాటలు వినవలెను.
ప్రశ్న 2.
వినియోగదారుని బాధ్యతలు ఏవి ?
జవాబు:
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుటకు ప్రభుత్వముగాని, స్వచ్ఛంద సంస్థలు గాని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ వినియోగదారుడు తనకు తానుగా వ్యాపారస్తుల దోపిడీ నుంచి రక్షించుకొనుటకు ముందుకురావలెను. అందువలన దిగువ తెలిపిన బాధ్యతలను స్వీకరించవలెను.
1) వస్తువుల నాణ్యత అవగాహన : ఉత్పత్తిదారుల నీతి బాహ్యమైన చర్యల నుండి, కల్తీలను నిరోధించుటకు గాను తాను కొనదలచిన వస్తువుల నాణ్యతపై వినియోగదారుడు కొంత అవగాహన కలిగి ఉండుట అతని బాధ్యత. ఆ వస్తువులపై ఉన్న నాణ్యత ప్రమాణాలను ధృవీకరించిన (I.S.I) ఐ.యస్.ఐ, ఆగ్మార్క్, FPO, పూల్మార్క్, ఎకోమార్క్, హాల్మార్క్ కలిగిఉన్నవా గమనించాలి.
2) తప్పుదారి పట్టించే ప్రకటనల గురించి జాగ్రత్త : వస్తువుల నాణ్యత గురించి అతిశయోక్తిగా ఇవ్వబడే ప్రకటనలపై ఆధారపడకూడదు. ఇతర వినియోగదారులు ఎవరైతే వీటిని వినియోగిస్తున్నారో వారి నుంచి సమాచారము పొందవలెను.
3) ఎంపిక చేసుకునే ముందు వివిధ రకములైన వస్తువులను పరీక్షించే బాధ్యత : వస్తువులను పరీక్షించిన తర్వాత తాము వస్తువులను కొనటానికి ముందు నాణ్యత గురించి, విలువ, మన్నిక, కొన్న తర్వాత అమ్మకపుదారు అందించే సేవలు గురించి తెలుసుకోవాలి.
4) వినియోగదారుడు అమ్మకపుదారునితో జరిగిన వ్యవహారమునకు ఋజువు సంపాదించుట : వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీల గురించి సరైన వ్రాతపూర్వక ధృవీకరణను స్వీకరించి దానిని జాగ్రత్తగా భద్రపరచాలి. ఒకవేళ ఆ వస్తువుపై ఫిర్యాదు చేయవలసినపుడు అది ఉపయోగపడుతుంది. సాధారణముగా వాడే వస్తువులకు వ్యాపారస్తుడు వారంటీ లేక గ్యారంటీ పత్రమును కొనుగోలు చేసిన వస్తువుతో జత చేస్తారు. వాటిపై వ్యాపారస్తుని సంతకము చేసినాడో లేదో గమనించవలెను. వాటిపై వ్యాపార సంస్థ సీలు, తేదీ ఉన్నట్లు చూడవలెను. వాటి కాలపరిమితి ఉన్నంతవరకు భద్రపరచవలెను.
5) వినియోగదారుడు తన హక్కుల గురించి తెలుసుకొనవలెను : వస్తువుల కొనుగోలులోగాని, సేవలు ఉపయోగములోగాని పైన తెలిపిన హక్కులను గురించి సరియైన అవగాహన కలిగి, అవసరమైనపుడు వాటిని ఉపయోగించవలెను. తాము కొనుగోలు చేసిన వస్తువులలో ఎలాంటి లోపాలు లేకుండా వాటికి సంబంధించిన సమాచారము మొత్తం గ్రహించి నాణ్యతను కూడా గమనించి కొనుగోలు చేయవలెను.
6) వాస్తవమైన లోపానికి ఫిర్యాదు చేయుట : ఒక వినియోగదారునిగా మీరు కొన్న వస్తువుపై అసంతృప్తి ఉన్నట్లయితే దానిని పరిష్కరించవలసినదిగా కోరవచ్చును. ఈ విషయములో మీరు మొదట వ్యాపారస్తునికి కావలసిన పరిష్కారము గురించి విన్నవించవలెను. వ్యాపారస్తుడు ఆ ఫిర్యాదుకు స్పందించని యడల మీరు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చును. వాస్తవముగా మీరు కోరుతున్న పరిహారము, జరిగిన నష్టము సమర్థనీయముగా ఉండవలెను. అవాస్తవ ఫిర్యాదులు చేయకూడదు. బలమైన కారణము ఉండవలెను, లేనియెడల ఫోరం మీకు అపరాధ సుంకమును విధించవచ్చును.
7) వస్తుసేవలను సరిగా వినియోగించుకోవడం : వినియోగదారులు వస్తువుల వినియోగము జాగ్రత్తగా చేయవలెను. గ్యారంటీ కాలపరిమితి ఉన్న కారణముగా వేరొక వస్తువు బదులుగా వస్తుంది అనే భావనతో నిర్లక్ష్య ధోరణితో వినియోగించకూడదు.
ప్రశ్న 3.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 క్రింద వినియోగదారుని సమస్యల పరిష్కారానికి యంత్రాంగమును వివరించండి.
జవాబు:
వినియోగదారుల రక్షణ చట్టము, 1986 వినియోగదారుల తగాదాల పరిష్కారానికి వివిధ స్థాయిలలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినవి. ఈ యంత్రాంగాన్ని జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగినది.
1) జిల్లా ఫోరం : రాష్ట్ర ప్రభుత్వము ప్రతి జిల్లాలోను జిల్లా ఫోరంను నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసినది. ఈ ఫోరంలో ఒక ప్రెసిడెంటును రాష్ట్ర ప్రభుత్వము నామినేట్ చేస్తుంది. జిల్లా కోర్టులో అతడు అర్హతగల జడ్జి అయి ఉండవలెను. మరో ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలు కూడా ఉంటుంది. ఈ సభ్యులకు ఆర్థిక, న్యాయ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై కనీసం 10 సంవత్సరాల అనుభవము ఉండవలెను. ఈ సభ్యుల వయస్సు 35 సంవత్సరాలు తక్కువ కాకూడదు మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ పట్టభద్రులై ఉండాలి. ఫోరంలోని ప్రతి సభ్యుని కాలపరిమితి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు (ఏది ముందైతే అది).
కలెక్టర్ ఫోరం ఛైర్మన్గా ఉంటాడు. 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ జిల్లాఫోరంలో ఫిర్యాదుదారు సంతృప్తి పొందకపోతే, ఆదేశాలను జారీచేసిన 30 రోజులలోపు రాష్ట్ర కమీషన్కు అప్పీలు చేసుకోవచ్చును.
2) రాష్ట్ర కమీషన్ : రాష్ట్ర కమీషన్ వినియోగదారుల తగాదాలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరిస్తుంది. రాష్ట్ర కమీషన్లో ఒక హైకోర్టులో అర్హత గలిగిన జడ్జి మరియు ఇద్దరుకు తక్కువ కాకుండా మరియు నిర్ణయించిన సభ్యులకు మించకుండా ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. రాష్ట్ర కమీషన్ 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్న ఫిర్యాదులను స్వీకరిస్తుంది. రాష్ట్ర పరిధిలోని వినియోగదారుని తగాదా విషయములో అవసరమైన రికార్డులు తెప్పించి సరైన ఆదేశాలను జారీ చేయవచ్చును. జిల్లా ఫోరంలో పెండింగ్లో ఉన్న ఏ ఫిర్యాదునైనా ఒక ఫోరం నుంచి మరొక ఫోరంనకు బదిలీ చేయవచ్చు. దీనికి సర్క్యుట్ బెంచీలు ఉన్నవి. ఒకవేళ బాధిత వ్యక్తి ఈ |కమీషన్ ఆదేశాలతో తృప్తి చెందకపోతే ఆ ఆదేశాలు వెలువడిన 30 రోజులలోపు జాతీయ కమీషన్కు అప్పీలు చేసుకొనవచ్చును.
3) జాతీయ కమీషన్ : 1988 వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వము జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేసినది. ఇది జాతీయస్థాయిలో పని చేస్తుంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన అత్యున్నత స్థానము. దీని కార్యాలయము కొత్త ఢిల్లీలో ఉన్నది. జాతీయ కమీషన్లో ఒక ప్రెసిడెంటు మరియు నలుగురు సభ్యులు, అవసరమయితే అంతకుమించి ఉంటారు. ఆ సభ్యులలో ఒకరు స్త్రీ సభ్యురాలు ఉంటారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జీగాని, విశ్రాంతి జడ్జిగాని అయి ఉండాలి. సభ్యులందరూ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పట్టభద్రులై ఉండాలి. ప్రెసిడెంటు, మిగిలిన సభ్యులను కేంద్ర ప్రభుత్వము నియమిస్తుంది. ఒక కోటి రూపాయలకు మించిన విలువ గల వస్తువులు మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జాతీయ కమీషన్కు ఫిర్యాదు చేయవచ్చును. జాతీయ కమీషన్ ఇచ్చిన తీర్పుతో బాధితుడు సంతృప్తి పొందకపోతే ఉత్తర్వులు జారీ చేసిన 30 రోజులలోపు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చు.
ప్రశ్న 4.
వినియోగదారుల రక్షణ చట్టము 1986 క్రింద ఏ వ్యక్తులు ఫిర్యాదు నమోదు చేయవచ్చు? ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయవచ్చు ? ఫిర్యాదు ఎక్కడ ? ఎలా ? నమోదు చేయాలో చెప్పండి ?
జవాబు:
వినియోగదారుడు తనకు కలిగిన నష్టానికి సంబంధించి సరైన ఫోరంలో ఫిర్యాదు చేయవలెను. వినియోగదారుల రక్షణ చట్టము 1986 ప్రకారం దిగువ తెలిపిన వ్యక్తులు ఫిర్యాదు చేయవచ్చు.
- వినియోగదారుడు.
- వినియోగదారుల స్వచ్ఛంద సంఘము. ఇందులో సభ్యత్వము లేకపోయినా ఆ వ్యక్తి తరపున వీరు ఫిర్యాదు చేయవచ్చును.
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వము.
- ఒకే రకమైన ఫిర్యాదులు చేయదలిచిన వ్యక్తులు కలిసి ఫిర్యాదు చేయవచ్చును.
- వినియోగదారునకు మరణం సంభవించిన అతని తరపున అతని వారసుడు.
ఒకరు లేదా అంతకు మించిన వారితరపున ఒక వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చును.
- చేయకూడని వ్యాపారము, నిషేధించిన వ్యాపారమును చేయు వ్యాపారస్తులు, సరిగా సేవలను అందించని సేవా కేంద్రాలపై ఫిర్యాదు చేయవచ్చు.
- కొనుగోలు చేసిన వస్తువులు, కొనుగోలుకై చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వస్తువులలో లోపాలు ఉన్నప్పుడు.
- అందించవలసిన సేవలలో లేక అందించుటకు జరిగిన ఒప్పందము ప్రకారము సేవలలో లోటు ఏర్పడినపుడు.
- నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధర కలిగినపుడు :
ఎ) అప్పటికి అమలులో ఉన్న చట్టబద్ధమైన విలువకు ఎక్కువగా ఉన్నట్లయితే;
బి) ఆ వస్తువులో పేర్కొన్న ధర కంటే;
సి) ధరల పట్టికలో పేర్కొన్న ధర కంటే;
డి) అమ్మకపుదారుడు మరియు కొనుగోలుదారు చేసుకున్న ఒప్పందము ప్రకారము;
ఇ) భద్రతలేని, ప్రాణహాని కలిగించే వస్తువులు లేదా సేవలకు సంబంధించి హాని జరిగితే;
కొనుగోలు చేసిన వస్తువులు/సేవలు మరియు కోరిన పరిహారము 20 లక్షల రూపాయలలోపు ఉన్నట్లయితే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. 20 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు దాటకపోతే ఫిర్యాదులు రాష్ట్ర ఫోరంలో చేయాలి. ఒక కోటి రూపాయలు మించినచో జాతీయ కమీషన్కు ఫిర్యాదు చేయవలెను.
ఫిర్యాదును వ్యక్తిగతముగా గాని, అధీకృత ఏజెంటు ద్వారా గాని లేదా పోస్టు ద్వారా చేయవచ్చు. సరైన సాక్ష్యాధారాలతో చేయనున్న ఆరోపణను ఆధారముగా చూపి ఒక పేపరుపై ఫిర్యాదు చేయవలెను. ఇందులో కోరిన పరిహారము కూడా స్పష్టముగా తెలపవలెను. ఈ పరిస్థితులు తలయెత్తిన సమయము, స్థలము తెలుపుతూ ఫిర్యాదు దారుని మరియు ఎవరిపై చేయదలచినారో ఆ వ్యక్తి చిరునామా ఇతర వివరాలు తెలపవలెను.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వినియోగదారుని అర్థం తెలపండి.
జవాబు:
వినియోగదారుని రక్షణ చట్టం 1986 ప్రకారము వస్తువులకు సంబంధించి వినియోగదారుడు అంటే వస్తువు కొనుగోలుదారు. ప్రతిఫలాన్ని చెల్లించడం ద్వారా లేదా చెల్లిస్తానని తెల్పడం ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తానని ” హామీ ఇచ్చినవారు, పూర్తిగా లేదా పాక్షికముగా ప్రతిఫలాన్ని చెల్లించి వస్తువులు కొన్నవారు, వస్తువులను కొనుగోలుదారు అంగీకారముతో ఉపయోగించేవారు. సేవల విషయములో, ప్రతిఫలానికి సేవలను పొందేవారు లేదా అద్దెకు పొందేవారు, సేవలను కొనుగోలుదారు అంగీకారముతో ఉపయోగించేవారు.
ప్రశ్న 2.
వినియోగదారిత్వం అంటే ఏమిటి ?
జవాబు:
వినియోగదారిత్వము వ్యాపారము మీద వినియోగదారుని ఒత్తిడిని వ్యవస్థీకరించుట ద్వారా మార్కెట్లో అతని హక్కులను పరిరక్షించడము. వినియోగదారిత్వము అనగా వినియోగదారుల రక్షణ చట్టము 1986లో తెలపబడిన వినియోగదారుల హక్కులను రక్షించి చెల్లించే వస్తుసేవలకు సరైన ప్రమాణాలు ఉండేటట్లు చూడడము. ఫిలిఫ్ కొట్లర్ వినియోగదారిత్వము ఒక సామాజిక ఉద్యమము. దీనిలో అమ్మకపుదారులకు సంబంధించి కొనుగోలుదారుల హక్కులను తెలియజేయుట.
పై నిర్వచనాలను బట్టి వినియోగదారిత్వము అనగా ఇది పెరుగుతున్న సామాజిక శక్తి. ఇది వినియోగదారుల హక్కులను గురించి అవగాహన కల్గిస్తుంది. ఈ హక్కుల రక్షణకై
- వినియోగదారులకు బోధించి, వారి హక్కులకై పోరాడేటట్లు సంచయమును కలుగజేస్తుంది.
- వినియోగదారుల న్యాయమైన హక్కులను హామీ ఇచ్చే విధముగా ప్రభుత్వముపై ఒత్తిడిని తేవడం.
- వ్యాపారము నిజాయితీగాను, బాధ్యతగా చేసేటట్లు చూడటం.
- వ్యాపారములో అనుచిత చర్యలు, అన్యాయాలు జరగకుండా నివారించడం.
ప్రశ్న 3.
వినియోగదారుని రక్షణ అంటే ఏమిటి ?
జవాబు:
వినియోగదారుల ఆసక్తిని, హక్కులను పరిరక్షించడాన్ని వినియోగదారుని రక్షణ అంటారు. వ్యాపార సంస్థల అనుచిత చర్యలను అరికట్టడానికి, వినియోగదారుల ఇబ్బందులను నివారించడం ద్వారా వినియోగదారులను రక్షించడాన్ని వినియోగదారుని రక్షణగా చెప్పవచ్చును. దిగువ తెల్పబడినవి సాధారణముగా వ్యాపారములో కన్పించే అనుచిత చర్యలు.
- కల్తీ వస్తువులను అమ్మడం, అమ్మే వస్తువులలో నాసిరకం వస్తువులను కలపడం.
- అసలు వస్తువులకన్నా తక్కువ విలువ గల వస్తువులను అమ్మడం.
- తక్కువ ప్రమాణము గల వస్తువులను అమ్మడం.
- నకిలీ వస్తువుల అమ్మకము.
- తూనికలు, కొలతలలో లోపం.
- అక్రమ నిల్వ, నల్లబజారు. ఈ చర్యల వలన కొరత, ధరలలో పెరుగుదల ఏర్పడతాయి.
- గరిష్ట రిటైల్ ధర కన్నా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం.
- లోపభూయిష్టమైన వస్తువుల సరఫరా.
- తప్పుదోవ పట్టించే ప్రకటనలు.
- చౌకబారు సేవలను సప్లయి చేయుట.
ప్రశ్న 4.
మహాత్మా గాంధీ మాటలలో వినియోగదారుడు అనగా ?
జవాబు:
జాతిపిత మహాత్మాగాంధీ ఒక గొప్ప నాయకుడే కాదు గొప్ప దార్శినికుడు కూడా. ఆర్థికపరమైన రక్షణ చర్యల ద్వారా వినియోగదారులను మోసాల నుండి కాపాడాలని ఉద్భోదించారు. ప్రస్తుతం దేశములో అసంఖ్యాక వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన వినియోగదారుని విషయములో పేర్కొన్న దిగువ సూత్రాలు పొందు పరచిన బోర్డులు దర్శనమిస్తాయి.
“మన వద్దకు వచ్చే అందరి వ్యక్తులలో వినియోగదారుడు అందరి కంటే ముఖ్యమైనవాడు. అతడు మనపై ఆధారపడి జీవించటం కాదు. మనమే అతనిపై ఆధారపడుతున్నాము. అతడు మన కార్యకలాపాలకు ఆటంకము కాదు. మనము చేసే పనులన్నీ అతని కోసమే. మన వ్యాపారమునకు సంబంధించి అతడు బయట వ్యక్తికాదు. అతడే మన వ్యాపారములో ముఖ్యభాగస్వామి. అతనికి సేవలను అందించడం ద్వారా మనం అతనికి ఏదో మేలు చేస్తున్నట్లుగా భావించరాదు. సేవలను అందించే అవకాశం మనకు కల్పించడం ద్వారా అతనే మనకు ఎంతో మేలు చేస్తున్నాడు”.
ప్రశ్న 5.
జిల్లా ఫోరం.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వముచే ప్రతి జిల్లాలో ఈ ఫోరం ఏర్పాటుచేయబడును. జిల్లా ఫోరంనకు ఒక ఛైర్మన్ మరియు ఇద్దరు సభ్యులు ఉంటారు. అందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. జిల్లా జడ్జీ స్థాయి ఉన్న వ్యక్తి ఈ ఫోరానికి అధికారి. 20 లక్షల రూపాయలకు మించని వస్తువుల ధర మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జిల్లాఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ జిల్లా ఫోరంలో వినియోగదారుడు సంతృప్తి పొందకపోతే ఆదేశాలు వెలువడిన 30 రోజులలో రాష్ట్ర కమీషన్కు అప్పీలు చేసుకొనవచ్చును.
ప్రశ్న 6.
రాష్ట్ర కమీషన్.
జవాబు:
రాష్ట్ర కమీషన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసినవి. రాష్ట్ర కమీషన్ లో ఒక ప్రెసిడెంటు, ఇద్దరు సభ్యులు తక్కువ కాకుండా, నిర్దేశించబడిన సభ్యుల సంఖ్య మించకుండా ఉంటారు. ఇందులో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. హైకోర్టు స్థాయి గల జడ్జీ పర్యవేక్షణలో ఉంటాడు. 20 లక్షల రూపాయలకు మించి 1 కోటి రూపాయలకు తక్కువగా ఉన్న వస్తువుల విలువ మరియు కోరిన పరిహారము ఈ పరిమితిలో ఉన్నట్లయితే వ్రాతపూర్వకముగా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ బాధిత వ్యక్తి ఈ కమీషన్ ఆదేశాలకు తృప్తి చెందనట్లయితే ఈ ఆదేశాలు వెలువడిన 30 రోజులలోపు జాతీయ కమీషన్కు అప్పీలు చేసుకోవచ్చును.
ప్రశ్న 7.
జాతీయ కమీషన్.
జవాబు:
1988లో కేంద్ర ప్రభుత్వము జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేసినది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన అత్యున్నత స్థానము. దీనిని ఢిల్లీలో ఏర్పాటు చేసారు. ఇందులో ఒక ప్రెసిడెంటు మరియు నలుగురు సభ్యులు, (అవసరమయితే అంతకుమించి) వారిలో ఒక స్త్రీ సభ్యురాలై ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జీగాని, విశ్రాంత జడ్జీగాని దీనికి సారథ్యము వహిస్తారు. ఒక కోటి రూపాయలకు మించిన విలువ గల వస్తువులు మరియు కోరిన పరిహారము ఉన్నట్లయితే జాతీయ కమీషన్ ఎదుట ఫిర్యాదు చేయవచ్చును. జాతీయ కమీషన్ వెలువరించిన తీర్పుతో సంతృప్తి పొందని పక్షములో ఈ ఉత్తర్వులు వెలువడిన 30 రోజులలోపు బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును.